ఉగాది పండగ వచ్చిందీ...
ఉగాది నాడే బ్రహ్మ సృష్టిని ఆరంభించాడట. సకల చరాచర జీవరాశికీ మూల కారకుడైన బ్రహ్మ ఈ మహత్కార్యాన్ని ఆరంభించిన రోజుని అత్యంత వైభవోపేతంగా జరపాలన్న కాంక్షతోనే సరికొత్త అందాలను మోసుకొచ్చే వసంత మాసపు తొలి రోజునే ఉగాదిగా ఎంచుకున్నాడు. అందుకే ఆ పండగకు సర్వాంగ సుందరంగా ముస్తాబయిన ప్రకృతే వేదిక. మామిడి చిగురు తిన్న మత్తకోయిలల గానాలూ, సాయం సంధ్యల్లో మరు మల్లెల పరిమళాలూ, గిలిగింతలు పెట్టే వాసంత సమీరాలూ, వెండి వెన్నెలను కురిపించే చందమామ అందాలూ... అన్నీ ఈ పండగకు ప్రత్యేకతలే. అందమైన రేపటికి సంకేతాలే.
‘‘ఎవరదీ... నువ్వేనా ఉగాదీ!
కొమ్మల్లో కోయిల కూస్తుంటే
మా పెరటి రెమ్మల్లో మల్లియ పూస్తుంటే
ఈ మధుమాసోదయ వేళ
ఉగాదీ నిన్ను పోల్చుకున్నానులే’’
అంటాడు ఓ కవి చమత్కారంగా... నిజమే ఉగాది ఆగమనం అంత అందంగానే ఉంటుంది. పండగంటే మనింటిని తోరణాలతో ముస్తాబు చేయటమే మనకు తెలుసు ఈ పండగకు మాత్రం అనంత ప్రకృతీ సన్నద్ధమైపోతుంది. అందమైన వసంతానికి స్వాగతం పలుకుతుంది.
అందుకే గీతలో శ్రీకృష్ణుడు ‘మాసానాం మార్గశీర్షోహం... ఋతూనాం కుసుమాకరః’ అంటాడు. అంటే మాసాల్లో మార్గశిరమూ, రుతువుల్లో వసంత రుతువూ తానేనని అర్థం. అంతటి మహత్యం ఉంది వసంత రుతువుకి. ప్రపంచంలో అత్యధికంగా పూలు వసంతంలోనే పూస్తాయట. ఎర్రటి ఎండాకాలంలో సుకుమారమైన మల్లెపూలు పూయడం, చుక్కనీరు లేని చోట రసాలు నిండిన మధుర ఫలాలు గుత్తులుగా విరగకాయడం ఈ మాసానికే సొంతమైన ప్రకృతి వింతలు. అలాంటి వింతలే కృష్ణుణ్ని సైతం కట్టిపడేశాయి. వసంతం అనే పదానికి ఏడాది అనే అర్థమూ ఉంది. ఒక్క తెలుగువారే కాదు చాంద్రమానాన్ని పాటించే తెలుగు, కన్నడ, మహారాష్ట్ర ప్రజలూ చైత్ర శుక్ల పాడ్యమిని నూతన సంవత్సరానికి తొలి దినంగా పరిగణిస్తారు. కృతయుగంలో కార్తీకశుద్ధ అష్టమినాడు ఉగాది జరుపుకునేవారట. త్రేతాయుగంలో వైశాఖశుద్ధ తదియ రోజు సంవత్సరాది పండగ వచ్చేది. దాన్నే మనం ఇప్పుడు అక్షయ తృతీయగా జరుపుకుంటున్నాం. ద్వాపరయుగం మొదలైంది మాఘ బహుళ అమావాస్య నాడు. అయితే అన్ని యుగాల ఆరంభమూ వసంత మాసంలోనే జరిగిందని చెబుతారు. ఆయా యుగాల్లో వసంతం ఆయా మాసాల్లో వచ్చేదట. మోడువారిన చెట్లు చిగురిస్తూ పచ్చని ప్రకృతి మనిషిని పరవశానికి గురిచేసే కాలం, ఏ యుగంలోనైనా కొత్త ఉగాదికి నాంది పలికేదిగానే ఉంటుంది మరి!
‘వసంతి సుఖం యథా తథా అస్మిన్నితి’ అంటారు. అంటే వసంతకాలంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని అర్థం. నిజానికి సాధారణ పండగల్లా ఉగాది ఏ దేవతకో సంబంధించిన పండగ కాదు. కాలాన్ని ఆరాధించే పండగ. నిరంతరమూ, నిత్యనూతనమూ అయిన కాలాన్ని కొలుచుకుని అనంత కాలగమనంలో మనమెక్కడ ఉన్నామో తెలుసుకుని మరొక్కసారి దేవుడు ఇచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా మరల్చుకునే ప్రయత్నానికి నాంది పలికే పండగ.
ఉగాది పుట్టిందిలా...
ఉగాదిని తొలుత యుగాదిగా పిలిచేవారు. యుగస్య ఆదిః అని అర్థం. అంటే ఉత్తర దక్షిణ ఆయనాలు రెండూ కలిసిఉండే సంవత్సరానికి చైత్రశుద్ధ పాడ్యమే ఆది కనుక ఆ రోజును యుగాది అంటారు. యుగాది అంటే బ్రహ్మసృష్టిని ప్రారంభించిన రోజని అర్థం. కాలక్రమేణా అది ఉగాదిగా మారింది. బ్రహ్మ ఇప్పుడు ద్వితీయ పరార్ధంలో అంటే రెండో సగం జీవిత కాలంలో ఉన్నాడు. అందుకే ఏదైనా కార్యం చేయాలనుకున్నప్పుడు సంకల్పంలో కాలాన్ని ప్రస్తావిస్తూ ఆయన్ని గౌరవిస్తాం. అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే, అష్టావింశిన్ మహాయుగే, కలియుగే ప్రథమపాదే... అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన విళంబి నామ సంవత్సరే చైత్ర మాసే, వసంత రుతౌ, శుక్లపక్షే, పాడ్యమ్యాం తిథౌ, భానువాసరే శుభ నక్షత్రే శుభయోగ శుభ కరణే... అని చెబుతాం. అంటే ఏ కార్యాన్ని మొదలు పెట్టాలనుకున్నా మనం సృష్టికర్త అయిన బ్రహ్మ మొదలు జరిగిన కాలాన్నంతా చెబుతూ మనం ఏడోదైన వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగమైన కలియుగంలో విళంబి నామ సంవత్సరంలో ఉన్నామంటూ వర్తమాన సమయం దాకా చెబుతాం. గడచిన అనంత కాలం మొదలు ఈ ఏడాది ఈ రోజు దాకా కాలాన్ని నిమిషాలతో సహా లెక్కగట్టి నిత్య పూజా విధానాల్లో, శుభాశుభ కార్యాల్లో తప్పనిసరిగా మననం చేసుకునే ఉత్కృష్టత మన జీవన శైలిలో భాగం. అదీ మన సంప్రదాయంలో కాలానికున్న ప్రాధాన్యత. ఉగాది అచ్చంగా ఆ కాలానికి ప్రతిరూపమైన పండగే. కృష్ణపరమాత్మ కురుక్షేత్ర సమయంలో విశ్వరూపధారణ చేసినప్పుడు ‘నేను కాలాన్ని... ఈ వ్యవస్థను విధ్వంసం చేస్తాను’ అని అంటాడు. అంటే ఇక్కడ కాలం విష్ణుస్వరూపమే. కానీ ఆ కాలస్వరూపుడు చెప్పిన విధ్వంసం వెనుక ఒక రహస్యం దాగి ఉంది. ఆ విధ్వంసం ఒక కొత్తసృష్టికీ, సరికొత్త వ్యవస్థ రూపకల్పనకూ పునాది అవుతుంది. ఏవైనా గడిచిన విషయాల గురించి చెప్పేటప్పుడు కాలగర్భంలో కలిసిపోవడం అనే పదాన్ని మనం అందుకే వాడతాం. పాతదాన్నంతటినీ తనలోకి లాక్కొనే కాలం నిరంతరం మనకు కొత్త సమయాన్నీ, కొత్త ఆశల్నీ అవకాశాల్నీ ఇస్తూనే ఉంటుంది.
