వాల్మీకి మంచి కథానాయకుడితో ఓ పుస్తకం రాయాలనుకుని తన ఆశ్రమానికి వచ్చిన లోక సంచారి ఐన నారదుడిని అలాంటి వ్యక్తి గురించి అడుగుతాడు. 16 సుగుణాలు గల రాముడి గురించి నారదుడు ఆయనకి చెప్తాడు. తర్వాత వ్యాసుడు తమసా నదీ తీరానికి స్నానానికి వెళ్లినప్పుడు చెట్టు మీది క్రౌంచ పక్షుల జంటని చూస్తాడు. అంతలో ఓ వేటగాడు ఓ పక్షిని బాణంతో చంపేస్తాడు. రెండో పక్షి పడే వేదనని చూసిన బాధతో ఆయనకి అనుకోకుండా నోటిలోంచి ఓ శ్లోకం వచ్చింది. తర్వాత బ్రహ్మ ఆయనకి ప్రత్యక్షం అయి, ‘క్రౌంచ పక్షి మరణంతో నీ నోటి నించి వెలువడ్డ శ్లోకాన్ని నేనే నీకు స్ఫురింపజేశాను. ఆ ఛందస్సులో రాముడి కథ రాయి’ అని సూచిస్తాడు. ఆయన రఘురాముడి చరిత్ర మొత్తాన్ని ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో రాస్తాడు. గాయత్రీ మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలతో ప్రతీ వెయ్యవ శ్లోకం మొదలవుతుంది. ఆయన రాసిన ఆ శ్లోకాలని లవకుశులు అనేకచోట్ల గానం చేస్తూ తిరుగుతూంటారు. ఓసారి వాళ్లు తన ఊళ్లో గానం చేస్తూంటే, దాన్ని విన్న రాముడు వారిని పిలిపించి తన సభలో రామకథని గానం చేయమంటాడు. అలా రామాయణం మొత్తం ఫ్లాష్‌బ్యాక్‌లో చెప్పబడిందట. నిజమేనా?’
‘నిజమే. తర్వాత?’ తల్లి చిరునవ్వుతో ప్రశ్నించింది.
‘అయోధ్య నగరం రాజధానిగా దశరథుడనే మహారాజు కోసల సామ్రాజ్యాన్ని పాలించేవాడు. ఆ రాజ్యంలోని ప్రజలంతా ఎలాంటి బాధలు లేకుండా ధర్మంగా, న్యాయంగా ప్రవర్తిస్తూ సదా సంతోషంగా ఉండేవారు. నాస్తికులు కాని, రోగులు కాని, బీదలు కాని, బాధపడేవారు కాని ఆ రాజ్యంలో ఉండేవారు కారు. దశరథుడి మంత్రి సుమంతుడు పాలన విషయంలో చక్కటి సలహాలని ఇచ్చేవాడు.
‘అయోధ్యాపురిని దశరథ మహారాజు, ఇంద్రుడు అమరావతిని పాలించిన రీతిలో పాలించేవాడు. అక్కడ ఒక్క బీద వాడు కాని దానం కోరేవాడు కాని అడుక్కునేవాడు కాని, రోగగ్రస్థుడు, ధర్మం తప్పి ప్రవర్తించేవాడు కాని లేరు. అంతా సుఖశాంతులతో జీవిస్తున్నారు. వింధ్య పర్వతాల్లోని ఉత్తమ ఏనుగులు రాజుగారి సైన్యంలో ఉండేవి. (సింధు దేశం ఉత్తమాశ్వాలకి ప్రసిద్ధి). మంత్రులు ఎనిమిది మంది ఐకమత్యంతో రాజ్యపాలనలో దశరథుడికి సహాయం చేసేవారు. అంతా న్యాయంగా వ్యవహరించేవారు.
‘ఐతే సంతానం లేని దశరథుడు తన పురోహితుడైన వశిష్ఠ మహర్షిని, ఇతర బ్రాహ్మణులని పిలిపించి అశ్వమేథ యాగాన్ని చేయాలనుకుంటున్నానని చెప్పి, సలహా కోరాడు. దాన్ని చేయమని, గుర్రాన్ని వదలమని వారు సలహా ఇచ్చారు. సుమంత్రుడు మాత్రం తర్వాత దశరథుడ్ని వొంటరిగా కలిసి ఇలా చెప్పాడు.
‘రాజా నీకు సంతానం కలగడం గురించి పూర్వం సనత్కుమారుడు ఋషులతో చెప్పాడని విన్నాను. ఆ వైనం విను. కాశ్యపుడి మనవడు, విభాండకుడి కొడుకు అయిన ఋష్యశృంగుడు బ్రహ్మచారి. వంగ దేశపు రాజైన రోమపాదుడు ధర్మం తప్పి పాలించడంతో ఆ దేశంలో అనావృష్ఠి ఏర్పడింది. ఋష్యశృంగుడు తమ రాజ్యంలో కాలుపెడితే వర్షం కురిసిస్తుందన్న సలహా ప్రకారం, కొందరు వేశ్యలని పంపి అతన్ని ఆకర్షించి, ఋష్యశృంగుడ్ని తన రాజ్యానికి రప్పించడంతో వర్షాలు ఆగిపోయాయట.
‘కృతజ్ఞతగా రోమపాదుడు తన కూతురు శాంతని ఋష్యశృంగుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ సందర్భంలో సనత్కుమారుడు ‘దశరథుడు ఇక్ష్వాకు వంశంలో రాజుగా పుడతాడని, తనకి పుత్రసంతానం కలగడానికి ఋష్యశృంగుడ్ని అయోధ్యకి రప్పిస్తాడని, ఆయన ఋత్విక్కుగా వ్యవహరించాక పుత్రకామేష్టి యాగం పూర్తి చేసి, గుర్రాన్ని వదులుతారని చెప్పాడు.
దశరథుడికి నలుగురు ఉత్తమమైన కొడుకులు పుడతారని ఋష్యశృంగుడు చెప్పాడు. వసంత ఋతువు వచ్చింది. దశరథ మహారాజు తల పెట్టిన అశ్వమేథ యాగానికి సంబంధించిన మొదటి భాగం పూర్తయి ఏడాది తర్వాత గుర్రం తిరిగి వచ్చింది. వెంటనే అన్ని సంబారాలని సమకూర్చారు. ఆరు మారేడు, ఆరు చండ్ర, ఆరు మోదుగ , రెండు దేవదారు, ఓ శే్లష్మాతక కర్రతో చేసిన, ఎనిమిది అంచులు గల మొత్తం ఇరవై ఒక్క శిల్పులు అందంగా చెక్కిన యూప స్తంభాలని నిలబెట్టారు. గరుడాకార వేదికని చిత్యాగ్ని కోసం నిర్మించారు.
‘లోకంలోని ధార్మికులైన రాజులు అందర్నీ ఆహ్వానించారు. దశరథుడు స్వయంగా కాశీ, కేకయ, అంగ, సింధు మొదలైన దేశాల రాజులని ఆహ్వానించాడు. వారి కోసం ప్రత్యేకంగా వసతి గృహాలని నిర్మించారు. సరయూ నది ఉత్తర తీరంలో నిర్మించిన యాగశాలలో ఋష్యశృంగుని ఆధ్వర్యంలో మంత్రాలతో యాగం ఆరంభించారు. యాగం జరిగినంత కాలం ప్రజలంతా తృప్తిగా రుచికరమైన భోజనం చేశారు. వివిధ దేశాల నించి వచ్చిన వారికి, బ్రాహ్మణులు, దాసులు, మునులు, సన్యాసులకి అన్న, వస్తద్రానాలు జరిగాయి.
‘కౌసల్య యూపస్తంభానికి కట్టిన గుర్రానికి ప్రదక్షిణ చేసి మూడు కత్తులతో మంత్రోక్తంగా దాన్ని చంపింది. అలా అశ్వమేథ యాగాన్ని మూడు రోజుల్లో పూర్తి చేశారు. మొదటి రోజుకి చతుష్టోయం అని, రెండో రోజుకి ఉక్థ్యమని, మూడో రోజుకి అతిరాత్రం అని పేరు. యాగానంతరం దశరథుడు తన భూమిని అంతటినీ ఋత్విక్కులకి దానం చేశాడు. వారు దాన్ని ‘్భమిని రక్షించగలిగేది దశరథుడే’ అని చెప్పి ఆయనకి తిరిగి ఇచ్చేసి, దాని బదులుగా దశరథుడు ఇచ్చిన పది లక్షల ఆవులని, వంద కోట్ల బంగారు నాణెలని, నాలుగు వందల కోట్ల వెండి నాణాలని స్వీకరించి, వాటిని ఋష్యశృంగుడికి, వశిష్ఠుడికి ఇచ్చేశారు. ఆ ఇద్దరూ తమకి వద్దని, బ్రాహ్మణులంతా కలిసి ఆ సొమ్ముని పంచుకోమని చెప్పారు.
తర్వాత ఋష్యశృంగుడు దశరథుడి చేత పుత్రీయేష్ఠి యాగాన్ని చేయించాడు. ఆ యాగ ఫలాలని స్వీకరించిన దేవతలు, గంధర్వులు, సిద్ధులు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లి ఇలా మొర పెట్టుకున్నారు.
‘నీ వర ప్రసాదంతో రావణుడనే రాక్షసుడు ముల్లోకాలని పీడిస్తున్నాడు. ముఖ్యంగా స్ర్తిలని, యజ్ఞయాగాదులని చేసే బ్రాహ్మణులని. అతన్ని చంపే ఉపాయం ఆలోచించు’
‘అలాగే. రావణుడు నన్ను దేవ, దానవ, రాక్షస, గంధర్వ, యక్షుల చేతిలో చావు లేకుండా వరం అడిగాడు. కాని మనిషి మీద చులకనతో మనిషి చేత చంపబడకూడదని అడగలేదు’
అప్పుడే అక్కడికి విచ్చేసిన విష్ణువుతో ‘రావణుడ్ని చంపడానికి దశరథుడి ముగ్గురు భార్యలకి నలుగురు కొడుకులుగా జన్మించు’ బ్రహ్మ, దేవతలు విష్ణువుని కోరారు.
‘అలాగే. ఆ లోక కంటకుడ్ని చంపి, పదకొండు వేల సంవత్సరాలు భూమిని పాలిస్తాను’ విష్ణువు అంగీకరించాడు.
(బాలకాండ సర్గ 14 నించి 15 దాకా)
‘యజ్ఞ అగ్నిగుండం నించి ప్రజ్వరిల్లే అగ్నిశిఖ లాంటి ఓ మహాభూతం ప్రత్యక్షమై వెండి మూతగల బంగారు పాత్రలో పాయసాన్ని దశరథుడికి ఇచ్చి తను ప్రజాపతి పంపగా వచ్చానని, దాన్ని తన ముగ్గురు భార్యలకి ఇవ్వమని, కొడుకులు పుడతారని చెప్పి మాయం అయింది.
‘దశరథుడు కౌసల్యకి సగాన్ని, మిగిలిందాంట్లో సగాన్ని సుమిత్రకి, (పావు వంతు) మిగిలిన దాంట్లో సగం (ఎనిమిదో వంతు) కైకేయికి ఇచ్చాడు. కైకేయికి పాయసం ఇవ్వగా మిగిలిన ఎనిమిదో భాగాన్ని మళ్లీ సుమిత్రకి ఇచ్చాడు. దాన్ని తిన్న ఆ ముగ్గురు భార్యలు గర్భవతులు అయ్యారు.
ఇదిలా ఉండగా బ్రహ్మ దేవతలతో చెప్పాడు.
‘మానవ రూపంలో జన్మించే విష్ణువుకి సహాయంగా మీ ద్వారా అప్సరస, గంధర్వ స్ర్తిలకి కోతులుగా పుడతారు. (దేవతలకి తమ భార్యల ద్వారా పిల్లలు పుట్టరనే సరస్వతీ దేవి శాపం, రావణుడు వానరుల వల్ల చస్తాడనే నందికేశ్వరుడి శాపం ఉన్నాయి.) దేవతలారా! మీరు కామరూపులు, పరాక్రమవంతులైన వానర రూపంలో పుట్టండి’
‘అప్పటికే ఓసారి బ్రహ్మ ఆవులించగా ఆయన నోటిలోంచి జాంబవంతుడు ఎలుగు రూపంలో పుట్టాడు. దేవేంద్రుడికి వాలి, సూర్యుడికి సుగ్రీవుడు, బృహస్పతికి తారుడు, కుబేరుడికి గంధమాదనుడు, విశ్వకర్మకి నలుడు, అగ్నికి నీలుడు, అశ్వినీ దేవతలకి మైందుడు, ద్వివిదుడు, వరుణుడికి సుషేణుడు, పర్జన్యుడికి శరభుడు, వాయుదేవుడికి హనుమంతుడు జన్మించారు. ఇంకా మహా బలవంతులు, కామరూపలు ఐన లక్షలాది వానరులు గోలాంగూల, ఋక్ష, కినె్నర, నాగ, గంధర్వ, విద్యాధర అప్సరసలకి జన్మించారు. ఏ దేవతకి ఏ పరాక్రమం, ఏ రూపం ఉందో వారి సంతానానికి కూడా అవే వచ్చాయి. వారు పర్వతాల్ని పిండి చేసి చెట్లని వేళ్లతో సహా పెకలించగలరు. ఇలా వనాల్లో సంచరించే వానరులు మొత్తం కోటి మంది రావణుడి వధ కోసం రాముడికి సహాయం చేయడానికి పుట్టారు. ఆ వానర సేనలకి వాలి, సుగ్రీవుడు, నలుడు, నీలుడు, హనుమంతుడు నాయకులు అయ్యారు.
‘అశ్వమేథ, పుత్రకామేష్ఠి యాగాలు పూర్తయ్యాక దశరథుడు అతిథులని సత్కరించి పంపాడు.
ఋష్యశృంగుడు కూడా తన భార్య శాంత, మామగారు రోమపాదులతో వెళ్లిపోయాడు.
‘యజ్ఞం పూర్తయి ఆరు ఋతువులు (సంవత్సరం) అయ్యాక చైత్ర మాసం, పునర్వసు నక్షత్రం, నవమి తిథి, కర్కాటక లగ్నంలో దశరథుడి పెద్ద భార్య కౌసల్య కొడుకుని కన్నది. తర్వాత రెండో భార్య సుమిత్రకి కర్కాటక లగ్నంలోనే ఆశే్లషా నక్షత్రంలో కవలలు పుట్టారు. చివరి భార్య కైకేయికి పుష్యమి నక్షత్రం, మీన లగ్నంలో ఓ కొడుకు పుట్టాడు. దేవతలు ఆనందంతో దుందుభులు మోగించి, పుష్ప వర్షాన్ని కురిపించారు. అయోధ్య పౌరులు కూడా చాలా ఆనందించారు.
‘పదకొండు రోజుల తర్వాత వశిష్ఠుడు కౌసల్య కొడుక్కి రాముడు అని, కైకేయి కొడుక్కి భరతుడని, సుమిత్రకి పుట్టిన కవలలకి లక్ష్మణ, శతృఘు్నలనే పేర్లు పెట్టాడు. దశరథుడు విరివిగా దానాలు చేశాడు.
‘రాముడికి విలువిద్యలో, తండ్రికి సేవ చేయడంలో ఎక్కువ ఆసక్తి ఉండేది. రామలక్ష్మణుల మధ్య స్నేహం అధికంగా ఉండి ఇద్దరూ ఓ జతగా ఉండేవారు. అలాగే భరత శతృఘు్నలు కూడా జతగా ఉండేవారు.
‘వారికి వివాహ వయసు రావడంతో దశరథుడు ఆ విషయం బంధువులతో, పురోహితులతో ఆలోచిస్తూండగా అక్కడికి కుశిక వంశీయుడు, గాధి కుమారుడు ఐన విశ్వామిత్రుడు వచ్చాడు. దశరథుడు ఆయనకి ఎదురెళ్లి స్వాగతం చెప్పాడు. వశిష్ఠుడు, ఇతర మునులని ఆయన కుశల ప్రశ్నలు వేశాక విశ్వామిత్రుడ్ని ఏమి కోరి వచ్చారని దశరథుడు అడిగాడు. (బాలకాండ సర్గ 16 నించి 18 దాకా)
రామాయణం - మీరే డిటెక్టివ్ 5
విశ్వామిత్రుడు చెప్పిన ఆ మాటలు వినగానే దశరథుడు భయంతో ఇలా బదులు చెప్పాడు.
‘పదహారేళ్ల రాముడు రాక్షసులతో యుద్ధం చేయలేడు. కాబట్టి నా సైన్యంతో నేనే వెళ్లి ఆ రాక్షసులని చంపి, మీరు చేసే యాగాన్ని రక్షిస్తాను. రాముడికి ఇంకా అస్త్ర బలం లేదు. యుద్ధంలో నేర్పరి కాదు. పైగా రాముడు లేకుండా నేను క్షణకాలం కూడా బతకలేను. మీరు రాముడే కావాలంటే, అతనితోపాటు నేను, నా సైనికులు కూడా వెంట వస్తాం. ఎంతో ప్రయాసతో నేను అరవై వేలవ ఏట రాముడ్ని కన్నాను. కపట యుద్ధం చేసే ఆ రాక్షసులతో నేను ఎలా యుద్ధం చేయాలో చెప్పండి’
‘పౌలస్త్య వంశానికి చెందిన మిశ్రవశుడి కొడుకు, కుబేరుడి సోదరుడు, బ్రహ్మ నించి వరాలని పొందిన రావణుడు మూడు లోకాలని పీడిస్తున్నాడు. అతని ప్రేరణతో మారీచ, సుబాహులు అనే ఇద్దరు రాక్షసులు యజ్ఞాలకి విఘ్నాలు కలిగిస్తున్నారు.’
ఆ పేర్లు వినగానే దశరథుడు చెప్పాడు.
‘దేవ, దానవ, గంధర్వ, యక్ష, పతగ, పన్నాగులు కూడా రావణుడితో పోరాడలేరు. ఇక మానవులు ఏం చేయగలరు స్వామి? నేను నా సైన్యంతో, రాముడితో కలిసి కూడా వారితో యుద్ధం చేయలేను. నిజానికి నేను కూడా ఆ ఇద్దరు రాక్షసుల్లో ఒకరితోనే యుద్ధం చేయగలను. పున్నామ నరకం నించి నన్ను ఉద్ధరించే రాముడ్ని అందుకు మీకు ఇవ్వలేను’
ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు కోపంగా ఇలా చెప్పాడు.
‘అడిగింది ఇస్తానని మాట ఇచ్చి వెనక్కి వెళ్లడం రఘువంశ రాజులకి తగదు. అది అధర్మం’
వెంటనే వశిష్ఠుడు కల్పించుకుని ఇలా చెప్పాడు.
‘రాముడికి అస్త్ర విద్య రాకపోయినా విశ్వామిత్రుడి రక్షణలో ఉంటే రాక్షసులు ఏమీ చేయలేరు. కాబట్టి రాముడ్ని విశ్వామిత్రుడి వెంట పంపు. విశ్వామిత్రుడికి తెలిసిన అస్త్ర విద్యలు దేవతలకి కాని, గంధర్వ, యక్ష, కినె్నర, మహోదరులకి కాని, రాక్షసులకి కాని తెలీదు. దక్ష ప్రజాపతి ఇద్దరు కూతుళ్ల పేర్లు జయ, సుప్రభ, ఓ అల్లుడి పేరు భృశాశ్వు. రాక్షసులని చంపడానికి జయ ఏభై మంది కొడుకులని, సుప్రభ ఏభై మంది కొడుకులని కన్నారు. నిజానికి ఆ సంతానం జయాన్ని చేకూర్చే అస్త్రాలు. అవన్నీ నేడు విశ్వామిత్రుడి అధీనంలో ఉండటమే కాక, కొత్త అస్త్రాలని కూడా సృష్టించగలడు. స్వయంగా వారిని ఎదుర్కోగలిగీ, రాముడి మేలు కోసమే విశ్వామిత్రుడు రాముడి కోసం వచ్చాడు’
దాంతో దశరథుడు తృప్తి పడి విశ్వామిత్రుడి వెంట రాముడ్ని పంపడానికి అంగీకరించాడు.
* * *
విశ్వామిత్రుడు ముందు నడుస్తూంటే రామలక్ష్మణులు బాణాలతో ఆయన వెనక నడిచి సరయూ నదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ వారిద్దరికీ బ్రహ్మ కూతుళ్లైన బల, అతిబల అనే రెండు అస్త్ర విద్యలని విశ్వామిత్రుడు ఉపదేశించాడు. వాటివల్ల శ్రమ, జ్వరం కలగక వారు నిద్ర పోతున్నప్పుడు కూడా రాక్షసులు వారిని ఏం చేయలేరు. ఆకలి, దాహం కలగవు. రామలక్ష్మణులు ఆ రాత్రి అలవాటు లేని గడ్డి మీదే నిద్రించారు.
మర్నాడు ఉదయం విశ్వామిత్రుడు వారిద్దరినీ నిద్ర లేపాడు. ఆ సోదరులు ఇద్దరూ సంధ్యావందనం, గాయత్రి జపం చేశాక కొద్ది దూరంలోని సరయు, గంగానదుల సంగమ స్థానానికి చేరుకున్నారు. అక్కడ కొన్ని వేల ఏళ్లుగా తపస్సు చేసే ఋషులని చూశారు. ఓ ఆశ్రమాన్ని చూసి దాని గురించి రాముడు అడిగితే విశ్వామిత్రుడు వారికి ఇలా వివరించాడు.
‘ఇక్కడ తపస్సు చేసుకుని తన భార్యతో వెళ్లే శివుడ్ని మన్మథుడు ఎదిరించాడు. శివుడి చూపుతో మన్మథుడు కాలి బూడిద అయ్యాడు. అప్పటి నించి మన్మథుడికి అనంగుడు (అంగాలు లేని వాడు) అనే పేరు, ఈ ప్రదేశానికి వంగదేశం అనే పేరు వచ్చాయి. ఈ ఋషులంతా శివుడి శిష్యుల పరంపర’
వారి సంభాషణని ఆశ్రమంలోని ఋషులు దివ్యదృష్టితో తెలుసుకున్నారు. ఆ రాత్రి వారంతా ఋష్యాశ్రమంలో విశ్రమించారు.
(బాలకాండ సర్గ 19-23)
రామాయణం - మీరే డిటెక్టివ్ 6
మర్నాడు ఉదయం ఓ పడవలో రామలక్ష్మణులు, విశ్వామిత్రుడితో కలిసి గంగానది నదిని దాటారు. అకస్మాత్తుగా వారికి నది మధ్యలోంచి పెద్ద నీటి శబ్దం వినిపించడంతో రాముడు దాని గురించి విశ్వామిత్రుడ్ని అడిగాడు.
‘రామా! బ్రహ్మదేవుడు పూర్వం కైలాస పర్వతం మీద ఓ సరస్సుని సృష్టించాడు. మనోసంకల్పంతో ఏర్పడ్డ దానికి మానస సరోవరం అనే పేరు వచ్చింది. ఆ సరస్సు నించే పుట్టిన సరయూ నది అయోధ్య చుట్టూ ఉంది. అది గంగలో ప్రవేశించే శబ్దానే్న మీరు విన్నది’ ఆ ముని చెప్పాడు.
వారిద్దరూ ఆ నదికి భక్తితో నమస్కరించారు.
పడవలోంచి దక్షిణ తీరంలో దిగాక పెద్దపులులు, సింహాలు, ఏనుగులు, అడవి పందులు, వివిధ పక్షులు గల భయం కలిగించే ఓ అడవిని దూరం నించి చూశారు. విశ్వామిత్రుడు ఆ అడవి చరిత్రని వివరించాడు.
‘రామా! పూర్వం ఈ ప్రాంతంలో దేవతలు మలదము, కరూశము అనే రెండు దేశాలని స్థాపించారు. అంతకు పూర్వం వృత్తాసురుడు అనే రాక్షసుడ్ని చంపడంతో ఆవహించిన బ్రహ్మ హత్యాపాపం ఇంద్రుడ్ని ఆకలి, అశుభ్రతలతో పీడించసాగింది. దేవతలు, మహర్షులు మంత్రించిన నీటితో ఇంద్రుడికి స్నానం చేయించి ఆ పాపాన్ని పోగొట్టారు. ఇంద్రుడిని పీడించిన ఆ ఆకలి, అశుభ్రతలు బయటకి రాగానే వాటిని ఈ ప్రదేశానికి ఇచ్చేశారు. అవే మలదము, కరూశ దేశాలు. చాలాకాలం ఆ దేశాలు ధనధాన్యాలతో సమృద్ధిగా ఉన్నాయి. కొంతకాలానికి ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగల, వెయ్యి ఏనుగుల బలం గల తాటక అనే యక్షిణి ఇక్కడికి వచ్చింది. ఆమె ఈ దేశ పౌరులని పీడించి నాశనం చేసి చివరకి ఈ రెండు దేశాలని నశింపజేసింది. ఆ దేశాలు పాడుబడటంతో ఈ ప్రాంతమంతా పెద్ద అడవిగా మారింది. దీనికి తాటక వనం అని పేరు. తన వనంలోకి ఎవరూ రాకుండా ఆమె ఒకటిన్నర ఆమడల దూరంలో మార్గమధ్యంలో నివసిస్తోంది. ఎవరూ దీంట్లోకి వెళ్లరు. నువ్వు ఆ దుర్మార్గురాలిని చంపు’
‘యక్షులకి అంత పరాక్రమం ఉండదు అని విన్నాను. మరి ఈ తాటక యక్షిణికి అంత బలం ఎలా వచ్చింది?’ రాముడు సందేహంగా ప్రశ్నించాడు.
