మానవ శరీరమే ‘క్షేత్రం’. ఈ క్షేత్రానికి ‘శక్తి’ అధిష్ఠాత్రి. క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి కరుణించి కాపాడే తల్లికి క్షయం లేదు, వృద్ధి లేదు. తరగటం, పెరగటం ఉండవు. తరిగిపోయేది శరీరం. క్షీణించేది క్షేత్రం. క్షీణించే క్షేత్రంలో అక్షయంగా రాణించే కృపాకటాక్షిణి - జగన్మాత.
క్షేత్రపాలకులందరూ ఆమె విభూతులే. అందుకే అగ్నిజ్వాలలో ఆమె ఉంటుంది. కాని భక్తులకు చల్లని సుగంధ పరిమళ గంధాన్ని అందిస్తుంది. మహాప్రళయ జలధిలో వశిస్తుంది. కాని సకాల వర్షాలనిచ్చి భక్తులకు అన్నపానీయములనిచ్చి ఆదుకుంటుంది. నరులను నారాయణులుగా రూపుదిద్దుతుంది. తల్లి ఉనికి విలువను గుర్తించని వారిపట్ల ఆమెకు ద్వేషం లేదు, మందహాసం చేస్తుంది.
ఆధ్యాత్మిక, ఆధిభౌతిక ఆధిదైవిక తాపాలకు గురియైన సంసారులకు శరత్కాల చంద్రునిలాగా చల్లని వెనె్నలనిచ్చి, తాపోపశమనాన్నిచ్చి సుఖ సంతోషాలకు మోక్షానికి మార్గాన్ని చూపుతుంది. ఆమె ఎప్పటికీ పిన్న వయసులోనే దర్శనమిస్తుంది. దార్శనిక శక్తికి మారుపేరు జగన్మాత. ఆ జగన్మాతే - బాలాత్రిపుర సుందరి.
‘అ’కారం నుంచి ఉద్భవించిన సమస్త వాఙ్మయం, జగన్మాత స్వరూపం. అది అక్షరం, క్షయం లేనిది. తల్లిని అంతర్ముఖంగా ఆరాధించాలి. అప్పుడే తల్లి లీలా విలాసాలు గోచరమవుతుంది. లీలలంటే సేవలు. అంటే తల్లి చూపించే వాత్సల్యము. దుష్టశిక్షణ చేసి శిష్టరక్షణ చేసే లీలలు, బిడ్డలపట్ల మాతృమూర్తికి ఉండే ఆదరణ.
సమస్త వాఙ్మయం మూడు మాత్రల్లో, మూడు వేదాల్లో, మూడు దమాలలో కూడుకొని ఉంటుంది. గుణత్రం, భువత్రయం, కాలత్రయం, మూర్తిత్రయం, వేదత్రయం, నాదత్రయం- యిలా అనేక త్రివర్గాలకు నిలయమైన బృహత్‌త్రయి త్రిపురసుందరి. కూటత్రయంలో ప్రాణికోటికి ప్రాణశక్తి ప్రసాదిస్తూ అందరికీ కరావలంబం అనగా చేయూతనిస్తూ, పురత్రయాన్ని పాలించే జగజ్జనని బాలా త్రిపురసుందరి.
జగన్మాతకు అందరూ సమానమే. బంధు ప్రీతి లేదు. తప్పుచేసినవారిని వారు ఎవరైనా సరే శిక్షిస్తుంది. అందుకే తండ్రి దక్షుడు చేసిన అధర్మయజ్ఞాన్ని ఆమె నిరసించి, అందుకు తానే బలి అయింది. ఇదే జగన్మాత త్యాగం. ఇంత జరిగినా బాలాత్రిపురసుందరి ముఖంలో మందహాసం మాత్రం స్థిరంగానే ఉంది. తనను కొలిచే భక్తులను కూడా స్థితప్రజ్ఞతను ప్రసాదించి, చిదానందాన్ని పంచి ఇచ్చే చిద్రూపిణి- బాలాత్రిపుర సుందరి. మూడు పాయలు అనగా త్రికరణములు- మనోవాక్కాయములు, త్రిగుణములు అనగా సత్వరజస్తమోగుణములు, స్థూల సూక్ష్మకారణ శరీరములు, భక్తి జ్ఞాన వైరాగ్యములు- ఇవన్నీ వేరు వేరుగా ఉండక ముప్పేటగా, ప్రేమతో ఒక్కటిగా అల్లుకొన్న ‘త్రిపుటు’లందు ప్రేమయే నిండి ఉంటుంది. ఆ విధముగా ఏకరూపమున అల్లుకొన్న ప్రేమను కరుణించే జగన్మాత- బాలాత్రిపుర సుందరి.
అటువంటి జగన్మాత స్వరూపాన్ని ‘బాల’గా స్మరించుకుంటే, శ్రీమాతకు మరింత దగ్గరవుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, నవరాత్రి పూజలో పది పనె్నండు సంవత్సరములలోపు వయసు కన్యలను పూజించి వారికి పసుపు కుంకుమ నూతన వస్తమ్రులు ఆభరణములిచ్చి దేవిని ‘బాల’ రూపంగా ఆరాధించి, ఆమె లీలా వినోదాన్ని అనుభవించి, ఆనందించి తరిస్తారు.