ఇలా జరుపుకోవాలి...
ఏడాది తొలిరోజు ఎలా గడుస్తుందో అలాగే ఏడాదంతా గడుస్తుందని ప్రజల విశ్వాసం. అందుకే ఆ రోజుని సకల శుభప్రదంగా జరుపుకునేందుకు అంతా సన్నద్ధమవుతారు. ఆ పండగ రోజుని ఎలా జరుపుకోవాలి అనే దానికి శాస్త్రం ఒక క్రమ పద్ధతిని సూచించింది. ప్రాతఃకాలంలోనే లేచి పెద్దవాళ్లతో తలకు నువ్వుల నూనె పెట్టించుకుని వాళ్ల ఆశీర్వాదం తీసుకుని అభ్యంగన స్నానం చేయాలి. తలమీద నీళ్లు కుమ్మరించుకుంటూ
గంగేచ యమునేచైవ కృష్ణా గోదావరి సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు
అనే శ్లోకాన్ని జపించాలి. తైలాభ్యంగనం వల్ల ఆకలి, దప్పిక, మలిన నిర్మూలనాలు జరుగుతాయనీ, మహాలక్ష్మీ కృప లభించి దరిద్రం తొలగిపోతుందనీ చెబుతారు. ఆ రోజు కొత్త బట్టలు కట్టుకోవాలి. నూతన వస్త్రంలో సకల దేవతలూ నివాసముంటారని శాస్త్రం చెబుతోంది. కొత్త బట్టలు కట్టుకుని కుటుంబ సభ్యులూ, ఇష్టమైన వారి సాంగత్యంలో గడిపితే లలితా, లక్ష్మీ కటాక్షాలు లభిస్తాయట. దిష్టి పోయేందుకు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టాలి. తర్వాత ఇష్టదేవతను ప్రార్థించి పరగడుపున ఉగాది పచ్చడిని స్వీకరించాలి. షడ్రుచుల సమ్మేళనమైన ఈ పచ్చడి గొప్ప ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందన్నది పురాణోక్తి. సర్వశుభప్రదమైన పంచాంగ శ్రవణాన్ని ఉగాది నాడు తప్పక వినాలి. అందులోనూ ఉత్తర ముఖంగా కూర్చుని పంచాంగశ్రవణం చేయడం వల్ల విశేషపుణ్య ఫలితాలు కలుగుతాయట.
పంచాంగ శ్రవణం...
శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్న దోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం
ఆయుర్వ్యిద్ధిద ముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం
నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్
పంచాంగం సిరిసంపదలను ప్రసాదిస్తుంది. దుస్స్వప్నాలను హరించడంతో పాటు గంగానదీ స్నాన ఫలితాన్నిస్తుంది. గోదానం చేసిన భాగ్యాన్నీ, ఆయురారోగ్యాలనూ, విద్యాబుద్ధులనూ, సత్సంతానాన్నీ ప్రసాదిస్తూ సకల విజయాలనూ సిద్ధింపజేస్తుంది. అందుకే పంచాగ శ్రవణం తప్పక చేయాలని చెబుతాయి శాస్త్ర గ్రంథాలు. ఉగాదినాడు చేసే పనుల్లో ఇదో ముఖ్య ఘట్టం. పంచాంగ శ్రవణ సమయంలో ఎన్నోసార్లు గ్రహాల పేర్లను పలుకుతారు. అందువల్ల ఆయా గ్రహాలు సంతోషిస్తాయి. ఫలితంగా పంచాగ శ్రవణం చేసిన వాళ్లకీ, విన్నవాళ్లకీ సూర్యుడివల్ల తేజస్సు, చంద్రుడివల్ల వైభవం, కుజుడి వల్ల సర్వమంగళం, బుధుడి వల్ల బుద్ధి వికాసం, గురుడి వల్ల జ్ఞానం, శుక్రుడి వల్ల సుఖం, శని వల్ల దుఃఖరాహిత్యం, రాహువు వల్ల ప్రాబల్యం, కేతువు వల్ల ప్రాధాన్యం కలుగుతాయని జ్యోతిషవాక్కు. పంచాంగ ప్రస్తావన వేదాలు మొదలు ఎన్నో శాస్త్ర గ్రంథాల్లో కనిపిస్తుంది. మన పంచాంగానికి మూలమైన కాల సిద్ధాంతాలున్న గ్రంథాన్ని క్రీ.శ.505లో వరాహమిహిరుడు ప్రతిపాదించాడు. మొత్తం 18 సిద్ధాంతాలుండగా అందులో ముఖ్యమైనవంటూ అయిదింటిని తన గ్రంథంలో ప్రస్తావించాడు. ఆ జ్యోతిష గ్రంథాన్ని ఉగాది నాడే ప్రజలకు అంకితం చేశాడట. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న పంచాంగాలను అందులోని పూర్వగణిత, దృగ్గణిత సిద్ధాంతాల ఆధారంగా రూపొందిస్తున్నారు.
బ్రహ్మ మంత్రివర్గం
ఏడాదికి తొలిరోజుగా ఉగాదిని ప్రతిపాదించిన బ్రహ్మ ఆ సంవత్సరాన్ని ఎవరు పరిపాలించాలీ, ఏయే శాఖలకు ఎవరెవరు మంత్రులుగా ఆధిపత్యం చెలాయించాలీ అనే వ్యవహారాన్ని నవగ్రహాలకు అప్పగించాడు. దాని ప్రకారమే ఆయా శాఖల అధిపతుల స్వభావాన్ని బట్టి ఆ ఏడాది వారు ఆధిపత్యం వహించే అంశం ఎలా ఉంటుంది అనేది నిర్ణయమౌతుంది. ఈ ఏడాది ఎంత వర్షం కురుస్తుందీ, ఏయే పంటలు బాగా పండుతాయీ, ధరలెలా ఉండబోతున్నాయీలాంటి అంశాలన్నీ ఈ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటాయి. ఈ మంత్రివర్గంలో మొత్తం
నవనాయకులుంటారు. వాళ్లను ఎలా నిర్ణయిస్తారంటే...
