ధనుర్మాసంలో ఆచరించే వ్రతం తిరుప్పావు. ఈ తిరుప్పావును ఆర్ధ్రమైన హృదయంతో ఆండాళ్ ఆలపించింది. వీటిలో ఉన్నవి 30 పాశురాలే. ఆండాళ్ ఆళ్వార్ల వంశంలో పుట్టింది. ఆమె తండ్రి విష్ణుచిత్తుడు. నారాయణుడిని అపరిమితంగా ప్రేమించినవాడు. భక్తులు భగవంతుడు తమకు కనిపించాలని ఆశిస్తారు.
కానీ విష్ణుచిత్తుడు మాత్రం- నారాయణుడు కనిపిస్తే మానవ దిష్టి తగిలి అందం కమిలిపోతుందేమోనని భయపడ్డాడు. ‘రావద్దు తండ్రి..’ అని కోరుకున్న ప్రేమికుడు. అలాంటి విష్ణుచిత్తుడి కూతురు ఆండాళ్. కృష్ణుడి పట్ల పరిపూర్ణమైన ప్రేమ నిండిన వ్యక్తి. ప్రేమ వల్ల భయం నింపుకున్న వ్యక్తి. ‘పొత్తి..పొత్తి’ అని మంగళము పాడిన వ్యక్తి. తిరుప్పావులోని పాశురాలలో ఈ ప్రేమభయమే ప్రధానాంశం. శ్రీకృష్ణుడు అతి సౌందర్యవంతుడు. ఆయన ప్రేమ అజరామరం. అపురూపం. దీనిని పొందటానికి ప్రయత్నించిన వారు గోపికలు. ఈ గోపికాతత్వాన్ని తనకు తానుగా ఆపాదించుకున్న గోదాదేవి ప్రణయతత్వానికి ప్రతీక. ఆమెకు ఈ ప్రపంచమంతా ప్రయణతత్వమే కనిపిస్తుంది. నల్లని గోపికలు, తెల్లని ఆవులు, వేణువూదే గోబాలలు, నీలాకాశం, అందమైన సెలయేర్లు, ఆకాశాన్ని సవాలు చేసే పర్వతాలు, వాటిని ముద్దాడే మేఘాలు.. ఇలా అన్నింటిలోను ప్రణయ తత్వమే. ఇది ప్రతీకాత్మకం- గోద, నీలగిరి, కృష్ణుడు. గోదాదేవికి అణువణువు ప్రణయభాసితమే. ఇలా ప్రేమించే మనస్సున్నప్పుడు ప్రపంచమంతా సౌందర్యంగానే కనిపిస్తుంది. ఈ సౌందర్యభావన అతిశయించినప్పుడు కలిగే ఆనందమే గిరి. ఆ గిరిని చేరుకున్నప్పుడు అక్కడ లభించే ఫలితమే కృష్ణుడు. ఈ ముగ్గురి ప్రణయానంద ప్రతీకలే ఈ గేయాలు.
శ్రీ వెల్లిపుత్తూరు పట్టణంలో విష్ణుచిత్తుడనే మహాభక్తుడి కుమార్తె శ్రీఆండాళ్. తల్లిదండ్రులు పెట్టిన నామం గోదా. ఆమె అయోనిజ. శ్రీకృష్ణుడంటే అపరమితమైన భక్తి. ఎంతలా అంటే భగవానుడి కోసం గుచ్చిన మాలికలు- ఆయనకు తగినట్లు ఉన్నాయా? లేదా? అనే సందేహంతో ముందు తాను ధరించి చూసేది. ఒక రోజు విష్ణుచిత్తుడు ఆమెను భగవతమాలలు ధరించి ఉన్నప్పుడు చూశాడు. తీవ్ర ఆగ్రహంతో ఆమెను దండించాడు.