ఒకప్పుడు ఇంద్రాది దేవతలు, తమ విజయానికి జగన్మాత కారణమన్న సత్యాన్ని మరచిపోయి, గర్వంతో అంతా తమ స్వశక్తితోనే పొందామని తలంపసాగారు. ఆ తరుణంలో అపురూపమైన ‘శక్తి’ వారి ఎదుట సాక్షాత్కరించింది. ఆ అద్వితీయ అపురూప శక్తి ఏమిటో వారికి గోచరించలేదు. తెలిసికొనటానికి అగ్నిదేవుడు ముందుకువచ్చి శక్తితో ‘‘నేను సర్వజ్ఞుణ్ణి. అన్నిటినీ దహించగలను’’ అన్నాడు. మహాశక్తి, అతని ఎదుట ఒక గడ్డిపోచ ఉంచి, దీనిని కాల్చమన్నది. అగ్నిదేవుడు సాయశక్తులా ప్రయత్నించాడు. అతని యావశ్శక్తి, అతని అహంకారము వలన పనిచేయలేదు. దీనవదనుడైనాడు. ఆశ్చర్య చకితుడైనాడు. నా వేడి ఉష్ణశక్తి ఏమైంది అని ఆలోచిస్తూ అవమానంతో కృంగిపోయాడు అగ్నిదేవుడు. ఈ విధంగానే వాయుదేవుడు మొదలుగాగల దేవతలందరూ విఫలులైనారు. అపుడు ‘‘ఉమా హైమవతీ బహుశోభమానా’’ అయి ప్రకాశిస్తూ, మందహాసంతో మహాశక్తి త్రిపుర సుందరీదేవి దర్శనమిచ్చింది. అహంకారాన్ని పోగొట్టుకున్న దేవతలు, తమ విజయానికి తమలో వున్న ఆ మూలశక్తియే కారణమని, తాము నిమిత్తమాత్రులమని తెలిసికొని తల్లి పాదముల్ని ఆశ్రయించారు. ఇది ఉపనిషత్ చెప్పిన ‘శక్తి’స్వరూపం- బాలాత్రిపుర సుందరీ పూజకు దీప్తినిస్తుంది.
భండాసురుని కుమారులు ముప్ఫయి మంది రాక్షసులు. భండాసురుడు, బండలాంటివాడు. తిండి దొరకాలేగాని, సుష్టుగా తిని, మొద్దు నిద్రపోతూ యుగాల్ని క్షణాలుగా గడిపేస్తాడు. దుర్జన సాంగత్యమే చేయాలనేవాడు విషంగుడు. ఇంద్రియములకు పూర్తిగా లోనై, దిగజారిన భోగలాలసకు దాసుడైనాడు వాడు- విశుక్రుడు. విషంగుణ్ణి సంహరించటానికి మాత్రిణీమాత మంచి వ్యూహరచన చేస్తుంది. విశుక్రుని ప్రాణాలు హరించేందుకు ‘వారాహి’ తన వీర్యాతిశయాన్ని ప్రయోగిస్తుంది.
ఒక్కసారి కామేశ్వరుని ముఖంవైపు చూస్తే, విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమవగా, సర్వవిఘ్నములను జయిస్తుంది, జగన్మాత. భండాసురుడు ప్రయోగించే ప్రతి శస్త్రానికి, ఆమె చేతిలో ప్రత్యస్త్రం ఉంది. అవసరమైతే ఆమె చేతి వ్రేళ్ళు, గోళ్ళనుండి మత్స్య కూర్మ వరాహాది దశావతారాలతో, శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరిస్తాడు. నారాయణుని సహకారంతోగాని, నరునిలోని భండత్వం నశించదు. నరజాతిలోని అసురత్వాన్ని నారాయణుడు నశింపజేస్తే పశుత్వాన్ని పశుపతి అణచివేస్తాడు. కామేశ్వరాస్త్రంతో భండాసురునితో సహా అతని రాజధానియైన శూన్యక మహానగరాన్ని అగ్నికి అర్పించింది. చతుర్బాహుడు మొదలు ఉపమాయుడు వరకు ముప్పది మంది రాక్షసులు భండాసురుని తనయులు. వారిని తనూజయై తొమ్మిది సంవత్సరముల వయసుగల ‘బాలాత్రిపురసుందరి’ వధించింది. దార్శనిక విమర్శ శక్తియే బాలాత్రిపుర సుందరీ స్వరూపం. ఆ తల్లి పూజతో ద్వైత వృత్తులు తొలగి ఆత్మానందం కలుగుతుంది.
సర్వసిద్ధి ప్రదాత్రి- బాలాత్రిపుర సుందరి. మోక్ష స్వరూపిణి బాలాపరమేశ్వరి.
మంత్రములన్నింటిలో మహిమాన్వితమైనది- బాలాత్రిపురసుందరీ మంత్రం. అందుకే శ్రీవిద్యోపాసకులకు మొదటగా ‘బాలా’ మంత్రాన్ని ఉపదేశిస్తారు. శ్రీచక్రంలో మొదటి ఆవరణలో ఉండే దేవత బాలాత్రిపురసుందరి. ఇవన్నీ శ్రీలలితా సహస్రనామ స్తోత్రంలో ‘‘్భండ సైన్య వధోద్యుక్త బాలావిక్రమ నందితా, భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణే..’’ లో వ్యక్తమవుతాయి.
విశ్వంలోని సకలశక్తులు ఆమె నుంచే వస్తాయి. అందరి ఆలోచనలు భావాలు సంకల్ప వికల్పాలు తల్లికి తెలుసు. బాల అయినా, అందరి జీవనాల్ని సుఖమయం చేసే తల్లి. అందుకే వర్ణరూపంలో అనగా అక్షర రూపంలో బాలాత్రిపుర సుందరీ దేవిని ఉపనిషత్తులు కీర్తించాయి. కల్పనా లోకంలో నిర్వికల్పంగా విహరిస్తూ వెలుగులకు వెలుగైన అతీతశక్తి బాలాత్రిపురసుందరి. ఆమె ఎప్పుడూ చిన్నవయసులోనే ఉంటుంది. పరమాణు ప్రమాణంలో ఉన్నా, బ్రహ్మాండాన్ని అలుముకున్న చీకటిని, చిటికెలో తన చిత్కళతో పారద్రోలి, జ్ఞాన వెలుగును ప్రసాదించేది బాలాత్రిపుర సుందరి. కుమారస్వామి తారకాసుర సంహారం గావించాడు. తారకాసురుని కుమారులు- తారాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు అనే త్రిపురాసురులు. వీరు తమ తండ్రి మరణానికి పరితపించి, బ్రహ్మను గూర్చి తపస్సు చేసి మరణం లేకుండా వరాన్ని కోరారు. అది సాధ్యపడదంటే, ఏదైనా ఒక మార్గాన్ని ఎంచుకొని ఆ విధంగా జరిగితే మరణించేటట్లుగా వరం కోరుకోమన్నాడు బ్రహ్మ. త్రిపురాసురులు మూడు పురములు కట్టుకొని, ఆకాశంలో తిరుగుతూ వేయి సంవత్సరములు జీవించిన పిమ్మట, ఆ మూడు పురములు ఒకే చోటికి చేరినపుడు, ఒకే బాణంతో ఆ పురాల్ని ఛేదించగలిగిన వాని చేతిలో మాత్రమే వారికి మరణం సంభవించేటట్లు వరం కోరుకున్నారు.