1. చాంద్రమానాన్ని అనుసరించి ఏ వారం ఉగాది వచ్చిందో ఆ వారాధిపతి ఆ సంవత్సరానికి రాజు
2. సౌరమాన సంవత్సరం ప్రారంభమైన రోజు ఏ వారం వస్తే ఆ వారాధిపతి మంత్రి
3. సూర్యుడు సింహరాశిలో ప్రవేశించే సమయంలో ఉన్న వారాధిపతి ఆ సంవత్సరానికి సేనా నాయకుడు
4. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించేటప్పుడు వారానికి అధిపతి సస్యాధిపతి
5. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించే సమయంలో ఉన్న వారానికి అధిపతి ఆ సంవత్సరానికి ధాన్యాధిపతి
6. సూర్యుడు మిథున రాశిలో ప్రవేశించేనాటి వారాధిపతి అర్ఘాధిపతి (ధరలకు వాణిజ్యానికీ అధిపతి)
7. సూర్యుడు ఆరుద్రా నక్షత్రంలో ప్రవేశించేనాటి వారానికి అధిపతి మేఘాధిపతి
8. సూర్యుడు తులారాశిలో ప్రవేశించే రోజుకి వారాధిపతి రసాధిపతి
9. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజున ఉన్న వారాధిపతి నీరసాధిపతి
పంచాంగ శ్రవణం మహా పుణ్యదాయకమైన విషయమే అయినా ఇందులో జీవన వికాస పాఠం కూడా నిగూఢంగా దాగి ఉంటుంది. ఏడాది తొలిరోజే ఆదాయ వ్యయాలూ, అవమాన రాజపూజ్యాలూ తెలుసుకోవడం ద్వారా మనిషి రాబోయే కష్టసుఖాలన్నింటికీ మానసికంగా సన్నద్ధమవుతాడు.
ఏ కొత్త బాధ్యతో మీద పడితే ‘ఆ రోజు చెప్పిన భారం ఇదేనన్నమాట’ అని సరిపెట్టుకుంటాడు. ఏ అనుకోని ఆపదో ఎదురైతే ‘గ్రహగతి మారుతుందని ముందే తెలిసిందేగా’ అని సర్దుకుంటాడు. చివరికి అనని మాటలు అన్నారన్నా, లేనిపోని వ్యవహారాల్లో ఇరుక్కున్నా ‘నీలాపనిందలు ఊహించినవేగా’ అని ఊరుకుంటాడు.
ఏ ఉన్నతాధికారో నలుగురి ముందూ అక్షింతలేస్తే ‘అవమానాలు అధికమని అనుకున్నదేగా’ అని మిన్నకుండిపోతాడు. సుఖసంతోషాలుంటాయి అన్న పంచాంగ వాక్యానికి పొంగిపోయి ‘ఈ ఏడాది నాకు ఇవీ ఉన్నాయన్నమాట’ అని నిండు మనసుతో ముందుకెళతాడు. మనిషి ధైర్యంతో కొత్త ఆశలతో ముందడుగు వేయడానికి ఏడాది తొలినాడు ఈ మాత్రం ఉత్సాహం చాలు. నిజానికి షడ్రుచులతో పంచే ఉగాది పచ్చడి ఆంతర్యమూ అదే. నాకు బెల్లమ్ముక్కలే కావాలంటే కుదరదు, అరటి పండొక్కటే తింటానంటే వీలు పడదు. వేప చేదునూ, మామిడి వగరునూ రుచి చూడాల్సిందే. చింతపండు పుల్లదనాన్నీ, మిరియాల ఘాటునీ అనుభవించాల్సిందే. అప్పుడే జయాపజయాల్నీ, లాభనష్టాల్నీ సమదృష్టితో చూసే మనోధైర్యం ఏర్పడేది. జీవితంలో ఎదురయ్యే ఎత్తుపల్లాల్నీ, ఊహించని మలుపుల్నీ సులువుగా దాట గలిగే సత్తా వచ్చేది. ఉగాది పండగ నుంచి మనం నేర్చుకోవాల్సిందీ, ఆ రోజు నుంచి స్ఫూర్తి పొందాల్సిందీ ఈ కోణంలోనే.
ఎన్నేళ్లంటే...
బ్రహ్మ సృష్టి ఆరంభమై ఇప్పటికి 195 కోట్ల 58 లక్షల 85 వేల 118 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు వచ్చిన విళంబి నామ సంవత్సరం 119వది. కలియుగం ప్రారంభమై ఈ ఉగాదికి 5119 సంవత్సరాలు. శ్రీమహావిష్ణువు మత్య్సావతారంలో సోమకాసురుణ్ణి సంహరించి, వేదాలను కాపాడి బ్రహ్మదేవుడికి అప్పగించింది ఉగాది నాడేనట. కలియుగం ప్రారంభమైందీ, శ్రీరామ పట్టాభిషేకం జరిగిందీ, కురుక్షేత్రం తర్వాత ధర్మరాజు పీఠాన్నెక్కిందీ, వెయ్యేళ్లపాటు పాలన సాగించిన విక్రమార్కుడు సింహాసనాన్ని అధిష్ఠించిందీ, శాలివాహనుడు కిరీట ధారణ చేసిందీ ఈ పర్వదినానే. అందుకే ఉగాదినాడు పనులు మొదలు పెడితే అందులో తిరుగుండదనేది చాలా మంది నమ్మకం. ఈ కారణంగానే కొన్ని చోట్ల రైతులు కొత్త నాగళ్లకు పూజ చేసి, లాంఛనంగా వ్యవసాయ పనుల్నీ ప్రారంభిస్తారు. ఉగాది రోజు ఇంటి ముందో, వీధిలోనో చలివేంద్రాన్ని స్థాపిస్తే గొప్ప పుణ్యఫలం లభిస్తుంది. శుభ్రమైన చోట అలికి ముగ్గుపెట్టి కొత్త కుండల్లో నీరు నింపాలి. గణపతినీ ఇష్టదేవతలనూ ధ్యానించి కొబ్బరికాయ కొట్టి చలివేంద్రాన్ని ప్రారంభించాలి. ఈ రోజు చల్లటి మజ్జిగనో లేక పానకాన్నో అతిథులకూ బాటసారులకూ ఇచ్చినా పుణ్యమని పురాణవాక్కు. ఈ రోజు కొందరు పితృదేవతల్ని గుర్తు చేసుకుంటూ తర్పణాలూ వదులుతారు.
పంచ అంగాలు...