పెరుమాళ్లకు ఆ హారాలను పంపలేదు. ఆ రోజు రాత్రి స్వామి స్వయంగా విష్ణుచిత్తుడి కలలోకి వచ్చి, శ్రీఆండాళ్ ధరించిన మాలికలను పంపమని ఆజ్ఞాపించాడు. సాక్షాత్తు నారాయణుడినే రక్షించటానికి ప్రయత్నించిన తల్లి కాబట్టి ఆమె శ్రీఆండాళ్ అయింది. భగవంతుడిని పొందటానికి రేపల్లెలో గోపికలు చేసిన శ్రీ కాత్యాయనీ వ్రతాన్ని అనుసరిస్తూ 30 రోజులు శ్రీఆండాళ్ ఒక వ్రతాన్ని ఆచరించింది. రోజుకొక పాటను ఆశువుగా స్వామి ముందు గానం చేసింది. తన ఊరే గోకులముగా, తోటివారంతా గోపీజనముగా, స్వామి మందిరం నందనందుని భవంతిగా, తానే గోపెమ్మగా గోదా చేసిన నాదస్తుతిలో భావనలెన్నో.
గోదా తొలి పాశురంలో గొల్లపడుచులకు వ్రతం గురించి వివరిస్తుంది. మార్గశిర మాసంలో యశోదమ్మ ముద్దుల తనయుడి ప్రేమను పొందటానికి అనువైన కాలమని విశదీకరిస్తుంది. రెండో పాశురంలో శ్రీకృష్ణుడి పరివారమెవరో పేర్కొంటోంది. నల్లనయ్యను పొందాలనుకున్నవారంతా ఈ వ్రతానుష్ఠానానికి యోగ్యులే. బాహ్యజాత్యాదులు అడ్డంకులు కావు. గొల్లతనం, స్త్రీత్వం, యవ్వనం, సంపదలనే భావనలేమిటో రెండో పాశురంలో శ్రీఆండాళ్ చెబుతుంది. గొల్లతనమంటే నారాయణుడు మనకిచ్చిన లక్షణాలు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా ప్రవర్తించటం సీ్త్రత్వం. శ్రీకృష్ణుడి సేవకు అంకితం కావటం యవ్వనం. శ్రీకృష్ణాగ్రహం తప్ప వేరేమి కోరకపోవటం సంపద. ఇవి ఉన్నవారంతా శ్రీకృష్ణపరివారమే. ఇక మూడో పాశురంలో వ్రతం చేయటం వల్ల కలిగే లాభాలను వివరిస్తుంది. ఈ వ్రతం వల్ల దేహాత్మాభిమానం, స్వాతంత్య్ర భావన, పరదాస్యం, స్వరక్షణ స్వాన్వయము, బంధులోలత, విషయవిలాసాలనే ఆరు దోషాలు తొలగిపోతాయి. జ్ఞానమనే పంట పండుతుంది.
నాలుగో పాశురంలో నారాయణుడికి ప్రణమిల్లే వరుణదేవుడిని వానలు కురిపించమని అభ్యర్థిస్తుంది. ఐదవ పాశురంలో అర్చామూర్తిని ఎలా పిలవాలో, ఎంతవాడై ఆలయాలల్లోకి వస్తాడో, ఏ పేర్లతో కీర్తిస్తే మన సకల పాపరాశిని పటాపంచలు చేస్తాడో, సమస్త పుణ్య ఫలాలు ప్రసాదిస్తాడో బహిర్గతం చేస్తుంది. ఆరవ పాశురంలో పదిమంది గోపికలకు బాహ్య పరిస్థితులు తెలియజేస్తూ కృష్ణానుభవానికి మేల్కొలుపుతుంది. ఈ పది మంది గోపికలను మేల్కొలపటంలో ఒక తాత్విక రహస్యముంది. మొత్తం తత్వాలు పది. మొదట పరమాత్మ. ఆ తర్వాత జీవుడు. మూడోవది ప్రకృతి శక్తులైన- భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారము. ఇవన్నీ కలిపితే పది అవుతాయి. ఈ దశవిశేషాలు కలిగిన జ్ఞానులే ఈ గోపికలు. ఏడవ పాశురంలో ఉదయం అవుతోందని తెలియజేసే పరిస్థితులను వివరిస్తూ.. తొలి గోపికను మేల్కొలుపుతుంది.