జగత్తత్త్వంలో రథాన్ని, వేద తత్త్వంలో గుఱ్ఱాల్ని, నాగతత్త్వంతో పగ్గాల్ని , మేరు శిఖర తత్త్వంతో ధనుస్సును, వాసుకి తత్త్వంతో వింటి నారిని, సోమ విష్ణు వాయు తత్త్వాలతో బాణాల్ని తయారుచేసి, బ్రహ్మ స్వయంగా సారధి అయ్యాడు. వాటి ప్రయోజనం సమకూరలేదు. పరమేశ్వరుడు అంతర్ముఖుడై పరతత్త్వాన్ని భావించాడు. త్రిపురములన్నీ ఒకే సరళ రేఖపై చేరాయి. ఒకే బాణంతో త్రిపురాలను ఛేదించాడు పరమేశ్వరుడు. చిరునవ్వుతో బాలాత్రిపుర సుందరి ధనుస్సునుంచి బయటకు వచ్చింది. నేటి ప్రకాశం జిల్లా త్రిపురాంతక క్షేత్రంలో బాలాత్రిపుర సుందరీదేవి శిలాకారంలో ప్రకాశిస్తూ భక్తుల పాలిటి పెన్నిధిగా ఉన్నది. అక్కడ గర్భగుడిగా చెప్పబడుతున్న దివ్య ప్రదేశమే, శ్రీ బాలా త్రిపురసుందరీదేవి ఆవిర్భవించిన ‘చిదగ్నికుండము’. ‘చిదగ్నికుండ సంభూతా దేవకార్య సముద్యతా’- లలితా సహస్రనామం.
మహా సరస్వతీదేవి అంశయే- మహాకాళి. ఆ దేవిని బాలా బీజ మంత్రంతో ఉపాసన చేసి, సర్వవిద్యా పారంగతుడైన, వాక్సుద్ధిని పొంది, మహాకవి అయినవాడు మహాకవి కాళిదాసు. ఇది బాలాత్రిపుర సుందరీ మహత్మ్యం.
‘‘శ్యామకృష్ణ సోదరి శుక శ్యామల త్రిపుర సుందరి, ఈ మహిలో నీ సమాన దైవమెందుగాననే కామాక్షీ’’ అంటూ లయబ్రహ్మ శ్యామశాస్ర్తీ జగన్మాతను కీర్తించాడు. త్రైలోక్య మోహనాది చక్రేశ్వరి, త్రైపద పరబ్రహ్మ మహిషి, భాస్వరి సాలోక్యాది ముక్తిప్రధానకరి, సదాశివకరి, గురు గుహోదయకరి మూలాది నవాధారేశ్వరి శుభకరి నీలాల కధరి, నిత్యానందకరి, లీలావిశ్వోత్పత్తి స్థితి లయకరి, బాలపరమేశ్వరి పంచదశాక్షరి అని, గానలోలే, బాలే పంచదశాక్షరి పాహిమాం అంటూ నాదాత్మకంగా నాగవరాళి రాగంలో అర్చించాడు- ముత్తుస్వామి దీక్షితులు.
దేవీ కటాక్ష సిద్ధిని లోక కల్యాణానికి ఉపకరించి, సర్వమానవ సౌభ్రాతృతో విశ్వమానవ కల్యాణాన్ని వీక్షించాలని ఉద్బోధిస్తుంది- శ్రీ బాలాత్రిపుర సుందరీ పూజ.
నాభి హృత్కంఠ రసన నాసాదుల యందు
ధర ఋక్సామాదులలో వరగాయత్రీ హృదయమున...
-నాదయోగి త్యాగరాజస్వామి
అగ్నిరూపుడు, తేజోరూపుడు అయిన పరబ్రహ్మలోనున్న శక్తి, జలరూపముగా ప్రాదుర్భవించింది. ఆ శక్తికి సంబంధించిన సత్వ రజస్తమో గుణములే- ‘్భర్భువస్సువః’ అనే మూడు వ్యాహృతులుగా భాసించినాయి. ఆ శక్తియే గాయత్రీమాత.
ప్రాణవాయువు, అగ్ని సంయోగము చేత, ఇంద్రియాధిష్టాతమైన దేవతలచే వాక్కు, నాదముగా సృజింపబడింది. అది వ్యవహార యోగ్యమగునట్లు ‘అ’కారాది స్వర రూపమునొంది, ప్రణవనాదముగా ఉద్భవిస్తుంది. అకార, ఉకార మకారములు- మూడక్షరముల కలయికతో ఓంకార ప్రణవనాదము ఏర్పడుతుంది. ఆ ప్రణవనాదమే వేదపురాణాగమ శాస్త్రాదులకు ఆధారం. ‘అగ్ని’ అధిదేవత అయిన నాదం- వేదాలకు ఆధారమయితే, శబ్దతః అర్థతః నిత్యములైనవి వేదములు. వేదమాత ‘గాయత్రి’. గాయత్రీ మంత్రాన్ని ఉచ్ఛరించేటపుడు నిశితంగా దర్శిస్తూ ఆ మంత్రంలో, స, రి, గ, మ, ప, ద, ని సంగీత సప్తస్వర సుందరులు గోచరిస్తారని పేర్కొంటూ గాయత్రీ మంత్ర విశిష్టతను, జగన్మోహినీ రాగ కీర్తనలో అద్భుతంగా వివరించాడు- నాదయోగి సద్గురు శ్రీ త్యాగరాజస్వామి.
