Tuesday, 13 March 2018

నియమానికి కట్టుబడి...




నియమానికి కట్టుబడి

ఒకరోజు ఇంద్రప్రస్థములో ఉన్న ద్రౌపది, పాండవుల వద్దకు నారదుడు వచ్చి సంసార జీవితంలో వారు పాటించవలసిన నీతి నియమాలను వివరిస్తూ ఇలా అన్నాడు.

‘‘ఓ పాండవులారా! విమలబుద్ధితో వినండి. ద్రౌపది మీ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కో ఏడాది ఉంటుంది. ఆ కమలాక్షి ఉన్న ఇంటి యజమానికి తెలియకుండా మీరెవరైనా ఆమె అంతఃపురానికి వెళితే ప్రాయశ్చిత్తముగా ఒక ఏడాది కఠిన వ్రతనియమాలు పాటించి తీర్థయాత్రలు చేయాలి.’’ అన్నాడు.

నారదుడు చెప్పిన ఆ సమయ నియమాన్ని శిరసావహిద్దామని పాండవులు నిర్ణయించుకున్నారు.

ఇలా ఉండగా ఒకరోజు ఒక బ్రాహ్మణుడు దొంగలు తన హోమ ధేనువును తీసుకెళ్లారని, తనను రక్షించమని వేడుకున్నాడు. ఆ విప్రుని అర్తనాదం విన్న అర్జునుడు దుఃఖమునకు కారణమడిగి ఏమి జరిగిందో తెలుసుకున్నాడు. అర్జునుడి ధనుస్సు ధర్మరాజు ఆయుధశాలలో ఉన్నది. అప్పుడు ద్రౌపదీదేవి ధర్మరాజు అంతఃపురంలో ఉన్నది. ఆ అంతఃపురంలో ప్రవేశిస్తే నారదుడు విధించిన నియమానికి భంగం కలుగుతుందని తెలిసినా ప్రాయశ్చిత్తమునకు జంకకుండా ఆర్తి రక్షకై ఆయుధాగారంలోకి ప్రవేశించి తన ధనుస్సు తీసుకుని దొంగలను వెంబడించి, పట్టుకున్నాడు. వారిని శిక్షించి విప్రుని హోమధేనువును తిరిగి అతనికి ఇచ్చాడు.

తరువాత సత్యవంతుడైన అర్జునుడు ధర్మరాజు వద్దకు వెళ్లి జరిగింది చెప్పి తీర్థయాత్రలు చేసి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం కల్పించమని కోరతాడు.

అప్పుడు ధర్మరాజు ‘‘సోదరా! దుష్టులను శిక్షించి నువ్వు ధర్మమే చేశావు. దుష్టులను ఉపేక్షిస్తే మహాపాపం. కాబట్టి నియమ భంగమైనదని నీవు విచారపడనక్కర్లేదు. ధర్మరక్షణకై చేశావు కాబట్టి నీవు తీర్థయాత్రలకు వెళ్లడం ఎందుకు?’’ అని అంటాడు.

అప్పుడు అర్జునుడు ‘‘అన్నయ్యా! ప్రజారక్షణ అనే వంకతో నేను ఇచ్చిన మాట తప్పడం మంచిది కాదు కదా! నా పాపం పోయే విధంగా నాకు తీర్థయాత్రలు చేసే అవకాశమివ్వండి.’’ అంటూ వేడుకున్నాడు.

తమ్ముని సత్యవాక్‌ పరిపాలను సంతోషించిన ధర్మరాజు తీర్థయాత్రలకు అనుమతినిస్తాడు. అర్జునుడు రాజభోగాలన్నీ తృణప్రాయంగా వదిలి సకల తీర్థాలు సేవించి పావనుడైనాడు.

No comments:

Post a Comment