పంచాంగం అంటే అయిదు విభాగాలు అని అర్థం. అవి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. తిథులు పదిహేనూ, వారాలు ఏడూ, అశ్వని మొదలు రేవతి వరకూ 27 నక్షత్రాలూ, విష్కంభం మొదలు వైధృతి వరకూ 27 యోగాలూ, బవ మొదలు కింస్తుఘ్నం వరకూ 11 కరణాలన్నింటిని గురించి తెలియజేసేదే పంచాంగం. ముహూర్తబలం కోసం ఈ అయిదింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. ప్రాచీన భారతీయుల ఖగోళ విజ్ఞానమే నేటి పంచాంగానికి పునాది అన్నది చరిత్రకారుల విశ్లేషణ. మనకి తెలిసిన ఖగోళ శాస్త్రం ఆధారంగా ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయో లెక్కవేసి, వాటి ప్రకారం ఫలితాలను అంచనా వేయడమే పంచాంగం. తిథి విషయంలో జాగ్రత్తపడితే సంపద, వారం వల్ల ఆయుష్షు, నక్షత్రం వల్ల పాప పరిహారం, యోగం వల్ల ఆరోగ్యం, కరణం వల్ల విజయం ప్రాప్తిస్తాయని అంటారు.
- లక్ష్మీహరిత ఇంద్రగంటి
సహకారం: డా.శంకరమంచి రామకృష్ణ శాస్త్రి
షడ్రుచుల సారం... జీవనవేదం..!
పచ్చని వనాలూ పూల హరివిల్లులూ వేపపూత గుబాళింపులూ మావిచిగురు అందాలూ కోయిలమ్మ కుహుకుహురాగాలూ మరుమల్లెల పరిమళాలతో విరిసిన మధుమాసంలో అందంగా అరుదెంచింది విళంబి నామ ఉగాది...షడ్రుచుల సంవత్సరాది..!
చెట్లు చిగురిస్తాయి...ఆశల పల్లకీలో ఊరేగిస్తూ. పచ్చదనం పల్లవిస్తుంది... నేత్రానందాన్ని అందిస్తూ. మరుమల్లెలు విచ్చుకుంటాయి... మన్మథబాణాలు వేస్తూ. గండుకోయిలలు గళం విప్పుతాయి... వీనులవిందు చేస్తూ... ఇలా ఎటుచూసినా అందంగా కనువిందు చేస్తుంటుంది వసంతరుతువు. అది మొదలయ్యే రోజే ఉగాది... చైత్ర శుద్ధ పాడ్యమి. ఆయుర్వేద శాస్త్రరీత్యా ఇది రుతువులు మారే సమయం... కఫ ప్రకోపకాలం. కాబట్టి కఫాన్ని నియంత్రణలో పెట్టడానికి తిక్త(చేదు), కషాయ(వగరు) రస ప్రధానమైన ఆహారం అవసరం అని చెబుతారు. వీటికి మరికొన్ని రుచులు జోడించి చేసేదే ఉగాది పచ్చడి. వాత, కఫ, పిత్త దోషాలను హరించే అద్భుత ఔషధం.
‘త్వామష్ఠ శోక నరాభీష్ట, మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం మామశోకం సదాకురు’
అనే శ్లోకాన్ని పఠిస్తూ ఉగాది పచ్చడిని తినాలని చెబుతోంది శాస్త్రం. దీన్నే నింబ కుసుమ భక్షణం, అశోక కళికాప్రాశనం అనీ అంటారు. అయితే సంవత్సరానికి ఒకసారి తింటే ఏడాది పొడవునా జబ్బులు రావా అన్న సందేహం సహజం. ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకూ వచ్చే రాత్రులను వసంత నవరాత్రులు అంటారు. ఈ తొమ్మిది రోజులపాటు పరగడుపునే ఉప్పు, కారం, వగరు, చేదు, పులుపు, తీపి అనే ఆరు రుచులు కలగలిసిన ఉప్పు, పచ్చిమిర్చి, మామిడికాయ, వేపపువ్వు, చింతపండు, బెల్లం కలిపి చేసిన ఈ పచ్చడిని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నాయి శాస్త్రాలు. పూర్వం చైత్ర శుక్ల పాడ్యమి నుంచి పౌర్ణమి వరకూ దీన్ని సేవించేవారు. ఒకప్పుడు మామిడిపిందెలకు బదులు మామిడి చిగుళ్లూ అశోక చిగుళ్లూ దంచి కలిపేవారట. కాలక్రమంలో చిగుళ్లకు బదులు మామిడి పిందెలు, లేత మామిడికాయలను వేస్తున్నారు. నిజానికి పూర్వం లేత వేపచిగుళ్లు, ఇంగువ, బెల్లం, సైంధవ లవణం, చింతపండు, తాటిబెల్లం, వాము, జీలకర్ర, పసుపు వేసి మెత్తగా నూరి పరగడుపున తినేవారని కొన్ని శాస్త్రాలు చెబుతుంటే; చింతపండుగుజ్జులో వేపపువ్వు, బెల్లం, నెయ్యి వేసి పరగడుపునే తీసుకునేవారని మరికొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. దీనివల్ల ఆయుష్షు పెరిగి వజ్ర సమాన దేహం సిద్ధిస్తుందట. కానీ కాలానుగుణంగా ఆరు రుతువుల్లోనూ ఏర్పడే త్రిగుణాత్మక కష్టసుఖాలను అనుభవించడానికి సంసిద్ధంగా ఉన్నాం అన్నదానికి సూచనగా ఆరు రుచులనూ కలిపి సేవించడం మొదలైంది. ఏ కాలానికి ఏది వచ్చినా స్వీకరిస్తాం అని శపథం చేయడానికి సంకేతమే ఈ పచ్చడి సేవనం. అందుకే ప్రస్తుతం అంతా వేకువనే లేచి అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి, ఇంటిని మామిడాకుల తోరణాలతో అలంకరించి, ఇష్టదేవతారాధన చేశాక ఉగాది పచ్చడిని తింటున్నారు.
శాస్త్రం ఇంకేమంటోంది?
‘జిహ్వాగ్రే వర్తతే సర్వమ్ (నాలుక చివరనే అంతా ఉంది)’ అని నీతిశాస్త్రం చెబుతోంది. నాలుక కొన్ని రుచులు ఇష్టపడి అనారోగ్యాన్ని కొనితెస్తుంది. అలా కాకుండా అన్ని రుచులనూ సమానంగా భరించడం తన కర్తవ్యంగా నాలుక గుర్తించాలని ఈ పండుగ చెబుతోంది. నాలుకను నడిపించేది మనస్సు. కాబట్టి దానికి ఇదో హెచ్చరిక. అన్ని ప్రాణులూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఆరు గుణాలు కలిగి ఉంటాయి.
వాటిల్లో ఏ ఒక్కటి హద్దుమీరినా దుర్గుణంగా మారి శత్రువు అవుతుంది. వీటినే అరిషడ్వర్గాలు అంటారు. వాటిని జయించగలగడమే మానవ జన్మ ప్రత్యేకత. ఉగాది పచ్చడి ఇచ్చే సందేశం అదే. తీపి కామానికీ, కారం క్రోధానికీ, ఉప్పు మోహానికీ, పులుపు లోభానికీ, చేదు మదానికీ, వగరు మాత్సర్యానికీ సంకేతాలు. మనం తినే పదార్థాలు ఏవైనా ఈ ఆరు రుచుల్లోకే వస్తాయి. ఏదో ఒక రుచి లేకుండా తినలేం. అన్ని రుచులనీ కలిపి తింటే మనం గెలిచినట్లు. ఏదో ఒక రుచిని మెచ్చుకుంటూ తింటే ఓడినట్టు. అందుకే అన్నింటినీ గెలుస్తాం అన్న దానికోసమే కొత్త ఏడాదిలో పరగడుపునే ఉగాది పచ్చడిని రుచి చూస్తారు. అటు జీవనసారాన్నీ బోధిస్తూ ఇటు ఆరోగ్యాన్నీ చాటే ఆ ఆరు రుచులేమిటంటే...
