Thursday, 19 July 2018

ఆషాఢ మాసం - తొలి ఏకాదశి






నిద్రాణం కాదది ఉత్థానం

నిద్ర బడలిక తీర్చి ఉత్తేజాన్నిస్తుంది.
అదే నిద్ర ఎక్కువైతే.. బద్ధకాన్ని కలిగిస్తుంది, ఆరోగ్యాన్ని చెడగొడుతుంది.
తనను తాను తెలుసుకునే నిద్ర కూడా ఒకటుంది. అదే యోగనిద్ర. మహా సంకల్పానికి, దృఢ చిత్తానికి నిదర్శనమిది. తొలి ఏకాదశి సందర్భంగా మహావిష్ణువు కూడా యోగనిద్రకు ఉపక్రమిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. నాలుగు నెలల పాటు శ్రీహరి తదేకమైన దీక్షలో ఉంటాడంటారు. ఆ సమయంలోనే సృష్టిపాలన చేస్తాడని విశ్వసిస్తారు. మహావిష్ణు యోగనిద్ర విశేషాలివే..


ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా చేసుకుంటారు. దీనినే శయన ఏకాదశి అని కూడా అంటారు. సంప్రదాయబద్ధంగా చేసుకునే గొప్ప పర్వదినం ఇది. ఈ రోజునే శ్రీమహావిష్ణువు శయనిస్తాడు. మళ్లీ కార్తీక శుద్ధ ఏకాదశి (ప్రబోధిని ఏకాదశి) నాడు నిద్ర నుంచి మేల్కొంటాడని అంటారు. ఈ నాలుగు మాసాలు మహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు.

దేవాదిదేవుడు, స్థితికారుడు అయిన మహావిష్ణువు నిద్రపోతాడా? లోకపాలకుడే నిద్రపోతే మరి లోకాల పరిస్థితి ఏమిటన్న సందేహం కలగక మానదు. అయితే శయన ఏకాదశి నుంచి ప్రబోధిని ఏకాదశి వరకు అంటే నాలుగు మాసాలు శ్రీహరి పడుకుంటాడు అంటే.. అది బడలిక తీర్చుకునే నిద్ర కాదని గ్రహించాలి. ఆయనది యోగనిద్ర. మామూలు నిద్రకు.. యోగనిద్రకు చాలా తేడా ఉంది. యోగ పరంగా చెప్పుకొంటే సమాధి స్థితికి సంబంధించినది. సమాధి స్థితికి చేరిన సాధకుడు ప్రజ్ఞానాన్ని పొందుతాడు. ఆ సమయంలో బ్రహ్మజ్ఞానం, బ్రహ్మానంద స్థితి కలుగుతాయి. ప్రజ్ఞానం సొంతమైన వారు అంతర్ముఖులై.. తమలోకి తాము చూసుకుంటూ పరమాత్మలో ఐక్యాన్ని పొందగలుగుతారు. ఈ ప్రజ్ఞానానికి సంబంధించిన విషయాలను, యోగనిద్రాస్థితి ఆనవాళ్లను మాండూక్యోపనిషత్తు వివరంగా చెబుతుంది. అలాగే ధ్యానానికి సంబంధించిన ప్రణవ నాదమైన ఓంకార విశేషాలను ప్రస్తావించింది.

సాధారణ ధ్యానానికి, యోగనిద్రకు తేడా ఉంది. ఈ రెండింటి సమ్మేళనంతో సమాధిస్థితికి చేరవచ్చు. ఈ స్థితిలో ఉన్నప్పుడే శ్రీమహావిష్ణువు తాను చేసిన సృష్టి సంరక్షణ విషయాలన్నిటినీ తనలో తాను సమీక్షిస్తాడు. ఈ సమీక్షణం ఆయనకు అలా ఉంటే.. యోగనిద్ర సాధకులకు కూడా ఓ సమీక్షణానందాన్ని కలిగిస్తుంది. ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేసి తానెవరో తెలుసుకోగలిగిన స్థితి సాధకుడికి చేకూరుతుంది. తానెవరో తెలిసినప్పుడు.. తన కర్తవ్యం ఏంటో తెలుస్తుంది. తన లక్ష్యం ఏంటో అవగతం అవుతుంది. ఇది తెలుసుకోగలిగితే అంతా శాంతమే. యోగనిద్ర సాధకులు పొందే అనిర్వచనీయమైన అనుభూతి ఇది. దీనిని సాధించడం వల్ల మానసిక ఆందోళనలు, వాటివల్ల కలిగే తీవ్రమైన శారీరక బాధలు దూరమవుతాయి. పూర్వం యుద్ధ సమయాల్లో యోధులు యోగనిద్రను అవలంబిస్తూ శరీరానికైన తీవ్రమైన గాయాల నొప్పులను, మానసిక ఉద్వేగాన్ని అధిగమిస్తూ ఉండేవారట.

