దేవీ నవరాత్రులలో జగన్మాతను మొదటి మూడు రోజులు మహంకాళిగా, తరువాత మూడు రోజులు మహాలక్ష్మిగా, చివరి మూడు రోజులు మహాసరస్వతిగా పూజిస్తారు.
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!’
కష్టం వచ్చినా, బాధ కలిగినా ‘అమ్మా’ అంటూ ప్రతి ఒక్కరూ ఆక్రందిస్తారు. తమ తల్లిని తలుచుకుంటారు. పరాశక్తియే తల్లి రూపంలో ఉంది. అందుకే ఉపశమనం కలుగుతుంది. సర్వభూతాలకు మాతృరూపంలో రక్షణ కల్పించేది జగన్మాత. ఆమెకు లక్ష్మి, సరస్వతి, దుర్గ... ఇలా సహస్రాధికంగా నామాలున్నాయి. ఆమె ఏ పేరుతో పిలిచినా పలికే పరదేవత!
‘దేవి’ అనే శబ్దానికి ‘అమ్మ’ అనే అర్థాన్ని వేదపురాణాలు వచిస్తున్నాయి. దుష్ట శిక్షణకే కాదు, జగద్రక్షకురాలిగా కూడా దేవి సాక్షాత్కరిస్తుంది. మనం శరణాగతులమైతే కృపను వర్షిస్తుంది. ఏది కోరితే అది ప్రసాదిస్తుంది. ముక్తిని కూడా అనుగ్రహిస్తుంది.
వ్యాసుడు రచించిన దేవీ భాగవతంలో జగన్మాత మహాత్మ్యాన్ని విస్తృతంగా ఉల్లేఖించారు. శాక్త్యోపనిషత్తులు పరదేవత గొప్పతనాన్ని చెప్పటంలో అగ్రభాగాన ఉన్నాయి. చైతన్యమొక్కటే అనీ, అది సర్వాంతర్యామి అనీ శాస్త్రాలు చెబుతున్నాయి. ఆదిశంకరాచార్యులు ‘సౌందర్యలహరి’లో పలు సందర్భాలలో శాక్తేయుల దృక్పథాన్ని సమర్థించినట్టు కనిపిస్తుంది. పరాశక్తి పలురూపాలు ధరిస్తుందని పెద్దలు అంటారు.
త్వం జీర్ణో దండేన వంచసి జాత్వం జాతోభవసి విశ్వతోముఖః’
శ్వేతాశ్వతరోపనిషత్తు మంత్రంలో ఈ భావన స్పష్టంగా గోచరమౌతుంది. ‘నీవు స్త్రీగాను, పురుషునిగాను, యువకునిగాను, యువతిగాను, చేతికర్రతో నడిచే వృద్ధునిగాను - అన్ని రూపాలలో ఉన్నావు’ అని భావం. జగత్తుకే మాతయైున ఆమె లేనిదెక్కడ? అంతటా ఉంది. అందరిలోనూ ఉంది. శంకర భగవత్పాదులు ‘సౌందర్యలహరి’లో అంబను తాను దర్శించి, అందరికీ దర్శింపజేశారు. ఆమె తత్త్వాన్ని ఆస్వాదింపజేశారు. ఆ కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని తమ ‘ఉమాసహస్రం’ కావ్యంలో జగన్మాతను ఇలా వర్ణించారు...
చిన్తనకాలే ప్రాణగతా తత్త్వవిచారే సర్వగతా’
పూజా సమయంలో ‘రూపం’లోను, స్తుతించేటప్పుడు ‘శబ్దం’గాను, చింతనలో ‘ప్రాణం’గాను, తత్త్వ విచారం చేసేటప్పుడు సర్వత్రా గోచరిస్తుంది.
శృంగేరీపీఠాధిపతి శ్రీ భారతీ తీర్థ మహాస్వామి ఇలా నిర్వచించారు -
లక్ష్మీప్రదాన సమయే నవ విద్రు మాభాంవిద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రామ్!
విద్వేషివర్గ విజయేచ తమాల నీలాం
దేవీం త్రిలోక జననీం శరణం భజామః
‘సంపదలనిచ్చే సమయంలో ఎర్రటి పగడంలా ప్రకాశిస్తూ లక్ష్మీరూపంలోను, జ్ఞానాన్ని ప్రసాదించే సమయంలో శరత్‌చంద్రునిలా ప్రకాశిస్తూ సరస్వతి రూపంలోనూ, శత్రువులను దునుమాడే సమయంలో ముదురు నీలివర్ణంతో ప్రకాశించే దుర్గా స్వరూపంలోనూ సాక్షాత్కరించే త్రిలోక జననిని శరణు వేడుతున్నాను’ అని భావం.
