తొమ్మిదీ వాకిళ్ల దొడ్డి లోపలను ఆరుగురు శత్రులు మిత్రులైదుగురు అంతటా ముగ్గురు మూర్ఖులున్నారు తెలివి తెలిపేవాడు దేవుడున్నాడు జో అచ్యుతానంద జోజో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా!
అంతటా ముగ్గురు మూర్ఖులున్నారు. అందులో ఒక మూర్ఖుడైన తమోగుణంలో ఉండే నిద్ర, ఆలస్యం, బద్ధకం వీటి నుంచి బయటపడగలిగితే హింసాత్మకమైన ఆలోచనలు ఉండవు. తమోగుణాన్ని వదిలేసినట్టే లెక్క! ఆ గుణాన్ని జయించినట్టే లెక్క! మిగతా ఇద్దరు మూర్ఖులు రజోగుణం, సత్వగుణం. దానిపైది, అంతేస్థాయిలో ఉండేది రజోగుణం. రజోగుణం అంటే చురుకుదనం. తమోగుణం ఉన్నవాడు బద్ధకస్తుడు అయి ఉంటాడు. వానికన్నా రజోగుణం ఉన్నవాడు చాలా నయం. చురుకుదనమన్నా ఉంటుంది. ఒక రోజు కాకపోయినా ఒక రోజన్నా బాగుపడతాడు. ‘ఇలా కాదు అలా చేస్తే బాగుపడతావు’ అని చెప్పొచ్చు. అందుకే తమోగుణం కంటే రజోగుణం గొప్పది. కానీ దాని ప్రమాదాలు దానికున్నాయి. చురుకుదనం చురుక్కుమని అటూ అంటుంది.. ఇటూ అంటుంది. పోటీలు పడటం, రాజకీయాలు, వ్యాపారాల్లోనూ.. అన్నింటా చురుగ్గా ఉంటారు.
ఈ గుణం కంటే మంచిది సత్వగుణం. అంటే శాంతం! మంచిగా ఉంటారు. పుస్తకాలు చదువుతారు. అవసరం లేని దాంట్లో వేలు పెట్టరు. గుళ్లు, గోపురాలు దర్శిస్తారు. ఈ సత్వగుణంతో వచ్చే ఇబ్బంది ఏమిటంటే ‘నేను మంచి వాణ్ణి, నేను ధర్మాత్ముణ్ణి’ అనే అహంకారం వచ్చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. గుళ్లు, గోపురాలు నిర్మించడం, చెరువులు తవ్వించడం, రోడ్లు వేయించడం.. ఇలాంటి పనులు సాత్విక అహంకారంగా మారకుండా చూసుకోవాలి. మరోటి ఏమిటంటే అహంకారంగా మారకపోయినా చాదస్తంగా మారుతుంది.
పూజలు, పునస్కారాలు, తీర్థయాత్రలు మంచివే. కానీ అవి చేయకపోయినా నష్టం ఏమీలేదు. వాటివల్ల జ్ఞానాన్ని గ్రహించాలి గానీ, ‘ఇవ్వాళ ఈ నైవేద్యం పెట్టలేకపోయాను’ అని..., ‘ఈ రోజు మంగళవారం ఆంజనేయస్వామి గుడికి వెళ్లాల్సి ఉండేది... కానీ వెళ్లలేకపోయాం మనసంతా అదోలా ఉంది’ అని అన్నారంటే సత్వగుణం ఛాదస్తంగా మారింది అని అర్థం. దాన్ని వెంటనే వదిలించుకోవాలి.
తమోగుణంతో ఎలా వ్యవహరించాలి? రజోగుణంతో ఎలా వ్యవహరించాలి? సత్వగుణంతో ఎలా వ్యవహరించాలి? అప్పుడు మనిషి త్రిగుణాతీతుడుగా ఎలా ఎదుగుతాడో తెలుస్తుంది. ఆంజనేయస్వామి అలా ఎదిగాడు.
ఆయన సముద్రం దాటుతున్నప్పుడు మూడు ఆటంకాలు వచ్చాయి. ఒకటి మైనాకుడు, రెండు సురస. మూడు సింహిక. మైనాకుడు మర్యాద కోసం ఆగమన్నాడు. సత్వగుణం కలవాడు కాబట్టి అతనితో సాత్వికంగా వ్యవహరించాడు. మైనాకుడు ఆగమని కోరితే ‘నేను ముఖ్యమైన పని మీద వెళుతున్నాను. ఎక్కువ సమయం ఆగలేను. నేను నిన్ను ముట్టుకుంటే ఆగినట్టుగానే భావించు. నువ్విచ్చిన పండ్లు తీసుకున్నట్టుగానే భావించు’ అని సాత్వికంగా జవాబిచ్చాడు ఆంజనేయుడు. అందుచేత సత్వగుణాన్ని సత్వగుణంతోనే పోగొట్టుకోవాలి.
తరువాత రాజసమైన ఆటంకం వచ్చింది. సురస రెండు అడుగులు నోరు తెరిస్తే, ఆంజనేయుడు నాలుగు అడుగులు దేహం పెంచాడు. సురస పది అడుగులు నోరు తెరిస్తే, ఇరవై అడుగులు దేహం పెంచాడు. చివరకు ‘నీతో నాకు పోటీ ఎందుకు? నువ్వు దాక్షాయనీ దేవివి. అమ్మ వారి స్వరూపం. నువ్వు రాక్షసివి కావు’ అని పది అడుగులు తెరిచి ఉన్న నోట్లోకి సూక్ష్మరూపంలోకి మారి దూరిపోయి, చెవి రంధ్రంలో నుంచి బయటకు వచ్చి నమస్కరించాడు ఆంజనేయుడు. ‘నువ్వు పెట్టిన షరతు ప్రకారం నాలో ప్రవేశించకుండా ఎవ్వరూ వెళ్లలేరు అన్నావు. నీ మాట నేను నిలబెట్టాను. నిన్ను అవమానించడం నా పని కాదు, నేను పని మీద వెళుతున్నాను. అనవసరంగా గొడవవద్దు’ అన్నాడు. రజోగుణంలో ఇది చాలా ముఖ్యం.
మూడోది సింహిక. ఆంజనేయుడు ఎగరకుండా కిందకు పట్టి లాగేస్తోంది. నేరుగా యుద్ధానికే దిగింది. దాంతో పిడికిలితో ఒక్క గుద్దు గుద్ది ప్రాణాలు తీశాడు. తమోగుణాన్ని అలానే ఛేదించాలి.
ఆంజనేయుడు సత్వగుణాన్ని సాత్వికంగా ఎదిరించాడు. రాజస ఆటంకాన్ని రజోగుణంతో ఎదుర్కొన్నాడు. తమోగుణాన్ని ఒక గుద్దు గుద్ది పారేశాడు.
-డా. గరికపాటి నరసింహారావు
No comments:
Post a Comment