గోదాదేవి శ్రీరంగనాధుని పొందటానికి చేసిన ప్రయత్నం.. గోపికలు శ్రీకృష్ణుడిని చేరటానికి చేసిన ప్రయత్నం వెనక ఉన్న అంతర్యాన్ని గ్రహించగలిగితే భగవంతుడి లీలలు అర్థమవుతాయి.
సన్మార్గంలో ప్రయాణించే మానవుడు మూడు అంశాలను విధిగా పాటించాలి. వీటిలో మొదటిది శ్రవణం. రెండోది మననం. మూడోది ఆచరణ. ఈ మూడింటినీ ఈ 30 పాశురాల్లో వివరించింది శ్రీ ఆండాళ్లు. మొదటి ఏడు పాశురాలలోని పరమార్థాన్ని గతం వారం తెలుసుకున్నాం. ఈ వారం ఎనిమిదో పాశురం నుంచి ఉన్న విశేషాలు గమనిద్దాం.
గోపికా బాలికలను లేపుతూ గోదాదేవి కృష్ణుడి అంతఃస్వరూపాన్ని వివరిస్తోంది. ఎనిమిదో పాశురంలో మూడో గోపికాబాలికను నిద్ర లేపుతూ- తూరుపు తెలవారుతోంది. గేదెలు చిరుమేత కోసం బయట పచ్చిక బయళ్లలో తిరుగాడుతున్నాయి. నువ్వు తప్ప మిగిలినవారందరూ స్వామి సేవకై సిద్ధపడుతున్నారు.. అని తొందరపెడుతుంది. ఇక్కడ గేదెలను బాహ్య స్వరూపంలో కాకుండా- అజ్ఞానానికి, తమస్సుకు ప్రతీకలుగా భావించాలి. వెలుగు వచ్చినప్పుడు అవి బయటకు వెళ్లిపోతాయి. మళ్లీ రాత్రి అయితే తిరిగి వస్తాయి. మన అజ్ఞానాదులు కూడా అలాంటివే. గురోపదేశం వల్ల అవి బయటకు పోతాయి. మళ్లీ తిరిగి వస్తాయి. వాటిని రానిచ్చి- పాల వంటి మంచి విషయాలను మనం తీసుకొని, మళ్లీ బయటకు పంపేయాలి. అలా చేయటం వల్ల భగవంతుడికి దగ్గరవుతాం. ఇక తొమ్మిదో పాశురంలో నాలుగో గోపిక దాకా స్థిత ప్రజ్ఞుడికి ఉండాల్సిన యాతమావస్థ, వ్యతిరేకావస్థ, ఏకేంద్రీయావస్థ, వశీకారావస్థల గురించి వివరిస్తోంది. దీనిని ఎలా పొందాలో కూడా చెబుతోంది. పదో పాశురంలో అత్యంత సౌందర్యవతి అయిన ఐదో గోపిక గురించి వివరిస్తుంది. ఈమె కోసం కృష్ణుడు కూడా అనేక తిప్పలు పడుతూ ఉంటాడు. కానీ ఆమె ఒక అలౌకికమైన స్థితిలో ఉంటుంది. కృష్ణుడి కూడా స్పందించదు. పరమయోగులకు మాత్రమే సాధ్యమయిన అలాంటి అలౌకిక స్థితిని పొందిన ఆ గోపికను నిద్ర లేవమని గోదాదేవి ప్రార్థిస్తుంది. పదకొండో పాశురంలో ఆరవ గోపిక బాహ్య సౌందర్యంతో పాటుగా అంతః సౌందర్యాన్ని కూడా గోదాదేవి వర్ణిస్తుంది. పన్నెండో పాశురంలో రామాయణం ప్రతీకగా జీవిత రహస్యాలను వివరిస్తూ- లోకవిలక్షణమైన సాత్విక నిద్ర నుంచి