‘ఆమెకి వరదానం వల్ల ఆ బలం వచ్చింది. ఆ వివరాలు చెప్తాను విను. పూర్వం సంతానం లేని సుకేతుడు అనే యక్షుడు సంతానం కోసం బ్రహ్మదేవుడి గురించి గొప్ప తపస్సు చేసి, ఆయన్ని మెప్పించి తాటకని కన్నాడు. ఆమె పెద్దయ్యాక బర్జుడి కొడుకు సుందుడికి భార్య అయింది. వారికి మారీచుడు అనే కొడుకు పుట్టాడు. శాపంతో మారీచుడు రాక్షసుడిగా మారాడు. అగస్త్య మహర్షి తాటక భర్త సుందుని శాపంతో చంపాడు. వెంటనే తాటక, మారీచులు ఆయన్ని తినాలని వికృత రూపంతో వస్తే, ‘రాక్షసివై మనుషులని తింటూ జీవించు’ అని ఆయన వారిని శపించాడు. ఆ తర్వాత ఆమె ఈ రెండు దేశాలని నాశనం చేసింది. ఆమెని చంపు. ఆడదాన్ని చంపకూడదని అనుకోకు. ప్రజాహితం కోసం రాజకుమారుడు నాలుగు కులాల్లోని ఎవర్నయినా చంపచ్చు. రాజు ప్రజా రక్షణకి పాపమైనా, కాకపోయినా, క్రూరమైన పనైనా సరే చెయ్యాల్సిందే. బ్రాహ్మణులని రక్షించడానికి అధర్మపరురాలైన తాటకని చంపు. పూర్వం విరోచనుడి కూతురు మంథర భూమాతని చంపాలని అనుకున్నప్పుడు దేవేంద్రుడు ఆమెని చంపాడు కదా? విష్ణువు కూడా ఇంద్రుడి నాశనం కోసం తీవ్ర తపస్సు చేసే భృగమహర్షి భార్య, శుక్రాచార్యుడి తల్లిని చంపాడు. ఇలా చాలామంది ఉన్నతమైన పురుషులు అధర్మపరులైన స్ర్తిలని చంపారు’
‘నా తండ్రి మీరు చెప్పింది చేయమని నన్ను ఆజ్ఞాపించారు. ఆయన చెప్పినట్లుగా, ప్రజాహితం కోసం నేను తాటకని చంపుతాను’
రాముడు చెప్పి అడవిలోని క్రూరమృగాలన్నీ భయపడేలా బాణం వింటిని లాగి పెద్ద టంకార శబ్దం చేశాడు. వెంటనే పిరికివాళ్లు చూస్తే గుండె ఆగిపోయే భయంకర రూపం గల తాటక ఉగ్రంగా రామలక్ష్మణుల దగ్గరికి వచ్చింది.
ఆమెని అన్నదమ్ములు ఇద్దరూ బాణాలతో ఎదుర్కొన్నారు. ఆమె తన మీదకి రాళ్ల వానని కురిపిస్తూంటే రాముడు శబ్దవేది (శబ్దం చేసే వ్యక్తి కనపడకపోయినా శబ్దాన్నిబట్టి బాణంతో ఆ వ్యక్తిని కొట్టే) అనే విలువిద్యతో తాటకని నిలువరించాడు. తన బాణాలతో ఆమె రెండు చేతులని ఖండించాడు. లక్ష్మణుడు కూడా తమ మీద మాయా విద్యని ప్రదర్శించే ఆమె ముక్కు చెవులని బాణాలతో కోశాడు.
‘రామా! సంధ్యాకాలంలో దీని మాయాశక్తి పెరుగుతుంది. ఆమె స్ర్తి అని ఉపేక్షించద్దు’ విశ్వామిత్రుడు హెచ్చరించాడు.
రాముడు గర్జిస్తూ తన మీదకి వచ్చిన తాటక వక్షస్థలం మీద బాణాలతో కొట్టాడు. తాటక మరణించడంతో ఇంద్రుడు, ఇతర దేవతలు సంతోషించి, రాముడికి అస్తవ్రిద్యని ఉపదేశించమని విశ్వామిత్రుడ్ని కోరారు. తాటక సంహారంతో విశ్వామిత్రుడు సంతోషించాడు. ఆ వనానికి కూడా ఆ రోజే శాపవిముక్తి కలిగింది.
ఆ రాత్రి వారు తాటక వనంలో నిద్రించారు. మర్నాడు ఉదయం విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి తీసుకెళ్లడానికి అన్నదమ్ములు ఇద్దర్నీ నిద్ర లేపాడు. (సర్గ 24-26)
మర్నాడు ఉదయం విశ్వామిత్రుడు రాముడికి తను ఇచ్చే అస్త్రాల వివరాలు ఇలా చెప్పాడు.
‘దేవ, రాక్షస, గంధర్వ, ఉరగ మొదలైన వారిని యుద్ధ రంగంలో జయించే ఈ దివ్యాస్త్రాలని నీకు ఇస్తాను. ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, ఇంద్రాస్త్రం, వజ్రాస్త్రం, శివ శూలం, బ్రహ్మ శిరోస్త్రం, బ్రహ్మాస్త్రం, ఐషికాస్త్రం ఇంకా నిప్పులు కక్కే మోదకి, శిఖరి అనే గదలు, ధర్మపాశం, కాలపాశం, వారుణపాశం, వారుణాస్త్రాన్ని ఇస్తాను. రామా! ఇంకా శుష్కం, ఆర్ద్ర అనే రెండు పిడుగులని, పైనకాస్త్రం, నారాయణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం, హయశిరస్సాస్త్రం, క్రౌంచాస్త్రం, ఇంకా రెండు శక్తులని నీకు ఇస్తాను. రాక్షసులు ధరించే కంకాళం, కపాలం, కంకణం అనే మూడు ముసలాలని కూడా ఇస్తాను. వైద్యాధరం అనే మహాస్త్రం, నందన ఖడ్గం, నిద్ర కలిగించే, నిద్ర తొలగించే గాంధర్వ, మానవాస్త్రాలని, సౌరాస్త్రాన్ని, దర్పణ, శోషణ, సంతాపన, విలాపనాస్త్రాలని, మదనాస్త్ర, మోహనాస్త్రాలని ఇస్తున్నాను. తీసుకో. తామస, సౌమనాస్త్రాలు, సంవర్థాస్త్రం, వౌసలాస్త్రం, సత్యాస్త్రం, మాయాధర్మాస్త్రం, తేజః ప్రభాస్త్రం, శిశిరాస్త్రం, సుదామనాస్త్రం, శితేషువు బాణం, మానవాస్త్రాలని తీసుకో. రామా! ఇష్టం వచ్చిన రూపాలని ధరించే, బలమైన ఈ ముప్పై ఒక్క అస్త్రాలు అన్నిటినీ వెంటనే తీసుకో’
విశ్వామిత్రుడు శుచిగా, తూర్పు వైపు తిరిగి ఆ అత్యుత్తమమైన అన్ని అస్త్రాలని రాముడికి ఉపదేశించాడు. ఏ అస్త్రాలని పరిపూర్ణంగా స్వీకరించడం దేవతలకి కూడా అసాధ్యమో అలాంటి అస్త్రాలు అన్నిటినీ విశ్వామిత్రుడు రాముడికి ఇచ్చాడు. ఆ అస్త్ర మంత్రాలు రాముడ్ని సేవించాయి. రాముడు ఆ అస్త్రాలని స్వీకరించాక అస్త్ర దేవతలు అందరూ రాముడికి నమస్కరించి ఇలా చెప్పాయి.
‘రామా! మేమంతా నీ దాసులం’
రాముడు చేత్తో ఆ అస్త్ర దేవతలని తాకి ఆజ్ఞాపించాడు.
‘నా జ్ఞాపకంలో ఉండండి’
దేవతలు వెళ్లాక రాముడు విశ్వామిత్రుడితో చెప్పాడు.
‘ఓ మునివర్యా! మీరు నాకు మూడు చక్రాలని, రెండు గదలని, మూడు పాసాలని ఇచ్చారు. దాంతో నేను ఈ అస్త్రాల ద్వారా దేవతలు కూడా ఎదిరించలేని వాడిని అయ్యాను. ఈ అస్త్రాల ఉపసంహారం కూడా తెలియచేయండి’
విశ్వామిత్రుడు ఆ పద్ధతిని కూడా ఉపదేశించాడు.
‘రామా! అలాగే. ఉపసంహారాలతోపాటు దృశాశ్వుని కొడుకులు, ప్రకాశించినవి, కామరూపం కలవి అయిన సత్యవంతం, సత్యకీర్తి, ధృష్టం, రభసం, ప్రతిహారతరం, పరాన్ముఖం, అవాగ్ముముఖం, లక్షాక్షం, విషమం, దృఢనాభం, సునాభం, దశాక్షం, శతవక్త్రం, దశశీర్షం, శతోదరం, పద్మనాభం, మహానాభం, దుందునాభం, సునాభం, జ్యోతిషం, కృశనం, నైరాశ్యం, విమలం, యోగంధరం, హరిద్రం, దైత్యం, ప్రశమనం, సార్చిర్మాలి, ధృతి, మాలి, వృత్తిమంతం, రుచిరం, పితృసౌమనసం, విధూతం, మకరం, కరవీరకరం, ధనం, ధాన్యం, కామరూపం, కామరుచి, మోహం, ఆవరణం, జృభకం, సర్వనాభం, సంతానం, వరణం అనే అస్త్రాలని కూడా ఇస్తున్నాను. వాటిని తీసుకో. నువ్వు వీటిని తీసుకోడానికి అర్హత గలవాడివి. నీకు క్షేమం అవుగాక!’
రాముడు సంతోషించి ఆ నలభై ఆరు అస్త్రాలని స్వీకరించాడు. ఆ అస్త్ర దేవతల్లో కొందరు ఎర్రగా కాలిన బొగ్గులా, కొందరు పొగలా కొందరు సూర్యచంద్రుల్లా ఉన్నారు. దివ్యమైన దేహాలు గల ఆ అస్త్ర దేవతలు కూడా ప్రత్యక్షం అయి, వినయంగా చేతులు కట్టుకుని రాముడితో ఇలా అన్నారు.
‘ఓ నరశ్రేష్ఠుడా! ఏం చేయాలో ఆజ్ఞాపించు’
‘మీరు నా మనసులో మెదలుతూ పని పడ్డప్పుడు నాకు సహాయం చేయండి. ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్లు వెళ్లండి’ రాముడు చెప్పాడు.
వారంతా రాముడికి ప్రదక్షిణం చేసి వెళ్లిపోయారు. ఉపసంహార మంత్రాలు తెలుసుకున్నాక రాముడు నడుస్తూ విశ్వామిత్రుడితో చెప్పాడు.
‘ఇటు వైపు పర్వతం మీద మృగాలతో నిండిన వృక్షాల గుంపు మేఘంలా చూడచక్కగా ఉంది. పక్షులు శ్రావ్యమైన పాటలు పాడుతూ ఈ ప్రదేశం ఆహ్లాదంగా ఉంది. కాబట్టి మనం ఆ భయంకరమైన అడవిలోచి బయటకి వచ్చామని అనుకుంటున్నాను. ఈ ప్రదేశం గురించి నాకు తెలుసుకోవాలని ఉంది. ఇక్కడ ఉన్న ఆశ్రమం ఎవరిది? బ్రాహ్మణులని చంపేవారు, దుర్మార్గులైన ఆ రాక్షసులు ఎక్కడికి వచ్చి నీ యజ్ఞానికి విఘ్నం చేస్తున్నారు? నేను రాక్షసులని చంపి నీ యజ్ఞాన్ని రక్షించాల్సిన ప్రదేశం ఏది? నాకు తెలుసుకోవాలని ఉంది.’
(సర్గ 27-28)
విశ్వామిత్రుడు రాముడి ప్రశ్నకి ఇలా జవాబు చెప్పాడు.
‘వామనావతారానికి పూర్వం వామనుడు (విష్ణువు) నివసించిన ఆశ్రమం ఇది. విష్ణువు ఈ వనంలో వందల కొద్దీ యుగాలు తపస్సు చేశాడు. కాశ్యపుడు ఇక్కడ తపస్సిద్ధి పొందాడు. అందువల్ల దీన్ని సిద్ధాశ్రమం అంటారు. విరోచనుడి కొడుకు బలి చక్రవర్తి ఇంద్రుడ్ని, ఇతర దేవతలని జయించి ముల్లోకాలని ఏలసాగాడు. బలి చక్రవర్తి యాగం చేసేప్పుడు అగ్నిదేవుడు, ఇతర దేవతలు అక్కడ తపస్సు చేసే విష్ణువుని కలిసి ఇలా కోరారు.
‘బలి యాగానంతరం వచ్చే యాచకులు యాచించినంత యథాతథంగా ఇచ్చేస్తాడు. నువ్వు వామన (మరుగుజ్జు) రూపం ధరించి మాకు లాభం చేకూర్చు’
అదే సమయంలో కాశ్యప ముని వెయ్యి సంవత్సరాలు తపస్సు పూర్తి చేసుకుని ఆ శక్తితో విష్ణువుని చూసి ఇలా చెప్పాడు.
‘ఓ ప్రభూ! ఆది, అంతం లేని ఈ విశ్వాన్ని నీ శరీరంలో చూస్తున్నాను’
విష్ణువు ఆయన్ని వరం కోరుకోమంటే ఇలా కోరుకున్నాడు.
‘అదితికి, నాకు కొడుకుగా పుట్టి దేవేంద్రుడికి తమ్ముడివి అవు. దేవతల పని చేసి పెట్టు’
ఆ ప్రకారం విష్ణువు అదితికి కొడుకుగా పుట్టి, మరుగుజ్జు రూపం ధరించి, బలి చక్రవర్తి దగ్గరికి వెళ్లి, మూడు అడుగుల భూమిని బిచ్చం అడిగాడు. దాన్ని స్వీకరించి మూడు లోకాలని ఆక్రమించి, బలిని బంధించి ఇంద్రుడికి మళ్లీ ముల్లోకాధిపత్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నేను వామనుడి మీద భక్తితో ఈ ఆశ్రమంలోనే ఉంటూ ఆరంభించిన యజ్ఞానికి రాక్షసులు విఘ్నం కలిగిస్తున్నారు.’
సిద్ధాశ్రమంలోని మునులంతా విశ్వామిత్రుడికి, రామలక్ష్మణులకి అతిథి పూజలు చేశారు. ఆ రోజునే విశ్వామిత్రుడు యజ్ఞాన్ని ఆరంభించాడు. రామలక్ష్మణులు ఆ రాత్రంతా అప్రమత్తంగా కాపుకాచి ఉదయం ప్రాంతఃకాల సంధ్యని, గాయత్రీ జపాన్ని, అగ్నిహోత్రాన్ని చేసి విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్లి నమస్కరించారు.
విశ్వామిత్రుడు వౌన దీక్ష తీసుకోవడంతో మునులు రామలక్ష్మణులతో చెప్పారు.
‘ఈ రోజు నించి ఆరు రోజులు రాత్రుళ్లు మీరు యాగాన్ని రక్షించాలి’
ఆరు రాత్రుళ్లు వారు నిద్ర లేకుండా కాపున్నారు. ఐదో రోజు రాగానే రాముడు లక్ష్మణుడితో జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. అకస్మాత్తుగా ఆకాశంలోంచి ఓ భయంకర శబ్దం వినిపించింది. నల్లటి రంగు గల మారీచ, సుబాహులు, వారి అనుచరులు ఆకాశంలోంచి మాయతో రక్త వర్షాన్ని యజ్ఞశాల మీద కురిపించారు. రాముడు మారీచుడి ఛాతీ మీద నల్లటి మానవాస్త్రంతో కొట్టాడు. ఆ దెబ్బకి ఆ నరమాంస భక్షకుడు వెళ్లి వంద యోజనాల దూరంలోని సముద్రంలో పడ్డాడు. ఆ చల్లటి బాణం ప్రాణం తీయకుండా స్పృహ తప్పిస్తుంది.
తర్వాత రాముడు ఆగ్నేయాస్త్రాన్ని సుబాహువు ఛాతీ మీద ప్రయోగించాడు. దాని దెబ్బకి ఆ రాక్షసుడు నేల కూలాడు. మిగిలిన రాక్షస మూక మీద వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి చంపాడు. యజ్ఞం పూర్తవగానే విశ్వామిత్రుడు రాముడితో ఇలా చెప్పాడు.
‘నా యజ్ఞం పూర్తయింది. నువ్వు కూడా నీ తండ్రి ఆజ్ఞని నెరవేర్చావు’
మర్నాడు ఉదయం రామలక్ష్మణులు సంధ్యావందనాది అనుష్ఠానాన్ని పూర్తి చేసుకుని, విశ్వామిత్రుడి దగ్గరకి వెళ్లి నమస్కరించి అడిగారు.
‘నీ సేవకులం. ఏం చేయాలో ఆజ్ఞాపించు’
విశ్వామిత్రుడి అనుమతితో మునులు వారికి ఇలా చెప్పారు.
‘రామా! మిథిలాపతి ఐన జనక మహారాజు చేసే యజ్ఞానికి మేం వెళ్తున్నాం. మీరు కూడా మాతో అక్కడికి వచ్చి ఓ గొప్ప విల్లుని చూడండి. దేవతలు, గంధర్వులు, రాక్షసులు ఎవరూ ఆ వింటిని వంచి నారిని కట్టలేరు. ఇక మనుషుల వల్ల ఏమవుతుంది? ఎందరో క్షత్రియ రాజులు దాన్ని ఎక్కుపెట్టలేక పోయారు. జనక మహారాజు పూర్వీకుడు దేవరాతుడు ఆ వింటిని యజ్ఞానికి ప్రతిఫలంగా దేవతలని అడిగి తీసుకున్నాడు. అది పూజా గదిలో పూజించబడుతోంది.’
సిద్ధాశ్రమానికి ప్రదక్షిణం చేసి, వన దేవతల దగ్గర సెలవు తీసుకుని అంతా ఉత్తరం వైపు మిథిలకి బయలుదేరారు. విశ్వామిత్రుడి వంద రథాలు అనుసరించాయి. తన వెనకే వచ్చే పక్షులు, మృగాలని విశ్వామిత్రుడు వారించి వెనక్కి పంపేశాడు. సాయంకాలానికి వారు శోణా నదీ తీరానికి చేరుకున్నారు. రాముడు విశ్వామిత్రుడ్ని ఆ ప్రదేశం గురించి చెప్పమని కోరాడు.
(సర్గ 29-31)
బ్రహ్మ కొడుకు కుశుడు విదర్భ రాజకుమారిని పెళ్లి చేసుకున్నాడు. వారికి కుశాంగుడు, కుశనాభుడు, అధూర్త రాజశుడు, వసువు అనే నలుగురు కొడుకులు పుట్టారు. కొడుకులు నలుగురు నాలుగు పట్టణాలని నిర్మించి పాలనని చేపట్టారు. కుశాంగుడు కౌశాంబి నగరాన్ని, కుశనాభుడు మహోదయపురాన్ని, అధూర్త రాజశుడు ధర్మారణ్యం అనే నగరాన్ని, వసువు గిరివ్రజపురాన్ని నిర్మించారు. మనం ఉన్నది గిరివ్రజపురం. గిరివ్రజపురం చుట్టూ ఐదు పర్వతాలు ఉన్నాయి. మగధ దేశంలోనే తూర్పు నించి పశ్చిమానికి ప్రవహించే శోణానది పుట్టింది. అది వసువుది.
కుశనాభుడికి ఘృతాచి అనే అప్సరస స్ర్తి ద్వారా వందమంది కూతుళ్లు పుట్టారు. వర్షాకాలంలో వారంతా ఓ రోజు ఉద్యానవన విహారం చేస్తూండగా వారిని చూసిన వాయుదేవుడు తనని పెళ్లి చేసుకోమని, మనుషుల్లో యవ్వనం త్వరగా పోతుందని, తనని పెళ్లి చేసుకుంటే దేవతా స్ర్తిలై శాశ్వత యవ్వనం పొందచ్చని వారికి చెప్పాడు.
‘మేమంతా మా తండ్రి కుశనాభుడి మాటని కాదని స్వేచ్ఛగా మేమే భర్తలని ఎన్నుకోం. వారు మమ్మల్ని ఎవరికి ఇచ్చి చేస్తే వారినే చేసుకుంటాం. నీకు శాపం పెట్టగలం. కాని ఆ పని చేయడం లేదు’ వారు బదులు చెప్పారు.
కోపం వచ్చిన వాయుదేవుడు వారిని గూని వాళ్లుగా చేశాడు. వాళ్లు అంతఃపురానికి తిరిగి వచ్చాక వాయుదేవుడికి, తమకి మధ్య జరిగింది తండ్రికి వివరించారు.
‘మీరు నా వంశ గౌరవాన్ని కాపాడారు. స్ర్తి పురుషులకి ఓర్పు అనేది అలంకారం. క్షమించడాన్ని అంతా చేయలేరు. రూపం, యవ్వనం లాంటివి గల దేవతలకి ఓర్పు తెలీదు’ కుశనాభుడు చెప్పాడు.
ఆయన వెంటనే మంత్రులను పిలిపించి కూతుళ్ల పెళ్లి గురించి ఆలోచించాడు.
విశ్వామిత్రుడు చెప్పేది రామలక్ష్మణులు ఆసక్తిగా వింటున్నారు.
‘రామా! నీకు చుళి అనే బ్రహ్మచారి అయిన తాపసి గురించి ఇక్కడ చెప్పాలి. అతను తపస్సు చేస్తూండగా ఊర్మిళ అనే గంధర్వ స్ర్తి కూతురు సోమద అతనికి సేవ చేస్తూ ధర్మమార్గాన్ని అనుసరించేది. ఆ సేవకి సంతోషించిన చుళి ఓ రోజు ఆమెని ఏదైనా వరం కోరుకోమని చెప్పాడు.
‘నేను కన్యని. ఎవర్నీ పెళ్లి చేసుకోను కూడా. నీ తపోబలంతో నాకో కొడుకుని ఇవ్వు’ అని సోమద కోరింది. బ్రహ్మదత్తుడు అనే కొడుకు పుట్టాడు. అతను కాంపిల్యా నగరంలో ఐశ్వర్యంతో జీవించసాగాడు. కుశనాభుడి తన వంద మంది కూతుళ్లను బ్రహ్మదత్తుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. బ్రహ్మదత్తుడి స్పర్శకి వాయు దోషం తొలగి వారి గూనితనం మాయం అయింది. సోమద కూడా సంతోషించింది. తర్వాత కుశనాభుడు కొడుకు కోసం పుత్రకామేష్టి యాగాన్ని చేశాడు. యాగం జరిగేప్పుడు కుశనాభుడితో తండ్రి కుశుడు, అతనికి కొడుకు పుడతాడని, అతనికి గాధి అనే పేరు పెట్టమని సూచించాడు. రామా! ధర్మపరుడైన ఆ గాధి నా తండ్రే. కుశవంశంలో పుట్టడంతో నాకు కౌశికుడు అనే పేరు కూడా వచ్చింది. సత్యవతి నా అక్క. రుచికుడు నా బావ. పతివ్రత అయిన ఆమె కౌశికీ నదిగా హిమాలయాల్లో ప్రవహించడమే కాక సశరీరంతో భర్తతో స్వర్గానికి వెళ్లింది. నేను నా సోదరి మీద ప్రేమతో హిమాలయ పర్వత ప్రాంతంలో నివసిస్తున్నాను. యాగం కోసం నేను సిద్ధాశ్రమానికి వచ్చాను’
ఆ విధంగా విశ్వామిత్రుడు తన వంశకథని చెప్పాక మునులు విశ్వామిత్రుడితో ఇలా చెప్పారు.
‘కుశవంశం పూజింపతగ్గది. సదా ధర్మాన్ని పాటించే ఆ వంశస్థులు బ్రహ్మదేవుడితో సమానం. కుశవంశంలోని వారిలో ప్రత్యేకంగా నువ్వు బ్రహ్మసమానుడివి’
అప్పటికే అర్ధరాత్రి అవడంతో వారంతా శోణానదీ తీరంలో నిద్రపోయారు. మర్నాడు ఉదయం విశ్వామిత్రుడు రామలక్ష్మణులని నిద్ర లేపాడు. తిరిగి అంతా బయలుదేరి మధ్యాహ్నం హంసా, సారస పక్షులు గల గంగానది ఒడ్డుకి చేరుకున్నారు. వారు విశ్రమించాక రాముడు విశ్వామిత్రుడ్ని ఇలా అడిగాడు.
‘మూడు మార్గాల్లో ప్రవహించే గంగ గురించి చెప్పు. ఇది మూడు లోకాలని ఎలా ఆక్రమించి సముద్రంలోకి ఎలా కలుస్తోంది?’