ఆరూ... ఆరోగ్యదాయకాలు!
చేదు: వేపపూత చేదుగా ఉంటుంది. నోటికి రుచించదు. జీవితంలో బాధ కలిగించే సంఘటనలన్నీ చేదుగానే ఉంటాయి. వాటిని సైతం తట్టుకుని మింగాలని చెప్పేదే ఈ వేపపూత. ఆరోగ్యపరంగా చూస్తే వేపపువ్వులోని చేదు కడుపులోని క్రిముల్ని నాశనం చేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. మంటను తగ్గించి, రక్తశుద్ధికి తోడ్పడుతుంది. చర్మవ్యాధుల్ని రానివ్వదు. కంటిచూపుని మెరుగుపరుస్తుంది. పైత్యాన్ని పోగొడుతుంది. కుష్ఠువ్యాధిని రానివ్వదు. నాలుకకు రుచి జ్ఞానాన్ని కలిగిస్తుంది. వాతాన్ని హరిస్తుంది. దీన్ని నూనెతోగానీ నెయ్యితోగానీ వేయించి, ఉప్పూ కారం కలిపి అన్నంతో తింటే సర్వరోగనివారిణిలా పనిచేస్తుందట.
తీపి: బెల్లం మధురంగా ఉంటుంది. ప్రతిమనిషి జీవితంలోనూ మధురానుభూతులు కొన్నే ఉంటాయి. ఎందుకంటే నిత్యం అవే అనుభవంలోకి వస్తే దుఃఖాన్ని తట్టుకునే శక్తి ఉండదు. తియ్యగా ఉంది కదాని అతిగా తింటే, ఆ తీపి కూడా చేదెక్కుతుంది. ఆరోగ్యం పాడవుతుంది. బెల్లంలోని తీపి ఆ విషయాన్నే స్పష్టం చేస్తుంది. దీన్ని మితంగా తీసుకుంటే మనసుని ఆహ్లాదపరుస్తుంది. అందులో శరీరానికి కావాల్సిన విటమిన్లూ ఖనిజాలూ లభిస్తాయి. దగ్గు, అజీర్తి, అలర్జీ, మలబద్ధకాల్ని నివారిస్తుంది. శరీరకాంతికీ శిరోజాల పెరుగుదలకీ తోడ్పడుతుంది. కంఠస్వరం మెరుగవుతుంది. బరువును పెంచుతుంది. ఉదర వ్యాధుల్నీ వాతాన్నీ పోగొడుతుంది.
ఉప్పదనం: ఉప్పు లేని పప్పు రుచించదు. అంటే రుచికి కారణం ఉప్పే. దీన్ని ఉత్సాహానికి ప్రతీకగా చెబుతారు. అయితే ఇది సరైన పాళ్లలోనే ఉండాలి. అప్పుడే జీవితంలోనూ విజయం వరిస్తుంది. ఆరోగ్యపరంగానూ ఉప్పు ఎక్కువయినా తక్కువయినా ముప్పు తప్పదు. కాబట్టి సమానంగా తీసుకుంటే ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్స్‌ను సమతౌల్యం చేస్తుంది. చెమటపట్టేలా చేస్తుంది. జీర్ణక్రియా వేగాన్ని పెంచుతుంది. శరీరంలోని కొవ్వునూ కంతులనూ కరిగిస్తుంది. జడత్వాన్ని పోగొడుతుంది.
పులుపు: చింతపండులోని పులుపు నేర్పునకు సంకేతం. నేర్పు లేకుండా జీవితంలో నెగ్గుకురాలేం. అందుకే పచ్చడిలో కాస్త పులుపూ పడాల్సిందే. ఆరోగ్యపరంగా ఇది ఉష్ణాన్ని తగ్గిస్తుంది. వాత, పైత్య, శ్లేష్మ రోగాల్ని హరిస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. గుండెకి బలాన్ని కలిగిస్తుంది. జీర్ణశక్తిని పెంచడంతోబాటు విరోచనకారిగానూ పనిచేస్తుంది.
కారం: కారం/పచ్చిమిర్చి/మిరియాల్లోని కారం రుచిగానే ఉంటుంది. కానీ దాన్ని తినేటప్పుడు పుట్టే మంటను తట్టుకోవాలి. అంటే జీవనగమనంలో ఎదురయ్యే సంఘటనలకు సహనం ఉండాలి అని చెబుతుంది. అప్పుడే వాటి ఫలితాన్ని రుచి చూడగలం. ఆరోగ్యానికొస్తే ఇది ఆకలిని పెంచుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. కొవ్వుని కరిగించి చర్మ, కంఠ రోగాలను పోగొడుతుంది. వాపులను తగ్గిస్తుంది.
వగరు: మామిడిపిందెలు వగరుగా ఉంటాయి. ఇవి సవాళ్లకు సంకేతం. వాటిని స్వీకరించేందుకు సదా సిద్ధంగా ఉండాలన్నదే వీటి సారాంశం. ఆరోగ్యపరంగా మామిడిపిందెలు శరీరంలోని మలినాలను తొలగిస్తాయి. ముఖ్యంగా పొట్టలో పేరుకున్న వాయువులను పోగొడతాయి. పెద్ద పేగుకి బలాన్ని చేకూర్చడంతోబాటు, శరీరాన్ని చల్లబరిచి, వడదెబ్బను పోగొడతాయి.
ఎలా చేస్తారు?
కొత్త కుండలో లేదా గిన్నెలో చిక్కటి చింతపండు రసంలో బెల్లం, మామిడి పిందెల్ని దంచిన మిశ్రమం లేదా మామిడిముక్కలు కలపాలి. దీనికి వేపపువ్వు, ఉప్పు, మిరియాలపొడి లేదా పచ్చిమిర్చి లేదా కారం వేసి కలుపుతారు. కొన్ని ప్రాంతాల్లో అరటిపండు, పుట్నాలపప్పు, చెరకుముక్కలు, తేనె కూడా జోడిస్తారు. ఇటీవల తమ అభిరుచులకు అనుగుణంగా ద్రాక్షపండ్లూ, దానిమ్మగింజలూ, ఖర్బూజ, పుచ్చ... ఇలా రకరకాల పండ్లనూ జోడించి చేస్తున్నారు.
ప్రాంతాన్నీ అభిరుచినీ బట్టి ఎవరు ఎలా చేసుకున్నా జీవితంలోని భిన్న భావోద్వేగాలకు ప్రతీకే షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి.
ఎన్నో ఉగాదులున్నాయ్!