దీర్ఘాయుష్షు, సత్సంతానం, గోవులు కీర్తి ద్రవ్యము, బ్రహ్మవర్చస్సు ప్రసాదించి అంత్యమున మోక్షమును అనుగ్రహించు కరుణామయి గాయత్రీ మాత అని అధర్వణవేదం పేర్కొన్నది.
స్వార్థరహితంగా, అందరి యోగక్షేమముల కొరకు శక్తి ఆరాధన, మంత్రజపం, ఉపాసనా చేయాలనే సద్బుద్ధినిచ్చే తల్లి గాయత్రీమాత.
గాయత్రీ మంత్రంలోని ఇరువది నాల్గు అక్షరములను, మూడు భాగములుగా చేస్తే, ఒక్కొక్క భాగానికి ఎనిమిది అక్షరాలు వస్తాయి. ఈ మూడు ఖండాలు- సృష్టి స్థితి లయలకు సూచితం. మొదటి ఖండం ఋగ్వేదం, రెండవది సామవేదం, తృతీయ ఖండం- యజుర్వేదం అవుతాయి. ఇది వేద మాత గాయత్రీ మంత్ర అంతరార్థం.
కాలమే ‘కాళి’. సూర్యచంద్రులు కాలానికి సారథులు. సూర్యుడు ఆత్మకారకుడు, చంద్రుడు మనస్సుకు అధిపతి. కాల కళా స్వరూపిణి- జగన్మాత. ప్రపంచానికే ప్రాణమయిన కాలస్వరూపిణిగా వెలుగొందుతుంది. సంధ్యా దేవత గాయత్రి. చారు రూపంలో చంద్ర మండలంలో, భైరవాకారంలో సూర్య మండలంలో ఉండి ‘చంద్ర సూర్యాగ్ని సర్వాభా..’గా వెలుగొందే జగన్మాత గాయత్రి.
వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రీ మంత్రాక్షరాన్ని చేర్చి యిరువది నాలుగువేల శ్లోకాలతో శ్రీమద్రామాయణాన్ని రచించాడు. గాయత్రీ మంత్రాక్షర ఘటితమైన శ్రీమద్రామాయణం సర్వశక్తి సమన్వితమయి, కల్యాణప్రదమయింది. అందుకనే ఇహ పర సాధకమయి, జీవన్ముక్తికి సోపానమయింది- శ్రీరామకథ.
గాయత్రీ మహా మంత్రం- జ్ఞాన సముపార్జనకు ప్రార్థించటం జరుగుతుంది. గాయత్రీ దేవి దర్శన మాత్రంగా, తనలోని అహంకారము అసూయను తొలగించుకొని, విశ్వరథుడు, విశ్వకళ్యాణద్రష్ట అయిన విశ్వామిత్రుడైనాడు. ఎవ్వరూ సాధించలేని సర్వశక్తులను ఆ గాయత్రీ మాత అనుగ్రహంతో పొంది, వాటిని లోకోపకారమునకు వినియోగించి ధన్యత నొంది, శ్రీరామచంద్రుని కృతముగా లోక కల్యాణం గావించాడు- బ్రహ్మర్షి విశ్వామిత్రుడు.
ఓంకారంతో ఆరంభించి, భూః భువః సువః మహః జనః తపః సత్యం- సప్త వ్యాహృతులతో సప్తలోకాల సంపద ఇమిడి యున్నది. పగలు- రాత్రి, వెలుగు-చీకటి, జాగృతి-సుషుప్తి, వీటికి సంబంధియైన సంధ్యలో గాయత్రి ప్రవేశిస్తుంది. ‘గతా భగవతీ రాత్రిః’ అహశ్శివముపస్థితం’ అని సాంధ్యా రాగంలోని శివ శక్తి సాయుజ్యం దర్శనమవుతుంది. ఉదయం సాయంత్రం సంధ్య వెలుగు గోచరించగానే, గూళ్లలోని పక్షులు సహితం, గలగలా ధ్వని చేస్తూ సంధ్యదేవిని కిలకిలారావంతో కీర్తిస్తాయి. సర్వుల హృదయాలను ఉద్దీపింపచేసే సమయం సంధ్యా సమయం. సంధ్య దేవత గాయత్రి.
‘న గాయత్య్రాః పరమం మంత్రం నీమాతుః పరదైవతమ్’ గాయత్రికి మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దేవత లేదన్నది దివ్యసూక్తి. ‘గాయత్రీ ఛందసా మహమ్’ అని ఋక్కులలో గాయత్రీ మంత్రమును నేనని భగవద్గీత పదవ అధ్యాయంలో గీతాచార్యుడు నొక్కి వక్కాణించడంలో గాయత్రీ మహిమ విశేషం విశదమవుతుంది.
కాలచక్రాన్ని తన సంచారంతో నడిపించేవాడు- సూర్యుడు. చండ మార్తాండ మండల మధ్యలో సూర్యునికి అధిష్ఠాత్రి అయి, సూర్యునికి కూడా సత్తాస్ఫూర్తులను కలిగించే చిన్మయ చైతన్య రూపిణి గాయత్రి.
ప్రత్యక్ష కర్మ సాక్షి సూర్యభగవానుడు. మనకంటికి కనిపించే ఈ భౌతిక ప్రకాశమే ఆయన భర్గస్సు. ‘సవిత’ అంటే మానవబుద్ధి. బుద్ధిలో ప్రతిఫలించే జ్ఞాన తేజః కిరణాలే- భర్గస్సు. ‘సవిత’ అంటే పరబ్రహ్మ స్వరూపం. చైతన్యవంతమైన నామరూపాది రుూ విశ్వమే- భర్గస్సు. అదే శక్తి స్వరూపం. ఆ శక్తే గాయత్రీమాత. ప్రాణుల దేహ గోళములందు కుండలినీ శక్తిగా మూలాధారాది షట్చక్రములలో ఉంటుంది. ప్రాతఃకాలంలో కుండలినీ శక్తితో సవితృ తేజస్సును ధ్యానించినా జపించినా, విశ్వ కళ్యాణం జరుగుతుంది. ఇది గాయత్రీమాత సర్వజనావళికి యిచ్చే రక్ష.