‘సరే. విను రామా! పర్వతరాజు హిమవంతుడు అనేక ధాతువులకి గొప్ప నిధి. మేరు పర్వత రాజు కూతురు మనోరమ అతని భార్య. వారికి గంగ, ఉమ అని ఇద్దరు కూతుళ్లు. రామా! వీరిద్దరూ లోకంలో పూజించబడేవారు. మూడు మార్గాల్లో ప్రవహించే గంగని తమ ప్రయోజనం నెరవేర్చుకోడానికి ఇవ్వమని దేవతలు కోరారు. హిమవంతుడు వారి కోరికని మన్నించి గంగని వారికి ఇచ్చి పంపాడు. రెండో కూతురు ఉగ్ర తపస్సు చేశాక ఆమెని రుద్రుడికి ఇచ్చి హిమవంతుడు పెళ్లి చేశాడు. గంగానది స్వర్గానికి వెళ్లాక సుర నదిగా మారింది. (బాలకాండ సర్గ 32-35)
రామాయణం.. మీరే డిటెక్టివ్ 10
‘ఓ బ్రహ్మర్షీ! హిమవంతుడి పెద్ద కూతురు, లోకపావని ఐన గంగ మూడు మార్గాల్లో ఎందుకు ప్రవహిస్తోంది? గంగ మూడు లోకాల్లో ఎందుకని ఉత్తమమైంది? దయచేసి చెప్పు’ రాముడు ప్రశ్నించాడు.
విశ్వామిత్రుడు దానికి ఇలా జవాబు చెప్పాడు.
‘రామా! కుమార సంభవం కథని చెప్తాను విను. ఈశ్వరుడు పెళ్లి చేసుకున్నాక తన భార్యతో వందేళ్లు క్రీడించినా ఆమెకి కొడుకు పుట్టలేదు. అప్పుడు దేవతలు ఈశ్వరుడి దగ్గరికి వెళ్లి ఇలా కోరారు. ‘నీ రేతస్సుని, తేజస్సుని ఎవరూ ధరించలేరు. కాబట్టి నీ భార్యతో కలిసి లోక హితం కోసం వేదోక్తంగా తపస్సు చేసి నీ తేజస్సుని నీ తేజస్సుతోనే ధరించు’
దానికి ఈశ్వరుడు ఇలా ప్రశ్నించాడు. ‘అలాగే, కాని భయపడకుండా నా రేతస్సుని ఎవరు ధరించగలరు?’
భూమి ధరించగలదని దేవతలు చెప్పారు. వెంటనే ఈశ్వరుడు తన రేతస్సుని భూమి మీద వదిలాడు. అది భూమంతా వ్యాపించింది. అది చూసి దేవతలు అగ్నిదేవుడ్ని ఇలా కోరారు. ‘వాయువుతో కలిసి నువ్వు ఆ ఈశ్వర రేతస్సులోకి వెళ్లు’
అలా అగ్ని ఆ రేతస్సుని ధరించాడు.
ఈశ్వరుడి భార్య ఉమాదేవి కోపంతో దేవతలని ‘కొడుకు కోసం చేసే మా సంభోగానికి అడ్డుపడ్డారు. కాబట్టి ‘మీకు మీ భార్యలతో సంతానం కలగకుండు గాక!’ అని శపించింది. భూమిని కూడా ఇలా శపించింది. ‘అనేక రూ పాలు గలదానివై, అనేకులకి భార్యవి అవుతావు. చాలా చెడ్డబుద్ధితో నాకు కొడుకు జన్మించడం ఇష్టపడని నువ్వు నా కోప ఫలితంగా పుత్రానందాన్ని పొందవు’ తర్వాత ఈశ్వరుడు హిమాలయాల్లోని పశ్చిమ హిమాలయాలకి వెళ్లి ఉమాదేవితో కలిసి తీవ్ర తపస్సుని ఆరంభించాడు.
‘ఈ విధంగా పరమేశ్వరుడు తపస్సు చేసే సమయంలో దేవతలు, ఋషులు బ్రహ్మ దేవుడి దగ్గరికి వెళ్లి ‘మా సేనాపతి మహేశ్వరుడు ఉమాదేవితో కలిసి తపస్సులో మునిగాడు. మాకు ఇప్పుడు సేనా నాయకుడు కావాలి’ అని కోరారు. ‘సరే. ఉమాదేవి శాపంవల్ల మీకు మీ భార్యల ద్వారా సంతానం కలగదు. ప్రస్తుతం అగ్ని దేవుడి దగ్గర ఉన్న ఈశ్వర రేతస్సుని స్వర్గంలోని గంగ ఆ ఉమాదేవి అంగీకారంతో తీసుకుని, మీకు సేనాపతిగా ఓ కొడుకుని కంటుంది’ అని బ్రహ్మ వారికి చెప్పాడు. ఆ ప్రకారం అగ్నిదేవుడు తనలోని ఈశ్వర రేతస్సుని గంగలో వదిలితే, ఆమెకి ధరించడానికి శక్యం కాక దాన్ని హిమవత్ పర్వతాల్లోని ఓ పర్వతం మీద వదిలింది.
‘రామా! భూమి మీదకి వచ్చి పడ్డ ఆ రేతస్సు నించి మిరుమిట్లు గొలిపే బంగారం, వెండి, ఇంకా ఆ రేతస్సులోని క్షారం నించి రాగి మరియు ఇనుము, మలం నించి తగరం, సీసం ఇలా అనేక ధాతువులు పుట్టాయి. ఆ పర్వతం మీది అడవి మొత్తం బంగారంగా మారింది. పుట్టిన ఆ కొడుక్కి కృత్తికలు పాలు ఇచ్చే ఏర్పాటుని దేవతలు చేశారు. అందువల్ల అతనికి కార్తికేయుడు (కృత్తికల కొడుకు) అనే పేరు వచ్చింది. గర్భస్రావం అవడం వల్ల ఆ బిడ్డకి స్కందుడు (జారిపడినవాడు) అనే పేరు కూడా పెట్టారు. ఆరు ముఖాలతో స్కందుడు ఆరరుగురి నించి ఒకేసారి పాలు తాగేవాడు కాబట్టి షణ్ముఖుడు అనే పేరు, మహేశ్వరుడి రేతస్సుని అగ్ని ధరించడంతో పుట్టినందున అగ్ని సంభవుడు అనే పేరు కూడా వచ్చాయి. అతన్ని దేవతలకి సేనా నాయకుడిగా చేశారు. ఒక్కరోజులోనే కార్తికేయుడు తన పరాక్రమంతో రాక్షససేనలని జయించాడు. భూలోకంలో కుమారస్వామి మీద భక్తి గలవారు ఎక్కువ ఆయుష్షు గలవారై, చక్కటి సంతానంతో, మనవలతో సుఖాలని అనుభవించి మరణించాక స్కంద లోకానికి వెళ్తారు.
‘రామా! పూర్వం అయోధ్యని సగరుడు పాలించేవాడు. అతని భార్య విదర్భ రాజు కూతురు "కేశిని". సగరుని రెండో భార్య సుమతి(అరిష్టనేమి కూతురు, గరుత్మంతుడి సోదరి). సంతానం లేకపోవడంతో సగరుడు తన భార్యలతో కలిసి హిమాలయాలకి వెళ్లి భృగుశ్రవణం అనే పర్వతం మీద వందేళ్లు భృగు మహర్షి కోసం తపస్సు చేశాడు. ఆయనకి ఆ తపస్సుకి మెచ్చి వంశాన్ని నిలిపే ఒక్కడే కొడుకుని లేదా అరవై వేల మంది కొడుకుల్ని ఇస్తానని చెప్పాడు. వారి ఎంపిక ప్రకారం కేశి వంశాన్ని నిలిపే అసమంజుడు అనే కొడుకుని కంటే, ఆయన రెండో భార్య సుమతి సొరకాయని పోలిన పిండాన్ని కన్నది. అది పగిలి అరవై వేల మంది కొడుకులు బయటకి వచ్చారు. పెంపుడు తల్లులు వారిని నేతి పాత్రల్లో ఉంచి పెంచారు. అసమంజుడు చిన్న పిల్లల్ని పట్టుకుని సరయూ నదిలోకి విసిరి, వారు మునిగిపోతూంటే చూసి ఆనందించేవాడు. అతను చేసే దుర్మార్గాల గురించి తెలిసిన సగరుడు వెంటనే కొడుకుని పట్టణంలోంచి వెళ్లగొట్టాడు. అసమంజుడి కొడుకు అంశుమంతుడు మాత్రం మంచి వాడు.
‘ఓ రామా! ఓసారి సగరుడు హిమాలయాలు, వింధ్య పర్వతం మధ్య ఓ చోట యజ్ఞం ఆరంభించాడు. ఆయన మనవడు అంశుమంతుడిని ఏమార్చి దేవేంద్రుడు రాక్షస రూపంలో ఆ యజ్ఞాశ్వాన్ని దొంగిలించాడు. ఋత్విక్కులు సగరుడికి అది చెప్పి యజ్ఞాశ్వాన్ని రక్షించమని కోరారు. వెంటనే సగరుడు తన అరవై వేల మంది కొడుకులతో ఇలా చెప్పాడు.
‘రాక్షసులు మంత్ర ప్రభావం వల్ల ఇక్కడికి రాలేరు. సముద్రంతో చుట్టబడ్డ భూమినంతా మీరు ఒక్కొక్కరూ ఒక్కో యోజనం చొప్పున, గుర్రం కనపడేదాకా తవ్వుతూ వెతకండి. అంత దాకా నేను యజ్ఞశాలని వదిలి వెళ్లను’
వెంటనే వారంతా ఒకో నలుచదరపు యోజనాన్ని ఒకరు చొప్పున వెదుకుతూ వజ్రాల్లాంటి గోళ్లతో, శూలాలు, గొడ్డళ్లతో భూమిని తవ్వుతూంటే రాక్షసులు, అనేక జంతువులు, పాములు నలిగిపోతూ బాధగా అరవసాగాయి. అలా వారంతా పర్వతాల చేత ఇరుకుగా వున్న జంబూ ద్వీప భూమిని పాతాళం దాకా తవ్వారు.
దేవతలు, పాములు, గంధర్వులు, అసురులు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి జరిగేది వివరించి ప్రార్థించారు.
‘సగర కుమారులు కనపడ్డ ప్రతీ ప్రాణిని గుర్రపు దొంగ అని భావించి చంపుతున్నారు. ఎందరో మహాత్ములని అలా చంపారు’ (బాలకాండ సర్గ 36-39)
రామాయణం.. మీరే డిటెక్టివ్ 11
‘ఇవాళ 40 సర్గ నుంచి 42 సర్గ దాకా చెప్తాను.
విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి గంగావతరణం గురించి చెప్తున్నాడు.
దేవతల మాటలు విని బ్రహ్మదేవుడు వారితో ఇలా చెప్పాడు.
‘సమస్త భూమికి యజమాని అయిన వాసుదేవుడు కపిలుడిగా తపస్సు చేస్తున్నాడు. అతని కోపాగ్నికి సగరుడి కొడుకులు బూడిద అవగలరు. వారు భూమిని తవ్వడం వల్ల తక్కువ ఆయుష్షుతో మరణిస్తారని విధి ఏనాడో నిర్ణయించింది. రామా! భూమిని తవ్వే సగర కుమారులు భూమిని ఓసారి చుట్టి వచ్చినా వారికి యాగాశ్వం కనపడకపోగా పిడుగు లాంటి శబ్దం వినిపించింది. తమ తండ్రి దగ్గరికి వెళ్లి గుర్రం కనపడలేదని చెప్పారు. సగరుడు కోపంగా వాళ్లతో ‘తవ్విన చోటే మళ్లీ తవ్వి, గుర్రాన్ని దొంగిలించిన వాడిని పట్టుకున్నాకే తిరిగి రండి’ అని చెప్పాడు.
‘ఆ ప్రకారం అరవై వేల మంది తిరిగి పాతాళానికి చేరుకున్నారు. వారికి తూర్పు దిక్కున తల మీద భూమిని మోసే విరూపాక్షం అనే కొండంత ఏనుగు కనిపించింది. దానికి వారు ప్రదక్షిణం చేసి, పూజించి పాతాళంలోకి చొచ్చుకుపోయి దక్షిణ దిక్కుని తవ్వారు. దక్షిణాన వారికి మహాపద్యం అనే ఏనుగు, పశ్చిమ దిక్కున సౌమనసం, ఉత్తరం వైపు భద్రం అనే కొండంత ఏనుగులు కూడా భూమి మీద తలలని మోస్తూ కనిపించాయి. ఆ నాలుగు ఏనుగులని దిగ్గజాలు అంటారు. అవి అలసటతో అప్పుడప్పుడూ తలలని కదిలిస్తే భూకంపాలు వస్తాయి. వాటిని తాకి, ప్రదక్షిణం, పూజా చేసి ఈశాన్య దిక్కులో భూమిని తవ్వడం కొనసాగించారు.
చివరికి గడ్డి మేస్తూ తిరిగే గుర్రాన్ని చూసి సంతోషించారు. కపిల రూపంలోని మహావిష్ణువుని చూసి కోపంతో గునపాలు, నాగళ్లు, చెట్లు, రాళ్లతో ఆ కపిలుడి మీదకి దాడి చేశారు. తాము సగరుడి కొడుకులమని, ఆయన యాగానికి చెందిన గుర్రాన్ని దొంగిలించాడని చెప్పగానే కపిలుడు కోపంతో హూంకారం చేయగానే సగర కుమారులు బూడిద అయ్యారు.
‘రఘునందనా! తమ కొడుకులు చాలాకాలం తిరిగి రాకపోవడంతో సగరుడు తన మనవడు అంశుమంతుడిని పిలిచి అతని పినతండ్రుల జాడని, యాగాశ్వాన్ని దొంగిలించిన వారి జాడని కనిపెట్టి రమ్మని, బాణాలు, అంబులు తీసుకెళ్లి నమస్కరించాల్సిన వారికి నమస్కరిస్తూ, అడ్డుపడే వారిని చంపుతూ పనిని పూర్తి చేసుకువచ్చి యజ్ఞం కొనసాగేలా చేయమని కోరాడు.
అంశుమంతుడు తన పినతండ్రులు తవ్విన దారిలోనే వెళ్లాడు. దైత్య, దానవ, పిశాచ, పతగోరగులని చూసి వారిని పూజించాడు. ఆ నాలుగు ఏనుగులని పూజించి అడిగితే, ‘గుర్రంతో తిరిగి వెళ్తావు’ అని అవి ఆశీర్వదించాయి. అవి చెప్పిన దారిలో వెళ్లి తన పినతండ్రుల బూడిద కుప్పలని చూసి దుఃఖించాడు. యజ్ఞాశ్వం కూడా అతనికి కనపడింది. వారికి తర్పణాలు వదలడానికి చూస్తే ఎక్కడా నీరు కనపడలేదు. అతనికి తన పినతండ్రుల మేనమామ గరుత్మంతుడు కనిపించి చెప్పాడు.
‘అంశుమంతా! ఏడవకు. నీ పినతండ్రుల మరణం వల్ల లోకం సంతోషిస్తోంది. కపిలుడు బూడిద చేసిన వీరికి మామూలు నీళ్లతో తర్పణం సరికాదు. హిమవంతుడి పెద్ద కూతురు గంగానదీ నీటితో జలతర్పణం చేయి. అందువల్ల ఈ అరవై వేల మందీ స్వర్గానికి చేరతారు. ఈ గుర్రాన్ని తీసుకెళ్లి మీ తాత యజ్ఞాన్ని జరిపించు’
అంశుమంతుడు గుర్రంతో సగర చక్రవర్తి దగ్గరికి వెళ్లి గరుత్మంతుడు చెప్పింద వివరించాడు. ఆయన కొడుకుల మరణానికి దుఃఖించి, యజ్ఞాన్ని పూర్తి చేసి నగరంలోకి ప్రవేశించాడు. గంగా నదిని స్వర్గం నించి ఎలా దింపాలో ఆయనకి బోధపడలేదు.
‘సగరుడు ముప్పై వేల సంవత్సరాలు రాజ్యం చేసి మరణించాక అంశుమంతుడు రాజయ్యాడు. కొంతకాలం తర్వాత రాజ్యభారాన్ని కొడుకైన దిలీపుడికి ఇచ్చి అంశుమంతుడు హిమాలయాల్లోని తపోవనంలో ముప్పై రెండు వేల సంవత్సరాలు తపస్సు చేసి స్వర్గస్థుడయ్యాడు.
దిలీపుడికి కూడా గంగని భూమికి తెచ్చే దారి దొరకలేదు. తండ్రిలా ధర్మంగా ముప్పై వేల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాక తన ముత్తాతలైన సగర కొడుకులకి గంగ నీటి తర్పణం చేయలేదనే మనోవ్యధతో దిలీపుడు తన కొడుకు భగీరథుడ్ని రాజుగా చేసి మరణించాడు.
భగీరథుడికి పిల్లలు పుట్టలేదు. గంగని స్వర్గం నించి భూమికి తేవాలనే నిశ్చయంతో రాజ్యాన్ని మంత్రులకి అప్పగించి గోకర్ణ క్షేత్రానికి గ్రీష్మ ఋతువులో నెలకోసారి మాత్రమే ఆహారం తీసుకుంటూ, రెండు చేతులు పైకెత్తి పంచాగ్నుల మధ్య నిలబడి తపస్సు చేశాడు.
భగీరథుడు అలా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాక బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమని చెప్పాడు. ‘తన ముత్తాతల భస్మరాసులని గంగా జల తర్పణంతో స్వర్గానికి చేరేలా మొదటి వరంగా ఇవ్వమని, రెండో వరంగా తనకి సంతానం కలిగి ఇక్ష్వాకు వంశం ఎన్నటికీ నశించకూడదని’ కోరాడు.
బ్రహ్మదేవుడు ఆ రెండు వరాలని ఇచ్చి చెప్పాడు.
‘స్వర్గం నించి కిందకి జారే గంగని భూమి ఆపలేదు. అందుకు శివుడు మాత్రమే సమర్థుడు’
బ్రహ్మదేవుడు గంగతో కూడా ఆ విషయం మాట్లాడి దేవతలతో స్వర్గానికి వెళ్లాడు. (బాలకాండ సర్గ 40-42)
రామాయణం.. మీరే డిటెక్టివ్ 12
‘రామా! భగీరథుడు కాలి బొటన వేలి మీద నిలబడి శివుడి కోసం తపస్సు చేశాడు. ఏడాది తర్వాత శివుడు ప్రత్యక్షమై చెప్పాడు.
‘నీ తపస్సుకి సంతోషించాను. భూమి మీదకి జారే గంగని నేను భరిస్తాను’
ఆ తర్వాత గంగ శివుడి నెత్తి మీదకి ఉరుకుతూ తన వేగంతో శివుడ్ని పాతాళంలోకి అణచి, అణచి, తను కూడా అక్కడికి వెళ్లాలని అనుకుంది. అది గ్రహించిన శివుడు ఉగంగ గర్వాన్ని అణచడానికి, తన తల మీదకి ఉరికిన గంగ ఎంత ప్రయత్నించినా తన జటాజూటం లోంచి భూమి మీదకి ఎన్ని ఏళ్లయినా జారనివ్వలేదు. దాంతో మళ్లీ భగీరథుడు శివుడి గురించి గంగని విడువమనే కోరికతో తీవ్ర తపస్సు చేస్తే, శివుడు ‘బిందూ సరస్సు ప్రాంతంలో’ గంగని వదిలాడు. గంగ శివుడి తల మీంచి ఏడు పాయలుగా క్రిందికి ప్రవహించింది. తూర్పు వైపు నించి ప్రవహించే మూడు పాయలకి ‘హ్లాదిని, పావని, నళిని’ అని పేర్లు. పశ్చిమం వైపు ‘సుచక్షువు, సీత, సింధు’ అని పేర్లు. ఏడో ప్రవాహం భగీరథుడి రథాన్ని అనుసరించింది.
అలా ఆకాశం నించి శివుడి నెత్తి మీదకి, అక్కడ నించి భూమి మీదకి గంగ పెద్ద శబ్దంతో ఉరుకుతూంటే చేపలు, తాబేళ్లు, మొసళ్లు కూడా మెరుపుల్లా మెరుస్తూ ఆ నీటితోపాటు కిందకి జారాయి. విమానాలు, గుర్రాలు, ఏనుగుల మీద వచ్చిన దేవతలు, ఇంకా ఋషులు, గంధర్వులు, యక్ష, సిద్ధులు మేఘాలు లేని ఆకాశం లోంచి ఆశ్చర్యంగా ఆ గంగావతరణాన్ని చూస్తూంటే వారి ఒంటి మీది ఆభరణాల మీద సూర్యకాంతి మెరుస్తూ ‘వంద సూర్యులు ఆకాశంలో ఉన్నారా?’ అనిపించింది.
గంగా ప్రవాహం కొన్ని చోట్ల వేగంగా, కొన్ని చోట్ల వంకరగా, కొన్నిచోట్ల సూటిగా, కొన్నిచోట్ల కిందకి, కొన్నిచోట్ల నీటిని నీరు ఢీకొని పైకి చిమ్మి మళ్లీ కిందకి పడసాగింది. శివుడి శరీరం నించి వచ్చిన ఆ జలం పవిత్రమైందిగా భావించి దేవ, ఋషి, గంధర్వులు, భూలోక వాసులు ఆ నీటిని ముట్టుకున్నారు. శాపాలతో స్వర్గలోకం నించి భూలోకానికి వచ్చిన వారు ఆ స్పర్శతో పాపాలని పోగొట్టుకుని ఆకాశంలోకి ఎగిరి పై లోకాలకి వెళ్లారు. చాలామంది ఆ గంగానదిలో స్నానాలు చేశారు.
భగీరథుడి రథం వెంట గంగే కాక ఋషులు, రాక్షసులు, దేవతలు, గంధర్వులు, యక్ష, కినె్నర, మహోరగ, అప్సరసలు కూడా వెళ్లారు. దారిలోని జహ్ను మహర్షి యజ్ఞ వాటికని గంగ ముంచేసింది. గంగ గర్వాన్ని చూసి కోపంతో మండిపడ్డ ఆయన దాన్ని మొత్తం తాగేశాడు. అంతా జహ్ను మహర్షిని పూజించి, గంగని విడవమని ప్రార్థిస్తే, ఆయన గంగని చెవుల్లోంచి వదిలాడు. ఆయన శరీరంలోంచి వెలువడ్డ గంగ జహ్ను కూతురు అవడంతో దానికి ‘జాహ్నవి’ అనే పేరు వచ్చింది.
చివరికి తమ తాతల చితాభస్మాలని చేరి, వాటిని చూసి భగీరథుడు కొద్దిసేపు దుఃఖించాడు. భగీరథుడి వెంట వెళ్లిన గంగ సముద్రంలో కలిసి, సగరుడి అరవై వేల మంది కొడుకుల చితాభస్మాలని తడిపి తరింపజేసి పాతాళానికి వెళ్లిపోయింది.
పాపాలు నశించిన ఆ అరవైవేల మందీ స్వర్గలోకానికి వెళ్లారు. తర్వాత బ్రహ్మదేవుడు భగీరథుడి దగ్గరికి వచ్చి ఇలా చెప్పాడు.
‘సగర చక్రవర్తి, అంశుమంతుడు, ఆయన కొడుకు, నీ తండ్రి ఐన దిలీపుడు చేయలేని పనిన నువ్వు చేసావు. భూలోకంలో సాగర జలం ఉన్నంతకాలం సగర కుమారులు స్వర్గంలో ఉంటారు. ఈ గంగ నీకు పెద్దకూతురై భాగీరథి అనే పేరుతో పిలువబడుతుంది. అంతేకాక స్వర్గలోకం, భూలోకం, పాతాళంలోకి ప్రవహించినందుకు గంగ త్రిపథ అనే పేరుతో కూడా పిలువబడుతుంది. ఈ గంగలో స్నానం చేసి పవిత్రుడివై పుణ్యం సంపాదించు.’
సగర కుమారులు అందరికీ భగీరథుడు శాస్త్ర ప్రకారం జలతర్పణాలని అర్పించాడు. తన కోరిక తీరడంతో విచారం పోయిన ఆయన తిరిగి తన రాజధానికి వెళ్లి ప్రజలని మళ్లీ పాలించసాగాడు. రామా! సంధ్యాకాలం దాటిపోతోంది. సంధ్యావందనం చేయి’
ఈ గంగావతరణం వినడం వల్ల ఐశ్వర్యం, కీర్తి, ఆయుర్దాయం, పుత్ర సంతానం, స్వర్గం లభిస్తాయి. దీన్ని బ్రాహ్మణులకి, క్షత్రియులకి, ఇతరులకి వినిపిస్తే వారి పితృదేవతలు, దేవతలు సంతోషిస్తారు. వారి అన్ని కోరికలు తీరి చెప్పే వాడి పాపం నశిస్తుంది.
(బాలకాండ సర్గ 43-44)
రామాయణం.. మీరే డిటెక్టివ్ 13
‘పుణ్యనది ఐన ఈ గంగా నదిని దాటుదాం. మీ రాక తెలిసి ఋషులు మెత్తని చాపతో కప్పిన పడవని తెచ్చారు’
వారు దాని మీద ఉత్తర తీరం చేరి, అక్కడ నించి విశాలా నగరానికి చేరాక రాముడు అడిగాడు.
‘ఈ నగరాన్ని ఎవరు పాలిస్తున్నారు?’