మనం చైత్రశుద్ధపాడ్యమిని ఉగాదిగా భావించినట్టు.. ఒక్కో రాష్ట్రానిదీ ఒక్కో సంప్రదాయం. సూర్యమానం, చాంద్రమానం, వాటిల్లోనూ పలు సంప్రదాయాల వల్ల ఈ సంవత్సరాదిని జరుపుకునే కాలాల్లోనూ ఎన్నో వైవిధ్యాలున్నాయి. ఓ రకంగా జనవరి నుంచి డిసెంబర్‌దాకా ఏడాదిలో ఏదో ఒక రాష్ట్రం తమ సంప్రదాయ ఉగాదిని పాటిస్తూనే ఉంటాయని చెప్పొచ్చు. ఆ విభిన్న ఉగాదుల సమాచార సమాహారం ఇది..
గుడీపడ్వా మహారాష్ట్రలో జరుపుకునే ఉగాది ఇది. వాళ్లూ మనలాగే చైత్రశుద్ధ పాడ్యమినాడు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. పాడ్యమినే మరాఠీలో పడ్వా అంటారు. ఇక ‘గుడీ’ అంటే ధ్వజం. వెదురుపుల్లకు పట్టువస్త్రం చుట్టి, పూలతో అలంకరిస్తారు. పైన వెండి లేదా కంచు పాత్ర బోర్లిస్తారు. ఈ జెండాలాంటి ఆకారాన్ని బ్రహ్మధ్వజానికి ప్రతీకలా భావించి కొలుస్తారు. మన తెలుగువాళ్లలాగే బ్రహ్మ ఈ ఉగాది రోజే సృష్టి ఆరంభించాడని వాళ్లూ నమ్మతారు కాబట్టే ఈ పూజ! మరాఠీలూ షడ్రుచులతో ఉగాది పచ్చడి చేస్తారు. కాకపోతే దానికి వాము అదనంగా చేరుస్తారు. మనలాగే ఉగాదినాడు పండితుల పంచాంగ పఠనం కూడా వింటారు! |
విశూ మలయాళీల సంవత్సరాది ఇది. సౌరమానం ప్రకారం లెక్కగడతారు కాబట్టి.. సూర్యుడు మేషంలో ప్రవేశించే తొలి రోజుని సంవత్సరాదిగా భావిస్తారు. ఈ తొలి నెలని వాళ్లు మేడం(మేషం) అనే పిలుస్తారు. ఏటా ఏప్రిల్ 14న వస్తుందీ వేడుక. పండగకి ముందు సాయంత్రం కుటుంబంలోని అందరికన్నా పెద్ద వయస్కురాలు ఓ పళ్లెంలో పచ్చిబియ్యం, కొత్తబట్టలు, బంగారు-పసుపు రంగుతేలిన దోసకాయలూ, అరటిపళ్లూ, తమలపాకులూ, అద్దం తీసుకుంటుంది. ఆ పళ్లాన్ని ఉరళి అంటారు. విశూ రోజు ఆమే ముందుగా లేచి ఉరళిని తీసుకెళ్లి నిద్రపోతున్నవాళ్లని మేల్కొలుపుతుంది. నిద్రలేచినవాళ్లు ఈ పాత్రనే మొదట చూడాలన్నమాట! ఇలా చూడటాన్నే ‘విశూ కని’ అంటారు. మలయాళంలో కని అంటే చూడటమని. ఇలా చేయడం వల్ల సర్వశుభాలు కలుగుతాయని వాళ్ల నమ్మకం. |
బైశాఖి ఇది సౌరమానం ప్రకారం వస్తుంది. వాళ్ల తొలి నెల వైశాఖం. దీన్నే బైశాఖీ అని పిలుస్తారు. పంజాబీలు ఈ సంవత్సరాదిని.. మన సంక్రాంతిలా చేస్తారు. పంట చేతికొచ్చే సమయంలో కోలాహలంగా నిర్వహిస్తారు. పొలాల్లోనే ఆటాపాటలుంటాయి. కొత్తగా పండిన గోధుమలను పిండి పట్టించి, ఆ పిండితో రొట్టెలు చేసి బెల్లం, నెయ్యి కలిపి ఆరగిస్తారు. సాయంత్రాల్లో పంట కొట్టిన తుప్పతో పెద్ద మంటలు వేసి, వాటి చుట్టూ స్త్రీ, పురుషులు భాంగ్రా, గిద్దా నృత్యాలు చేస్తారు. |
బెస్తు వర్ష్ గుజరాతీలు మనలాకాకుండా కార్తికశుద్ధ పాడ్యమిరోజుని సంవత్సరాదిగా భావిస్తారు. అంటే.. దీపావళి మరుసటి రోజన్నమాట. దీన్ని బెస్తు వర్ష్ అంటారు. భాగవతంలో శ్రీకృష్ణుడు గోవర్థనగిరిని పైకెత్తే పర్వం గుర్తుందా? ఆ గోవర్థననానికున్న మరోపేరే అన్నకూట్. అప్పుడే పండిన ధాన్యాలతో ఆహారం, తీపి పదార్థాలు ఓ పళ్లెంలో దేవుని ముందు కొండలా పెట్టి గొంతెత్తి పాడి దాన్ని ప్రసాదంలో తీసుకోవడమే ఈ పర్వదినాన ప్రధాన క్రతువు. |
ఏ ఏడాదిలో ఏముంది..?
కొత్త చిగుళ్లూ, కోయిల పాటలూ, షడ్రుచులతో స్వాగతం చెప్పే తెలుగువారి నూతన సంవత్సరం. ఇంతకీ తెలుగు సంవత్సరాలకు ఆ పేర్లు ఎందుకొచ్చాయో... వాటి అర్థమేంటో తెలుసా...
మనకు అరవై పేర్లతో అరవై తెలుగు సంవత్సరాలు ఉంటాయి. అయితే, ఈ పేర్లు రావడానికి వెనుక ఓ కథ ఉంది. ఓసారి నారద మహాముని విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి ఓ రాజును పెళ్లాడతాడు. వారికి అరవైమంది పుత్రులు జన్మిస్తారు. కానీ ఓ యుద్ధంలో ఆ కొడుకులందరూ మరణిస్తారు. అప్పుడు నారద మహర్షి విష్ణువుని ప్రార్థించగా ‘నీ పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు. అలా వారి పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి’ అని వరమిస్తాడు నారాయణుడు. అవే ప్రస్తుతం తెలుగు సంవత్సరాలుగా వాడుకలో ఉన్నాయి. వీటిలో ఒక్కో పేరుకీ ఒక్కో ప్రత్యేకమైన అర్థం కూడా ఉంది. ఈ ఏడాది విళంబి నామసంవత్సరాన్నే తీసుకుంటే... విళంబి... అంటే దేనికీ లోటు లేకుండా ప్రజలు సుభిక్షంగా ఉంటారని అర్థం.

సౌర, చాంద్రమానాలెందుకు?
మనం ఉగాది పండగను చాంద్రమానం ప్రకారం జరుపుకుంటాం. తమిళులూ మలయాళీలూ సౌరమానం ప్రకారం మనకన్నా ఆలస్యంగా ఏప్రిల్ నెలలో చేసుకుంటారు. సంక్రాంతి పండగను మాత్రం సౌరమానం ప్రకారమే చేసుకుంటాం. అయితే ఇలా రెండు రకాల మానాలను ఎందుకు లెక్కలోకి తీసుకుంటున్నాం, అసలు కాలాన్ని రెండు పద్ధతుల్లో ఎందుకు లెక్కిస్తున్నాం, అన్న సందేహాలకు ప్రముఖ జ్యోతిష్కులు శంకరమంచి రామకృష్ణశాస్త్రి సమాధానమిస్తున్నారిలా...