గోపికను లేవమని గోదా దేవి ప్రార్థిస్తుంది. మన జీవితంలో బందీపబడిన జీవుడే సీత. రావణుడి చెరబడ్డ సీతలా మనం మనసు చేత వంచించబడ్డాం. అహంకారానికి బానిసలయ్యాం. శ్రీరాముడే లంకలోకి ప్రవేశించి చెర నుంచి సీతను విడిపించినట్లు- ఆచార్యుడు మన చెరను విడిపిస్తాడు. అయితే ఇది అంత సులభం కాదు. ఈ తత్వాన్ని గోదాదేవి ఈ పాశురంలో వివరించింది. ఇక ఎనిమిదో గోపికను నిద్ర లేపటానికి పదమూడో పాశురంలో గోదాదేవి ప్రయత్నిస్తుంది. ఈ ఎనిమిదో గోపిక అతి సుందర నేత్రి. ఈ నేత్రములు బాహ్య ప్రపంచాన్ని చూస్తాయి. కానీ అంతః ప్రపంచాన్ని చూసే నేత్రాలు వేరే ఉంటాయని ఈ పాశురంలో చెప్పకనే చెబుతుంది. పదనాలుగో పాశురంలో తొమ్మిదో గోపికను నిద్ర లేపటానికి ప్రయత్నిస్తుంది. ఈ గోపికకు నేర్పుగా మాట్లాడగలిగిన చాతుర్యముంది. అందరి కన్నా ముందు లేస్తానని చెప్పింది. కానీ లేవలేదు. దీని వెనకున్న రహస్యం గురించి ఈ పాశురంలో గోదాదేవి వివరిస్తుంది.
శ్రీరంగడిని అనుగ్రహం కోరి వ్రతమాచరించిన గోదాదేవి.. పాశురాలతో స్వామిని మనసారా కీర్తించింది. శ్రీ కృష్ణుడి లీలలను, ఆయన చూపిన మాయలను మనోహరంగా వర్ణిస్తూ గోపికలను వ్రతానికి సన్నద్ధం చేస్తుంది. పరమాత్ముడి మహిమలను ముప్పయ్ పాశురాల్లో వివరించింది. తొలి పద్నాలుగు పాశురాల గురించి గతవారాల్లో తెలుసుకున్నాం. ఈ వారం పదిహేనో పాశురం నుంచి ఉన్న విశేషాలను తెలుసుకుందాం.
పదిహేనవ పాశురంలో ఆ నల్లనయ్య ఎంత బలవంతుడో గోపికలకు చెబుతుంది శ్రీ ఆండాల్. కువలయాపీడమనే బలిష్టమైన ఏనుగును స్వామి ఎలా చంపాడో వివరిస్తుంది. ఆ స్వామి విశేషాలను కీర్తిస్తూ వ్రతాన్ని అచరిద్దామంటూ పదవ గోపబాలికను మేల్కొలుపుతుంది. ఇక పదహారో పాశురంలో గోపికల సమేతంగా నందగోపుని ఇంటి చేరుతుంది. భవన ద్వారాలు తెరవ వలసినదిగా స్వామివారి ద్వార పాలకులను కోరుతుంది. స్వామిని మేల్కొలుపుటకు శ్రీ కృష్ణుడు ఇచ్చిన మాట మేరకే ఇక్కడికి వచ్చామని ద్వారపాలకులకు విన్నవించుకుంటుంది. పదిహేడవ పాశురంలో లోనికి ప్రవేశించిన గోపికలు స్వామిని వేనోళ్లా కీర్తిస్తూ మేల్కొలిపే ప్రయత్నం చేస్తారు.
ముల్లోకాలు కొలిచే స్వామి నిదుర వీడి మేల్కొనుమంటూ స్తుతిస్తారు.