‘కృత యుగంలో దితి, అదితిలకి ధార్మికులైన కొడుకులు ఉండేవారు. మనిషికి ముసలితనం, రోగాలు, చావు లేకుండా ఉండటానికి ఉపాయం ఏదా అని కొందరు మహాత్ములు ఓసారి ఆలోచించారు. పాల సముద్రాన్ని చిలికి అమృతాన్ని తీయాలనే ఆలోచన వారికి వచ్చింది. వారు వాసుకి అనే పాముని తాడుగా, మంథర పర్వతాన్ని కవ్వంగా చేసి చిలకసాగారు. అలా వెయ్యి సంవత్సరాలు చిలికాక తాడుగా ఉన్న వాసుకి విషాన్ని కక్కుతూ కోరలతో రాళ్లని కరవసాగింది. పాలసముద్రం లోంచి హాలాహలం పుట్టి ప్రపంచంలోని రాక్షసులని, మనుషులని కాల్చసాగింది. దేవతలు శివుడి దగ్గరకి వెళ్లి తమని ఆ విషం నించి రక్షించమని వేడుకున్నారు. శంఖచక్రాలతో శ్రీహరి అక్కడ ప్రత్యక్షమై శివుడితో, ‘దేవతలు అందరికన్నా ముందుగా నువ్వే పుట్టావు. కాబట్టి సముద్ర మధనంలో మొదటగా పుట్టిన విషాన్ని నువ్వే తీసుకోవాలి’ అని చెప్పి మాయం అయ్యాడు.
‘శివుడు దాన్ని అమృతంలా స్వీకరించాడు. తర్వాత మళ్లీ చిలకడం కొనసాగించారు. కవ్వంలా ఉన్న ఆ పర్వతం పాతాళంలోకి దిగిపోయింది. దాంతో దేవతలు విష్ణువుని దాన్ని పైకి ఎత్తి రక్షించమని కోరారు. దాంతో విష్ణువు తాబేలు రూపం ధరించి ఆ పర్వతాన్ని తన వీపు మీద మోసాడు. ఇలా వెయ్యి సంవత్సరాలు సంవత్సరాలు చిలికాక సముద్రంలోంచి దండ కమండలాలతో ధన్వంతరి, తేజస్సు గల అరవై కోట్ల మంది అప్సరసా స్ర్తిలు బయటకి వచ్చారు. పాలని చిలకగా అందులోంచి పుట్టడంతో ఆ స్ర్తిలకి అప్సరసలు అనే పేరు వచ్చింది. వారికి లెక్కకి అందని పరిచారికలు కూడా పుట్టారు. దేవతలు, రాక్షసుల్లో ఎవరూ వారిని పెళ్లి చేసుకోకపోవడంతో వారు వేశ్యలు అయ్యారు.
‘తర్వాత వరుణుడి కూతురు, సురకి (మద్యానికి) దేవత అయిన వారుణి తనని ఎవరు స్వీకరిస్తారా అని వెదుకుతూ బయటకి వచ్చింది. దితి కొడుకులు దైత్యులు సురని (మద్యాన్ని) స్వీకరించలేదు. దాంతో వారు అసురులుగా పిలవబడుతున్నారు. అదితి కొడుకులు మాత్రం వారుణిని స్వీకరించడంతో వారికి సురులు అనే పేరు వచ్చింది. తర్వాత ఉచ్ఛైశ్రవము అనే మేలుజాతి గుర్రం, కౌస్త్భుం అనే మాణిక్యం పుట్టాక చివరగా అమృతం పుట్టింది.
అమృతం కోసం జరిగిన యుద్ధంలో దేవతలు దైత్యులని చంపారు. దాని కోసం దైత్యులు, రాక్షసులు ఓవైపు, దేవతలు మరోవైపు చేరి యుద్ధం చేస్తూండగా విష్ణువు మాయామోహిని రూపాన్ని ధరించి దైత్యుల నించి అమృతాన్ని దొంగిలించి, తనని ఎదిరించిన కొందరు దైత్యులుని చంపేశాడు. ఆ తర్వాత దేవేంద్రుడు చారణులు, ఋషులు గల లోకాలని పాలించసాగాడు.
తన కొడుకులు అంతా చంపబడటంతో తన భర్త కాశ్యపుడుతో ( మరీచుడి కొడుకు) దితి దుఃఖంగా చెప్పింది.
‘నీ కొడుకులని దేవతలు చంపారు. కాబట్టి దేవేంద్రుడ్ని చంపగలిగే లోకనాయకుడైన కొడుకు నాకు కావాలి. అందుకు వీలుగా తపస్సు చేయడానికి నాకు అనుమతి కావాలి’
‘అలాగే, వెయ్యి సంవత్సరాలు నువ్వు పవిత్రంగా ఉంటూ తపస్సు చేస్తే మూడు లోకాలకి ప్రభువయ్యే కొడుకుని నా వల్ల కంటావు’ అతను చెప్పి ఆమె శరీరమంతా తడిమి తను కూడా తపస్సు చేసుకోడానికి వెళ్లాడు.
దితి కుశప్లవనం అనే చోట తీవ్ర తపస్సుని ఆరంభించింది. ఆ సమయంలో దేవేంద్రుడు ఆమెకి నిప్పు, దర్భలు, సమిథలు, నీళ్లు, పళ్లు, దుంపలు మొదలైనవన్నీ సమకూర్చడం, శ్రమ తీరేలా ఒళ్లు పట్టడం లాంటి ఉపచారాలతో చక్కటి సేవ చేశాడు. ఇలా తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు గడిచాయి. దితి ఆ సేవకి సంతోషించి దేవేంద్రుడితో చెప్పింది.
‘దేవేంద్రా! నా కోరిక మీద మీ నాన్న వెయ్యి సంవత్సరాల తర్వాత నాకో కొడుకు పుడతాడనే వరాన్ని ఇచ్చాడు. ఇంకో పదేళ్ల తర్వాత నువ్వు నీ తమ్ముడ్ని చూస్తావు. నువ్వు వాడితో కలిసి మూడు లోకాలని జయించి పాలించగలవు’
ఆ మధ్యాహ్నం దితి తల స్థానంలో పాదాలని ఉంచి, పాదాల మీద జుట్టు పడుతూండగా నిద్రపోయింది. దాంతో అపవిత్రురాలైన దితిని చూసి దేవేంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించి వంద అంచుల వజ్రాయుధంతో పిండాన్ని ఏడు ముక్కలుగా నరికాడు. గర్భంలోంచి వినపడ్డ ఏడుపుకి, ఏడవవద్దనే మాటలకి దితి నిద్ర లేచింది. జరిగేది గ్రహించి తన కొడుకుని చంపద్దని దేవేంద్రుడ్ని కోరగా తండ్రి మీది గౌరవంతో అతను ఆమె గర్భంలోంచి బయటకి వచ్చాడు.
‘యుద్ధంలో నన్ను చంపబోయే పిల్లవాడు కాబట్టి నరికాను. క్షమించు’ దేవేంద్రుడు దితిని కోరాడు.
(బాలకాండ సర్గ 45-46)
రామాయణం.. మీరే డిటెక్టివ్ 14
దితి దుఃఖిస్తూ దేవేంద్రుడితో చెప్పింది.
‘నా లోపం వల్లే గర్భస్థ శిశువు ఏడు ముక్కలుగా నరకబడ్డాడు తప్ప ఇందులో నీ తప్పు లేదు. నాకో పని చేసి పెట్టు. నరకబడ్డ నా ఏడు మంది కొడుకులు అంతరిక్షంలోని వాతస్కంధాలకి (ఇవి నక్షత్ర మండలాలు, మొదలైన వాటికి ఆధారాలని పురాణాల్లో ఉంది) అధిష్టాన దేవతలై అంతరిక్షంలో సంచరించాలి. ఒకరు బ్రహ్మలోకంలో, ఒకరు ఇంద్రలోకంలో, మరొకరు వాయువు అనే అంతరిక్షంలో తిరగాలి. మిగిలిన నలుగురు నాలుగు దిక్కుల్లో తిరగాలి. వీరు ‘మరుత్తులు’ అనే పేరుతో ప్రసిద్ధి చెందాలి’
‘ఇంద్రుడు వాటికి అంగీకరించాడు. రామా! అక్కడ నించి దితి, ఇంద్రుడు స్వర్గానికి వెళ్లారు. దితికి ఇంద్రుడు సేవ చేసిన ప్రదేశం ఇదే. ఇక్ష్వాకుడికి, అలంబుస పుట్టిన విశాలుడు ఇక్కడ విశాలపురిని నిర్మించాడు. అతని కొడుకు హేమచంద్రుడు. అతని కొడుకు సుచంద్రుడు. సుచంద్రుడి కొడుకు ధూమ్రాశ్వుడు. అతని కొడుకు సృంజయుడు. అతని కొడుకు సహదేవుడు. సహదేవుడి కొడుకు కుశాశ్వుడు. కుశాశ్వుడికి సోమదత్తుడు, అతనికి కాకుత్థ్సుడు పుత్రులు. ఇప్పుడు సుమతి ఈ నగరాన్ని పాలిస్తున్నాడు. ఈ రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకుని రేపు ఉదయం జనక మహారాజుని దర్శిద్దాం’
విశ్వామిత్రుడు రాక గురించి తెలుసుకున్న సుమతి బంధువులు, పురోహితులతో ఆయనకి ఎదురెళ్లి, కుశలప్రశ్నలు వేసి స్వాగతం చెప్పాడు. ఆయన తన దేశానికి రావడం వల్ల తను ధన్యుడ్ని అయ్యానని కూడా చెప్పాడు.
విశ్వామిత్రుడు కూడా సుమతి క్షేమాన్ని అడిగి తెలుసుకున్నాడు.
సుమతి ఇలా చెప్పాడు.
‘ఓ మహర్షీ! నీ వెంట ఉన్న ఈ ఇద్దరూ దేవతలతో సమానమైన పరాక్రమం గలవారిలా కనపడుతున్నారు. ఏనుగు, సింహాల్లా నడిచే వీరి అందం అశ్వనీ దేవతలని పోలి ఉంది. ఈ ఇద్దరూ ఎవరి కొడుకులు? కత్తులు, బాణాలు ధరించిన వీరు దుర్గమమైన ఈ మార్గంలో కాలినడకన ఇక్కడికి ఎందుకు వచ్చారు?’
విశ్వామిత్రుడు అతనికి సిద్ధాశ్రమంలోని రాక్షస వధ గురించి చెప్పాడు. రామలక్ష్మణులని సుమతి సత్కరించాక ఆ రాత్రి వారు అక్కడే నిద్రించి మర్నాడు మిథిలా నగరానికి చేరుకున్నారు.
మిథిలకి దగ్గరలో గల నిర్మానుష్యమైన ఓ ఆశ్రమాన్ని చూసి రాముడు అడిగాడు.
‘మునులు ఎవరూ లేని ఈ ఆశ్రమం ఎవరిది?’
‘రామా! ఇది గౌతముడి ఆశ్రమం. తన భార్య అహల్యతో అతను చాలా సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశాడు. గౌతముడు లేని సమయంలో దేవేంద్రుడు గౌతముడి రూపాన్ని ధరించి అహల్య దగ్గరికి వెళ్లి ఆమెతో సంగమాన్ని కోరాడు. అతను ఎవరో తెలిసి కూడా ఆమె అందుకు అంగీకరించింది. తర్వాత చెప్పింది.
‘గౌతముడు వచ్చే లోగా నువ్వు తక్షణం ఇక్కడ నించి వెళ్లిపో’
సరిగ్గా ఆ సమయంలో స్నానంతో తడిసిన గౌతముడు సమిధలతో, దర్భలతో వస్తూ దేవేంద్రుడుని చూశాడు. జరిగింది గ్రహించి ఆయన కోపంతో ఇలా శపించాడు.
‘నువ్వు చేసిన పాడు పనికి నీ వృషణాలు పడిపోవాలి’
తక్షణం అవి నేల రాలాయి. తర్వాత అహల్యని కూడా ఆయన ఇలా శపించాడు.
‘ఎవరికీ కనపడకుండా గాలిని భోజనం చేస్తూ, ఆహారం లేక తపస్సు చేస్తూ ఈ ఆశ్రమంలోనే ‘మట్టిలో పడి ఉండు’ . దశరథుడి కొడుకైన రాముడు ఈ అడవిలోకి ప్రవేశించగానే నీకు పాపం నించి, శాపం నించి విమోచనం కలుగుతుంది’. నువ్వు రాముడికి అతిథి సత్కారాలు చేశాక నీలోని లోభం, మోహం తొలగి తర్వాత నాతో కలిసి జీవిస్తావు’
వెంటనే గౌతముడు ఈ అరణ్యాన్ని విడిచి సిద్ధులు, చారణులు నివసించే హిమాలయ శిఖరాలకి వెళ్లి అక్కడ తపస్సు చేయసాగాడు. (బాలకాండ సర్గ 47-48)
రామాయణం.. మీరే డిటెక్టివ్ 15
వృషణాలు పడిపోయిన దేవేంద్రుడు ఋషులు, చారణులతో, అగ్ని మొదలైన దేవతలతో ఇలా చెప్పాడు.
‘గౌతముడికి కోపాన్ని, అతని తపస్సుకి విఘ్నాన్ని కలిగించాను. అలా అతను నాకు, అహల్యకి శాపాలు పెట్టడం ద్వారా అతని తపశ్శక్తిని ఖర్చు చేసేశాను. ఇప్పుడు మీరు తిరిగి నాకు వృషణాలు వచ్చేలా చేయండి’
వారంతా మరుద్గణాలతో పితృదేవతల దగ్గరకి వెళ్లి యజ్ఞంలో వారికి భాగంగా లభించే మేకకి ఉన్న వృషణాలని తీసి దేవేంద్రుడికి ఇవ్వమని అర్థించారు. వారా ప్రకారం చేశారు. రామా! అప్పట్నించీ పితృదేవతలు అంతా వృషణాలు లేని మేకలనే తింటున్నారు. దేవేంద్రుడికి కూడా అప్పటి నించి మేక వృషణాలే ఉన్నాయి. గౌతముడి ఆశ్రమానికి వెళ్లి అహల్యకి శాప విమోచనం కలిగించు’
రామలక్ష్మణులు విశ్వామిత్రుడి వెనకే నడుస్తూ ఆ ఆశ్రమంలోకి వెళ్లారు. అహల్య రాముడికే ముందు కనపడింది. ఆమె రాముడ్ని చూడగానే శాపవిముక్తి పొంది, ఆ తర్వాతే అహల్య అందరికీ కనపడింది. అహల్య తపస్సుతో వచ్చిన గొప్ప తేజస్సుతో, నీళ్లల్లోని సూర్య ప్రతిబింబంలా, మేఘాలు కప్పిన పూర్ణచంద్రుడిలా కనపడసాగింది. ఘోర తపస్సు వల్ల శరీరం పరిశుద్ధమైన అహల్యని దేవతలు మెచ్చుకుని దుందుభులు మ్రోగించి పుష్ప వర్షాన్ని కురిపించారు. గంధర్వులు పాడితే అప్సరసలు నృత్యం చేశారు. రామలక్ష్మణులు ఆమె పాదాలని స్పృశించి నమస్కరించారు.. అహల్య వారికి అతిథి మర్యాదలు చేసింది. గౌతముడు కూడా వచ్చి అహల్యని తిరిగి స్వీకరించి రాముడ్ని పూజించాడు. తర్వాత విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు మిథిలా నగరానికి వెళ్లి, ఈశాన్యం వైపు ఉన్న యజ్ఞవాటికని చేరారు.
అక్కడికి చేరాక రాముడు విశ్వామిత్రుడ్ని ఇలా అడిగాడు.
‘మహామునీ! ఇక్కడ అనేక దేశాల నించి వచ్చిన విద్యా సంపన్నులైన వేల కొద్దీ బ్రాహ్మణులు ఉన్నారు. వందల కొద్దీ శకటాలతో ఋషి వాటికలు ఇరుకుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం బస చేయడానికి అనువైన ప్రదేశాన్ని నిర్ణయించు’
విశ్వామిత్రుడు వారిని జనం ఆట్టే లేని, నీరు సమృద్ధిగా ఉన్న విడిదికి తీసుకెళ్లాడు. విశ్వామిత్రుడు వస్తున్న సంగతి విని జనక మహారాజు తన పురోహితుడు శతానందుడితో వచ్చి వినయంగా ఆయనకి ఎదురెళ్లాడు. ఋత్విక్కులు మంత్రపూర్వకంగా పూజాద్రవ్యాలని విశ్వామిత్రుడికి సమర్పించారు. వాటిని స్వీకరించి ఆయన జనకుణ్ని అడిగాడు.
‘నువ్వు క్షేమంగా ఉన్నావా? యజ్ఞం ఎలాంటి లోపాలు లేకుండా జరుగుతోందా?’
తర్వాత విశ్వామిత్రుడు ఉపాధ్యాయులని, పురోహితుడ్ని, మునులని కుశల ప్రశ్నలు వేశాడు.
‘విశ్వామిత్రా! పూజ్యుడైన నీ దర్శనం లభించడంతో ఈ రోజు దేవతలు నా యజ్ఞాన్ని సఫలం చేశారు. ఇది ఒక పనె్నండు రోజుల్లో పూర్తవుతుంది. ఆ తర్వాత యజ్ఞ భాగాలని స్వీకరించడానికి వచ్చే దేవతలని చూడచ్చు. కత్తులు, అంబులపొది, ధనస్సులని ధరించి, పెద్ద కళ్లు, ఏనుగు, సింహాల్లాంటి నడకతో, వీరులైనవారు, అశ్వనీ దేవతల్లా అందమైన వారు, పులి, ఎద్దులతో సమానమైన వారు, యవ్వనవంతులు, శ్రేష్టమైన ఆయుధాలని ధరించిన దేవతల్లా ఉన్న ఈ ఇద్దరు వీరులు ఎవరి కొడుకులు? ఇక్కడికి ఎందుకు కాలినడకన వచ్చారు? మహామునీ! రూపంలో, చర్యల్లో, తెలివిలో వీరు ఒకరికి మరొకరు పోలి, సూర్యచంద్రులు ఆకాశం నించి వెలుగు ఇచ్చినట్లుగా ఈ ప్రదేశాన్ని ప్రకాశింప జేస్తున్నారు. దయచేసి ఈ వీరుల గురించి నాకు చెప్పండి’ జనక మహారాజు అడిగాడు.
‘వీరు దశరథుడి కొడుకులు. నా వెంట సిద్ధాశ్రమానికి వచ్చి అక్కడ నివసించే రాక్షసులని చంపారు. విశాల నగరాన్ని చూసి, అహల్యని సందర్శించి, గౌతముడితో ముచ్చటించి, శివధనస్సుని పరీక్షించడానికి తన వెంట నా వెంట మిథిలకి వచ్చారు’ విశ్వామిత్రుడు వివరించాడు.
(బాలకాండ సర్గ 49-50)
రామాయణం.. మీరే డిటెక్టివ్ 16
‘రాముడ్ని చూడగానే గౌతముడి పెద్ద కొడుకు శతానందుడు శరీరం గగుర్పాటు చెందింది. విశ్వామిత్రుడు చెప్పింది విని అతను ఇలా ప్రశ్నించాడు.
‘మహామునీ! తీవ్ర తపస్సులో మునిగిన నా తల్లిని రాముడికి చూపించావా? సర్వప్రాణులూ పూజించే రాముడికి మా అమ్మ పళ్లని, కందమూలాలని ఇచ్చి పూజించిందా? విధి వల్ల మా అమ్మకి జరిగిందంతా రాముడితో చెప్పావా? రామ దర్శనంతో పవిత్రురాలైన మా అమ్మ మా నాన్నని చేరిందా? మా నాన్న కూడా రాముడ్ని పూజించి గౌరవించాడా? రాముడు కూడా నా తండ్రిని పూజించాడా?’
‘శతానందా! ఏమీ వదలకుండా చేయాల్సిందంతా చేశాను. రేణుకాదేవి జమదగ్నిని చేరినట్లు అహల్య గౌతముడ్ని చేరిందిరింది’ విశ్వామిత్రుడు చెప్పాడు.
‘రామా! మా అదృష్టం కొద్దీ విశ్వామిత్రుడితో ఇక్కడికి వచ్చావు. నీకు స్వాగతం. తపస్సుతో బ్రహ్మర్షి ఐన విశ్వామిత్రుడి చర్యలని ఊహించలేం. గొప్ప తపశ్శాలి ఐన విశ్వామిత్రుడు నీకు రక్షకుడిగా ఉండటంవల్ల ఈ లోకంలో నీకంటే అదృష్టవంతుడు ఇంకెవరూ లేరు. విశ్వామిత్రుడి చరిత్రని చెప్తాను విను. ఆయన సకల విద్యలని అభ్యసించి ప్రజల మేలుని కోరుతూ ధర్మంగా వేల సంవత్సరాలు రాజ్యపాలనని చేశాడు. బ్రహ్మ కొడుకు కుశుడు అనే రాజు ఉండేవాడు. కుశుడి కొడుకు కుశనాభుడు. ఆయన కొడుకు గాధి. ఆ గాధి కొడుకే ఈ విశ్వామిత్రుడు. ఓసారి ఈయన అక్షౌహిణి సైన్యంతో నగరాల్లో, రాష్ట్రాల్లో, నదులు, కొండల్లో, ఆశ్రమాల్లో ప్రయాణిస్తూ భూమి అంతా సంచరించాడు. సిద్ధ, చారణ, దేవ, దానవ, గంధర్వ, కినె్నరలు నివసించే వివిధ వృక్షాలు, పక్షులు గల వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్లాడు. ఇంద్రియాలని జయించిన ఋషులు అక్కడ నివసించేవారు. వారిలోని కొందరు నీటిని, కొందరు గాలిని, కొందరు రాలిన ఆకులని, కొందరు పళ్లు, దుంపలని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ జపహోపాలు చేస్తూండేవారు. వైఖానస (బ్రహ్మ గోళ్ల నించి పుట్టినవారు), వాలఖిల్య (తోక నించి పుట్టినవారు) మునులుగల, రెండో బ్రహ్మ లోకమా అనిపించే ఆ వశిష్ఠాశ్రమాన్ని విశ్వామిత్రుడు చూశాడు.
విశ్వామిత్రుడు వశిష్ఠుడికి నమస్కరించాడు. వశిష్ఠుడు ఆయనకి స్వాగతం చెప్పాడు.
‘మీ తపస్సు, అగ్నిహోత్రం, శిష్యులు, వృక్షాలు క్షేమంగా ఉన్నాయా?’ విశ్వామిత్రుడు ప్రశ్నించాడు.
‘క్షేమమే రాజా! నువ్వూ క్షేమమే కదా? ధర్మంగా ప్రజల్ని రక్షిస్తూ పాలిస్తున్నావు కదా? ధనాన్ని న్యాయంగా సంపాదిస్తూ దాన్ని పెంచి, రక్షించి, అవసరమైన వారికి ఇస్తున్నావు కదా? నీ సేవకులని చక్కగా పోషిస్తున్నావు కదా? వారంతా నీ ఆజ్ఞలని పాలిస్తున్నారు కదా? నీ శత్రువులు అందర్నీ జయించావు కదా? నీ సైన్యం, ధనాగారం, స్నేహితులు, కొడుకులు, మనవళ్లు క్షేమమే కదా?’ వశిష్ఠుడు అడిగాడు.
‘అంతా క్షేమమే’ విశ్వామిత్రుడు వినయంగా బదులు చెప్పాడు.
అలా వారిద్దరూ చాలా విషయాలు మాట్లాడుకున్నాక వశిష్ఠుడు ఆశ్రమంలో దొరికే పళ్లు, కందమూలాలు, నీళ్లు వారికి ఇచ్చి చెప్పాడు.
‘నీకూ, నీ సైన్యానికీ అతిథి సత్కారాలు చేస్తాను. దయచేసి స్వీకరించు’
విశ్వామిత్రుడు వెంటనే ఆతిథ్యానికి అంగీకరించలేదు. ప్రేమతో కూడిన ఆయన మాటలే ఆతిథ్యం అని నిరాకరించాడు. వశిష్ఠుడు తన ఆతిథ్యం తీసుకువెళ్లమని బలవంతం చేశాకే విశ్వామిత్రుడు అంగీకరించాడు. తర్వాత వశిష్ఠుడు చిత్రమైన రంగుగల కామధేనువు శబలని పిలిచి చెప్పాడు.
‘ఈ రాజుని, ఇతని పరివారాన్ని నేను భోజనంతో సత్కరించాలి అనుకున్నాను. అందుకు తగిన ఏర్పాట్లు చేయి. ఎవరికి ఏది ఇష్టమో వారికి ఆ ఆహారం, పానీయాలు వెంటనే వడ్డించు.’
(బాలకాండ సర్గ 51-52)
రామాయణం.. మీరే డిటెక్టివ్ 17
శతానందుడు రాముడికి విశ్వామిత్రుడి గురించి చెప్పేది ఇలా కొనసాగించాడు.
‘రామా! ఆ కామధేనువు ఎవరికి ఏది ఇష్టమో అది ఇస్తుంది. అలా అది చెరకు గడలు, వివిధ రకాల తేనెలు, పేలాలు, మద్యాలు, పానీయాలు, పప్పులని, అనేక రకాల పిండివంటలని, పర్వతాలంత వేడి అన్నరాశులని, మధురాన్నాలని, కాలువల్లా పారే పెరుగుని, వివిధ రసాలు చేర్చి వండిన పదార్థాలని, బెల్లం వంటకాలని వేలకొద్దీ సృష్టించి సమకూర్చింది. వాటిని విశ్వామిత్రుడి సైన్యం, విశ్వామిత్రుడు, అతని రాణులు, పురోహితులు, బ్రాహ్మణులు, మంత్రులు, సేవకులు మొదలైన వారంతా తిని తృప్తి చెందారు.
