Sunday, 22 July 2018

మారీచుడు






మారీచుడు

లోకంలో ఎవరూ పుట్టుకతోనే మంచి వారు కాదు. అలాగని చెడ్డవారూ కాదు. పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న పరిస్థితులూ, ప్రలోభాలూ, పరతంత్య్రం ఆలోచనా రాహిత్యం లాంటివెన్నో కలిసి మనిషి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. మనిషి తప్పులు చేయడం సహజం, కానీ చేసిన తప్పులను తెలుసుకొని సరిదిద్దుకునే అవకాశం లేకపోతే తప్పిదాలను పునరావృతం కాకుండా చూసుకోగలగాలి. అయితే ప్రతీసారీ తానే తప్పులకు ఆస్కారమిస్తాడనుకుంటే పొరపాటు. కొన్నికొన్ని సార్లు చేసేది తప్పని తెలిసినా తప్పని పరిస్థితుల్లో ఆదేశానుసారంగా బానిసత్వపు ధిక్కారంలో తప్పులు చేయాల్సి రావచ్చు. కానీ చేసే ఆ తప్పే తన జీవితానికి ముగింపని నిశ్చయించుకొని తృప్తిగా తప్పు చేసేంత గుండె నిబ్బరం ఎవరికుంటుంది? ఒక్క మారీచునికి తప్ప. రామబాణంతో తగిలిన మొదటిదెబ్బ జీవితంలో మొదటిసారి బాధంటే ఏంటో తెలియపరిచిందనీ, ర అన్న శబ్దం వింటేనే తనలో కలిగిన భయాందోళనలు వర్ణించనలవి కావనీ రాక్షసుడైన మారీచుడు రామగానం చేస్తూనే ఉంటాడు. రావణుని ఆదేశం పాటించినా లోక కళ్యాణం కోసం తప్పిదాలను తన ఖాతాలో వేసుకోవడానికి వెనుకాడని మారీచుని చరితం అత్యద్భుతం.

మనిషైనా, రాక్షసుడైనా, చెడైనా, మంచైనా మనం చేసే పనుల వల్ల మనకు నష్టం జరిగినా పర్లేదు. కానీ సమాజానికి చేటు కాకూడదనే మారీచుని ఆదర్శం ఆలోచనీయం.

రామకథలో రామచంద్రుని పదహారేళ్ళ ప్రాయంలోనే కలిసిన రావణుని మంత్ర, యజ్ఞాలను ధ్వంసం చేసే కర్కశుడు, తాటక సునంతుల కొడుకు, సుబాహు సోదరుడు మారీచుడు అంటేనే క్రూరత్వానికి పరాకాష్ఠ. ఆతని భీభత్సాలకు అంతులేదు. యజ్ఞ విధ్వంసమే అతని లక్ష్యం. మహర్షుల సంఘపీడనమే అతనికి ఆట. మారీచుని పేరు చెబితేనే పిచ్చుకలు నీటిని కూడా ముట్టవట. మారీచుడనే మాట వింటే చాలు అరణ్యప్రాంతమంతా కకావికలం అయిపోతుందట. కానీ అంతటి మారీచునిలో కూడా రామబాణం మార్పు తీసుకు రాగలిగింది.

విశ్వామిత్రుని యాగ సంరక్షణ కోసం చిరుప్రాయంలోనే అడవులకు వచ్చిన రామచంద్రుడు మారీచ సుబాహుల నుంచి విశ్వామిత్రుని యజ్ఞాన్ని కాపాడేందుకు అహర్నిశలూ శ్రమిస్తుండగా దాడిచేసిన మారీచునిపై మానవాస్త్రం ప్రయోగిస్తే కనిపించనంత దూరంలో ఎగిరిపడ్డాడు. అతి కష్టం మీద చాలా కాలానికి అదుపులోకి తెచ్చుకున్నాడు తన శరీరాన్ని మారీచుడు. రామబాణం ధాటికి బుద్ధికి మేల్కొలుపు పలికాడు మారీచుడు. తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు.

శూర్పణఖ మాటలతో ఆవేశం పూనుకొని రావణుడు తపస్సు చేసుకుంటూ బతుకుతున్న మారీచుని చేరాడు. వెండి చుక్కలున్న బంగారు లేడిలా మారి సీతారామ లక్ష్మణులను మాయ చేయమని మారీచుని ఆదేశించాడు రావణుడు. 


మారీచునికి చాలా విద్యలు తెలుసు. మంచి మాయావి. కానీ రావణుని మాటలు విన్న మారీచునికి నోట మాట రాలేదు. ఎందుకంటే రామపరాక్రమం బాగా ఎరిగిన వాడు కాబట్టి. 

అయినా ధైర్యం చేసి రావణునితో "ప్రభూ! మీరు రాజులు. మేము బంట్రోతులం. మీరు చెప్పినట్టు మేం చేసి తీరాల్సిందే గానీ, మీ మంచి కోరి నేను చెప్పే మాటలు వినండని" అంటాడు మారీచుడు.

రావణునితో మారీచుడు మాట్లాడిన మాటలు చాలా గొప్పగా ఉంటాయి. "రాజనేవాడు స్వంత పట్టుదలకూ, మూర్ఖత్వానికీ పోయి యావత్ రాజ్యాన్నీ భ్రష్టు పట్టించడం ఏ మాత్రం మంచిది కాదనీ, రాముడంటే మామూలు రాజు కాదనీ, ఆయన ధర్మపత్ని నీ వినాశనానికే జనించిందనీ, రామ అన్న మాటే కాదు రతో మొదలయ్యే ఏ పదం విన్నా నన్ను నేను తమాయించుకోలేకపోతున్నాననీ పరస్త్రీ వ్యామోహంలో పడి బంగారు లంకను బుగ్గిపాలు చేసి ఎందరో జీవితాలను నాశనం చేయవద్దనీ, ధర్మం తెలిసిన నీవు ధర్మం చెప్పమనీ" ఎన్నో విధాలుగా రావణునికి చెప్పి చూస్తాడు మారీచుడు.

మారీచుడు రావణుడు చెప్పినట్టు చేస్తే రాముని చేతిలో చావు తప్పదు. చేయకపోతే రావణుని చేతిలో చావు. రెండింటిలో చెడ్డపని చేసినప్పటికీ మంచి వాడి చేతిలోనే చావు మంచిదని మారీచుడు నిశ్చయించుకున్నాడు. అందమైన బంగారు జింకలా మారి సీతను మాయ చేసి రామలక్ష్మణులను దృష్టి మరల్చి సీతను రావణుడు ఎత్తుకెళ్ళేందుకు ముఖ్యహేతువైనాడు. కానీ రావణునితో సహా యావత్ రాక్షస వినాశనానికి శ్రీకారం చుట్టాడు. బంటులా విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తూనే రాముని చేతిలో చావుకు సిద్ధమై అదొక సుకృతంలా భావించిన మారీచుని నిర్ణయం అయిష్టంలోంచి వచ్చిన అదృష్టంగా పరిణమించింది. మనిషైనా, రాక్షసుడైనా, చెడైనా, మంచైనా మనం చేసే పనుల వల్ల మనకు నష్టం జరిగినా పర్లేదు. కానీ సమాజానికి చేటు కాకూడదనే మారీచుని ఆదర్శం ఆలోచనీయం.

ఇట్టేడు అర్కనందనా దేవి



No comments:

Post a Comment