పద్దెనిమిదవ పాశురంలో నీళాదేవిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తారు గోపికలు. నీ మేనత్త కుమారుడైన శ్రీ కృష్ణుడిని మేల్కొలిపేందుకు వచ్చామని చెప్పుకుంటారు. తలుపు తీయమని కోరుతారు. పంతొమ్మిదో పాశురంలో నీళాదేవి, శ్రీ కృష్ణుడు ఇద్దరినీ మేల్కొలపాలని దృఢంగా నిశ్చయించుకుంటారు. శ్రీ కృష్ణుడి మాయలను మరోసారి వర్ణిస్తారు. మా కోసమైనా నీ భర్తను ఒక్క క్షణం విడిచిపెట్టొచ్చు కదమ్మా అంటూ నీళాదేవిపై నిష్టూరాలాడతారు.
ఇరవయ్యవ పాశురంలో దేవతలను ఆ స్వామి ఎలా కాపాడాడో కీర్తిస్తుంది శ్రీ ఆండాళ్. అలాంటి స్వామిని చూసే అవకాశం ఇవ్వమంటూ నీళాదేవిని నిద్ర నుంచి మేల్కొనమంటుంది. ఇరవై ఒకటో పాశురంలో నీళాదేవితో కలిసి శ్రీకృష్ణుడిని నిద్రలేపే ప్రయత్నం చేస్తుంది. ఇలా ఆ నల్లనయ్య అనుగ్రహం కోసం శ్రీ ఆండాల్ పరిపరి విధాలా ప్రయత్నిస్తుంది
శ్రీహరికి మార్గశిర మాసం అంటే ఎంతో ప్రీతి. అందుకే శ్రీ ఆండాల్ తిరుప్పావై వ్రతాన్ని ధనుర్మాసంలో ఆచరించింది. ముప్పయ్ రోజులు.. రోజుకో పాశురం చొప్పున కృష్ణ భగవానుడిని స్తుతించింది. మూడు వారాలుగా వ్రతదీక్షలోని గోదాదేవి.. ఆ నల్లనయ్యను కీర్తిస్తూ గోపికలను నిద్రలేపడం, కృష్ణ భగవానుడి భవనానికేగి అక్కడ నీళాదేవి అనుగ్రహం పొందిన వైనాన్ని సంక్షిప్తంగా తెలుసుకున్నాం. మిగతా పాశురాల్లో గోదాదేవి ఆ నందగోపాలుడ్ని ఇలా కీర్తించింది..
నీళాదేవి, గోపికల సమేతంగా శ్రీకృష్ణ మందిరానికి వెళ్లిన గోదాదేవి.. ఆదమరచి నిద్రిస్తున్న గోపాల దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి పరిపరివిధాల ప్రయత్నిస్తుంది. దానికి కొనసాగింపుగా ఇరవైరెండో పాశురంలో ‘ధరణిపై పేద నుంచి రాజు వరకు అందరూ నీవే దిక్కనుచూ నీ చెంతకు చేరారు స్వామి. ఆడవారిమైనా మేమంతా కూడా నీ సన్నిధికి చేరాము. ఇకనైనా కనులు తెరచి మమ్మనుగ్రహింప ప్రార్థన’ అని వేడుకుంటుంది.
భక్తుల కోరిక మన్నించి నిదుర లేచిన స్వామిని ఇరవైమూడో పాశురంలో అద్భుతంగా స్తుతిస్తుంది శ్రీ ఆండాల్. ‘గుహలో ప్రశాంతంగా నిదురిస్తున్న సింహం మేల్కొని జూలు విదిల్చినట్టుగా.. నీవు గోచరిస్తున్నావు కృష్ణా’ అని కీర్తిస్తూ.. తమ మనో నిశ్చయమును నెరవేర్చాల్సిందిగా కోరుతుంది. ఇరవైనాలుగో పాశురంలో.. శ్రీహరి అవతార విశేషాలతో పాటు శ్రీకృష్ణుడిగా ఆయన చూపిన లీలావిలాసాలను ప్రస్తుతిస్తుంది. వామనమూర్తిగా వచ్చి ముల్లోకాలను కొలిచిన తీరు.. రాముడిగా రావణుడిని సంహరించి సీతమ్మను పొందిన గాథ.. ఇక కృష్ణావతారంలో బాల్యం నుంచి చూపిన మాయలు భక్తితో వర్ణిస్తూ తమపై దయ చూపమని వేడుకుంటుంది.