ఒకప్పుడు జగత్తులో అసాధారణ పరిస్థితులు నెలకొన్నప్పుడు బ్రహ్మ విష్ణు రుద్రులలో ఆగ్రహ జ్వాలలు రగిలాయి. ఆ జ్వాలలు ఒక్కటిగా కలసినప్పుడు, ఆ జ్వాలల శక్తివల్ల ‘కన్యక’గా ఒక మహాశక్తి ఆవిర్భవించింది. ఆమెను ‘త్రికళ’గా, ‘మహామాయ’గా ఋషులు పేర్కొన్నారు. ఆ శక్తి మూడు వన్నెలతో మూడు శక్తులుగా విభజితమయింది. బ్రహ్మకళ సరస్వతిగా, విష్ణుకళ నారాయణి ‘మహాలక్ష్మి’గా, రుద్రుని కళ మహాకాళిగా రూపాలు ధరించింది. ఈ మూడు కళలు లేదా శక్తులు పరాశక్తి తాలూకు ఇచ్ఛ, జ్ఞాన, క్రియా శక్తులన్నారు. సర్వశక్తి సమన్విత అయిన పరాశక్తినే ‘దుర’్గగా ఋషులు పేర్కొన్నారు.
దేవతలందరికీ ఆత్మ ఆ పరాశక్తి. అందువల్ల ఆమెకు సహస్రాధిక నామాలు, రూపాలు. సాత్త్విక గుణాలతో ‘లలిత’గా, త్రిభువనాలకు రక్షకశక్తి అయిన ‘త్రిపుర’గా, జగత్తును శాంతి సౌభాగ్యాలతో తీర్చిదిద్ది సుందరంగా మార్చడం వల్ల ‘సుందరి’గా మూడూ కలిసి లలితా త్రిపుర సుందరిగా అభివ్యక్తమవుతున్నది. స్త్రీరూపంలో పరాశక్తిగా పిలుపునందుకుంటోంది. ఏ రూపంలో ఉన్నా పరాశక్తిని ప్రధానంగా తొమ్మిది రూపాలతో, నామాలతో, శరన్నవరాత్రులలో ఆరాధిస్తారు. తొమ్మిది సంఖ్యకు గుణిజాలను (నామరూపాలు) కూడితే ‘చివరికి అంతా ఒక్కటే’ అనే భావన ఇమిడి ఉంటుంది.
పరాశక్తి తొమ్మిది రూపాలు - శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి... ఈ నామాలు ప్రధానమని ‘దుర్గాసప్తశతి’ చెబుతోంది. శరన్నవరాత్రులలో పరాశక్తిని ఒక్కొక్కరూపంలో ఒక్కొక్క రోజున ఆరాధిస్తారు. ఉపాసనా భావంలో వైవిధ్యమున్నా శక్తి స్వరూపాన్ని మాతృభావనతో ఆరాధిస్తే కన్నతల్లిలా వాత్సల్యాన్ని వర్షిస్తుంది.
జగన్మాత ఆరాధనను ‘రాత్రివ్రతం’ అంటారు. ‘ముగురమ్మల మూలపుటమ్మ’ అయిన పరాశక్తి రాత్రి దేవత. శరన్నవరాత్రులలో బ్రహ్మ, విష్ణు శివాత్మకమైన పరాశక్తి మూడు రోజుల చొప్పున తొమ్మిది రోజులపాటు పూజలందుకుంటుంది. ఈ తొమ్మిది రోజులు పగలు, రాత్రి అనే భేదం లేకుండా ఆరాధనలందుకోవడం వలన శరన్నవరాత్రులను ‘అహోరాత్రదీక్ష’గా పరిగణిస్తారు. ‘నవ’ శబ్దం పరమేశ్వరునికి, ‘రాత్రి’ శబ్దం పరమేశ్వరికి పర్యాయ పదాలని ‘నిర్ణయ సింధువు’ చెబుతోంది. అలా భావన చేస్తే నవరాత్రులు - పార్వతీ పరమేశ్వరులు, శివశక్తులు, ప్రకృతీ పురుషుల ఆరాధనావ్రతమని ‘దేవీ మహాత్మ్యం’ ఉట్టంకిస్తోంది.
దేవీ నవరాత్రులలో జగన్మాతను మొదటి మూడు రోజులు మహంకాళిగా, తరువాత మూడు రోజులు మహాలక్ష్మిగా, చివరి మూడు రోజులు మహాసరస్వతిగా పూజిస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో చండముండ, శుంభ, నిశుంభ, మధుకైటభ, రక్తబీజాది క్రూర రాక్షసులను సంహరించి, జగత్తులో సుఖశాంతులను నెలకొల్పి విజయశ్రీగా ఆమె వినుతి గడించింది. అందుకే పదవనాడు రాజరాజేశ్వరిగా పూజలందుకుంటోందని ‘దుర్గాసప్తశతి’ చెబుతోంది. జగన్మాత ‘పదద్వ ప్రభాజాల పరాకృతి సరోరుహా’... పద్మకాంతులను మించిన కాంతులు గలవి దేవి పాదాలు. ‘బ్రహ్మవిష్ణు మహేశాన వేద పూజితాంఘ్రి ద్వయే’ అని వేదవ్యాసుడు స్తుతించారు. త్రిమూర్తులతో, వేదాలతో పూజలందుకుంటున్న పాదాలు అవి. అలాంటి పాదాలను నిత్యం శరణు వేడుదాం!
No comments:
Post a Comment