గాయత్రీ మంత్రం సూర్యపరంగా ఉంటుంది, కాని ఉపాస్య దేవత గాయత్రి. సూర్యశక్తిని గాయత్రీ మంత్రం ద్వారా జపించి, ఆదిత్యుని గాయత్రీ తత్త్వంలో ఆరాధిస్తే, ఉపాసిస్తే- ఆరోగ్యప్రదం మోక్షప్రదం.
సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి వెళ్ళడానికి నెల రోజులు పడుతుంది. ఒక్కొక్క రాశిలో ఉన్నపుడు కొన్ని ప్రత్యేకతలుంటాయి. ప్రకృతిలో అనేక మార్పులొస్తాయి. అవి మానవ శరీరం మీదా, మనస్సుమీదా ప్రభావం చూపుతాయి. అయితే పుట్టినవాడు ఏ రాశిలో సూర్యుడు ఉన్నాడో అది ముఖ్యమైన ప్రాణశక్తి. ప్రాణం మన శరీరంలో నాభి దగ్గర ఉంటుంది. స్థితికారకుడైన విష్ణుమూర్తి నాభి కమలం నుండే జనించాడు- సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు. అలాగే, గర్భస్థ శిశువు నాభి, తల్లి నాభి కలుస్తాయి. ఇదే గర్భస్థ శిశువుకు ప్రాణశక్తినిచ్చేది. బయటకు వచ్చిన తరువాత వేరు చేస్తారు. వేరవగానే సూర్యశక్తి ప్రాణశక్తిగా పుట్టిన పిల్లవానికి సమకూరుతుంది. ఈ శక్తియే గాయత్రీమాత.
రోజూ మూడుసార్లు త్రిసంధ్యావేళల్లో ప్రాణాయామం చేస్తే బుద్ధి వికసిస్తుంది. పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఆ సంధ్యా దేవతే గాయత్రిమాత.
శ్రీదేవీ శరన్నవరాత్రుత్సవములలో, శ్రీ దుర్గా సప్తశతీ పారాయణ ముఖ్యంగా చేస్తారు. ఇది గాయత్రీ మంత్ర స్వరూప, తత్త్వమే. గాయత్రీ మంత్రంలోని మూడు పాదములు, శ్రీ దుర్గా సప్తశతిలోని మూడు చరిత్రలకు స్ఫూర్తి. గాయత్రీ మంత్రంలోని మొదటి చరణమైన ‘తత్సవితుర్వరేణ్యం’- శ్రీ దుర్గా సప్తశతిలోని మొదటిభాగం. దానికి అధిష్ఠాన దేవత- మహాకాళి. కాళి - కాల స్వరూపం. అన్నీ కాలంలోంచి ప్రభవించి, ప్రళయకాలంలో లయమవుతాయి. గాయత్రీ మంత్రంలోని ప్రథమ పాదాన్ని సాధకుడు సంపూర్ణంగా తెలిసికుంటే ఆధ్యాత్మిక సూర్యోదయం కలిగి, ప్రతి ప్రభావం ఒక సుప్రభాతం అవుతుంది.
గాయత్రీ మంత్రంలోని రెండవ పాదం ‘్భర్గోదేవస్య ధీమహి’ అన్నదానికి, శ్రీ దుర్గాదేవీ సప్తశతిలో, రెండవ చరిత్రలో ఉన్నది. దీనికి అధిష్ఠాన దేవత- శ్రీ మహాలక్ష్మి, స్థితికర్తయైన విష్ణుపత్ని. భక్తులు పోషణా సామర్థ్యం కలిగి, విజ్ఞానం, ఐశ్వర్యం సత్వగుణ సంపత్తి ప్రాప్తిస్తాయి. అనుదినం, సుదినమవుతుంది.
గాయత్రీ మంత్రం యొక్క మూడవ చరణం ‘్ధయోయోనః ప్రచోదయాత్’- దీని వివరణ శ్రీ దేవీ సప్తవతిలోని మూడవ చరిత్రలో విశదీకరింపబడింది. దీనికి మహాసరస్వతి అధిష్ఠాన దేవత. ‘నేనెవరు?’ అనేదానికి సంపూర్ణమైన అర్థాన్ని తెలిసికోగలుగుతాడు- భక్తుడు. హృదయంలో సూర్యచంద్రుల ప్రకాశం ఎప్పుడూ ఉంటుంది. బాహ్య ప్రపంచంలో సూర్యచంద్రులు కలిసి కాని, గాయత్రీ ఉపాసకులకు సూర్యచంద్రులిద్దరూ ఎప్పుడూ కలిసి ఉంటారు. ఇది మహోదాత్తమైన గాయత్రీ ఆరాధనా విశేషం.
‘‘విధాత్రీ ధర్మాణాం త్వమసి సకలామ్నాయ జననీ
త్వమర్థానాం మూలం ధనద నమనీ యాంఘ్రికమలే
త్వమాదిః కామానాం జనని కృత కందర్ప విజయే
సతాం ముక్తేర్బీజం త్వమసి పరబ్రహ్మ మహిషే
-ఆనందలహరి
తల్లీ వేదమాతా... నీవు వేద ధర్మాలను విధించు జగన్మాతవు. అఖిల ధర్మాలకు మూలం వేదములు. ‘వేదో ఖిలో ధర్మమూలం..’ వేద మాతవు నీవే. అనగా గాయత్రీ మాతవు. మా బుద్ధులను చక్కగా వికసింపజెయ్యి; ధర్మబుద్ధిని ప్రసాదించు. ధర్మబుద్ధి కోసం నిన్ను అర్చిస్తాను, ఉపాసిస్తాను. మొదటి పాదం ధర్మాన్ని రెండవ పాదం అర్థాన్ని, మూడవ పాదం, కామాన్ని, నాల్గవ పాదం మోక్ష పురుషార్థాన్ని ప్రతిబింబిస్తోంది. చతుర్విధ పురుషార్థాల్ని కటాక్షించి, ధర్మంతో అర్థ, కామాల్ని అనుభవిస్తే మోక్షం లభిస్తుందని గాయత్రీమాత విశేషాన్ని, ఆదిశంకరాచార్యులవారు వేదమాత గాయత్రిని స్తుతిస్తూ ఆనంద లహరిలో మనకందించిన శ్లోకం, గాయత్రీ మాత పూజకు స్ఫూర్తినిస్తుంది.