‘పూజకి అర్హుడవైన నువ్వు నన్ను పూజించావు. నీకు లక్ష ఆవులని ఇస్తాను. కామధేనువుని నాకు ఇవ్వు. ఈ ఆవు రత్నం లాంటిది. రత్నాలు రాజు సొమ్ము. ఇది నాకు చెందుతుంది. కాబట్టి ఇవ్వు’ విశ్వామిత్రుడు కోరాడు.
‘రాజా! నువ్వు లక్షలు లేదా కోట్ల ఆవులని, వెండి రాసులని ఇచ్చినా సరే, నేను శబలని ఇవ్వను. ఈ ఆవుకీ, నాకూ గల సంబంధం బుద్ధిమంతుడికి, కీర్తికిగల సంబంధంలా శాశ్వతమైంది. నా హవ్యం, కవ్యం, నా ప్రాణయాత్ర, అగ్నిహోత్రం, భూతబలి, దేవతలకి నైవేద్యాలు, అనేక విద్యలు ఈ ఆవు మీదే ఆధారపడి ఉన్నాయి. ఇంకా అనేక ఇతర కారణాలవల్ల కూడా దీన్ని నీకు ఇవ్వలేను’
వశిష్ఠుడి ఆ మాటలు విని విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు.
‘బంగారు నడుము తాళ్లు, మెడ తాళ్లు, బంగారు అంకుశాలు గల పధ్నాలుగు వేల ఏనుగులని ఇస్తాను. నాలుగు తెల్లటి గుర్రాలని కట్టిన, చిరుగంటల అలంకరణ గల ఎనిమిది వందల బంగారు రథాలని ఇస్తాను. ఇంకా పదకొండు వేల మేలుజాతి గుర్రాలని ఇస్తాను. వయసులో ఉన్న అనేక రంగుల ఆవులని కోటి ఇస్తాను. రత్నాలు, బంగారం, ఇంకా ఏదైనా ఎంత కావాలో అడుగు. వాటిని ఇచ్చి శబలని తీసుకుంటాను’
విశ్వామిత్రుడు ఏం ఇచ్చినా శబలని ఇవ్వడానికి వశిష్ఠుడు అంగీకరించలేదు.
‘ఇదే నాకు రత్నం. ఇదే ధనం. ఇదే సర్వస్వం. ఇదే జీవితం. నాకు దర్శపూర్ణ మాస యాగాలు, మంచి దక్షిణలు గల యజ్ఞాలు, అనేక ఇతర క్రియలకి కూడా ఈ ఆవే ఆధారం. నా క్రియలన్నిటికీ ఆధారమైన ఈ ఆవుని నీకు ఇవ్వను.
విశ్వామిత్రుడు ఆ ఆవుని బలవంతంగా లాక్కుని వెళ్లాడు. దాంతో శబలకి వశిష్టుడు తనని ఇష్టపడి ఇచ్చేసాడా అనే అనుమానం కలిగి బాధపడి, వందల కొద్దీ భటుల నించి తప్పించుకుని వాయువేగంతో వశిష్ఠుడి దగ్గరికి వెళ్లి ఏడుస్తూ ఇలా చెప్పింది.
‘రాజ భటులు నన్ను తీసుకువెళ్తున్నారు. నువ్వు నన్ను ఇచ్చేసావా?’
దుఃఖించే సోదరితో చెప్పినట్లుగా వశిష్ఠుడు ఇలా జవాబు చెప్పాడు.
‘ఇవ్వలేదు. ఓ శబలా! నువ్వు నాకు ఏం అపకారం చేసావని ఇచ్చేస్తాను? ఆ రాజు బలవంతంగా లాక్కెళ్లాడు. నా బలం క్షత్రియ రాజైన అతని బలంతో సమానం కాదు. అతనికి గుర్రాలు, రథాలు, ఏనుగులు, కాల్బలం గల అక్షౌహిణీ సైన్యం ఉంది. అందువల్ల శక్తిమంతుడు’
‘బ్రాహ్మణోత్తమా! క్షత్రియ బలం బలం కాదు. క్షత్రియ బలం కంటే బ్రాహ్మణ బలం దివ్యమైంది. గొప్పది. విశ్వామిత్రుడు నీకన్నా బలం గలవాడు కాదు. బ్రహ్మబలం గల నువ్వు నన్ను ఆజ్ఞాపించు.’
‘సరే. శత్రుసైన్యాన్ని నశింపజేసే సైన్యాన్ని సృష్టించు’ వశిష్ఠుడు ఆజ్ఞాపించాడు.
‘రామా! వెంటనే కామధేనువు అంబా అని అరిచి వందల కొద్దీ పప్లవులని, నూమిని కప్పివేసేంత మంది యవనులని, శకులని సృష్టించింది. బంగారు వస్త్రాలు ధరించిన వాళ్లు మండే అగ్నిలా కత్తులు, గదలతో విశ్వామిత్రుడి సైన్యాలని నాశనం చేశారు. విశ్వామిత్రుడు కోపంగా అనేక ఆయుధాలతో పప్లవులని చంపేశాడు. ఆ తర్వాత విశ్వామిత్రుడు మహాస్త్రాలని ప్రయోగించి యవనులని, కాంభోజులని, పప్లవులని చెల్లాచెదరు చేశాడు.’ (బాలకాండ సర్గ 53-54)
రామాయణం.. మీరే డిటెక్టివ్ 18
విశ్వామిత్రుడి అస్త్రాలకి వారంతా ఓడిపోవడం చూసి వశిష్ఠుడు చెప్పాడు.
‘శబలా! యోగశక్తితో ఇంకా సైన్యాన్ని సృష్టించు’
మళ్లీ కామధేనువు చేసిన అంబా అనే ధ్వనికి దాన్నించి సూర్యతేజం గల కాంభోజులు, పొదుగు నించి ఆయుధాలతో పప్లవులు, యోని నించి యవనులు, మలమూత్ర ద్వారాల నించి శకులు, వెంట్రుల రంధ్రాల నించి మ్లేచ్ఛులు, హారీతులు, కిరాతులు పుట్టారు. వారంతా విశ్వామిత్రుడి సైన్యాన్ని క్షణంలో మట్టుపెట్టారు. అది చూసిన విశ్వామిత్రుడి వంద మంది కొడుకులు కోపంతో వివిధ ఆయుధాలతో వశిష్ఠుడి మీదకి వెళ్లారు. ఆయన హూంకారం చేసి వారి రథాలతో సహా వారిని బూడిద చేశాడు. ఇది చూసి విశ్వామిత్రుడు సిగ్గుపడి దుఃఖించాడు. కోరలు తీసిన పాములా, వేగం లేని సముద్రంలా, రాహువు మింగిన సూర్యుడిలా కాంతిని కోల్పోయాడు. అతని అహంకారం అణిగింది.
ఆయన ఓ కొడుక్కి రాజ్యాన్ని అప్పగించి కిన్నరులు, ఉరగులు గల హిమాలయానికి చేరి శివుడి కోసం తపస్సు చేశాడు. కొద్దికాలానికి శివుడు ప్రత్యక్షమయ్యాడు.
‘అన్ని రహస్యాలతో ధనుర్వేదాన్ని నాకు అనుగ్రహించు. దేవతలకి, రాక్షసులకి, మహర్షులకి, గంధర్వ, యక్షులకి తెలిసిన అన్ని అస్త్రాలని నాకు ప్రసాదించు’ విశ్వామిత్రుడు కోరాడు.
శివుడు వాటిని ఇచ్చాడు. స్వతహాగా అహంకారి ఐన విశ్వామిత్రుడికి అవి లభించడంతో అహం పెరిగింది.
విశ్వామిత్రుడు వశిష్ఠాశ్రమానికి వెళ్లి ఆశ్రమం మీద ఆ అస్త్రాలని ప్రయోగించాడు. ఆ అస్త్రాలని ప్రయోగించగానే ఆ తపోవనం కాలిపోయింది.
‘సూర్యుడు మంచుని నశింప జేసినట్లుగా నేను శత్రువుని నశింపచేస్తాను’ అని వశిష్ఠుడు ధైర్యం చెప్పినా వేల కొద్దీ మృగాలు, పక్షులతో పాటు ఆయన శిష్యులు కూడా భయంతో పారిపోయారు. దాంతో తపోవనం నిశ్శబ్దంగా, నిర్మానుష్యంగా మారింది.
‘మూర్ఖుడా! చాలాకాలంగా పెంచిన నా ఆశ్రమాన్ని నాశనం చేసావు. ’ వశిష్ఠుడు కోపంగా చెప్పి విశ్వామిత్రుడితో పలికాడు.
విశ్వామిత్రుడు వశిష్ఠుడి మీద ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు.
‘ఓ దుర్మార్గపు క్షత్రియుడా! నీ క్షత్రియ బలం ఎక్కడ? నా బ్రహ్మ బలం ఎక్కడ? నా బ్రహ్మ బలాన్ని చూడు’ చెప్పి వశిష్ఠుడు ఆ ఆగ్నేయాస్త్రాన్ని తన బ్రహ్మదండంతో శాంతింపజేశాడు.
వెంటనే విశ్వామిత్రుడు వారుణ, రౌద్ర, ఇంద్ర, పాశుపత, ఐషికాస్త్రాలని ప్రయోగించాడు. రామా! ఇంకా విశ్వామిత్రుడు మానవ, వౌహన, గాంధర్వ, స్వాపన, జృంభణ, మదన, సంతాపన, విలాపన, శోషణ, ధారణ, వజ్రాస్త్రాలని; బ్రహ్మ, వరుణ పాశాలని; పైనాక, దైతాస్త్రాలని; సుష్కం, ఆద్రం అనే రెండు వజ్రాలని; దండ, పైశాచ, క్రౌంచ అస్త్రాలని; ధర్మచక్ర, కాలచక్ర, విష్ణు చక్రాలని; వాయవ్య, మథన, హయ, శిరోస్త్రాలని; కంకాళం, ముసలం అనే రెండు శక్తులని; వైద్యాధర, కాల, త్రిశూల, కాపాల, కంకణాస్త్రాలని ప్రయోగించాడు. వశిష్ఠుడి దండం వాటన్నింటినీ మింగేసింది. దాంతో విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు.
అది చూసి అగ్ని మొదలైన దేవతలు, దేవర్షులు, గంధర్వులు, మహోరగులు భయపడ్డారు. బ్రహ్మాస్త్రం మూడు లోకాలని బాధించింది. ఐతే వశిష్ఠుడు బ్రహ్మ తేజ ప్రభావంతో బ్రహ్మ దండంతో బ్రహ్మాస్త్రాన్ని కూడా మింగేశాడు. ఉగ్రంగా ఉన్న వశిష్ఠుడి వెంట్రుకల రంధ్రాల నించి మూడు లోకాలు మూర్ఛ చెందేలా పొగతో కూడిన అగ్ని కిరణాలు బయటకి వచ్చినట్లుగా కనిపించాడు. ఆయన చేతిలోని బ్రహ్మదండం పొగలేని ప్రళయాగ్నిలా, రెండో యమదండంలా వెలిగిపోసాగింది.
వెంటనే మునులంతా వచ్చి వశిష్ఠుడితో చెప్పారు
‘మహామునీ! నీ బలం అడ్డులేనిది. నీ తేజస్సుని నీ తేజస్సులోనే నిగ్రహించి లోకాల బాధని తొలగించు. నువ్వు విశ్వామిత్రుడ్ని ఓడించావు’
వారి మాటలకి వశిష్ఠుడు శాంతించాడు.
ఛా! క్షత్రియ బలం ఏముంది? బ్రహ్మ తేజో బలమైన నిజమైన బలం. ఒక్క బ్రహ్మదండం నా అస్త్రాలన్నిటినీ మింగేసింది. కాబట్టి నాకు బ్రాహ్మణత్వం వచ్చేలా ఇంద్రియాలని, మనసుని నిగ్రహించి తపస్సు చేస్తాను’ అని అలా గర్వభంగం చెందిన విశ్వామిత్రుడు నిశ్చయించుకున్నాడు.
(బాలకాండ సర్గ 55-56)
రామాయణం.. మీరే డిటెక్టివ్ 19
‘విశ్వామిత్రా! నువ్వు రాజర్షివి అయ్యావు’
తన తపస్సుకి లభించిన ఆ ఫలితానికి తృప్తి చెందక, పైగా సిగ్గుపడ్డ విశ్వామిత్రుడు మళ్లీ తీవ్ర తపస్సుని ఆరంభించాడు.
ఆ కాలంలో ఇక్ష్వాకు వంశపు త్రిశంకుడు అనే రాజు ఉండేవాడు. అతనికి యజ్ఞం చేసి శరీరంతో స్వర్గానికి వెళ్లాలనే కోరిక కలిగి, వశిష్ఠుడి దగ్గరికి వెళ్లి కోరాడు. కాని ఆయన అది కుదరదని చెప్పడంతో, దక్షిణ దిక్కులోని వశిష్ఠుడి కొడుకుల దగ్గరికి వెళ్లి తన కోరికని చెప్పాడు. అది విన్న వారు కోపంగా చెప్పారు.
‘మూర్ఖుడిలా ఉన్నావు. న్యాయపరుడైన గురువు కాదన్నాక ఇంకొకర్ని ఎలా ఆశ్రయిస్తున్నావు? ఇక్ష్వాకు వంశీయులకి పురోహితుడు, గురువైన మా తండ్రి చేయలేని దాన్ని మేము చేసి ఆయన్ని అవమానిస్తామా?’
‘సరే. నా గురువు, వారి కొడుకులు కూడా నిరాకరించారు కాబట్టి నేను మరొకర్ని చూసుకుంటాను’ చెప్పాడు.
ఆ మాటలకి కోపంతో వశిష్ఠ కుమారులు త్రిశంకుణ్ని ఛండాలుడు అవమని శపించారు. ఆ రాత్రి గడిచాక ఆయన సుకుమారమైన శరీరం నల్లగా, రాజదుస్తులు నల్లటి దుస్తులుగా, జుట్టు పొట్టిగా, బంగారు ఆభరణాలు ఇనప ఆభరణాలుగా మారి ఛండాలుడి రూపం వచ్చింది. ఆయన్ని చూసి అనుచరులు, మంత్రులు పారిపోయారు.
ధైర్యవంతుడైన త్రిశంకుడు దుఃఖంతో విశ్వామిత్రడి దగ్గరికి వెళ్లాడు.
‘నా గురువు, అతని కుమారుల వల్ల శరీరంతో స్వర్గానికి వెళ్లాలనే నా కోరిక తీరకపోగా ఈ రూపాన్ని పొందాను. బొందితో స్వర్గానికి వెళ్లాలనే కోరికతో వంద యజ్ఞాలు చేసినా ఫలితం లభించలేదు. అనేక యజ్ఞాలు చేస్తూ ప్రజలని ధర్మంగా పాలించిన నేను ఎన్నడూ అబద్ధం ఆడలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇక మీదట కూడా అబద్ధం ఆడను అని నా క్షత్రియ ధర్మం మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. నేను చేసే యాగానికి గురువులు చేయూత ఇవ్వడం లేదు. అందువల్ల నీ దగ్గరికి వచ్చాను. దయచేసి నా కోరిక తీర్చు. ఇంక నన్ను కాపాడే వారే లేరు’
అతనికి జరిగింది విని, ఛండాల రూపంలోని త్రిశంకుడి మాటలకి జాలిపడ్డ విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు.
భయపడక. నువ్వు ధర్మపరుడివని నాకు తెలుసు. నిన్ను కాపాడుతాను. కాబట్టి నిశ్చింతగా యజ్ఞం చేయి. అందుకు అవసరమైన మహర్షులని రప్పిస్తాను. ఇక స్వర్గం నీ చేతిలో ఉన్నట్లే. ఈ ఛండాల రూపంలోనే నువ్వు స్వర్గానికి వెళ్తావు’
విశ్వామిత్రుడు యజ్ఞానికి అవసరమైన సామాగ్రిని సమకూర్చమని తన కొడుకులకి సూచించి, తన శిష్యులతో చెప్పాడు.
‘మీరు ఋషులని, వారి శిష్యులు, స్నేహితులు, ఋత్విక్కులని తీసుకురండి. ఎవరు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతారో ఆ మాటలని నాకు చెప్పండి’
విశ్వామిత్రుడి శిష్యులు నాలుగు వైపులకి వెళ్లి, అన్ని దేశాల నించి వేద పండితులైన బ్రాహ్మణులని తీసుకువచ్చారు. మహోదయుడు తప్ప మిగిలిన బ్రాహ్మణులు అంతా వచ్చారని విశ్వామిత్రుడు గ్రహించాడు.
‘గురుదేవా! మహోదయుడు, వశిష్ఠుడి కొడుకులని కూడా ఆహ్వానించాం. కాని వారు కోపంగా ‘క్షత్రియుడు యాగ్నీకుడిగా, ఛండాలుడు సమర్పించే హవిస్సుని దేవతలు ఎలా స్వీకరిస్తారు? ఛండాలుడి అన్నం తినే బ్రాహ్మణులు స్వర్గానికి ఎలా వెళ్తారు?’ అని అన్నారు.’
విశ్వామిత్రుడు వెంటనే కోపంగా ఇలా శపించాడు.
‘ఉగ్ర తపస్సు చేసే నన్ను నిందించిన వారంతా బూడిద అగు గాక! వారు వంద జన్మలు ముష్టిక జాతిలో పుట్టి, నిత్యం కుక్క మాంసాన్ని తింటూ వికృత రూపాలతో ఈ లోకంలో సంచరించుదురు గాక! నన్ను తిట్టిన మహోదయుడు ప్రాణం తీసే దయలేని దుష్టజాతి ఐన నిషాద జాతిలో పుట్టుగాక!’
(బాలకాండ సర్గలు 57-59)
రామాయణం.. మీరే డిటెక్టివ్ 20
విశ్వామిత్రుడు మహోదయుని, వశిష్ఠ కుమారులని శపించాక ఋషులని త్రిశంకుడికి పరిచయం చేసి చెప్పాడు.
‘ఇక్ష్వాకు వంశీయుడైన ఇతను శరీరంతో స్వర్గానికి వెళ్లడానికి చేసే యజ్ఞానికి మీరంతా సహాయం చేయండి’
విశ్వామిత్రుడికి కోపం వస్తే శపిస్తాడనే భయంతో ఆయన చేసే క్రతువులో అంతా యాజకులుగా పని చేశారు. వారు క్రతువు నిర్వహణలో మంత్రపూర్వకమైన సహాయం చేశారు. ఆ యజ్ఞం అలా కొన్ని రోజులు జరిగాక విశ్వామిత్రుడు సమస్త దేవతలని వారి భాగాలు తీసుకోడానికి ఆహ్వానించాడు. వారు రాకపోవడంతో విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో త్రిశంకుడ్ని శరీరంతో స్వర్గానికి పంపాడు.
త్రిశంకుడుని ఇంద్రుడు స్వర్గంలోకి రానివ్వలేదు సరికదా ‘తలకిందులుగా’ భూమి మీదకి వెళ్లి పడమని ఇంద్రుడు శపించాడు. కాపాడమని అరుస్తూ త్రిశంకుడు మళ్లీ భూమి మీదకి వచ్చి పడ్డాడు. విశ్వామిత్రుడు ‘ఆగు’ అని అరిచి కోపంగా దక్షిణ దిక్కులో మరో సప్త ఋషులని, నక్షత్రమాలని, నక్షత్ర వంశాన్ని, మరో ఇంద్రుడ్ని, దేవతా సృష్టిని చేయడం ఆరంభించాడు. దాంతో ఋషులు, దేవతలు, అసురులు భయంతో విశ్వామిత్రుడి దగ్గరకి వెళ్లి అతన్ని శాంతింపజేస్తూ చెప్పారు.
‘ఓ తపోధనా! గురు శాపంతో ఛండాలుడైన త్రిశంకుడు శరీరంతో స్వర్గానికి వెళ్లడానికి అర్హుడు కాడు’
‘కావచ్చు. కాని ఇతన్ని శరీరంతో స్వర్గానికి పంపుతానని మాట ఇచ్చాను. అది అబద్ధం కావడం నాకు ఇష్టం లేదు. దాంతో ఇతను స్వర్గానికి వెళ్లాలి. కాబట్టి నేను సృష్టించిన నక్షత్రాలు ఈ లోకం ఉన్నంత కాలం స్థిరంగా ఉండేలా మీరు అనుమతించండి’ విశ్వామిత్రుడు కోరాడు.
‘సరే. కాని నువ్వు సృష్టించిన నక్షత్రాలన్నీ జ్యోతిశ్చక్రానికి బయట ఉండాలి. త్రిశంకువు ఆ నక్షత్రాల మధ్య తలకిందులుగా నివసించాలి’ దేవతలు కోరారు.
దానికి విశ్వామిత్రుడు అంగీకరించాడు. యజ్ఞం పూర్తయ్యాక దేవతలు, మునులు వెళ్లిపోయారు.
విశ్వామిత్రుడు దక్షిణ దిశలో చేసిన తపస్సుకి విఘ్నం కలగడంతో పశ్చిమ దిశకి వెళ్లి ఋషులతో కలిసి పుష్కర క్షేత్రంలో, పళ్లని, కందమూలాలని మాత్రమే తింటూ తిరిగి తపస్సుని ఆరంభించాడు.
ఆ కాలంలో అయోధ్య అధిపతి అంబరీషుడు ఓ యాగాన్ని ఆరంభించాడు. ఇంద్రుడు అతని యాగ పశువుని దొంగిలించాడు.
‘రాజా! మీ అధర్మం వల్లే యాగ పశువు పోయింది. మీరు పశువుని కాపాడలేకపోతే రాజుకి ప్రాణహాని. దీనికి చాలా పెద్ద ప్రాయశ్చిత్తం చేయాలి. పశువు దొరక్కపోతే మనిషినైనా ఆ స్థానానికి తెస్తే యజ్ఞాన్ని కొనసాగించవచ్చు’ రాజ పురోహితుడు రాజుకి చెప్పాడు.
దాంతో అంబరీషుడు వేలకొద్దీ ఆవులని ఇచ్చి నర పశువుని సంపాదించే ప్రయత్నంతో వివిధ దేశాల్లో, పల్లెల్లో, నగరాల్లో, ఆశ్రమాల్లో వెతుకుతూ భృగుతుంగ పర్వతం మీద ఉన్న రుచీక మహర్షి దగ్గరికి వెళ్లి నమస్కరించి ఇలా కోరాడు.
‘అన్ని దేశాలు తిరిగినా యజ్ఞ పశువు నాకు లభించలేదు. లక్ష ఆవులని తీసుకుని నీ కొడుకుల్లోని ఒకడ్ని నాకు యజ్ఞ పశువుగా ఇవ్వు’
‘నా పెద్ద కొడుకుని ఇవ్వను’ రుచీకుడు చెప్పాడు.
రుచీకుడి భార్య వెంటనే చెప్పింది.
‘సాధారణంగా తండ్రికి పెద్ద కొడుకంటే ఇష్టం. తల్లికి చిన్న కొడుకు ఇష్టం. కాబట్టి నా చిన్న కొడుకు శునకుడుని ఇవ్వను’
ఈ మాటలు విన్న మధ్య కొడుకు శునశే్శపుడు అంబరీషుడితో చెప్పాడు.
‘పెద్దకొడుకుని మా నాన్న, చిన్న కొడుకుని మా అమ్మ ఇవ్వనన్నారు. కాబట్టి మధ్యవాడైన నన్ను వాళ్లు నీకు ఇవ్వదలుచుకున్నారని నాకు అనిపిస్తోంది. అందువల్ల నన్ను తీసుకెళ్లు’
లక్ష ఆవులని ఇచ్చి అంబరీషుడు శునకుడ్ని తన వెంట తీసుకువెళ్లాడు (బాలకాండ సర్గలు 60-61)
రామాయణం.. మీరే డిటెక్టివ్ 21
శునశే్శపుడితో వెళ్తూ అంబరీషుడు మధ్యాహ్నం పుష్కర క్షేత్రంలో విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు దాహంతో, అలసటతో ఉన్న శునశే్శపుడు ఇతర ఋషులతో కలిసి తపస్సు చేసుకునే విశ్వామిత్రుడ్ని చూసి, ఆయన ఒడిలోకి వెళ్లి చెప్పాడు.
‘ఓ మహామునీ! నాకు తల్లి లేదు. తండ్రి లేడు. ఇక జ్ఞాతులు, బంధువుల మాట ఏం చెప్పను? అందరికీ రక్షకుడివైన నువ్వే నన్ను ధర్మంగా రక్షించాలి. నేను నాశనం లేని వాడినై, ఎక్కువ ఆయుర్దాయంతో జీవించి, తపస్సు చేసి స్వర్గానికి వెళ్లేలా అందరినీ రక్షించే నువ్వు నన్ను అనుగ్రహించి రక్షించు. నీ కొడుకులా భావించి నన్ను రక్షించు’
శునశే్శషుడి మేనమామే విశ్వామిత్రుడు.
అతన్ని విశ్వామిత్రుడు ఓదార్చి తన కొడుకులతో చెప్పాడు.
‘పరలోక హితం కోసం తల్లిదండ్రులు కొడుకుల్ని కంటారు. అది నెరవేర్చే సమయం మీకు వచ్చింది. ఈ ముని కొడుకు నన్ను శరణు కోరాడు. పుణ్యం, ధర్మం మీద ఆసక్తిగల మీరు ఇతని ప్రాణాల్ని కాపాడటానికి రాజుకి యజ్ఞ పశువులుగా వెళ్లి అగ్నికి ఆహుతై, ఇతనికి ప్రాణభిక్ష పెట్టండి. అందువల్ల శునశే్శపుడు కాపాడబడతాడు. యజ్ఞం కూడా అవిఘ్నంగా జరిగి దేవతలు తృప్తి చెందుతారు. ఇతను నన్ను కోరింది కూడా నెరవేరుతుంది’
ఆ మాటలు విని అహంకారులైన విశ్వామిత్రుడు కొడుకు మధుష్యందుడు మొదలైన వారు పరిహాసంగా ఇలా చెప్పారు.
