పర్వదినాలు అంటే ‘పూర్ణిమ’ రోజులు. ఇవి దేవతలకు అత్యంత ప్రీతికరమని భక్తులు విశ్వసిస్తారు. మాఘమాసంలో పవిత్ర స్నానాలు చేసి, ఇష్టదైవాల్ని పూజిస్తారు. సాగర తీరాన నివసించేవారు అక్కడ స్నానాదులు ముగించి జపాలు, దానాల వంటి సత్కర్మలు ఆచరిస్తారు. నదీస్నానం చేసినా, అందుకు అవకాశం లేనివారు బావి లేదా చెరువు నీటితో గంగను స్మరిస్తూ స్నానం గావించినా అదీ పుణ్యప్రదమేనని ఓ నమ్మకం.
మాఘమాసంలో మరో నాలుగు పండుగలున్నాయి. మాఘ శుద్ధ అష్టమి మఘా నక్షత్రంనాడు- భీష్మాష్టమి. సప్తమి-సూర్య సప్తమి (రథ సప్తమి). మాఘ బహుళ చతుర్దశి- శివరాత్రి. మాఘ బహుళ అమావాస్య, మాఘ మాసాంతం- ద్వాపర యుగాది.
మాఘశుద్ధ అష్టమి తిథినాడు భీష్ముడు పరమపదించాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తరవాత, మాఘ శుద్ధ అష్టమినాడు ఆయన స్వచ్ఛంద మరణం పొందాడని ‘మహాభారతం’ చెబుతోంది. శ్రీకృష్ణుడు ఆయన దగ్గరే ఉన్నాడు. తన మరణానంతరం వచ్చే ఏకాదశి పుణ్యదినాన్ని ‘భీష్మ ఏకాదశి’గా లోకం గుర్తించేలా వరం కోరతాడు భీష్ముడు. కృష్ణుడు అనుగ్రహించాడని ‘నారద పురాణం’ విశదీకరిస్తోంది. భారత యుద్ధం ముగిశాక, అంపశయ్యమీద ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఉన్న భీష్ముడికి కృష్ణుడు తన వాగ్దానం ప్రకారం దర్శనమిస్తాడు. అప్పుడు భీష్ముడు చేసిన స్తుతి ‘భీష్మ స్తవం’గా పేరొందింది. దాన్ని ఆయన ‘కృష్ణాయ నమః’ అని ముగిస్తాడు. అది శ్రీకృష్ణ మహామంత్రంగా నిలిచిపోయింది.
ఇదే మాసంలో స్మరించాల్సిన పౌరాణిక గాథల్లో మార్కండేయుడి చరిత్ర ఒకటి. అతడికి పరమేశ్వరుడు ప్రసాదించింది పదహారు సంవత్సరాల ఆయుర్దాయమే! అది పూర్తయిన వెంటనే భటుల్ని పంపుతాడు యముడు. ఆ సమయంలో అతడు శివ ధ్యానం చేస్తుండటంతో, భటులు ఆ దరిదాపులకైనా వెళ్లలేకపోతారు. ఒక మహా తేజస్సు వారిని అక్కడి నుంచి తరిమేస్తుంది. విషయం తెలిసి, యమధర్మరాజే అక్కడికి చేరుకుంటాడు. పాశంతో మార్కండేయుడి ప్రాణాలు హరించడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అతడు శివలింగాన్ని హత్తుకొని, ఆ స్వామిని ధ్యానిస్తాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై, యముడి పైకి త్రిశూలాన్ని ప్రయోగించి, భక్త మార్కండేయకు చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తాడు. అన్నింటికీ మూలం మాఘంలో రోజూ ఉదయమే సాగిన గంగాస్నానం, ఈశ్వర ధ్యానం అని వివరిస్తుంది ‘మాఘ పురాణం’.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో స్నానానికి ఎంతో ప్రాముఖ్యముంది. పలు విధాల స్నానాలుంటాయి. అవి- మంత్ర, వాయవ్య, ఆగ్నేయ, కాపిల, వారుణ, మునుమానస స్నానాలు. వేదమంత్రాలు చదువుతూ చేసేది మంత్ర స్నానం. గోధూళి పైన చల్లుకొని చేసే స్నానం వాయవ్యం. విభూతి రాసుకొని చేస్తే ఆగ్నేయం. శరీరం పైభాగాల్ని తడి వస్త్రంతో తుడుచుకోవడం కాపిలం. ఎండలో స్నానం ఆచరించడం ఆతపం. సాధారణ స్నానం - వారుణం. విష్ణుస్తుతితో చేసే స్నానం మునుమానసం. ఇవన్నీ శారీరక, మానసిక పరిశుభ్రతకు దోహదపడతాయి. మాఘస్నానం చేసి, విష్ణువును పూజించి, దానం తరవాత పురాణ శ్రవణం నిర్వర్తించడం సంప్రదాయం.
అన్ని అంతరాలకూ అతీతంగా పాటించాల్సిన పద్ధతులివి. మాఘమాసం శివకేశవులిద్దరికీ ఇష్టమైనది. దేవతార్చనలో- శివుణ్ని, విష్ణువును, వారి అవతార మూర్తులను స్తుతించవచ్చు. మాఘ స్నానం వల్ల బుద్ధి, వికాసం, ఆరోగ్యం అభివృద్ధి చెందుతాయి. శరీరం ఉల్లాసభరితమవుతుంది. విష్ణువుకు ఇష్టమైన మాఘ శుద్ధ ఏకాదశి పరమ పవిత్రం. అఘం అంటే పాపం. దాన్ని పోగొట్టేది మాఘం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ మాసం అత్యంత విశేషమైనది. ఇటువంటి పవిత్ర స్నానాల సంస్కృతి దేశంలో అతి ప్రాచీన కాలం నుంచీ ఉందని పురాణాలెన్నో తేటతెల్లం చేస్తున్నాయి.
- పి.భారతి
No comments:
Post a Comment