‘సంధ్యా దేవీం, సావిత్రీం, వరగాయత్రీం, సరస్వతీం భజేహం..’- సంధికాలములు మూడు. ప్రాతఃకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలము. ఇదే జీవితములో జన్మ, మధ్యమ, అస్తమయ కాలములు. సంధ్యా సమయంలో ప్రకృతిలో ఒక తెలియని ‘శక్తి’ అభివృద్ధి చెందుతుంది. ఆ సమయంలో చేసిన జప ధ్యానాదులు విశేష ఫలితాల్నిస్తాయి. ఉదయం గాయత్రి, మధ్యాహ్నం సావిత్రి, సాయం సమయంలో సరస్వతీ రూపంలో ధ్యానిస్తారు అని సంధ్యాదేవత గాయత్రీ మాతను గురించి, దేవక్రియ రాగంలో, హృద్యంగా వర్ణించాడు ముత్తుస్వామి దీక్షితులు. ఇది వేదమాత, సంధ్యాదేవి గాయత్రీ పూజకు దీప్తినిస్తుంది.
కాల స్వరూపాన్ని ప్రాముఖ్యాన్ని తెలిసికొని, సకాలంలో సత్కార్యాల్ని ఆచరించి సత్ఫలితాలు పొంది, ఫలసిద్ధిని లోక కళ్యాణానికి ఉపకరించాలని హెచ్చరిస్తోంది- సంధ్యాదేవత గాయత్రీమాత.
జరుగుతున్న ప్రతి క్షణంలో, జీవిస్తున్న ప్రతి ప్రాణిలో, కదిలే ప్రతి కణంలో, ప్రసరించే ప్రతి కిరణంలో, తల్లి శక్తి వ్యక్తమవుతుంది. పాంచభౌతికమయిన మన శరీరమే జగన్మాత ఆలయం. ఈ విశాల కువలయం- జగదంబ ఆలయం- విశ్వమంతా ఆమె చైతన్యమే. అశాశ్వతమైన దేహభ్రాంతిని తొలగించుకొంటేనే ఆత్మతత్త్వం బోధపడుతుంది. ఆ ఆత్మతత్త్వమే శ్రీ లలితా పరమేశ్వరి.
శ్రీమాతలోని దేవీతత్త్వం, శ్రీమహావిష్ణువులోని దివ్యతత్త్వం రెండూ ఒకే తత్త్వానికి చెందినవే. అదే పరమతత్త్వం. ఆ పరమతత్త్వానికి రెండు రూపాలు మాత్రమే. సగుణ సాకారంగా, రెండూ వేరు వేరుగా కనపడినా నిరాకార నిరంజనంగా, చిన్మయ దృష్టితో తన్మరుూభావంతో తరచి తరచి భావన చేస్తే, రెండింటిలోనూ ఒకే ఆనందమయ బిందువు దర్శనమిస్తుంది. ఆ ఆనందమయ, పరమానందమయ బంధువే ‘శ్రీ లలితా పరమేశ్వరి’. ఆ దేవియే శ్రీలలితా త్రిపురసుందరి.
నిరాకారము, నిశ్చలము అయినది- శివతత్త్వం. శివుణ్ణి ఆశ్రయించి అనుసరించి ఉంటుంది ‘శక్తి’. ఇదే శివ శక్తిసామరస్యం. శివతత్త్వాన్ని నామరూపాత్మకంగా మార్చి దర్శింపజేస్తోంది అదిశక్తి. చరాచర విశ్వమంతా దాని విభూతి. కనుక, నామరూపాత్మకమది. చెప్పేది నామం, చెప్పబడేది రూపం. నామం- భావప్రపంచం అయితే, రూపం వస్తు ప్రపంచం. ఈ రెండింటి నడుమ నడిచేదంతా క్రియారూపం. నామ, రూప, క్రియలనే మూడూ ‘త్రిపురములు’. త్రిపురముల సృష్టికర్త్రి అయి, వాటిలో ఆనందమయంగా విహరించే మహోదాత్తశక్తి ‘లలితా త్రిపురసుందరి’.
శోభ, విలాసము, గాంభీర్యము, లాలిత్యము, మాధుర్యము, స్థైర్యము, తేజస్సు, ఔదార్యము, సౌకుమార్యము- అన్నీ ఒక రాశిగా పోస్తే- లలితా పరమేశ్వరీ రూపం. భవ భయ బాధలను తొలగించి, భవాన్ని విభవంగా రూపుదిద్దగల మహాశక్తి స్వరూపిణి శ్రీ లలితా పరమేశ్వరి. అందుకే భక్తులు ఆ ‘శక్తి’ని అనే్వషిస్తూ వెడతారు. జగన్మాత అనుగ్రహాన్ని పొంది, కుండలినీయోగ శక్తితో యోగ సమాధిలో అమృతతత్త్వాన్ని పొందుతారు.
విశ్వప్రేమ- జగన్మాత తత్త్వం. దీనిని నిత్య జీవితంలో అమలుపరిస్తే, జగన్మాత అనుగ్రహాన్ని పొందుతారు. ఎందుకంటే విశ్వప్రేమ త్యాగానికి దోహదం చేస్తుంది. త్యాగబుద్ధి ఉన్నవాడికి అమృతమైన మనస్సు ఉంటుంది. మనస్సుకి అధిపతి చంద్రుడు. జ్యోతిషశాస్త్ర రీత్యా చంద్రుడంటే తల్లి, జగన్మాత. కనుక విశ్వప్రేమతో జగన్మాత, అనుగ్రహాన్ని పొందుతారు.