సాధించడమెలా?
యోగనిద్ర అంటే అటు నిద్రాకాదు, ఇటు మెలకువా కాదు. అసలేంటిది? దీన్ని సాధించడం సాధ్యమేనా? అనంటే అదేమంత కష్టమైన పని కాదంటారు సమర్థులైన యోగాచార్యులు. యోగాసనాల్లో శవాసనం కూడా ఒకటి. ఈ ఆసనం వేసేవారు నేలమీద వెల్లకిలా శవంలా పడుకొంటారు. ఆ సమయంలో చర్మం, కళ్లు, నాలుక, ముక్కు ఈ నాలుగింటినీ అంతర్ముఖీనం చేయాలి. కేవలం చెవులు మాత్రమే పని చేస్తూ ఉండాలి. ఈ స్థితిలోకి వచ్చి గురువు చెప్పిన మాటలను వింటూ అటు నిద్ర, ఇటు మెలకువ కాని స్థితికి చేరుకోవాలి. ఇదే యోగనిద్ర. ఈ స్థితికి చేరినప్పుడు ఆనందం సొంతమవుతుంది. అనారోగ్యం దూరమవుతుంది. వైదిక కాలం నాటి మహర్షులే కాక, ఆధునిక కాలంలోని యోగ గురువులు పలువురు కూడా శారీరక, మానసిక ఆరోగ్యాల పరిరక్షణకు ఈ యోగనిద్రను తమ శిష్యులతో సాధన చేయిస్తున్నారు. అలసట, బద్ధకం, అనారోగ్యం అన్నీ పోయి చెయ్యవలసిన పనిని హుషారుగా చేసే ఓ ఉత్తమ శక్తి యోగనిద్ర. ఆ శక్తిని అందరూ అందిపుచ్చుకోవాలని ప్రబోధించడమే మహావిష్ణువు యోగనిద్రాస్థితి పరమార్థం.



ఆరోగ్యసాధనే అసలు లక్ష్యం
తొలి ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉన్న నాలుగు మాసాల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. ఈ కాలానికి సనాతన సంప్రదాయంలో ఓ విశిష్టమైన స్థానం ఉంది. సాధకులు, యోగులు, పీఠాధిపతులు చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తారు. ‘ఈ సాధనంతా దేనికి?’ అన్న సందేహం రావొచ్చు. దీనికి సమాధానం ఆరోగ్య సాధనే! ఈ వ్రతం గురించి స్కాంద, భవిష్యోత్తర, బ్రహ్మవైవర్త తదితర పురాణాల్లో వివరంగా ప్రస్తావించారు.

చాతుర్మాస్య వ్రతం ఆచరించడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక బలం కూడా సమకూరుతుంది. మనసుకు ప్రశాంతమైన స్థితి కలుగుతుంది. అందుకే ఈ వ్రతం కాలగమనంలో బౌద్ధులకు, జైనులకు కూడా ఆచరణ యోగ్యమైంది. బౌద్ధులు చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించిన తీరు జాతక కథల్లో చాలా చోట్ల కనిపిస్తుంటుంది. ఈ నాలుగు నెలలు క్రమశిక్షణతో కూడిన ఆహార వ్యవహారాలను పాటిస్తారు. జీవితాన్ని నియంత్రించుకుంటూ సమాజానికి ఆదర్శంగా నిలవడమే వ్రత సారంగా కనిపిస్తుంది.