‘స్వంత కొడుకులని విడిచి ఇతరుల కొడుకుని ఎలా రక్షిస్తావు? అది కుక్క మాంసాన్ని తినడంతో సమానంగా భావిస్తున్నాం’
ఆ మాటలకి మండి పడ్డ విశ్వామిత్రుడు వాళ్లని వెంటనే శపించాడు.
‘నా ఆజ్ఞని అతిక్రమించిన మీరు వశిష్టుడి కొడుకుల్లా ముష్టిక జాతుల్లో పుట్టి కుక్క మాంసం తింటూ ‘వెయ్యేళ్లు భూమి మీద జీవించండి’
తర్వాత శునశే్శపుడికి మంత్రాలతో రక్ష చేసి చెప్పాడు.
‘నీకు ఎర్రటి పైపూత పూసి, ఎర్రటి పూల దండలు వేసి, పవిత్రమైన తాళ్లతో వైష్ణవ యూపస్తంభానికి కడతారు. నేను ఉపదేశించే మంత్రాలతో అగ్నిని ప్రార్థించు. అప్పుడు నీకేం కాదు’
ఆ మంత్రాలని స్వీకరించి శునశే్శపుడు అంబరీషుడి దగ్గరికి వెళ్లి చెప్పాడు.
‘వెంటనే యజ్ఞశాలకి వెళ్దాం పదండి. మీరు దీక్షలో కూర్చోండి’
ఆ మాటలకి సంతోషించిన అంబరీషుడు యజ్ఞవాటికకి చేరుకున్నాడు. సభ్యుల అనుమతితో శునశే్శపుడిని దర్భ పవిత్రాలు, ఎర్రటి బట్టలతో బలి పశువుగా చేసి యూపస్తంభానికి కట్టారు. అతను విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రాలతో ఇంద్రుడ్ని, ఉపేంద్రుడ్ని శాస్తప్రరంగా స్తుతించాడు. రామా! రహస్యంగా ముని కొడుకు చేసిన ఈ స్తుతికి ఇంద్రుడు సంతోషించి అతనికి దీర్ఘాయువుని ప్రసాదించాడు. అంబరీష మహారాజుకి కూడా దేవేంద్రుడు ఎన్నో రెట్ల యజ్ఞ ఫలాన్ని ఇచ్చాడు.
ఆ తర్వాత విశ్వామిత్రుడు పుష్కర క్షేత్రంలో వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు.
ఆ తపస్సుని పూర్తి చేసి వ్రత స్నానం చేసిన విశ్వామిత్రుడికి దాని ఫలాన్ని ఇవ్వడానికి దేవతలు అంతా వచ్చారు.
‘నీ పుణ్యం చేత నువ్వు ఋషివి అయ్యావు’ బ్రహ్మ విశ్వామిత్రుడికి చెప్పి తిరిగి స్వర్గానికి వెళ్లిపోయాడు. విశ్వామిత్రుడు మళ్లీ తపస్సుని ఆరంభించాడు.
‘రామా! కాలవశాన మేనక అనే అప్సరస పుష్కరంలో స్నానం చేయసాగింది. విశ్వామిత్రుడు మేఘం వెనక గల మెరుపు తీగ లాంటి ఆమెని చూశాడు. వెంటనే కోరిక చెలరేగి ఆయన ఇలా కోరాడు.
‘ఓ అప్సరసా! నా ఆశ్రమానికి నీకు స్వాగతం. నాతో ఉంటూ నా కోరికని తీర్చు’
ఆమె అందుకు అంగీకరించింది. అలా పదేళ్లు సుఖంగా గడిచాక విశ్వామిత్రుడు తన తప్పునకు సిగ్గుపడ్డాడు. దుఃఖం కలిగింది. ఇది తనని తపస్సు నించి దూరం చేయడానికి దేవతలు పన్నిన పన్నాగం అని గ్రహించాడు. తన ఆలోచనని గ్రహించి నమస్కరిస్తూ, భయంతో వణికే ఊర్వశిని మంచి మాటలు చెప్పి పంపించి ఉత్తర దిశలోని హిమాలయాలకి వెళ్లాడు.
తన ఇంద్రియాలని జయించాలనే నిష్ఠతో కౌశికీ నదీ తీరంలో తీవ్ర తపస్సుని ఆరంభించాడు. అలా ఆయన వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాక దేవతలకి భయం కలిగింది. ఋషులు, దేవతలు విశ్వామిత్రుడు మహర్షి అయ్యాడని భావించారు. వారి మాటలని విన్న బ్రహ్మదేవుడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్లి చెప్పాడు.
‘మహర్షీ! నీ తపస్సుకి సంతోషించాను. నీకు మహర్షిత్వాన్ని ఇస్తున్నాను’
ఐతే అందుకు విశ్వామిత్రుడికి సంతోషం కాని, దుఃఖం కాని కలగలేదు. ఆయనకి నమస్కరించి వినమ్రంగా ఇలా చెప్పాడు.
‘మహర్షిత్వం వల్ల నేను ఇంద్రియాలని జయించిన వాడిని అయ్యాను’
‘లేదు. నువ్వు ఇంకా ఇంద్రియాలని జయించలేదు. కాబట్టి ఇంకా ప్రయత్నించు’ చెప్పి బ్రహ్మ స్వర్గానికి వెళ్లిపోయాడు.
విశ్వామిత్రుడు చేతులని పైకి ఎత్తి, గాలినే ఆహారంగా తీసుకుంటూ గొప్ప తపస్సుని మళ్లీ ఆరంభించాడు. గ్రీష్మ ఋతువులో (వేసవిలో) పంచాగ్నుల మధ్య, వర్షాకాలంలో ఆరు బయట తడుస్తూ, చలికాలంలో పగలు, రాత్రి నీళ్లల్లో నిలిచి వేయి సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. అది చూసి దేవేంద్రుడు, దేవతలు భయపడ్డారు. ఇంద్రుడు అప్సరసైన రంభని పిలిచి తనకి మేలు, విశ్వామిత్రుడికి కీలు చేసే మాటలని చెప్పాడు.
(బాలకాండ సర్గ 62-63)
మీరే డిటెక్టివ్ 22 రామాయణం..
నువ్వు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్లి కామాన్ని రెచ్చగొట్టి, ఆయన తపస్సుని భగ్నం చేయి’
‘కోపంతో విశ్వామిత్రుడు నన్ను శపించవచ్చని భయంగా ఉంది’ రంభ చెప్పింది.
‘రంభా! భయపడకు. నేను (ఇంద్రుడు) కోకిల రూపంలో మన్మథుడితో పాటు నీ (రంభ) పక్కనే ఉంటాను. నేను చెప్పినట్లు చేయి. వసంత ఋతువులో నీ అందంతో అతని తపస్సుకి భంగం కలిగించు’
కోకిల పాటలు విన్న విశ్వామిత్రుడు అందమైన రంభని చూడగానే అది ఇంద్రుడి పథకంగా గ్రహించాడు.
‘కామక్రోధాలని జయించాలి అనుకునే నన్ను వ్యామోహంలోకి లాగాలని అనుకున్న నువ్వు పదివేల సంవత్సరాలు బండ రాయిగా పడి ఉండు. తపోబలం గల ఓ బ్రాహ్మణుడు నీకు శాపవిమోచనం కలిగిస్తాడు’
రంభ తక్షణం రాయిగా మారిపోయింది. అది చూసి మన్మథుడు, ఇంద్రుడు పారిపోయారు.
విశ్వామిత్రుడికి తను ఇచ్చిన శాపానికి పశ్చాత్తాపం కలిగింది. తనకి ఇంద్రియాల మీద ఇంకా ఆధిక్యత రాలేదని తెలుసుకుని మనశ్శాంతి పోయింది. తను ఇక వౌనంగా ఉండి వందల ఏళ్లు శరీరాన్ని శుష్కింపజేసి ఇంద్రియాలని జయించాలని, తపస్సుతో తనకి బ్రాహ్మణత్వం లభించే దాకా ఆహారాన్ని వదిలేసి, ఊపిరిని బిగించి వేయి సంవత్సరాలు తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు.
‘రామా! ఆ తర్వాత విశ్వామిత్రుడు పశ్చిమ దిశకి వెళ్లి వౌనంగా, ఎన్ని విఘ్నాలు కలిగినా, కోపం తెచ్చుకోకుండా అతి తీవ్రమైన తపస్సుని ఆరంభించాడు. అలా వెయ్యి సంవత్సరాలు గడిచాక విశ్వామిత్రుడు భోజనానికి కూర్చుంటే, ఇంద్రుడే బ్రాహ్మణ రూపంలో వచ్చి భోజనం పెట్టమని కోరాడు. ఆయన తన భోజనాన్ని వౌనంగా ఆయనకి ఇచ్చేసి మరో వెయ్యి సంవత్సరాలు ఊపిరి బిగబట్టి తపస్సు చేయసాగాడు.
అతని తల నించి మూడు లోకాలు తగలబడుతున్నాయా అనేంత పొగ రాసాగింది. విశ్వామిత్రుడి తేజస్సు దేవ, గాంధర్వ, పన్నగ, అసుర, రాక్షసులని పీడించసాగింది. వారు శాంతిని కోల్పోయి బ్రహ్మ దగ్గరికి వెళ్లి మొర పెట్టుకున్నారు.
‘విశ్వామిత్రుడు ఎలాంటి వ్యామోహాలకి లొంగక తపస్సుతో వృద్ధి చెందుతున్నాడు. కొద్దిగా కూడా పాపం మిగలని ఆయన కోరిన వరాన్ని నువ్వు ఇవ్వకపోతే పర్వతాలు పగిలి, సముద్రాలు క్షోభిస్తున్నాయి. దేనికీ ప్రకాశం అనేదే లేదు. భూమి కంపిస్తోంది. గాలి బలహీనమైంది. ప్రజలు నాస్తికులు అవుతున్నారు. మహర్షి తేజస్సు ముందు సూర్యుడి కాంతి వెలవెల బోతోంది. అతని తేజస్సు వల్ల మూడు లోకాలు నాశనం కాకముందే త్వరపడు. పూర్వం ప్రళయాగ్నితో మూడు లోకాలు కాలిపోయినట్లు కాలుతున్నాయి. ఇతను దేవ లోకానికి రాజు అవాలని కోరుకుంటే ఆ వరం ఇవ్వు’
వారి వెంట వచ్చిన బ్రహ్మ విశ్వామిత్రుడితో చెప్పాడు.
‘నీ ఉగ్ర తపస్సుకి సంతోషించాను. నువ్వు బ్రాహ్మణత్వం పొందావు. నీకు దీర్ఘాయువుని కూడా ఇస్తున్నాను’
దానికి సంతోషించిన విశ్వామిత్రుడు ఇలా కోరాడు.
‘ఐతే వేదాలు, ఓంకార వషట్కారాలు (దేవతలకి హవిస్సులని సమర్పించే అర్హత) నన్ను వరించి, వేదాలని ఇతరులకి బోధించే, యజ్ఞ యాగాదులని చేయించే అర్హత కావాలి. ఇదంతా జరిగితే మీరు వెళ్లచ్చు’
బ్రహ్మదేవుడి కొడుకైన వశిష్ఠుడు కూడా నన్ను బ్రహ్మర్షిగా అంగీకరించాలి అని విశ్వామిత్రుడు కోరితే, దేవతలు బతిమాలితే వశిష్ఠుడు వచ్చి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడని అంగీకరించాడు.
దేవతలు వెళ్లిపోయారు.
బ్రహ్మర్షి విశ్వామిత్రుడు వశిష్ఠుడ్ని పూజించాడు.
‘రామా! విశ్వామిత్రుడు మునుల్లో శ్రేష్ఠుడు’
(బాలకాండ సర్గ 63,64,65లోని 26వ శ్లోకం దాకా)
రామాయణం.. మీరే డిటెక్టివ్ 23
విశ్వామిత్రుడు అలా బ్రాహ్మణత్వాన్ని సంపాదించుకుని భూ మండలం అంతా సంచరించాడు. తపస్సు, ధర్మం, పరాక్రమం మూర్త్భీవించిన విశ్వామిత్రుడు మునుల్లో శ్రేష్ఠుడు’ శతానందుడు తను చెప్పేది పూర్తి చేశాడు.
ఆ మాటలు విన్న జనక మహారాజు విశ్వామిత్రుడికి నమస్కరించి చెప్పాడు.
‘రామలక్ష్మణులతో నేను చేసే యజ్ఞానికి వచ్చావు. నీ దర్శనంతో నేను ధన్యుడ్ని, పవిత్రుడ్ని అయి అనేక లాభాలు పొందాను. నీ తపస్సు, బలం, గుణాలు కొలతకి అందనివి. సూర్యాస్తమయ సమయం అయింది. రేపు ఉదయం నా దగ్గరికి రమ్మని కోరుతున్నాను’
జనకుడు, ఆయన గురువులు, బంధువులు విశ్వామిత్రుడికి ప్రదక్షిణ చేశాక ఆయన అనుమతితో జనకుడు వెళ్లిపోయాడు.
విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో మహర్షుల బసకి వెళ్లాడు.
మర్నాడు ఉదయం జనక మహారాజు రామలక్ష్మణులని, విశ్వామిత్రుడ్ని పిలిపించి వారిని పూజించి కోరాడు.
‘విశ్వామిత్రా! నేను ఏం చేయాలో ఆజ్ఞాపించు’
‘క్షత్రియులైన రామలక్ష్మణులు నీ దగ్గర ఉన్న ధనస్సుని చూడాలని అనుకుంటున్నారు. దాన్ని చూశాక వెళ్తారు’
విశ్వామిత్రుడి ఆ మాటలు విన్న జనకుడు వెంటనే ఆ ధనస్సు చరిత్రని వారికి ఇలా వివరించాడు.
‘పూర్వం దక్ష యజ్ఞ ధ్వంస సమయంలో రుద్రుడు ఈ ధనస్సుని వంచి, దేవతలతో ఉగ్రంగా ఇలా చెప్పాడు.
‘దేవతలారా! యజ్ఞ భాగాలని కోరే నాకు మీరు వాటిని ఇవ్వలేదు కాబట్టి ఈ ధనస్సుతో మీ తలలని నరుకుతాను’
దేవతలు భయపడి శివుడ్ని శాంతింపజేశారు. ఆయన వారిని అనుగ్రహించి ఆ ధనస్సుని వారికి ఇచ్చాడు. దాన్ని శివుడు నిమి చక్రవర్తి నించి ఆరో వాడైన దేవరాతుడికి దాచడానికి ఇచ్చాడు. ఇది ఇలా ఉండగా నేను ఒకప్పుడు యజ్ఞ్భూమిని దున్నుతూండగా నాగలి నించి సీత అనే కన్య నాకు లభించింది. (స్ర్తి గర్భం నించి పుట్టని వారిని
అయోనిజ అంటారు.) ఆమెని కూతురిగా పెంచుతున్నాను. సీతని పెళ్లి చేసుకోడానికి అర్హతగా పరాక్రమాన్ని శుల్కంగా నిర్ణయించాను. చాలా మంది రాజులు సీతని పెళ్లి చేసుకోడానికి, తమ బలాన్ని ప్రదర్శించడానికి మిథిలకి వచ్చారు. వారిలో ఎవరూ ధనస్సుని కదల్చలేక పోవడంతో ఆ బలహీనులకి నేను సీతని ఇవ్వడానికి నిరాకరించాను. వారంతా దీన్ని అవమానంగా భావించి మిథిలా నగరాన్ని సంవత్సరంపాటు ముట్టడించారు. నగరంలో జీవించడానికి అవసరమైన వస్తువులన్నీ తరిగిపోవడంతో నాకు చాలా విచారం కలిగింది. అప్పుడు నేను తపస్సు చేస్తే దేవతలు నాకు చతురంగ బలాలని ఇచ్చారు. ఆ రాజులంతా ఆ యుద్ధంలో ఓడిపోయి తమ పరివారంతో పారిపోయారు. రాముడు ఈ ధనస్సుని ఎక్కుపెట్టగలిగితే సీతని అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాను’
గంధం, పూలమాలలతో అలంకరించబడ్డ ఆ దివ్య ధనస్సుని జనకుడు తెప్పించాడు. ఏభై మంది దృఢమైన వారు ఎనిమిది చక్రాల ఇనప పెట్టెలో ఉంచిన ఆ ధనస్సుని అతికష్టం మీద లాక్కుని వచ్చారు. జనకుడు రామలక్ష్మణులతో, విశ్వామిత్రుడితో ఇలా చెప్పాడు.
‘విశ్వామిత్ర మహామునీ! మా వంశీయులు పూర్వం దీన్ని ఎక్కుపెట్టాలని ప్రయత్నించి విఫలం అయ్యారు. అప్పట్నించి దీన్ని పూజిస్తున్నాను. సురులు కాని, అసురులు కాని, రాక్షసులు, గంధర్వ, యక్ష, కినె్నర, కిన్నర, మహోరగులు కాని దీన్ని ఎక్కుపెట్టలేక పోయారు. దీన్ని వంచి నారి కట్టి, దాన్ని లాగి బాణం ఎక్కు పెట్టడానికి మనుషులకి శక్తి ఎక్కడిది?’
బ్రహ్మర్షి ఆదేశాన్ని అనుసరించి రాముడు ఆ పెట్టెని తెరచి అందులోని విల్లుని చూసి చెప్పాడు.
‘బ్రహ్మర్షీ! ఈ విల్లుని నేను కదల్చగలిగితే దాన్ని ఎక్కుపెట్టడానికి ప్రయత్నిస్తాను’
తర్వాత వేల మంది చూస్తూండగా, రాముడు వింటిని మధ్య భాగంలో పట్టుకుని సునాయాసంగా అందుకుని ఎక్కుపెట్టాడు. దాని నారిని చెవి దాకా లాగడంతో పిడుగు చప్పుడుతో అది విరిగిపోయింది. పర్వతం బద్దలైతే అదిరినట్లుగా భూమి అదిరింది. విశ్వామిత్ర, జనక, రామలక్ష్మణులు తప్ప మిగిలిన అంతా మూర్ఛపోయారు. వారు తేరుకున్నాక జనకుడు కంగారుగా విశ్వామిత్రుడితో చెప్పాడు.
‘మహామునీ! దశరథ కుమారుడు రాముడి పరాక్రమాన్ని ప్రత్యక్షంగా చూశాను. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నా కూతురు సీత ఇక రాముడికి భార్యగా, మా వంశానికి కీర్తిని తీసుకువస్తుంది. సీతకి కన్యాశుల్కం పరాక్రమం అని నిర్ణయించాను. కాబట్టి నా ప్రాణం అయిన సీతని రాముడికి ఇస్తాను. నువ్వు ఆజ్ఞాపిస్తే నా మంత్రులు వెంటనే అయోధ్యకి వెళ్లి, రామలక్ష్మణులు నీ సంరక్షణలో క్షేమంగా ఉన్నారని జరిగింది దశరథుడికి వివరించి, అతన్ని ఇక్కడికి తీసుకుని వస్తారు’
జనక మహారాజు తన మనుషులని అయోధ్యకి పంపాడు.
(65వ సర్గ, 27వ శ్లోకం నించి; 66,67 సర్గలు)
రామాయణం.. మీరే డిటెక్టివ్ 24
ఇవాళ బాలకాండ సర్గ 67, 68 ల్లోని కథని చెప్తాను. ఈ శ్రవణమే పుణ్యదాయకం.
జనక మహారాజు దూతలు గుర్రాలు అలసిపోయేలా మూడు రోజులు ప్రయాణం చేసి అయోధ్యా నగరానికి చేరారు. ద్వారపాలకులు ఆ దూతలని వృద్ధుడైన దశరథుడి దగ్గరికి తీసుకెళ్లారు. వారు నమస్కరించి ఇలా చెప్పారు.
‘మహారాజా! మిథిలాధిపతి అయిన జనక మహారాజు మీ గురువులు, పురోహితులు, పరివారం క్షేమం అడుగుతున్నారు. మా రాజు ఇలా చెప్పమన్నారు. ‘నా కూతుర్ని వీరుడికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పిన మాట అందరికీ తెలుసు. కొందరు రాజులు ఈ పరీక్షలో ఓడిపోయారు. కాని దైవకృప వల్ల విశ్వామిత్రుడి వెంట మిథిలకి వచ్చిన వీరుడైన రాముడు సభలో ఆ దివ్య ధనస్సుని మధ్యకి విరిచి ఆమెని గెలుచుకున్నాడు. ఆ పరీక్షలో నెగ్గిన ఆ వీరుడికి సీతని ఇవ్వటానికి నీ అనుమతిని కోరుతున్నాను. నువ్వు గురువులు, పురోహితులతో వెంటనే వచ్చి నాకు ఆనందాన్ని కలిగించు. నీకు కూడా నీ కొడుకులని, వారి పెళ్లిని చూసి ఆనందం కలుగుతుంది. విశ్వామిత్రుడు, శతానందుడి అనుమతితో జనక మహారాజు ఈ సందేశాన్ని మా ద్వారా మీకు పంపుతున్నారు’
ఆ తర్వాత దూతలు వౌనంగా ఉండిపోయారు. ఆ సందేశాన్ని విన్న దశరథుడికి ఆనందం కలిగింది. వశిష్ఠ, వామదేవులతో, ఇతర మంత్రులతో ఇలా చెప్పాడు.
‘రాముడు లక్ష్మణుడితో విశ్వామిత్రుడితో ఇప్పుడు విదేహ దేశంలో ఉన్నాడు. జనకుడు రాముడి పరాక్రమాన్ని చూసి అతనికి తన కూతుర్ని ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఆయన ఆచారం మీకు నచ్చినట్లైతే, ఆలస్యం చేయకుండా వెంటనే మిథిలా నగరానికి వెళ్దాం’
మంత్రులు సరే అనటంతో దశరథుడు మర్నాడే ప్రయాణం అని వారికి చెప్పారు. జనకుడి దూతలు అతిథి సత్కారంతో ఆ రాత్రి అయోధ్యలోనే విశ్రాంతి తీసుకున్నారు.
దశరథుడు సుమంత్రుడితో మర్నాడు ఉదయం ఇలా చెప్పాడు.
‘్ధనాధ్యక్షులు పుష్కలంగా ధనాన్ని, వివిధ రత్నాలని తీసుకుని ముందు వెళ్లాలి. నేను చెప్పగానే చతురంగ సైన్యం, మంచి రథాలు, పల్లకీలు బయలుదేరాలి. బ్రాహ్మణులైన వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, దీర్ఘాయుష్షు గల మార్కండేయుడు, కాత్యాయన ఋషి ముందు వెళ్లాలి. జనకుడి దూతలు తొందర పెడుతున్నారు కాబట్టి ఆలస్యం చేయకుండా నా రథాన్ని సిద్ధం చేయించండి’
ఆ విధంగా అంతా బయలుదేరారు. నాలుగు రోజులు ప్రయాణం చేశాక దశరథుడు విదేహ దేశాన్ని చేరాడు.
జనకుడు వృద్ధుడైన దశరథుడికి స్వాగతం పలికాడు.
‘దేవతలతో కలిసి దేవేంద్రుడు వచ్చినట్లుగా మీరు వశిష్ఠ మహర్షి, బ్రాహ్మణోత్తములతో నా ఇంటికి రావడం నా భాగ్యం. పరాక్రమంలో గొప్పవాడైన రఘువంశ రాజులతో వియ్యం కూడా నా భాగ్యం. అందువల్ల నా వంశం పూజించ దగ్గదైంది. ఋషులు సమ్మతిస్తే వారి పెళ్లిని జరిపించండి’ జనకుడు కోరాడు.
‘జనక మహారాజా! స్వీకరించడం అనేది ఇచ్చే వాడి చేతిలో ఉంది. దాత ఇస్తేనే కదా తీసుకునేవాడు తీసుకునేది. నీ కన్యాదాన నిర్ణయం ప్రకారం నువ్వు ఎలా చెప్తావో అలా చేద్దాం’ దశరథుడు చెప్పాడు.
మునీశ్వరులు కూడా ఒకరినొకరు కలుసుకున్నందుకు సంతోషించారు. దశరథుడు రామలక్ష్మణులని చూసి ఆనందించాడు. ధర్మ రహస్యాలు తెలిసిన జనక మహారాజు ఆ రాత్రి యజ్ఞానికి సంబంధించిన క్రతువుని పూర్తి చేశాడు. మర్నాడే పెళ్లి అని నిర్ణయించారు. ఇది హరిదాసు చెప్పలేదు. కూతుళ్ల పెళ్లిళ్లకి సంబంధించిన అంకురార్పణని కూడా జనకుడు ఆ రాత్రి చేశాడు.
(బాలకాండ సర్గ 67, 68, 69వ సర్గ)
రామాయణం.. మీరే డిటెక్టివ్ 25
మర్నాడు తెల్లవారుఝామున జనకుడి చేత చేయించాల్సిన యజ్ఞ విధులని మహర్షులు చేయించాక ఆయన గౌతముడి కొడుకైన శతానందుడితో ఇలా చెప్పాడు.