శ్రీలలితా పరమేశ్వరీ దేవికి సంబంధించిన విషయమలు బ్రహ్మాండ పురాణంలో, లలిత లలిత పదములతో వివరింపబడినాయి. అవి చిన్న కథలుగా చెప్పబడినాయి. కథల వెనుక దాగివున్న ఆధ్యాత్మికతను గంభీర భావాలను తెలిసికోవాలి. జగన్మాత ప్రాభవాన్ని, ప్రాదుర్భావాన్ని చెప్పి, హయగ్రీవుడు అగస్త్య మహర్షి కోరికపై లలితా నామాలను చెప్పాడు. అదే లలితా సహస్రం. అంతేకాదు, వాటిని రహస్య నామ సహస్రం అన్నాడు. దేవీ ఖడ్గమాలాస్తోత్రంలో కూడా ‘రహస్య యోగిని, పరాపర రహస్య యోగిని..’ అని చెప్పబడింది. అంటే, ప్రతి ఒక్క నామాన్ని భక్తితో భావన చేస్తూ నామ సంకీర్తనం చేస్తే తల్లి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. రహస్యం తెలియకపోయినా, లలితాంబను ప్రతి పదంలో భావిస్తూ నామపారాయణ చేస్తే సంతుష్టురాలై మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది.
శాక్తేయ విద్యలలో శంకర పీఠాధిపతుల ఆదేశ అనుగ్రహముతో శ్రీ విద్యా సంప్రదాయం అగ్రస్థానాన్ని ఆక్రమించింది. శ్రీచక్రము, శ్రీవిద్యా మంత్రములు శ్రీదేవీ స్వరూపాలే. శ్రీదేవీ మహాత్మ్యమును శబ్ద రూపంగా, శ్రీవిద్యామంత్రములు వెల్లడి చేస్తాయి. శ్రీవిద్య బ్రహ్మవిద్య. కనుక, శ్రీవిద్య మంత్రం, శ్రీచక్రం యంత్రం, శ్రీసహస్రం అంటే లలితా సహస్రనామం- మంత్రానికీ యంత్రానికి సంబంధించిన ‘తంత్రం’. శ్రీవిద్యలో అక్షరూపంగా వెలుగొందే శక్తి, శ్రీచక్రంలో రేఖాకారంగాను, శ్రీసహస్రంలో- సూక్ష్మరూపంగాను దర్శనమిస్తుంది. ఇదే లలితా పరమేశ్వరీ తత్త్వం. శ్రీవిద్య, శ్రీచక్ర అధ్యయన అర్చన సర్వులకు అంత సులభంకాదు. కానీ, సహస్ర నామాలను చదవడం, ఆ దివ్య నామాలతో శ్రీ లలితా పరమేశ్వరీ దేవిని ఆరాధించటం, అందరికీ సాధ్యం. అన్ని నామాలు ఆత్మతత్త్వ నామాలే. మనలోని పరతత్త్వాన్ని భావన చేసికొని జగన్మాతను సేవించటమే నామపారాయణ.
మన శరీరమే ఒక శ్రీచక్రం. శ్రీచక్రమునందు తొమ్మిది ఆవరణలు ఉంటాయి. ఈ తొమ్మిది ఆవరణలు, మన శరీరంలోని తొమ్మిది ద్వారాలకు సంకేతం. మానవ శరీరంలో షట్చక్ర సందర్శనంతో సకల దేవతలు ఒకే తత్త్వానికి చెందినవారని అర్థమవుతుంది. మూలాధారంలో నిద్రాణంగా ఉన్న కుండలిని మేల్కొలిపి, సహస్రారానికి చేరుస్తే, అమృతధారలు వర్షిస్తాయి. నశించే స్వభావం కల్గిన శరీరం నశించినా, నశించని అమృత తత్త్వాన్ని దర్శింపజేస్తుంది కుండలినీ యోగ శక్తి. అదే ‘ఆత్మవిద్య’. ఆత్మవిద్యను ప్రసాదించే మహోదాత్త శక్తి- శ్రీ లలితా త్రిపురసుందరి.
ఈ కుండలినీ యోగశక్తి ప్రభావానే్న, సద్గురు నాదయోగి శ్రీ త్యాగరాజస్వామి, తన ఘన రాగ పంచరత్న కీర్తనలలో వివరించాడు. శ్రీరామచంద్రుడు నీలమేఘ శ్యాముడు (నల్లనివాడు) కాని, త్యాగయ్య రాముణ్ణి చంద్రవర్ణునిగా అనగా తెల్లనివాడుగా కీర్తించాడు. ఇది సత్యమా? అసత్యమా? శ్రీరామచంద్రుడు కుండలినీయోగ శక్తివంతుడు. మూలాధారం నుంచి షట్చక్రాలను, గ్రంధిత్రయాన్ని అధిగమించి కుండలిని సహస్రారానికి చేరితే, చంద్రమండలమైన సహస్రారం నుండి అమృతధారలు వర్షిస్తాయి. అమృతం తెలుపు. కనుకనే, నీలమేఘశ్యాముడైన రాముడు, చంద్రవర్ణునిగా తెల్లగా దర్శనమిచ్చాడు త్యాగయ్యకు. ‘‘సుధాసారాభివర్షిణి, సహస్రారాంబుజా రూఢాయై నమః’’- అన్న లలితా సహస్ర నామములలో చెప్పబడిన విషయాల్ని ‘‘చందురు వర్ణుని అంద చందమును హృదయారవిందమున చూచి బ్రహ్మానందమనుభవించువారెందరో మహానుభావులని’’ శ్రీరాగంలో కీర్తించాడు- త్యాగయ్య. ఇది శ్రీ లలితా పరమేశ్వరీ ఆరాధనకు ఉపాసనకు సంపూర్ణ స్ఫూర్తిదాయకం.