చాతుర్మాస్య వ్రతంలో ఆహార నియమాలను పరిశీలిస్తే నాలుగు మాసాల్లోనూ కొన్ని కొన్ని కాయగూరలను, ఆహార పదార్థాలను విడిచిపెడతారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పెద్దలు చేసిన నియమం ఇది. శ్రావణంలో కొన్ని కూరలు, బాధ్రపదమాసంలో పెరుగు, ఆశ్వయుజంలో పాలు, కార్తీక మాసంలో పప్పుపదార్థాలు తినకూడదన్నది నియమం. అలాగే నిమ్మ, ముల్లంగి, గుమ్మడి, చెరకు జోలికి వెళ్లరు. ఇలాంటి నియమాలు పాటించడం ద్వారా ఆరోగ్యం మెరుగవుతుందని చెబుతారు. అంతేకాదు ఈ వ్రతాన్ని స్త్రీపురుషులందరూ ఆచరించవచ్చని పురాణాలు పేర్కొంటున్నాయి. కాలక్రమంలో ఇది సన్యాసులకు, యోగులకు మాత్రమే పరిమితమైంది. యతులు ఈ వ్రతాన్ని విధిగా పాటిస్తారు. ఒకే ప్రదేశంలో ఉండి నాలుగు మాసాల పాటు సామాజిక చైతన్యానికి ఉపకరించే విషయాలను ప్రబోధిస్తుంటారు.

యల్లాప్రగడ మల్లికార్జునరావు






శేషశాయి.. శయనించు కాలమిది

ఆషాఢ మాసంలో శుక్ల పక్ష ఏకాదశికి ఎంతో ప్రాధాన్యం ఉంది. దీనినే తొలి ఏకాదశి, దేవ శయన ఏకాదశి అని పిలుస్తారు. సర్వలోక స్థితికారకుడైన మహావిష్ణువు శయన ఏకాదశి రోజున నిద్రకు ఉపక్రమిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. నేటి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అంటే నాలుగు నెలల పాటు స్వామి యోగనిద్రలో ఉంటాడు. ఆ మరుసటి రోజు క్షీరాబ్ది ద్వాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొంటాడని చెబుతారు. శయన ఏకాదశిని దేవతల రాత్రికి ప్రారంభ గుర్తుగా సూచిస్తారు. దక్షిణాయన పుణ్యకాలంతో దేవతలకు రాత్రి సమయం మొదలవుతుందని పెద్దల మాట.

మార్గశిర మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశికి ఎంత విశిష్ఠత ఉన్నదో.. ఈ దేవ శయన ఏకాదశికి అంతటి ప్రాముఖ్యం ఉంది. ఈ పర్వదినం సందర్భంగా దేశంలోని వైష్ణవ దేవాలయాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. తొలి ఏకాదశి సందర్భంగా మహారాష్ట్రలోని పండరీపురంలో కొలువుదీరిన పాండురంగడిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి వేలమంది భక్తులు కాలినడకన అక్కడికి తరలివెళ్తుంటారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు తండోపతండాలుగా.. హరినామ సంకీర్తన చేస్తూ ఏకాదశికి నాలుగైదు రోజుల ముందే యాత్ర మొదలుపెడతారు. పాండురంగడి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని.. మహదానందం పొందుతారు.

శయన ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు ఉపవాస దీక్షను పాటిస్తారు. ఏకాదశి రోజంతా ఉపవాసం ఉంటారు. రాత్రి భజనలు, సంకీర్తనలతో విష్ణుమూర్తిని కొలుస్తారు. ద్వాదశి రోజున ఉదయాన్నే స్నానమాచరించి... స్వామివారికి పూజాదికాలు నిర్వహించి.. ఆ తర్వాత ఆహారం తీసుకుంటారు. ఈ పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకుని పునీతులం అవుదాం.





ఈ నాలుగు నెలలూ పవిత్రం!


ఆషాఢ మాసంలో ఆధ్యాత్మిక విశేషాలు ఎన్నో! తొలి ఏకాదశి, గురు పౌర్ణమి వంటి పర్వాలు ఈ మాసంలోనే వస్తాయి. ఆషాఢ మాసం మొదలు నాలుగు నెలలను చాతుర్మాసాలని పిలుస్తుంటారు. ఈ కాలంలో చాతుర్మాస్య వ్రతం ఆచరించడం ఒక సంప్రదాయం. మనిషి జీవన విధానాన్ని గాడిలో పెట్టే సాధనం... చాతుర్మాస్య వ్రతం. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుంచి కార్తీక శుద్ధ పౌర్ణమి వరకూ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తుంటారు. కొందరు ఆషాఢ శుద్ధ ఏకాదశి (శయన ఏకాదశి) నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ పాటిస్తుంటారు.