‘కాలః కాలయితా మహం’ అంటాడు గీతాచార్యుడు. అంటే కంటికి కనిపించని ఆ కాల స్వరూపం నేనే అని అర్థం. మరి అలాంటి కాలాన్ని లెక్కించడం అంటే సామాన్యమా... గ్రహాలూ నక్షత్ర సంచారం గురించి ఎంతటి అవగాహన ఉండాలి! దానికి మరెంతటి పరిశీలన ఉండాలి! అయితే ప్రత్యక్షంగా కనిపించే కాలస్వరూప దైవం ఆదిత్యుడే. అందుకే పాశ్చాత్య దేశాలన్నీ సూర్యుడి గమనాన్ని మాత్రమే లెక్కించారు. కానీ భారతీయ ఖగోళనిపుణులు సౌర కుటుంబంలోని అన్ని గ్రహాల ప్రభావాన్నీ తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అదే జ్యోతిషశాస్త్రం. అందులో భాగంగానే సూర్యుడితోపాటూ చంద్రుడూ, బృహస్పతి గమనాలనూ లెక్కించారు. మనం సూర్య, చంద్ర గమనాలు రెండింటినీ పరిగణనలోకి తీసుకుని, సమప్రాధాన్యం ఇస్తున్నాం. ఎందుకంటే యజ్ఞయాగాదులు నిర్వహించాలంటే ఒక్క సౌరమానం సరిపోదు, చాంద్రమానంలోని తిథి, నక్షత్రాలు కూడా తెలియాలి. అంతేకాదు, ఒక పగలుతోబాటు రాత్రి కలిస్తేనే రోజు పూర్తవుతుంది. ఆ రాత్రిని ప్రభావితం చేసేది చంద్రుడే. మనమీద ఆ ప్రభావం తెలుసుకోవాలంటే చంద్రగమనాన్నీ లెక్కించాల్సిందే. అందుకే మనవాళ్లు రెండింటినీ తీసుకుని సమన్వయం చేస్తున్నారు.
సౌరమానమంటే...
సూర్యగమన గణనమే సౌరమానం. సూర్యుడు దీర్ఘవృత్తాకార కక్ష్యలో సంచరిస్తుంటాడు (నిజానికి ఇక్కడ సూర్యుడు తిరుగుతున్నాడని కాదు. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష్యనే సూర్యగమనంగా లెక్కించారు నాటి నిపుణులు). అలా సంచరించే కక్ష్యనే పన్నెండు భాగాలుగా విభజించారు. అవే మేషం, వృషభం, కుంభం... వంటి రాశులు. దీన్నే రాశి వృత్తం అంటారు. ఈ పన్నెండు రాశుల్లో సూర్యుడు సంచరించడానికి ఏడాది పడుతుంది. ఒక్కో రాశిలోనూ ఒక్కో నెల ఉంటాడు. ఒకరాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడమే రాశి సంక్రమణం. అందుకే సంక్రాంతి అనేది ప్రతీ రాశికీ ఉంటుంది. కానీ ఈ రాశిచక్రం ద్వారా నెల మాత్రమే తెలుస్తుంది. ఆ రోజు తిథి, నక్షత్రాల గురించి తెలియాలంటే మాత్రం చాంద్రమానాన్ని అనుసరించాల్సిందే.
సూర్యగమన గణనమే సౌరమానం. సూర్యుడు దీర్ఘవృత్తాకార కక్ష్యలో సంచరిస్తుంటాడు (నిజానికి ఇక్కడ సూర్యుడు తిరుగుతున్నాడని కాదు. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష్యనే సూర్యగమనంగా లెక్కించారు నాటి నిపుణులు). అలా సంచరించే కక్ష్యనే పన్నెండు భాగాలుగా విభజించారు. అవే మేషం, వృషభం, కుంభం... వంటి రాశులు. దీన్నే రాశి వృత్తం అంటారు. ఈ పన్నెండు రాశుల్లో సూర్యుడు సంచరించడానికి ఏడాది పడుతుంది. ఒక్కో రాశిలోనూ ఒక్కో నెల ఉంటాడు. ఒకరాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడమే రాశి సంక్రమణం. అందుకే సంక్రాంతి అనేది ప్రతీ రాశికీ ఉంటుంది. కానీ ఈ రాశిచక్రం ద్వారా నెల మాత్రమే తెలుస్తుంది. ఆ రోజు తిథి, నక్షత్రాల గురించి తెలియాలంటే మాత్రం చాంద్రమానాన్ని అనుసరించాల్సిందే.
చాంద్రమానమంటే...
చంద్రుడి గమనం ద్వారా తిథినీ నక్షత్రాన్నీ కూడా తెలుసుకోవచ్చు. నిజానికి చాంద్రమానానికీ సూర్య(భూ)గమనమే కీలకం. సూర్యుడు తిరిగే కక్ష్యను రాశి చక్రం మాదిరిగానే మరో 27 భాగాలుగా విభజించారు. అవే నక్షత్రాలు. ఆ వృత్తాన్ని నక్షత్ర వృత్తం అంటారు. అయితే సూర్యుడు ఉన్న సమయంలో నక్షత్రాలు కనిపించవు. కాబట్టి ఆ సమయంలో నక్షత్ర గమనాన్ని లెక్కించలేం. నక్షత్ర గమనంతో కాలాన్ని లెక్కిస్తే అది దోషరహితంగానూ, స్థిరంగానూ ఉంటుంది. కోట్ల సంవత్సరాల నాటి సంఘటనల సమయాన్ని తెలుసుకోవాలంటే ఆ సమయంలో ఏ నక్షత్రాలు ఏ రాశిలో ఉన్నాయో చెబితే కచ్చితంగా లెక్కించగలగడానికి అదే కారణం. సూర్యుడికీ చంద్రుడికీ మధ్యలో భూమి అడ్డు రావడంవల్ల చంద్రుడి కళలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. వాటినే తిథులుగా లెక్కించారు. అలాగే చంద్రుడు రోజుకి ఒక నక్షత్రం చొప్పున నెలలో 27 నక్షత్రాల దగ్గరే ఉంటాడు. అంటే ఏడాదికి చాంద్రమానం ప్రకారం 354 రోజులే. కానీ భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజుల 6 గంటల 11 నిమిషాల 31 సెకన్లు పడుతుంది. అదే చంద్రుడు తిరగడానికి 354 రోజులు పడుతుంది. అంటే... భూమి, చంద్రుడి గమనాల్లో 11 రోజుల తేడా ఉంటుంది. ఈ తేడాని సరిచేసేందుకు ఏర్పాటు చేసినదే అధికమాసం. వాటిని సైతం ఒక పద్ధతిలో 34, 35, 34, 35, 28 నెలలకోసారి వచ్చేలా లెక్కించారు.