ఇద్దరమ్మల ముద్దుల బిడ్డడా అంటూ ఇరవైఅయిదో పాశురంలో బాలకృష్ణుడిని గుర్తుచేస్తుంది. ‘దేవకి పంటగా వెలిసి.. యశోదమ్మ చెంతన పెరిగి.. గోకులంలో ఆనందం పంచావు స్వామి. పంతమాడిన కంసుడిని సంహరించి లోకకల్యాణం గావించిన కృష్ణా.. నీ లీలామృతమును చెప్పినంత మాత్రాన మా జన్మ ధన్యమైంద’ని ప్రణమిల్లుతుంది.
ఇరవైఆరో పాశురంలో తిరుప్పావై వ్రతం ఆచరిస్తున్న విధం గురించి కృష్ణపరమాత్మకు వివరిస్తుంది శ్రీ ఆండాల్. ఇరవైఏడో పాశురంలో వ్రతమాచరించే క్రమంలో వారి అలంకార విశేషాలను స్వామికి తెలియజేస్తుంది. ఇరవైఎనిమిదో పాశురంలో ఈ వ్రతాన్ని చేయడంలో ఏవైనా లోపాలుంటే పెద్దమనసుతో మన్నింపమని, భక్తిపారవశ్యంలో మర్యాదలో ఏదైనా లోపం జరిగితే మనసులో పెట్టుకోకు స్వామి అని వేడుకుంటుంది. ఇరవైతొమ్మిదో పాశురంలో ఈ వ్రతం ఆచరించడం వెనకున్న ప్రధాన ఉద్దేశాన్ని వివరిస్తుంది గోదాదేవి.
‘స్వామి.. జన్మజన్మల వరకూ నీతో బంధుత్వం కలవారుగా ఉండాలని ఈ వ్రతం చేశామ’ని కోరుతుంది. ముప్పయవ పాశురంలో తిరుప్పావై వ్రతం చేయడం వల్ల కలిగే ప్రయోజనాన్ని తెలుపుతుంది. ముప్పది రోజులు రోజుకో పాశురం చొప్పున స్వామిని కీర్తిస్తూ తిరుప్పావై వ్రతం చేసిన వారికి స్వామి పరిపూర్ణ కటాక్షం సిద్ధిస్తుందని వివరిస్తుంది గోదాదేవి.
శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్
ఆళ్వారులు అనగా భగవదనుభవంలో మునిగి ఉన్నవారని అర్థం. ఆళ్వారులు పన్నెండు మంది, వీరినే ‘పన్నిద్ధాళ్వారుల’ని కూడా అంటారు. వీరిలో అన్ని కులాల వారు ఉన్నారు. ఏ కులము వారైనా.. వారి భక్తి మార్గానికి, పాండిత్యానికి ప్రజలు వశులైనారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. ఆమె పేరే ఆండాళ్ (గోదాదేవి). కీ.శ. 776 నలనామ సంవత్సర కర్కాటక (ఆషాఢ) మాసంలో పూర్వ ఫలణీ నక్షత్రయుక్త శఖసమయాన దొరికింది. ఆండాళ్ అయోనిజ. ఆమె విష్ణు చిత్తులకు తులసీవనంలో లభించింది. విష్ణు చిత్తులకు ‘పెరియాళ్వారు’, భట్టినాథులు అనే నామాంతరాలు ఉన్నాయి. వీరు శ్రీవిల్లి పుత్తూరు (శ్రీధన్విపురం)లో ఉన్న వటపత్రశాయికి, నిత్యం పుష్పమాలికలను సమర్పించేవారు. భగవానుడి సేవలో తరించేవారు. ఓ రోజు తులసివనంలో యజ్ఞవాటిక కోసం తవ్వుతుండగా.. ఒక బాలిక కనిపించింది. వీరికి సంతానం లేకపోవడం వల్ల ఆ బాలికను అల్లారుముద్దుగా పెంచి ‘కోదై’ (పూలదండ) అనే పేరుతో పిలిచేవారు. ఆమె చిన్నప్పటి నుంచి భగవంతుని పట్ల అచంచలమైన భక్తివిశ్వాసాలు కలిగి ఉండేది.