చాతుర్మాస్య వ్రతాన్ని బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్న్యాసులు.. అందరూ ఆచరించే సంప్రదాయం ఉండేది. అయితే కాలక్రమంలో సన్న్యాసులు, సనాతన ధర్మాన్ని నిష్ఠగా ఆచరించే కొద్ది మంది మాత్రమే పాటిస్తున్నారు. ఆషాఢ మాసం నుంచి వర్షాలు మొదలవుతాయి. వాతావరణం ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయేలా ప్రేరేపిస్తుంటుంది. అలాంటి పరిస్థితులను ఎదుర్కొనే రక్షణ కవచమే చాతుర్మాస్య వ్రతం. దీనిని ఆచరించేవారు నాలుగు మాసాలు తానున్న ప్రదేశం పొలిమేర దాటకూడదు. రెండో నియమం నాలుగు నెలలూ ఒకే పూట భోజనం చేయాలి. అది కూడా తానే స్వయంగా వండుకోవాలి. విస్తట్లోనే తినాలి. అన్నింటి కన్నా.. చేయదలచిన భోజనం ఒకేసారి విస్తట్లో వడ్డించుకోవాలి. అంటే మారు వడ్డన పనికిరాదు. ఈ నాలుగు నెలలూ మధ్యాహ్నం పూట నిద్రించకూడదు. రాత్రి కూడా రెండో జాము వరకు భగవన్నామ స్మరణ చేసి అప్పుడు పడుకోవాలి.

ఈ నియమాలన్నీ మనిషిని సన్మార్గంలో నడిపించడానికి దోహదం చేసేవే. మితాహారం ఆరోగ్య కారకం. ఇంద్రియ నిగ్రహం ఆధ్యాత్మిక పురోగతికి దోహదం చేస్తుంది. నాలుగు నెలలు ఈ నియమాలు పాటించడం ద్వారా.. ఆ తర్వాతి కాలంలోనూ మనో నిగ్రహంతో ఉండగలుగుతారనే ఉద్దేశంతోనే చాతుర్మాస్య వ్రతాన్ని సూచించారు మన పెద్దలు. 







తొలి ఏకాదశి

  • ఆధ్యాత్మిక ఆరోగ్యరాశి తొలిఏకాదశి
  • నేటి నుంచి చాతుర్మాస్య దీక్ష ప్రారంభం
సనాతన హైందవ సంప్రదాయంలో ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంది. వాటి ఆచరణ వెనుక ఆధ్యాత్మిక భావంతోపాటు, ఆరోగ్య రహస్యం కూడా దాగి ఉంటుంది. మనం ఏపని చేపట్టినా తిథుల ప్రకారమే చేస్తాం. అదేవిధంగా ప్రతి పండుగ కూడా తిథులపై ఆధారపడే నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా ఆషాఢమాసంలో శుక్లపక్ష ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. దీన్ని ‘తొలి ఏకాదశి’గా పిలుస్తారు. ప్రస్తుతం ఉగాది నుంచి నూతన తెలుగు సంవత్సరంగా పరిగణిస్తున్నప్పటికీ పూర్వకాలంలో ఈ తొలి ఏకాదశినే సంవత్సర ఆరంభంగా పాటించేవారు. అందువల్ల సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఇది తొలి ఏకాదశిగా ప్రసిద్ధి పొందింది. ఇక దీన్ని ‘శయన ఏకాదశి’ అని కూడా వ్యవహరిస్తారు. క్షీరసాగరంలో శేషపాన్పుపై ఈ రోజునుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడని పురాణ ప్రతీతి. అందువల్ల ఈ తొలిఏకాదశిని శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని పేర్కొంటారు.

ప్రకృతి మార్పులకు సంకేతం..
క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ తొలిఏకాదశి ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా నిలుస్తుంది. ఈ రోజునుంచి సూర్యుడు ఉ త్తరం నుంచి దక్షిణం వైపునకు మరలుతాడు, ఇది దక్షిణాయనాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా నేటి నుంచి చాతుర్మాస్య దీక్ష ప్రారంభమై నాలుగునెలలు కొనసాగుతుంది. పూర్వం ప్రతి ఒక్కరూ ఈ చాతుర్మాస్య దీక్షను ఆచరించే వారు. అయితే ప్రస్తుతం కేవలం పీఠాధిపతులు, మఠాధిపతులు మాత్రమే దీనిని పాటిస్తున్నారు. ఈ దీక్ష సమయంలో వర్షరుతువు ఆరంభంలో మానవ శరీరానికి సరిపడని ఆహారాన్ని త్యజించి కొన్ని విధాల శాకాహారాన్ని మాత్రమే భుజిస్తారు. దీంతో ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ ఉపవాసం వల్ల శరీరంలో పాడైన కణాలను శరీరం ఉపయోగించుకుంటుంది. దీంతో క్షీణించిన కణాలు పోగుపడకుండా ఉండటంతో కేన్సర్‌ వంటి రోగాలు రాకుండా నిరోధించవచ్చని రుజువయింది. ఈ ఏ కాదశి ఉపవాసంపై పరిశోధన చేసిన జపాన్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ యోషినోరి ఒహుసుమికి నోబెల్‌ బహుమతి లభించింది.