చంద్రుడి గమనం ద్వారా తిథినీ నక్షత్రాన్నీ కూడా తెలుసుకోవచ్చు. నిజానికి చాంద్రమానానికీ సూర్య(భూ)గమనమే కీలకం. సూర్యుడు తిరిగే కక్ష్యను రాశి చక్రం మాదిరిగానే మరో 27 భాగాలుగా విభజించారు. అవే నక్షత్రాలు. ఆ వృత్తాన్ని నక్షత్ర వృత్తం అంటారు. అయితే సూర్యుడు ఉన్న సమయంలో నక్షత్రాలు కనిపించవు. కాబట్టి ఆ సమయంలో నక్షత్ర గమనాన్ని లెక్కించలేం. నక్షత్ర గమనంతో కాలాన్ని లెక్కిస్తే అది దోషరహితంగానూ, స్థిరంగానూ ఉంటుంది. కోట్ల సంవత్సరాల నాటి సంఘటనల సమయాన్ని తెలుసుకోవాలంటే ఆ సమయంలో ఏ నక్షత్రాలు ఏ రాశిలో ఉన్నాయో చెబితే కచ్చితంగా లెక్కించగలగడానికి అదే కారణం. సూర్యుడికీ చంద్రుడికీ మధ్యలో భూమి అడ్డు రావడంవల్ల చంద్రుడి కళలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. వాటినే తిథులుగా లెక్కించారు. అలాగే చంద్రుడు రోజుకి ఒక నక్షత్రం చొప్పున నెలలో 27 నక్షత్రాల దగ్గరే ఉంటాడు. అంటే ఏడాదికి చాంద్రమానం ప్రకారం 354 రోజులే. కానీ భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజుల 6 గంటల 11 నిమిషాల 31 సెకన్లు పడుతుంది. అదే చంద్రుడు తిరగడానికి 354 రోజులు పడుతుంది. అంటే... భూమి, చంద్రుడి గమనాల్లో 11 రోజుల తేడా ఉంటుంది. ఈ తేడాని సరిచేసేందుకు ఏర్పాటు చేసినదే అధికమాసం. వాటిని సైతం ఒక పద్ధతిలో 34, 35, 34, 35, 28 నెలలకోసారి వచ్చేలా లెక్కించారు.
చాంద్రమానమే ప్రధానం
ఈ సౌర, చాంద్రమానాలకీ ఉగాదికీ సంబంధం ఏమిటీ అనుకోవచ్చు. ‘ఉ’ అంటే నక్షత్రం. ‘గ’ అంటే గమనం. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం. ఉగాది అంటే నక్షత్ర గమనాన్ని లెక్కించడం మొదలుపెట్టిన రోజనే అర్థం అని కొందరి అభిప్రాయం. చాంద్రమానాన్ని అనుసరించే చైత్రశుద్ధ పాడ్యమిని ఉగాదిగా జరుపుకుంటున్నాం. తెలుగువారితోబాటు కన్నడిగులు, మహారాష్ట్రీయులు కూడా ఆ రోజునే ఈ పండగ జరుపుకుంటారు. సంక్రాంతిని మినహాయిస్తే ఉగాది సహా మిగిలిన పండగలన్నీ చాంద్రమానం ప్రకారమే ఉంటాయి. ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం పండగలూ వ్రతాల విషయంలో కొన్ని తిథులు నిర్ణీత సమయంలోనే ఉండాలి. సూర్యోదయ సమయానికి పాడ్యమి తిథి ఉన్న రోజే ఉగాది. మధ్యాహ్నానికి నవమి తిథి ఉంటేనే శ్రీరామనవమి. అర్ధరాత్రి సమయానికి అష్టమి తిథి ఉంటేనే శ్రీకృష్ణాష్టమి. మధ్యాహ్నానికి చవితి ఉంటే తప్ప అది వినాయకచవితి అనిపించుకోదు. ఇలా ప్రతీ పండగకీ నిర్ణీత సమయాలున్నాయి. అంతేకాదు, ఏ కాలమానాన్ని ఆచరించే వారైనప్పటికీ చంద్రునికీ నక్షత్రాలకీ పౌర్ణమితో ముడిపడిన చైత్రాది నామాలతోనే నెలలను పిలుస్తుంటారు. ఉదాహరణకు సౌరమానాన్ని పాటించే తమిళులు కూడా చైత్రమాసం నుంచి ఫాల్గుణ మాసం వరకూ గల చాంద్రమాన పేర్లతోనే నెలలను లెక్కించడం విశేషం. అవన్నీ ఎలాగున్నా పంచాంగం చూసుకోవాలన్నా జాతకచక్రం తెలుసుకోవాలన్నా చాంద్రమానమే ప్రామాణికం!
ఈ సౌర, చాంద్రమానాలకీ ఉగాదికీ సంబంధం ఏమిటీ అనుకోవచ్చు. ‘ఉ’ అంటే నక్షత్రం. ‘గ’ అంటే గమనం. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం. ఉగాది అంటే నక్షత్ర గమనాన్ని లెక్కించడం మొదలుపెట్టిన రోజనే అర్థం అని కొందరి అభిప్రాయం. చాంద్రమానాన్ని అనుసరించే చైత్రశుద్ధ పాడ్యమిని ఉగాదిగా జరుపుకుంటున్నాం. తెలుగువారితోబాటు కన్నడిగులు, మహారాష్ట్రీయులు కూడా ఆ రోజునే ఈ పండగ జరుపుకుంటారు. సంక్రాంతిని మినహాయిస్తే ఉగాది సహా మిగిలిన పండగలన్నీ చాంద్రమానం ప్రకారమే ఉంటాయి. ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం పండగలూ వ్రతాల విషయంలో కొన్ని తిథులు నిర్ణీత సమయంలోనే ఉండాలి. సూర్యోదయ సమయానికి పాడ్యమి తిథి ఉన్న రోజే ఉగాది. మధ్యాహ్నానికి నవమి తిథి ఉంటేనే శ్రీరామనవమి. అర్ధరాత్రి సమయానికి అష్టమి తిథి ఉంటేనే శ్రీకృష్ణాష్టమి. మధ్యాహ్నానికి చవితి ఉంటే తప్ప అది వినాయకచవితి అనిపించుకోదు. ఇలా ప్రతీ పండగకీ నిర్ణీత సమయాలున్నాయి. అంతేకాదు, ఏ కాలమానాన్ని ఆచరించే వారైనప్పటికీ చంద్రునికీ నక్షత్రాలకీ పౌర్ణమితో ముడిపడిన చైత్రాది నామాలతోనే నెలలను పిలుస్తుంటారు. ఉదాహరణకు సౌరమానాన్ని పాటించే తమిళులు కూడా చైత్రమాసం నుంచి ఫాల్గుణ మాసం వరకూ గల చాంద్రమాన పేర్లతోనే నెలలను లెక్కించడం విశేషం. అవన్నీ ఎలాగున్నా పంచాంగం చూసుకోవాలన్నా జాతకచక్రం తెలుసుకోవాలన్నా చాంద్రమానమే ప్రామాణికం!
No comments:
Post a Comment