‘ఇక్షుమతీ నదీ తీరంలో, చుట్టూ నీటి ఉసిరి చెట్లు గల పుష్పక విమానం లాంటి, పరిశుద్ధమైన సాంకాశ్య నగరంలో ధార్మికుడైన నా తమ్ముడు ఉన్నాడు యజ్ఞ సంభారాలని సమకూర్చడంలో అతను నాకు సహాయం చేశాడు. ఈ పెళ్లికి అతను వస్తే నాకు ఆనందం’
వెంటనే శతానందుడు కొందరు దూతలని పిలిచాడు. వారు జనకుడి ఆజ్ఞ ప్రకారం కుశధ్వజుడ్ని తీసుకురావడానికి గుర్రాల మీద బయలుదేరి సాంకాశ్య నగరంకి వెళ్లి తాము ఎందుకు వచ్చారో చెప్పారు. వెంటనే
కుశధ్వజుడు మిథిలా నగరానికి చేరుకున్నాడు. ఆయన శతానందుడికి, జనకుడికి గౌరవంగా నమస్కరించాడు.
జనకుడు తన మంత్రి సుదామతో చెప్పాడు.
‘నువ్వు వెళ్లి దశరథుడి కొడుకులు, మంత్రులతో సహా దశరథుడ్ని వెంట పెట్టి తీసుకురా’
ఆ ప్రకారం దశరథుడు వచ్చాక ఆయన జనకుడితో చెప్పాడు.
‘మహారాజా! మా వంశానికి దైవం, పూజ్యుడు ఐన వశిష్ఠుడు మా తరఫున మా పూర్వీకుల గురించి మీకు చెప్తాడు’
వశిష్ఠుడు వెంటనే ఇలా చెప్పాడు.
‘ఇక్ష్వాకు వంశంలోని 37వ మహారాజు దశరథుడు. అవ్యక్తం నించి పుట్టినవాడు, సదా ఉండేవాడు, నిత్యుడు, నాశనం లేని వాడైన బ్రహ్మదేవుడికి మరీచి, మరీచికి కాశ్యపుడు కొడుకులుగా పుట్టారు. కాశ్యపుడికి సూర్యుడు, సూర్యుడికి మనువు, ప్రజాపతి ఐన మనువుకి ఇక్ష్వాకువు పుట్టారు. ఆ ఇక్ష్వాకుడు అయోధ్యకి మొదటి రాజు. ఆయన కొడుకు కుక్షి. కుక్షికి వికుక్షి, అతనికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అతనికి పృథువు, పృథువుకి త్రిశంకుడు పుట్టారు. త్రిశంకుడికి దుందుమారుడు, అతనికి యవనాశ్వుడు, అతనికి మాంథాత, మాంథాతకి సుసంధి, అతనికి ధృవసంధి, ప్రసేనజిత్ అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. ధృవసంధికి భరతుడు, అతనికి అసితుడు పుట్టారు. అసితుడికి హైహయ, తాలజంఘ, శశిబిందు వంశరాజులు శత్రువులు అయ్యారు. వారితో చేసిన యుద్ధంలో ఓడిపోయి, అసితుడు కొద్దిసైన్యంతో, మంత్రులతో హిమాలయాల్లోని భృగుప్రస్రవణం అనే చోటకి వెళ్లిపోయాడు. ఆ సమయంలో అతని ఇద్దరు భార్యలు గర్భవతులు. కాళింది అనే భార్య తన సవతికి గర్భవిచ్చేదానికి విషాన్ని ఇచ్చింది.
‘అదే సమయంలో అక్కడ భృగువంశానికి చెందిన చ్యవనుడు ఉండేవాడు. విషం పెట్టబడ్డ భార్య కొడుకుని కోరుకుంటున్నానని చ్యవనుడితో చెప్పింది. సవతికి విషం పెట్టిన కాళింది కూడా ఆ సమయంలో అక్కడికి వెళ్లింది. చ్యవనుడు విషం పెట్టబడ్డ సవతితో చెప్పాడు.
‘గొప్ప బలం, పరాక్రమం గల కొడుకు నీ గర్భంలో ఉన్నాడు. కొద్దికాలంలో అతను నీకు విషంతో పుడతాడు’
అసితుడు మరణించాక దుఃఖంలో ఉన్న ఆమెకి చ్యవనుడి అనుగ్రహంతో కొడుకు పుట్టాడు. సగరుడి కొడుకు అసమంజుడు. అతనికి దిలీపుడు, దిలీపుడికి భగీరథుడు పుట్టారు. భగీరథుడి కొడుకు కకుత్సుడు. అతనికి రఘువు పుట్టాడు. రఘువుకి ప్రవృద్ధుడు పుట్టాడు. ప్రవృద్ధుడు వశిష్ఠుడి శాపంతో నరమాంస భక్షకుడు అయ్యాడు. వశిష్ఠుడిని బదులుగా శపించడానికి నీటిని తీసుకున్న ప్రవృద్ధుడు భార్య వారించడంతో ఆ నీటిని తన పాదాల మీద విడిచి కల్మష పాదుడు అయ్యాడు. అతని కొడుకు శంఖణుడు. అతనికి సుదర్శనుడు, అతనికి అగ్నివర్ణుడు, అతనికి శ్రీఘ్రగుడు, అతనికి మరువు, మరువుకి ప్రశుశ్రుకుడు, అతనికి అంబరీషుడు కొడుకులుగా పుట్టారు. అంబరీషుడికి సహుషుడు, నహుషుడికి యయాతి, అతనికి నాభాగుడు, నాభాగుడికి అజుడు జన్మించారు. అజుడికి పుట్టినవాడే దశరథ మహారాజు. ఆయన ఇద్దరి కొడుకులు రామలక్ష్మణులు. జనక మహారాజా! మొదటి నించీ ఇక్ష్వాకులది పరిశుద్ధమైన వంశం. వారంతా ధార్మికులు, వీరులు, సత్యం మాట్లాడేవారు. అలాంటి వంశంలో పుట్టిన రామలక్ష్మణులకి నీ కూతుళ్లని ఇచ్చి పెళ్లి చేయి’
(బాలకాండ సర్గ 70-75)
రామాయణం.. మీరే డిటెక్టివ్ 26
‘దశరథుడి వంశం గురించి వశిష్ఠుడు చెప్పాక జనకుడు తన వంశం గురించి వారికి ఇలా చెప్పాడు.
‘మహామునీ! కన్యాదాన సమయంలో తమ వంశం గురించి చెప్పే సాంప్రదాయం ఉంది కాబట్టి విను. పూర్వం బలం గలవాడు, శ్రేష్ఠుడు, మూడు లోకాల్లో ప్రసిద్ధుడైన నిమి చక్రవర్తి ఉండేవాడు. నిమి కొడుకు, మొదటి జనకుడు మిథిలి. మొదటి జనకుడైన మిథిలి మిథిలా నగరాన్ని నిర్మించాడు. అతని కొడుకు ఉదావశుడు. అతనికి నందివర్థనుడు, అతనికి సుకేతువు, సుకేతువుకి రాజర్షి ఐన దేవరాతుడు, దేవరాతుడికి బృహద్రధుడు, అతనికి మహావీరుడు, అతనికి సుధృతి కొడుకులుగా జన్మించారు. సుధృతికి ధృష్టకేతువు, రాజర్షి ఐన ధృష్టకేతువుకి హర్యశ్యుడు కొడుకులు. అతని కొడుకు మరుడు. మరుని కొడుకు ప్రతీంధకుడు. అతని కొడుకు కీర్తిరధుడు. అతనికి దేవమీఢుడు, అతనికి విబుధుడు, విబుధుడికి మహోద్రకుడు పుట్టారు. అతనికి కీర్తిరాతుడు, అతనికి మహారోముడు, రాజర్షి మహారోముడికి స్వర్ణరోముడు, అతనికి రాజర్షి ఐన హ్రస్వరోముడు పుట్టారు. హ్రస్వరోముడికి ఇద్దరు కొడుకులు. వారిలో పెద్దవాడిని నేను. నా తమ్ముడు కుశధ్వజుడు. మా నాన్నగారు రాజ్యభారాన్ని నాకు అప్పగించి వనానికి తపస్సుకి వెళ్లారు. తర్వాత ఆయన పోయారు. నా తమ్ముడ్ని చూసుకుంటూ ధర్మానుసారంగా రాజ్యపాలనని చేస్తున్నాను.
‘కొంతకాలం క్రితం సాంకాశ్యపురం రాజు సుధన్వుడు మిథిలా నగరం మీదకి దండెత్తి వచ్చి, శివధనస్సుని, సీతని తనకి ఇవ్వమని కబురు పంపాడు. శివధనస్సుని, సీతని తనకి ఇవ్వమని కబురు పంపాడు. నేను నిరాకరించి యుద్ధంలో అతన్ని చంపాను. సాంకాశ్యపురానికి నా తమ్ముడ్ని రాజుని చేశాను. వశిష్ట మహామునీ! సీతని రాముడికి, నా రెండో కూతురు ఊర్మిళని లక్ష్మణుడికి ఆనందంగా ఇస్తానని ‘మూడు సార్లు’ చెప్తున్నాను అని జనకుడు చెప్పాడు. (ఓ విషయాన్ని గట్టిగా చెప్పడానికి ఆ కాలంలో మూడుసార్లు చెప్పడం రివాజు). రామలక్ష్మణుల చేత పితృకార్యాన్ని చేయించు. తర్వాత పెళ్లి జరిపించు’
దశరథ విశ్వామిత్రులు జనకుడితో ‘నీ తమ్ముడు కుశధ్వజుడి ఇద్దరు కూతుళ్లని భరత, శతృఘు్నలకి ఇచ్చి పెళ్లి చేయించు’ అని అడిగారు.
‘దశరథ మహారాజా! ఈ రోజు మఖ నక్షత్రం. ఇవాళ్టికి మూడో రోజున ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో పెళ్లి చేద్దాం. రామలక్ష్మణుల చేత గోదానం, సువర్ణ దానం, భూదానం మొదలైన దానాలని చేయించు’ జనకుడు చెప్పాడు.
అది విన్న వశిష్ఠుడు, విశ్వామిత్రుడు జనకుడితో ఇలా చెప్పారు.
‘ఇక్ష్వాకు, విదేహ వంశాలు కొలతకి అందనంత గొప్పవి. ఈ రెండు వంశీయులతో సమానమైన వారు ఎవరూ లేరు. రామలక్ష్మణులకి సీత, ఊర్మిళలని ఇచ్చి పెళ్లి చేయడం రెండు వంశాల గౌరవాలకి తగినది’
ఆ ఇద్దరి మునుల సూచనని జనక మహారాజు సంతోషంగా అంగీకరించాడు.
‘సంతానానికి దేవత, దాత ఐన భృగుడు ఉత్తరా నక్షత్రంలో పెళ్లి శ్రేష్టం కాబట్టి కుశధ్వజుడి కూతుళ్లు మాండవి, శృతకీర్తిలకి కూడా రామలక్ష్మణులతో పాటు భరత శతృఘు్నలకి ఒకే ముహూర్తంలో పెళ్లి చేద్దాం. ముని పుంగవులైన మీ ఇద్దరూ సింహాసనాలని అధిష్టించి మా ముగ్గురి రాజ్యాల మీద అధికారం నిర్వహించండి. దశరథుడికి మిథిల మీద అధికారం ఉంది. అలాగే నాకూ అయోధ్య మీద అధికారం ఉంది. అందువల్ల దశరథుడి రాజ్యం మీద కూడా మీకు అధికారం ఇస్తున్నాను’ జనకుడు చెప్పాడు.
ఆ మాటలకి సంతోషించిన దశరథుడు చెప్పాడు.
‘మిథిలాధిపతులైన మీ ఇద్దరు అన్నదమ్ములు ఎందరో ఋషులని, రాజులని పూజించిన సద్గుణ రాశులు. మేము ఇక విడిదికి వెళ్లి పితృకర్మలని చేస్తాం’
జనక మహారాజు దగ్గర సెలవు తీసుకుని దశరథుడు వశిష్ఠ, విశ్వామిత్రులతో విడిదికి వెళ్లాడు.
శాస్త్ర ప్రకారం శ్రాద్ధం చేసి, మర్నాడు ఉదయం గోదానాన్ని చేశారు. దశరథ మహారాజు ఒక్కో కొడుక్కి కంచు పాత్రలతోపాటు లక్ష చొప్పున బంగారు కొమ్ములు, లేగదూడలు గల నాలుగు లక్షల ఆవులని, ఇతర వస్తువులని బ్రాహ్మణులకి దానం చేశాడు’
(బాలకాండ సర్గ 71, 72)
రామాయణం.. మీరే డిటెక్టివ్ 27
రామలక్ష్మణుల చేత దశరథుడు గోదానం జరిపించిన రోజే భరతుడి మేనమామ, కేకయ రాకుమారుడు యుధాజిత్తు వచ్చాడు. దశరథుడితో ఇలా చెప్పాడు.
‘మా నాన్న నీ కుశలం అడిగారు. నువ్వు అక్కడ కుశలం కోరుకునే వారంతా ఆరోగ్యంగా ఉన్నారు. మా నాన్నకి భరతుడ్ని చూడాలని ఉండటంతో అతన్ని తీసుకెళ్లాలని అయోధ్యకి వెళ్లాను. మీరంతా ఇక్కడికి పెళ్లికి వచ్చారని తెలిసి వెంటనే మిథిలకి భరతుడ్ని చూడటానికి వచ్చాను’
దశరథుడు అతనికి అతిథి మర్యాదలు చేశాడు. మర్నాడు ఉదయం ఋషులు ముందు నడవగా దశరథుడు యజ్ఞ వాటికకి చేరాడు. రాముడు విజయం అనే ముహూర్తంలో తోరణం కట్టడం లాంటి వివాహ క్రతువులని చేసి, తన సోదరులతో వశిష్ఠుడు మొదలైన మునులు ముందు నడవగా తన తండ్రి దగ్గరికి వెళ్లాడు.
తర్వాత వశిష్ఠుడు జనకుడి దగ్గరకి వెళ్లి చెప్పాడు.
‘మహారాజా! దశరథుడి కొడుకులు కౌతుక మంగళం పూర్తి చేసి కన్యాదాత అయిన మీ కోసం ఎదురుచూస్తున్నారు. దాత, ప్రతిగ్రహీత కలిసినప్పుడేగా పెళ్లి జరిగేది. వచ్చి దాన్ని పూర్తి చేయండి’
‘లోపలకి రావచ్చుగా? ఈ రాజ్యం కూడా మీ రాజ్యం లాంటిదే వశిష్ఠ మహర్షీ. అడ్డగించే ద్వారపాలకులు ఉన్నారా? మీరు ఎవరి ఆదేశం కోసం ఎదురుచూస్తున్నారు? మీ స్వంత ఇంట్లో సంకోచం దేనికి? కౌతుక మంగళాలు పూర్తి చేసిన నా కూతుళ్లతోపాటు నేను దశరథ మహారాజు కోసం ఎదురుచూస్తున్నాను. ఆలస్యం చేయకుండా పెళ్లిని జరుపుదాం’
జనకుడి మాటలని విన్న దశరథుడు తన కొడుకులు, ఋషులతో కలిసి లోపలకి వెళ్లాడు.
జనకుడు వశిష్ఠుడ్ని లోకాభి రాముడైన రాముడి పెళ్లిని జరిపించమని కోరాడు. ఆయన విశ్వామిత్ర, శతానందులతో శాస్త్ర ప్రకారం మండపం మధ్య అగ్ని వేదికని నిర్మించి, దాని చుట్టూ గంధం, పూలు, బంగారు పాలికలు, అంకురాలు గల కుండలు, మూకుళ్లు, ధూపపాత్రలు, శంఖాకారపు పాత్రలు, అర్ఘ్యానికి నీళ్ల పాత్రలు, పేలాల పాత్రలు, అక్షింతలు మొదలైనవి సిద్ధం చేశాడు. వేదిక చుట్టూ మంత్రపూర్వకంగా దర్భలని పరిచి, అగ్నిని ఉంచి అందులో హోమం చేశాడు.
వధువు దుస్తుల్లో అలంకరించబడ్డ సీతని జనక మహారాజు తీసుకువచ్చి రాముడి ఎదురుగా కూర్చోపెట్టి ఇలా చెప్తూ మంత్రపూర్వకంగా నీళ్లని వదిలాడు.
‘ఇదిగో. నా కూతురు సీత. ఈమె నీకు భార్య కాగలదు. సీతని స్వీకరించు. నీ చేత్తో ఈమె చేతిని పట్టుకో. ఈమె పతివ్రతగా సదా నీ నీడలా నిన్ను అనుసరించే ఉంటుంది’
వెంటనే దేవదుందుభులు మోగి పుష్ప వర్షం కురిసింది. తర్వాత జనకుడు రామ సోదరులతో ఇలా చెప్పాడు.
‘లక్ష్మణా! రా. నేను ఇచ్చే ఊర్మిళని స్వీకరించు. ఈమె చేతిని నీ చేత్తో తీసుకో. భరతా! మాండవి చేతిని పట్టుకో. శతృఘ్నా! శ్రుతకీర్తి చేతిని పట్టుకో’
నలుగురు రాజకుమారులు ఆ కన్యల చేతులని పట్టుకుని వారిని తమ భార్యలుగా స్వీకరించాక, అగ్నికి, వేదికకి, జనక మహారాజుకి, ఋషులకి ప్రదక్షిణం చేసి యథావిధిగా పెళ్లి చేసుకున్నారు.
రామ, లక్ష్మణ, భరత శతృఘు్నలు, సీత, ఊర్మిళ, మాండవి, శ్రుతకీర్తుల పాణిగ్రహణం చేయగానే ఆకాశం నించి పూలవర్షం కురిసి, స్వర్గంలో దుందుభులు మోగి, మంగళ వాద్య ధ్వనులతో కూడిన పాటలకి అప్సరసలు నృత్యం చేశారు. గంధర్వులు చక్కగా పాడారు.
రామలక్ష్మణ, భరత శతృఘు్నలు మూడుసార్లు అగ్నికి ప్రదక్షిణం చేసి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నూతన నలుగురు వరుళ్లు తమ భార్యలతో విడిదికి వెళ్లారు. వారి వెంట దశరథుడు, తన భార్యలు, బంధువులు, ఋషులతో వారి వెంట వెళ్లారు.
మర్నాడు ఉదయం విశ్వామిత్రుడు రాజకుమారులని ఆశీర్వదించి, జనకుడు, దశరథుల దగ్గర సెలవు తీసుకుని హిమాలయాలకి వెళ్లిపోయాడు. దశరథుడు కూడా అయోధ్యకి బయలుదేరాడు. జనకుడు తన కూతుళ్లకి చాలా ధనాన్ని, లక్షల కొద్దీ ఆవులని, కంబళ్లని, కోట్ల కొద్దీ పట్టువస్త్రాలని, ఏనుగులు, గుర్రాలు, రథాలు, కాలిబంటు గల చతురంగ సైన్యాన్ని, అందమైన దాసీదాసులని అరణంగా ఇచ్చి పంపాడు. ఇంకా వెండి, బంగారం, ముత్యాలు, పగడాలని కన్యాదానంగా ఇచ్చాడు. వారి వెంట కొంత దూరం వెళ్లి దశరథుడ్ని సాగనంపి, జనకుడు తిరిగి మిథిలకి చేరుకున్నాడు.
వారంతా ప్రయాణిస్తూండగా అక్కడక్కడా భయంకరంగా పక్షులు కూయసాగాయి. జంతువులు ప్రదక్షిణంగా వెళ్లాయి.
‘వశిష్ఠ మహర్షీ! పక్షులు ప్రతికూలంగా, మృగాలు అనుకూలంగా ఉన్నాయి. ఇదంతా ఏమిటి? నాకు భయంగా ఉంది’ దశరథుడు ప్రశ్నించాడు.
‘రాజా! అకస్మాత్తుగా ఘోరమైనదేదో దైవవశాత్తూ జరగబోతోందని పక్షులు సూచిస్తున్నాయి. మృగాలు ఆ ఘోరం తొలగుతుందని సూచిస్తున్నాయి. కాబట్టి భయపడకు’ వశిష్ఠుడు ధైర్యం చెప్పాడు.
కొద్దిసేపటికి భూమి కంపించి, చెట్లు పడిపోయేలా గాలి వీచింది. సూర్యకాంతి తగ్గి, అన్ని దిక్కుల్లో వెలుతురు తగ్గింది. దశరథుడి సైన్యాన్ని దుమ్ము కప్పగా, వారంతా మూర్ఛపోయినట్లుగా కనిపించారు. వశిష్ఠుడు, ఇతర మునులు, దశరథుడు, అతని కొడుకులు మాత్రమే స్పృహలో ఉన్నారు.
ఆ చీకట్లో భుజాన గండ్రగొడ్డలితో, విల్లు, బాణాలు , గతంలో క్షత్రియులని చంపిన జటాధారి అయిన పరశురాముడు త్రిపుర సంహారం చేసే శివుడిలా కనిపించాడు. అతన్ని చూసి వశిష్ఠుడు, ఇతర ఋషులు తమలో తాము ఇలా అతని గురించి మాట్లాడుకున్నారు.
‘పూర్వం కార్తవీర్యార్జునుడు తన తండ్రిని చంపడంతో ఇతను క్షత్రియులు అందర్నీ చంపాడు. కోపం తగ్గి శాంతించిన అతను మళ్లీ క్షత్రియ వినాశనాన్ని చేయాలని అనుకోవడం లేదు కదా?’
వారు తనని ప్రేమగా ‘రామా! రామా!’ అని పిలుస్తూ వారు ఇచ్చిన అర్ఘ్యాన్ని, పూజని స్వీకరించిన పరశురాముడు రాముడితో ఇలా చెప్పాడు.
(బాలకాండ సర్గ 73-74)
రామాయణం.. మీరే డిటెక్టివ్ 28
‘రామా! నీ పరాక్రమం అద్భుతమైందని, నువ్వు శివుని విల్లు విరిచేసావని విన్నాను. ఊహించలేని అది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను నా వెంట ఓ మంచి విల్లుని తెచ్చాను. జమదగ్ని నించి నాకు లభించిన ఆ భయంకరమైన వింటిని ఎక్కుపెట్టి, బాణాన్ని పూరించి, నీ బలాన్ని చూపించు. ఆ పని చేస్తే నువ్వు బలమైన వాడివని మెచ్చుకుని నీతో ద్వంద యుద్ధం చేస్తాను’
ఆ మాటలు వినగానే దశరథుడు దిగాలుగా చేతులు జోడించి చెప్పాడు.
‘గొప్ప కీర్తిగల బ్రాహ్మణుడివైన నీకు క్షత్రియుల మీద కోపం పోయింది కదా? బాలురైన నా కుమారులకి అభయం ఇవ్వు. స్వాధ్యాయంలో, వేదాధ్యయనంలో, ఇతర వ్రతాలు చేసే భృగు వంశంలో పుట్టిన నువ్వు శివుడి ముందు శపథం చేసి ఆయుధాన్ని వదిలావు కదా? నువ్వు ధర్మంగా భూమినంతా కాశ్యపుడికి దానం చేసి మహేంద్ర పర్వతంలో ఉంటున్నావు. నువ్వు మా అందరి వినాశనానికి వచ్చావు. రాముడు మరణిస్తే మేమంతా మరణించినట్లే’
పరశురాముడు ఆ మాటలని పట్టించుకోక రాముడితో ఇలా చెప్పాడు.
‘దేవలోకానికి చెందిన విశ్వకర్మ చేత చేయబడ్డ ఈ రెండు ధనస్సులూ గొప్పవి, బలమైనవి. వాటిలో ఓ దాన్ని యుద్ధాన్ని కోరే శివుడికి దేవతలు ఇచ్చారు. త్రిపురాలని నాశనం చేసిన దాన్ని నువ్వు విరిచేసావు. శివధనస్సుతో సమాన బలమైన, ఎదిరించ శక్యం కాని ఈ రెండో విల్లుని దేవతలు విష్ణువుకి ఇచ్చారు. తర్వాత దేవతలు శివ, విష్ణువుల బలాన్ని తెలుసుకోవాలని ఉందని బ్రహ్మని కోరారు. అది తెలియడానికి ఆయన శివ కేశవుల మధ్య విరోధాన్ని కల్పించాడు. దాంతో ఒకరినొకరు జయించాలని శివుడు, విష్ణువు మధ్య గొప్ప యుద్ధం జరిగింది. విష్ణువు చేసిన హూంకారంతో శివుడి విల్లు జడమై పోయి ముక్కంటి కదల్లేకపోయాడు. దేవతలు, ఋషులు, చారణులు అది చూసి ప్రార్థించగా వారిద్దరూ శాంతించారు. విష్ణువే అధికుడని తెలుసుకున్నారు. శివుడు కోపంతో ఆ ధనస్సుని, బాణాలని రాజర్షి దేవరాతుడికి ఇచ్చాడు. రామా! విష్ణువు తన విల్లుని భృగు వంశస్థుడు జమదగ్ని దగ్గర ఉంచమని ఇచ్చాడు. జమదగ్ని దాన్ని మహాత్ముడైన తన కొడుకు, మా నాన్న అయిన రుచీకుడికి ఇచ్చాడు.