పురాణగాథల ప్రకారం..
ఇక పురాణగాథల ప్రకారం కృతయుగంలో మురాసురుడికి బ్ర హ్మ ఇచ్చిన వరంతో అహంకారం పెరిగి దేవతలను, నరులను హింసిస్తుంటాడు. అతడితో యుద్ధం చేసి అలసిపోయిన శ్రీమహా విష్ణువు సింహవతి అనే గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా ఆయన శరీరం నుంచి ఒక కన్య ఉద్భవించి మురాసురుడిని సంహరిస్తుంది. ఇందుకామెను వరం కోరుకొమ్మని మహావిష్ణువు కోరగా తాను ఏకాదశి తిధిగా, విష్ణుప్రియగా లోకంచే ఆరాధింపబడాలని కోరుతుంది. ఈ తొలిఏకాదశి నాడు ఆచరించాల్సిన వ్రతాన్ని సైతం శాస్త్రం పేర్కొంది. ఈ వ్రతాన్ని ఆచరించి దూర్వాస మహర్షి శాపం నుంచి విముక్తి పొందడానికి అంబరీషుడు హరిభక్తి పరాయణుడై విష్ణు సాయుజ్యం పొందాడు.

గ్రామాల్లో ఘనంగా..
గ్రామాల్లో ఈ తొలిఏకాదశిని ఎంతో ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ రోజున ప్రత్యేకంగా జొన్నలను వేయించి మెత్తగా దంచి, అందులో బెల్లం కలిపి తయారుచేసిన ‘పేలపిండి’ ఎంతో రుచికరంగా ఉండి పిల్లల మొదలు పెద్దల వరకు ఇష్టపడే ఒక ఆహారం. దీన్ని శ్రీమహావిష్ణువుకు నివేదన చేసి అనంతరం ప్రసాదంగా తీసుకుంటారు. అలాగే ఈ తొలిఏకాదశి పండుగ సందర్భంగా మహిళలు గోరింటాకును ధరించి, వేకువజామునే ముంగిళ్లలో కళ్లాపు చల్లి, ముగ్గులతో అలంకరిస్తారు.

ఇక ఈ తొలిఏకాదశి రోజున గోపద్మ వ్రతాన్ని ఆచరించడం ఎంతో ప్రాశస్త్యం. అది వీలుపడని వారు కనీసం గోవుకు పదకొండు ప్రదక్షిణాలు చేసి, బ్రాహ్మణుడికి మోయన, దక్షిణ ఇచ్చి ఆశీర్వచనం తీసుకోవాలి. ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. అయిదు కర్మేంద్రియాలు, అయిదు జ్ఞానేంద్రియాలు, మనసు మొత్తం కలిసి పదకొండింటిపైనా నియంత్రణ ఏర్పరుచుకోవాలన్నదే ఏకాదశి వ్రతం సందేశం. ఇక పలు దేవాలయాల్లో ఏకాదశి సందర్భంగా శ్రీమహా విష్ణువుకు ప్రత్యేకపూజలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.






మోక్షాన్నిచ్చే ఏకాదశి వ్రతం

ఆషాడస్య శుక్లైదశ్యాం యద్విధానం శృణుష్య తత్‌
ఉపోష్య తస్మిన్‌ దివసే విధివన్‌ మండపే శుభే
స్థాపయేత్ప్రతిమాం విష్ణోః శంఖచక్ర గదాంబుజైః
తతఃపంచామృతైస్నాప్య మంత్రైశుద్ధ జలేనచ