విష్ణు చిత్తులు వటపత్రశాయికి సమర్పించే పుష్పమాలికలను తాను ధరించాలనే కోరిక ఆండాళ్ మనసులో కలిగింది. ఆ మాలికలను ఎవరికీ తెలియకుండా తన శిరస్సున అలంకరించుకుని, తన ప్రతి రూపాన్ని నూతినీటిలో చూసి ఆనందించేది. ఓ రోజు విష్ణుచిత్తులు పూలమాలికలను ఆలయానికి తీసుకెళ్తుండగా అందులో తల వెంట్రుకలను చూశారు. అనుమానం వచ్చి ఆండాళ్‌ను అడుగగా, ఆమె తన తప్పు ఒప్పుకుంది. పుష్పమాలికలను స్వామికి సమర్పించలేక ఎంతో బాధపడ్డారు. ఆ రాత్రే విష్ణుచిత్తుల వారికి స్వామి కలలో కనిపించి ‘రోజూ నీవు తెచ్చిన పుష్పమాలికలు నీ కుమార్తె ధరించినవే, వాటిని నేను అత్యంత ప్రీతితో స్వీకరిస్తున్నాను. ఆమె ధరించిన మాలికలనే తీసుకొని రావాలని’ ఆదేశించారు. ఆనాటి నుంచి ఆండాళ్‌దేవికి ‘శూడికోడత్తనాచ్చియార్’ (ఆముక్తమాల్యద), ‘గోదాదేవి’ అనే పేర్లు కలిగాయి.
శ్రీరంగనాథుని రూపరేఖా విలాసాలను తండ్రి ద్వారా విన్న ఆండాళ్.. ఆ స్వామినే తన ప్రాణనాథునిగా పొందాలని నిశ్చయించుకుంది. ద్వాపర యుగంలో.. గోపికలు శ్రీ కృష్ణునిపై భక్తితో, అతడినే భర్తగా పొందదలచి ‘కాత్యాయనీ వ్రతం’ చేసి తరించారు. గోదాదేవి కూడా అదే వ్రతాన్ని కృష్ణుడిని భర్తగా పొందదలచి, శ్రీవిల్లి పుత్తూరునే గోకులంగా, తోటి చెలికత్తెలను గోపికలుగా, తనూ ఒక గోపికగా, అక్కడి రంగనాథుడినే తన నాథుడిగా భావించి మార్గశీర్షమాసంలో.. ముప్ఫయ్ రోజులు.. నిత్యం ఒక పాశురం (పాట)ను స్వామికి నివేదించి వ్రతసమాప్తి చేసింది. చివరి రోజున ‘భోగి పండు’గ నాడు ఆండాళ్ శ్రీరంగనాథునితో వివాహం జరుగుతుంది. ఈ తిరుప్పావై గ్రంథం సర్వవేదాలకు మూలం అంటారు. ఆండాళ్ భూదేవి అవతారమని అంటారు. ఆండాళ్ రచించిన ‘తిరుప్పావై’ వ్రతగ్రంథం తర్వాత రచించిన మరో గ్రంథం ‘నాచ్చియార్ తిరుమొళి’. ‘తిరుప్పావై’ వ్రతం అయ్యాక పాండ్యదేశం రాజైన వల్లభరాములకు శ్రీరంగనాథుడు దర్శనమిచ్చి, ఆండాళ్‌ను తన వద్దకు తీసుకొచ్చి వివాహం చేయమని ఆదేశించాడు. శ్రీరంగం వెళ్లి కల్యాణం జరిగే లోపు ఆండాళ్ అనుభవించిన ‘ఆర్తి’ వాక్‌రూపంలో బయటకు వచ్చి ‘నాచ్చియార్ తిరుమొళి’ గ్రంథంగా అవతరించింది.
డాక్టర్ చెలికాని మురళీకృష్ఱారావు
No comments:
Post a Comment