మా నాన్న అస్త్ర సన్న్యాసం చేశాక కార్తవీర్యార్జునుడు చెడు బుద్ధితో ఆయన్ని చంపేశాడు. ఈ దారుణం గురించి నాకు తెలీగానే నేను కోపంగా క్షత్రియ జాతికి చెందిన ప్రతీ ఒక్కరిని పుట్టిన వాడిని పుట్టినట్లు అనేకసార్లు చంపేశాను. అలా ఈ భూమినంతా జయించి నేను చేసిన యజ్ఞం చివర్లో మహాత్ముడైన దేవరాతుడికి దానం చేసి తపోబలం గల నేను మహేంద్ర పర్వతం మీద నివసిస్తున్నాను. రామా! గొప్ప పరాక్రమం గల నువ్వు శివ ధనస్సుని విరిచేసావని తెలిసిన వెంటనే ఇక్కడికి వచ్చాను. క్షత్రియ ధర్మాన్ని, మా తాత, నాన్నల ద్వారా నాకు లభించిన ఈ విష్ణు ధనస్సుని తీసుకుని దీన్ని సంధించి నీ శత్రువుల నగరాలని జయించు. నువ్వా పని చేస్తే నీతో నేను యుద్ధం చేస్తాను.
తన పక్కనే ఉన్న తండ్రి మీద గౌరవంతో రాముడు ఎక్కువ మాట్లాడకుండా ఇలా చెప్పాడు.
‘పరశురామా! నీ చరిత్ర విన్నాను. మీ నాన్న విషయంలో రుణం తీర్చుకున్న నిన్ను మెచ్చుకుంటున్నాను. నాకు పరాక్రమం లేదని నువ్వు అవమానిస్తున్నావు కదా? దాన్ని చూడు’
వెంటనే రాముడు పరశురాముడి చేతిలోని విల్లుని, బాణాలని అందుకున్నాడు. దాంతో పరశురాముడి శక్తి మొత్తం రాముడిలో ప్రవేశించింది. వింటిని ఎక్కుపెట్టి, దానికి నారిని కట్టి పరశురాముడితో కోపంగా చెప్పాడు.
‘నువ్వు బ్రాహ్మణుడివి, విశ్వామిత్రుడికి బంధువు, నాకు పూజ్యుడు అవడంవల్ల నీ గమనశక్తిని, లేదా నీ తపస్సుతో జయించిన అనేక ఉత్తమ లోకాలని, ఈ రెంటిలో ఒక దాన్ని కొట్టేస్తాను. స్వర్గంలో పుట్టిన ఈ విష్ణు బాణం వృథా కాకూడదు కాబట్టి ఏది నీకు కావాలో కోరుకో’
ఆ అద్భుతమైన విష్ణు ధనస్సుని చూడటానికి బ్రహ్మ, దేవతలు, ఋషులు, అప్సరసలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు, కిన్నరలు, యక్షులు, రాక్షసులు, నాగులు వచ్చారు.
రాముడు ఆ ధనస్సుని ఎక్కు పెట్టగానే పరశురాముడి నీరసించి పోవడంతో ఆశ్చర్యంగా చెప్పాడు.
‘నేను గతంలో ఈ భూమి మొత్తాన్ని గురువు దేవరాతునికి ఇచ్చాక ఆయన నన్ను తన దేశంలో ఉండద్దని ఆదేశించాడు. ఆ మాట ప్రకారం నేను రాత్రుళ్లు భూమి మీద ఉండను. కాబట్టి నా గమనశక్తిని కొట్టద్దు. నా తపస్సుతో నేను జయించిన అనేక ఉత్తమ లోకాలని ఆలస్యం చేయకుండా కొట్టు. దీన్ని ఎక్కుపెట్టడం వల్ల నువ్వు మధువు అనే రాక్షసుడ్ని చంపిన విష్ణువే అని గ్రహించాను. యుద్ధంలో నిన్ను ఎదిరించగల వారు ఎవరూ లేరు. మూడు లోకాలకి ప్రభువైన నేను నీ చేతిలో అపజయం పొందినందుకు సిగ్గు పడటం లేదు’
రాముడు బాణాన్ని ప్రయోగించాక తన తప్ఫఃలం రాలిపోగా పరశురాముడు రాముడిని స్తుతించి, ప్రదక్షిణం చేసి ఉత్తర దిక్కుకి వెళ్లిపోయాడు. చీకటి తొలగి దిక్కులన్నీ ఎప్పటిలా ప్రకాశించాయి. రాముడిని ఋషులు, దేవతలు కీర్తించారు. తర్వాత రాముడు ఆ వింటిని, బాణాలని వరుణుడికి ఇచ్చి, వశిష్ఠుడు, ఇతర ఋషులకి నమస్కరించి ఆందోళనతో ఉన్న తండ్రితో చెప్పాడు.
‘పరశురాముడు వెళ్లిపోయాడు. ఇక చతురంగం బలంతో అయోధ్యకి వెళ్దాం’
పరశురాముడు వెళ్లిపోయాక దశరథుడు కొడుకులు మళ్లీ పుట్టినట్లుగా ఆనందించాడు. అంతా అయోధ్యకి చేరారు.
పౌరులు రాజమార్గాలని నీళ్లతో తడిపి పూలు చల్లారు. మంగళ వాయిద్యాలని మోగించారు. బ్రాహ్మణులు వారికి ఎదురు వచ్చి స్వాగతం చెప్పారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి, ఇతర రాజస్ర్తిలు కోడళ్లైన సీతా, ఊర్మిళ, మాండవి, శృతకీర్తులని చూసి సంతోషించారు. నూతన వధువులంతా గృహ దేవతలని పూజించి, పెద్దలు అందరికీ నమస్కరించారు. బ్రాహ్మణులకి ఆవులని, ధన ధాన్యాలని దానం చేసి తమ భర్తలతో ఆనందంగా కలిసారు.
పరాక్రమవంతులైన రామ, లక్ష్మణ, భరత శతృఘు్నలు పెళ్లి చేసుకున్నాక తండ్రికి అణకువగా ఉన్నారు. కొద్ది కాలానికి దశరథుడు కైకేయి కొడుకు భరతుడితో చెప్పాడు.
‘కేకయ రాజు కొడుకు, నీ మేనమామ ఐన యుధాజిత్తు నిన్ను పంపమని మిథిలలో నన్ను కోరాడు. నిన్ను తీసుకు వెళ్లడానికి వచ్చాడు. కాబట్టి నువ్వు అతనితో వెళ్లు’
తన తండ్రి, రామలక్ష్మణులు, తల్లుల దగ్గర సెలవు తీసుకుని భరతుడు తన మేనమేమ వెంట వెళ్లాడు.
రామలక్ష్మణులు తండ్రికి సేవ చేస్తూ ప్రజలని చక్కగా పాలించసాగారు. నియమాలని పూర్తిగా పాటిస్తూ అన్ని పనులని పర్యవేక్షించే రాముడ్ని చూసి దశరథుడు, బ్రాహ్మణులు, నాగరికులు అంతా సంతోషించారు. జీవులకి బ్రహ్మదేవుడు ఎలాగో, సుగుణాల రాశి అయిన రాముడు తన పౌరులకి అలా. రాముడి మనసు సీత మీదే లగ్నమైంది. సీత మనసు నిండా రాముడే నిండి ఉన్నాడు. తండ్రి చేత చేయబడ్డ సంబంధం కాబట్టి రాముడికి సీత మీద ప్రేమ కలిగి, సద్గుణాలు గల అందగత్తె కాబట్టి అది ఇంకా పెరిగింది. ఒకరి మీద మరొకరికి గల ప్రేమ రెట్టింపై ఇంకా పెరగసాగింది. అందంలో దేవతా స్ర్తిలా, లక్ష్మిలా ఉన్న మిథిలలో పుట్టిన జనకుడి కూతురు సీతకి రాముడి మీద గల ప్రేమ కొలతకి అందనిది. అలా దశరథ మహారాజు కొడుకు రాముడు, జనకుడి కూతురు సీతతో కలిసి లక్ష్మీదేవితో కూడిన మహా విష్ణువులా ప్రకాశిచాడు.
(బాలకాండ సమాప్తం)
రామాయణం.. మీరే డిటెక్టివ్ 29
ఆపదా మపహర్తారాం దాతారాం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
భావం: మనకు కలిగే అన్ని ఆపదలని చంపేవాడు, మన మనస్సుకి ఆనందం కలిగించేంత అందమైన వాడు అయిన శ్రీరామ చంద్రునికి సదా నేను నమస్కరిస్తున్నాను.
* * *
‘ భరతుడు తన మేనమామ ఇంటికి వెళ్తూ శతృఘ్నుడుని కూడా ప్రేమగా వెంట తీసుకెళ్లాడు. అశ్వ సంపద గల మేనమామ యుధాజిత్తు దగ్గర వారు ఉండసాగారు. మేనమామ గారింట్లో బస చేసిన ఆ సోదరులు ఇద్దరూ తరచూ తమ తండ్రిని గుర్తు తెచ్చుకోసాగారు. దశరథుడు కూడా భరత, శతృఘ్నులని సదా గుర్తు చేసుకునేవాడు. దశరథుడు తన నలుగురు కొడుకుల్నీ తన శరీరం నించి పుట్టిన నాలుగు చేతులుగా సమానంగా ప్రేమించేవాడు. ఐతే తన కొడుకులు అందరిలోకీ ఆయనకి రాముడి మీదే అధిక ప్రేమ ఉండేది. దుష్టుడైన రావణుడ్ని చంపడానికి దేవతలు ప్రార్థించగా భూలోకంలో పుట్టిన విష్ణుమూర్తి కదా ఆ రాముడు!
ఇప్పుడు ఆ రాముడి గుణగణాలు చెప్తాను వినండి.
‘రాముడు అందగాడు. వీరుడు, అసూయ లేనివాడు. తండ్రికి ఉన్న మంచి గుణాలన్నీ గలవాడు. అతనితో సమానమైన ఇంకో కొడుకు భూమి మీద లేనే లేడు. ఎప్పుడూ శాంతంగా ఉండే రాముడు మృదువుగా మాట్లాడేవాడు. ఎవరైనా కోపంగా మాట్లాడినా తిరిగి తను కోపంగా బదులు చెప్పేవాడు కాదు. మంచి మనసు గల రాముడు ఎవరు చిన్న ఉపకారం చేసినా దానికి సంతోషించేవాడు. తనకి చేసిన అపారాలని గుర్తుంచుకునే వాడు కాదు. అస్త్భ్య్రాసం చేసే సమయంలో అవకాశం లభిస్తే రాముడు శీలంలో, జ్ఞానంలో, వయసులో వృద్ధులైన వారి దగ్గరికి, మంచి వాళ్ల దగ్గరికి వెళ్లి మాట్లాడేవాడు. తెలివిగలవాడు, పరాక్రమవంతుడైనా, అందుకు గర్వపడేవాడు కాదు. ఎన్నడూ అబద్ధం ఆడలేదు. అన్నీ తెలిసిన వాడు. బ్రాహ్మణులని, పెద్దలని గౌరవించేవాడు. ప్రజలకి అతని మీద ఎంత ప్రేమ ఉందో అతనికీ ప్రజల మీద అంత ప్రేమా ఉంది. దయగల అతను బాధల్లో ఉన్నవారిని చూసి జాలిపడేవాడు. అన్ని ధర్మాలు తెలిసిన వాడు. తనని సదా అదుపులో ఉంచుకునేవాడు. క్షత్రియ ధర్మాన్ని చక్కగా ఆచరిస్తూ, అందువల్ల స్వర్గం లభిస్తుందని నమ్మేవాడు. ధర్మవిరుద్ధమైన, ప్రయోజనం లేని పనుల మీద ఆసక్తి ఉండేది కాదు. ఆరోగ్యవంతుడు, యువకుడు, మంచి వాక్చాతుర్యంగల పండితుడైన రాముడు, యుక్తుల్లో, సంభాషణల్లో మాటల్లో బృహస్పతి లాంటివాడు అని వాల్మీకి ఉపమానం చెప్పాడు. ఏ సమయంలో, ఏ ప్రదేశంలో ఏయే పనులు చేయాలో తెలిసిన రాముడు అందమైన దేహం కలవాడు. లోకంలోని ఏకైక సత్పురుషుడు. ఇతరుల స్వభావాన్ని ఇట్టే గ్రహించగలిగేవాడు. అలాంటి రాముడ్ని ప్రజలంతా బయట సంచరించే తమ ప్రాణంగా భావించేవారు.
వేదాలు, విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న రాముడు విలువిద్యలో తండ్రిని మించాడు. మంచి వంశంలో పుట్టిన రాముడు సాధు స్వభావుడు. దైన్యం లేనివాడు. ధర్మపరులు, వృద్ధులు అయిన బ్రాహ్మణుల నించి విద్యాబుద్ధులని నేర్చుకున్నాడు. ధర్మార్థ కామాల స్వరూపాలని చక్కగా అర్థం చేసుకున్నాడు. మతిమరుపు లేదు. సమయస్ఫూర్తితో లోక వ్యవహారాలని చక్కబెట్టే రాముడు అణకువ కలవాడు. మనసులోని భావాలని మొహం మీద తెలీనివ్వకుండా రహస్యంగా ఉంచేవాడు. ఇతరులకి సహాయం చేసేవాడు. అతని కోపం, సంతోషం వృథా అయ్యేవి కావు. దానం చేసేవాడు. మొండి పట్టుదల కాని, చపలత్వం కాని లేనివాడు. చెడు మాటలని మాట్లాడేవాడు కాదు. సోమరితనం, ఏమరుపాటు లేనివాడు. ఇతరుల్లోని తప్పులనే కాక తనలోని తప్పులని కూడా గుర్తించగలిగేవాడు. చేసిన మేలు మరిచేవాడు కాదు. మనుషుల మధ్య తేడాని గమనించి న్యాయప్రకారం దుర్మార్గులని నిగ్రహించి, మంచి వాళ్లని అనుగ్రహించేవాడు.
మంచి వాళ్లని చేరదీసేవాడు. ధనాన్ని సంపాదించే మార్గాలు, వాటిని శాస్త్ర ప్రకారం ఖర్చు చేసే విధానం తెలిసిన వాడు. శాస్త్రాల్లో, అనేక విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు. భోగాలకు ధనాన్ని వృధా చేసేవాడు కాదు.
విలువిద్యలో గొప్పవాడుగా అతిరథులు అతన్ని మెచ్చుకునేవారు. సేనని చక్కగా నడిపి శత్రువులపై దండెత్తి వాళ్లని చంపేవాడు. దేవతలు, రాక్షసులు కూడా అతన్ని జయించలేరు. గర్వంలేని రాముడు కాలాన్ని బట్టి మారేవాడు. ఎవర్నీ అవమానించేవాడు కాదు. రాముడు కోపాన్ని జయించిన వాడు.
ఇన్ని మంచి గుణాలు గల రాముడు ప్రజలకి తగిన విధంగా ప్రవర్తిస్తూ మూడు లోకాల్లో పూజ్యుడు అయ్యాడు. ఓర్పులో భూమాతతో, బుద్ధిలో బృహస్పతితో, పరాక్రమంలో ఇంద్రుడితో సమానంగా ఉండేవాడు. ఇవేకాక ఇంకా ఎన్నో మంచి గుణాలు గల రాముడు ప్రజలకి, తండ్రికి ఆనందం కల్గిస్తూ మంచి గుణాలనే కిరణాలతో సూర్యుడిలా ప్రకాశించసాగాడు. అలాంటి రాముడు తనని పాలించాలని భూమాత కోరిక.
తను జీవించి ఉండగానే రాముడ్ని రాజు చేయాలని ఓ రోజు దశరథుడికి ఆలోచన కలిగింది. రాముడు తనకన్నా మంచి గుణాలు కలవాడని, అతను భూమిని పాలిస్తూండగా చూస్తూ మరణించాలనే ఆలోచన కలగడంతో దశరథుడు మంత్రులతో ఆలోచించి రాముడ్ని యువరాజుగా చేయాలని నిశ్చయించాడు. ఆకాశంలో, భూమి మీద కలిగే ఉత్పాతాలు ఘోరమైనదేదో జరగబోతోందని సూచిస్తున్నాయని, కాబట్టి, రాముడికి పట్ట్భాషేకం చేస్తే తనకు ఇక విచారం ఉండదని వారితో చెప్పాడు. ఇతర రాజులని, నగర, గ్రామ ప్రముఖ పౌరులని వేరువేరుగా పిలిపించాడు. కాని ఆ తొందరలో భరతుడి తాతైన కేకయ రాజుని, వియ్యంకుడైన జనక మహారాజుని దశరథుడు పిలిపించలేదు. వారు తర్వాత తెలుసుకుంటారని అనుకున్నాడు. దశరథుడి నించి తగిన సత్కారాలు అందుకుని, వారంతా ఆయనతో సమావేశం అయ్యారు. ’ (అయోధ్యకాండ సర్గ 1లోని ఆఖరి 50వ శ్లోకం)
రామాయణం.. మీరే డిటెక్టివ్ 30
దశరథుడు సభలో గంభీరమైన స్వరంతో ఇలా చెప్పాడు.
‘ఉత్తమ రాజులైన ఇక్ష్వాకు వంశీయులు, మా పూర్వీకులు ప్రజలని తమ బిడ్డలుగా పాలించిన సంగతి మీకు తెలుసు. నేను కూడా వారి మార్గానే్న అనుసరించి మిమ్మల్ని జాగ్రత్తగా రక్షిస్తున్నాను. రాజ్యభారం చాలా బరువైంది. పరాక్రమం, ధైర్యాలతో ఆ భారాన్ని భరించాలి. ఇంద్రియ నిగ్రహం లేనివారు దీన్ని మోయలేరు. మోసి మోసి నేను అలసిపోయాను. ఎన్నో ఏళ్ల ఆయుష్షు గల నా దేహం ప్రజలు హితం కోసం రాజ్యం చేస్తూనే, తెల్లటి గొడుగు కిందే ముసలిదై పోయింది. అందువల్ల దీనికి విశ్రాంతిని ఇద్దామని అనుకుంటున్నాను. వశిష్ఠుడు, ఇతర ఉత్తమ బ్రాహ్మణుల అంగీకారంతో ప్రజా పాలనకి నా కొడుకుని నియమించి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను. నా పెద్ద కొడుకు రాముడు పరాక్రమంలో ఇంద్రుడితో సమానం. శత్రువులని జయించడంలో, మిగిలిన అన్ని గుణాల్లో నన్ను పోలి ఉన్నాడు. ధర్మసంరక్షణలో పుష్యమీ నక్షత్రంతో కూడిన చంద్రుడిలా ప్రకాశించే రాముడికి సంతోషంగా పట్ట్భాషేకం చేస్తాను. రాముడు మూడు లోకాలకి కూడా మంచి రాజు అవుతాడు. నేను ఇది బాగా ఆలోచించే చెప్తున్నాను. ఇది మంచిదని మీకు కూడా తోచి అనుమతిస్తే, అది నేను ఎలా చేయాలో చెప్పండి. ఇది కాక ఇంకో మంచి మార్గం ఉంటే సూచించండి. ఎందుకంటే పక్షపాతం లేని మధ్యస్తులది ఎక్కువ అభ్యుదయం గల ఆలోచన అవుతుంది.’
వెంటనే సభలోని అంతా ‘బావుంది, బావుంది’ అని చెప్పారు. బ్రాహ్మణులు, రాజులు, నగర, గ్రామ వాసులు కలిసి ఆలోచించి ఏకాభిప్రాయానికి వచ్చాక దశరథుడితో ఇలా చెప్పారు.
‘మహారాజా! నువ్వు ఎన్నో వేల సంవత్సరాల వయసు గల వృద్ధుడివి. అందువల్ల రాముడికి పట్ట్భాషేకం చెయ్యి. రాముడు పట్ట్భాషిక్తుడు అయ్యాక ఏనుగు అంబారీ మీద తెల్లటి గొడుగు కింద వెళ్తూంటే చూడాలని మేమంతా కోరుకుంటున్నాం.’
‘రాముడు రాజవ్వాలి అనే నా కోరికకి ఎదురుచెప్పలేక ఇలా చెప్పారా?’ అనే అనుమానం నాకు కలుగుతోంది. కాబట్టి నిజంగా మీ అభిప్రాయాన్ని చెప్పండి. నేను ధర్మంగా పాలిస్తున్నప్పుడు రాముడు రాజు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు?’ దశరథుడు వారిని ప్రశ్నించాడు.
‘రాజా! రాముడిలో అంతులేని మంచి గుణాలు ఉన్నాయి. దేవతలతో సమానుడు, బుద్ధిమంతుడు అయిన నీ కొడుకు గుణాలన్నీ అందరికీ ఇష్టమైనవి. వాటిని చెప్తాను. విను. దివ్య గుణాలు కలవాడు. దేవేంద్రుడితో సమాన పరాక్రమం గల, సత్యం, ధర్మం పాటించే రాముడు ఇక్ష్వాకు రాజుల్లో అందరికంటే గొప్ప సత్పురుషుడు. లక్ష్మిని ధర్మానికి దూరం కాకుండా చేయగలడు. (అధర్మం ఉన్నచోట లక్ష్మి ఉండదు) ప్రజలకి ఆనందం కలిగించడంలో చంద్రుడితో, క్షమలో భూమితో, బుద్ధిలో బృహస్పతితో, పరాక్రమంలో దేవేంద్రుడితో సమానుడు. అన్ని ధర్మాలు తెలిసిన ఓర్పుగల ఉత్తమ శీలవంతుడు. దుఃఖించే వారిని ఓదారుస్తాడు. మృదువైన వాడు. కృతజ్ఞత, ఇంద్రియ నిగ్రహం కలవాడు. వివిధ శాస్త్రాలు తెలిసిన బ్రాహ్మణులని పూజిస్తాడు. దేవతలకి, రాక్షసులకి, మానవులకి తెలిసిన అన్ని అస్త్రాల్లో ప్రావీణ్యం కలవాడు. విద్యావంతుడు. వేదాన్ని, సంగీతాన్ని చక్కగా అధ్యయనం చేశాడు. రాముడి బంధువర్గంలోని వాంరతా ఉత్తములు. రాముడు లక్ష్మణుడితో కలిసి యుద్ధానికి వెళ్లినప్పుడు జయంతోనే తిరిగి వస్తాడు. యుద్ధం నించి తిరిగి వచ్చాక రథమో, ఏనుగో ఎక్కి పౌరుల దగ్గరకి వెళ్లి తండ్రి కొడుకుని అడిగినట్లో లేదా తన బంధువులని అడిగినట్లో అందర్నీ కుశల ప్రశ్నలు వేస్తాడు. ‘సేవకులు (ప్రభుత్వాధికారులు) తమ పనులని శ్రద్ధగా చేస్తూ మీకు సేవ చేస్తున్నారా?’ అని అడుగుతాడు. ఎవరికైనా ఆపద కలిగితే విచారిస్తాడు. ఎవరికి అభివృద్ధి కలిగినా తన కొడుక్కి కలిగిన అభివృద్ధిని చూసి తండ్రి సంతోషించినట్లుగా సంతోషిస్తాడు. రాముడు అన్ని విధాలా ధర్మాన్ని రక్షిస్తాడు. పోట్లాటలు పెంచే మాటలు మాట్లాడడు. తనని ఆశ్రయించిన వారికి మేలు చేస్తాడు. యుక్తిగా మాట్లాడటంలో బృహస్పతి లాంటి వాడు. ప్రజలని పాలించడంలో మెలకువలు తెలిసినవాడు. భోగంతో చెడు మార్గం పట్టనివాడు. రాముడు మూడు లోకాలని పాలించే సమర్థత కలవాడు. ఇక భూలోకం సంగతి చెప్పాలా? రాముడికి కోపం కాని, ఆగ్రహం కాని వస్తే అవి నిష్ఫలం కావు. నియమం ప్రకారం చంపాల్సిన వారిని చంపి తీరుతాడు. రాముడు ఎవరి విషయంలో సంతోషిస్తాడో వారికి సకల ఐశ్వర్యాలు ఇస్తాడు. దశరథ మహారాజా! నీ పూర్వ పుణ్యం వల్ల రాముడు నీ కొడుకుగా లోకశ్రేయస్సు కోసం పుట్టాడు. ప్రజా పతుల్లో ఒకరైన మరీచికి కొడుకైన, కాశ్యపుడికి ఉన్నట్లుగా కొడుక్కి ఉండాల్సిన అన్ని మంచి గుణాలు రాముడికి ఉండటం నీ భాగ్యం. దేవతలు, అసురులు, మనుషులు, గంధర్వులు, ఉరగుల్లో ఖ్యాతి గల రాముడికి ఆయురారోగ్యాలు, బలం కలగాలని దేశ ప్రజలు, రాజధానిలో నివసించేవారు ఆశిస్తున్నారు. వృద్ధ మహిళలు, యువతులు కూడా రాముడి అభివృద్ధి కోసం ఉదయం, సాయంత్రాలు సకల దేవతలని పూజిస్తున్నారు. నీ అనుగ్రహంతో ప్రజల కోరిక తీరుతుంది. ‘ఇందీవర శ్యాముడు’ శతృ సంహారకుడు శతృసంహారకుడు ఐన రాముడి పట్ట్భాషేకాన్ని మేమంతా చూస్తాం. ప్రజల కోరికలని తీర్చే నువ్వు మా హితం కోసం, అన్ని లోకాలకి మంచి చేసే ఆసక్తి గల, ‘విష్ణువుతో సమానమైన’ ఉత్తమ గుణ సంపన్నుడైన నీ కొడుకు రాముడికి సంతోషంగా పట్ట్భాషేకం చేయి’ వారు చెప్పారు. (అయోధ్యకాండ సర్గ 2)
రామాయణం.. మీరే డిటెక్టివ్-31
http://andhrabhoomi.net/content/others-1294
No comments:
Post a Comment