నారద పురాణం ఆషాఢశుద్ధ ఏకాదశిని గురించి చెప్పిన శ్లోకమిది. దీన్నే మనం తొలి ఏకాదశి అంటాం. సాధారణంగా మనకున్న పన్నెండు నెలల్లో నెలకు రెండు చొప్పున ఇరవై నాలుగు, అధిక మాసంలో రెండు కలుపుకొని మొత్తం ఇరవై ఆరు ఏకాదశులుంటాయి. ఏకాదశుల ఔన్నత్యాన్ని గురించి ఆరోజు మనం పాటించాల్సిన విధివిధానాలను గురించి నారద పురాణమే గాక బ్రహ్మవైవర్త పురాణం, పద్మ పురాణం, వామన పురాణం వంటివేగాక, స్మృతికౌస్తుభం కూడా విపులంగా చెప్పాయి. ఈ ఇరువై ఆరు ఏకాదశుల్లో దేని ప్రత్యేకత దానికే ఉంది. ఆ ప్రత్యేకతను బట్టే పురాణాల్లో ఒక్కోదానికీ ఒక్కో పేరు పేర్కొనబడింది. మనకు తెలిసిన తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ఉత్థాన ఏకాదశి వంటివి మాత్రమేగాక కామ్యైకాదశి, రమైకాదశి, నిర్జలైకాదశి మొదలైనవి ఉన్నాయి.

ఆషాఢ శుద్ధ ఏకాదశిగా పిలువబడే ఈ పవిత్రమైన రోజున ఏం చేయాలి? ఏలా ఉండాలన్న చర్చను పురాణేతిహాసాలు విపులంగా చెప్పాయి. ఆ రోజు ఉపవాసదీక్ష చేసి మహావిష్ణువును సకలోపచారాలతో పూజించాలన్నది నియమం. దశమి రోజు రాత్రి నిరాహారులై, ఏకాదశినాడు సంపూర్ణంగా ఉపవసించి ద్వాదశినాటి ఉదయాన్నే స్వామిని పూజించి పారణ చెయ్యాలన్నది శాస్త్రం. నిష్ఠాపరులు నియమాలు సడలనివ్వకుండా స్వామిని ఆరాధించడాన్ని ఒక వ్రతంగా పెద్దలు పేర్కొన్నారు. ఉపవసించడమే కాక నేలపై పడుకోవడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, అహింస, ధ్యానం వంటివాటిని వ్రతనియమాలుగా చెప్పారు. పూర్వం మాంధాత, రుక్మాంగదుడు, అంబరీషుడు మొదలైనవారు ఈ పవిత్ర ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మోక్షం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి.

గోపద్మవ్రతంగా ఆచరించే ఈ రోజున భూరిదానాలు చేయడం మిక్కిలి శ్రేష్టకార్యం. అలాగే, ఈ రోజు నుంచి చాతుర్మాస్య దీక్ష ప్రారంభమవుతుంది. ఆషాఢ, శ్రావణ, భాద్రపద, కార్తీక మాసాల్లో యతులు, సన్యాసులు చాతుర్మాస్య దీక్ష చేస్తూ సంచారాన్ని ఆపి ఏదైనా పుణక్షేత్రంలో ఉంటూ ఈ నాలుగు నెలలూ ఆధ్యాత్మిక బోధలు చేస్తుంటారు. కార్తీకశుద్ధ ఏకాదశి దాకా ఈ దీక్ష సాగుతుంది. తొలి ఏకాదశినాడు వైకుంఠవాసుడు యోగ నిద్రా ముద్రితుడై తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు గనుక దీన్ని శయనైకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని అంటారు.

ఇతిహాసాల్లో, పురాణల్లో అనేక కథలతో ముడిపడి ఉన్న ఈ శయనైకాదశికి పకృతిపరంగా కూడా ప్రాశస్త్యం ఉంది. చాతుర్మాస్య దీక్షా ప్రారంభదినం కనుక ఇది తొలి ఏకాదశి. ఎండాకాలం ముగిసి వర్షాకాలం రావడంతో ప్రకృతి పలు మార్పులకు లోనై మానవాళికి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కనుక ఆహార నియమాల్లోనూ మార్పులు అవసరం. వాటిని సూచించేదే చాతుర్మాస్య దీక్ష. ఈ నియమాలు సన్యాసులకు, యతులకే కాదు. మానవులందరికీ కూడా వర్తించేవే. సత్యనిష్ఠ, ఉపవాస దీక్ష, వ్రతాచరణ మొదలైన పుణ్యకార్యాలను ప్రారంభించేది ఈ రోజే. పరమ పతివ్రతా తిలకంగా వెలుగొందిన సతీసక్కుబాయి పరమపదం చేరిన రోజు. అందుకే ఈ పర్వదినాన్ని పండరిపురంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు.
- గన్నమరాజు గిరిజామనోహరబాబు




No comments:

Post a Comment