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నామ విశేషాలను ఆరోగ్య విషయాలకు అన్వయించి, మన పూర్వీకులు పారాయణ చేసి, తీర్థం ఇచ్చి, ఆరోగ్యాన్ని ప్రసాదించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఎముకలకు సంబంధించిన వ్యాధిగ్రస్తులకు లలితా సహస్రనామ స్తోత్రంలో ‘‘మూలాధారాంబుజారూఢా పంచవక్త్రాస్థి సంస్థితా’’ అనే శ్లోకాన్ని మూలబీజ మంత్రంతో ‘‘ఓం ఐం హ్రీం శ్రీం అస్థి సంస్థితాయై నమః’’ అని ఉచ్ఛరిస్తూ తీర్థం యిస్తే, మంత్రాక్షర శక్తి ప్రభావంతో క్రమేపి ఎములకు సంబంధించిన వ్యాధులు నయమయ్యేవి. తన్మాత్రలైన శబ్ద స్పర్శ రూప రస గంధములతో భాసిల్లే ‘సాకినీ’ దేవతగా పరిపూర్ణమైన పృధ్వీతత్త్వంతో, అన్నింటికీ మూలాధారయైన మూలాధార క్షేత్రంలో వసించే శ్రీ లలితా పరమేశ్వరీ శక్తియే ఆరోగ్యానిచ్చేది.
సాకినీ మాతకు పెసలతో కూడిన అన్నం (కిచిడి) నివేదన చేస్తారు. ఎముకల సంబంధమైన వ్యాధిగ్రస్తులకు వైద్యులు నానబెట్టిన మొలకలెత్తిన పెసలతో కూడిన ఆహారాన్ని ఇమ్మంటారు. ‘‘ముద్గౌదనా సక్త చిత్తా సాకి న్యంబా స్వరూపిణీ’’ అన్న నామరహస్యం ఇదే. భక్తి వెదకి చూస్తే, తరచి తరచి ఉపాసిస్తే, యిలాంటి అనేక మర్మములు, విశేషాలు, విజ్ఞాన ఆరోగ్య సూత్రాలు దర్శించవచ్చు. శ్రీసహస్రం- శ్రీమాత శ్రీలలితా త్రిపురసుందరి మనకిచ్చిన రక్ష.
నీరు, నేలను పవిత్రం చేస్తే, నీటితో పవిత్రమైన నేల, తనపైనున్న ప్రాణికోటిని పవిత్రం చేస్తుంది. అటువంటి జలములందు ఈక్షణ గలది అనగా వాటిని చూస్తూ పోషించేది, వాటి స్వరూపమే అయినది- శ్రీ లలితా పరమేశ్వరి. పుష్కరోత్సవం సంవత్సరానికి ఒక మారు వస్తుంది. గురుగ్రహం ఒక్కో రాశిలో ప్రవేశించినపుడు, ఒక్కో నదికి పుష్కరం ఏర్పడుతుంది. ఒక రాశి నుండి మరో రాశిలో ప్రవేశించటానికి ఒక సంవత్సరం పడుతుంది. ఉదాహరణకు, కన్యారాశిలో గురుడు ప్రవేశించినపుడు కృష్ణానదికి పుష్కరాలు వస్తాయి, మరలా కృష్ణానదికి పుష్కరములు రావాలంటే పనె్నండు సంవత్సరాలు పడుతుంది. ఎందుకని? గురుడు ఒక్కో రాశిలో ఒక సంవత్సరం ఉండి, తిరిగి కన్యారాశిలో ప్రవేశించటానికి 12 సంవత్సరాలు పడుతుంది. ‘పుష్కర’ శబ్దానికి ‘పోషయతీతి పుష్కరమ్’- ఎల్లప్పుడూ పోషిస్తూ లోకానికి జీవనభూతమైనవి. అవి ఏవి? జలములు కనుక జలమునకు పుష్కరమని పేరు. పుష్కం (పోషణ) రాతీతి (అదత్తేఇతి) పుష్కరమ్- అనగా పోషణ ఇచ్చునది. పుష్కరోత్సవం అంటే, జలములందు ఉత్సవం. లలితా సహస్రనామంలో ‘పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా’ అనే నామాలున్నాయి. దీనిని బట్టి పుష్కరోత్సవం అంటే శ్రీలలితా దేవి ఆరాధనయే.
జీవితమంతా ఒక మహాసాధన. ఇందులో, ఏ క్షణం కూడా మనది కాదు. దానిని వ్యర్థం చేసేందుకు మనకు అధికారం లేదు. ఈ మానవ శరీరాన్ని ఈ జన్మకు ప్రసాదించిన జగన్మాతను స్మరిస్తూ ఈ ఉపాధి అనగా శరీరం ఉండగానే ఇందులో దాగివున్న ఆనంద బిందువును భక్తిశ్రద్ధలతో దర్శించాలి. ‘నీవార శూక వత్తాన్వీ పీతాభాస్వత్యణూపమా’ అన్నది మంత్రపుష్పం. దానికి శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన, శ్రీ సహస్రనామ పారాయణ మార్గం చూపిస్తాయి, ముఖ్యంగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ.
శ్రీమాత అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందిన వాగ్గేయకార త్రిమూర్తులలో మధ్యముడు- ముత్తుస్వామి దీక్షితులు. సంగీత త్రిమూర్తులు ఒకే ఊరులో జన్మించటం విశేషం. ఆ ఊరే తిరువారూరు- శ్రీపురము. ఈ గ్రామంలో వేంచేసిన తల్లి, కమలాంబిక, స్వామి-శ్రీత్యాగరాజస్వామి. శ్రీపురమంటే శ్రీచక్రమే. శ్రీచక్రంలో ఉండే తొమ్మిది ఆవరణలకు, తొమ్మిది కీర్తనలను మనకందించి, భావితరంవారిని తరింపజేసిన ముత్తుస్వామి దీక్షితులు- అనవరత స్మరణీయుడు. కమలాంబిక అంటే శ్రీలలితా త్రిపుర సుందరీదేవి. శ్రీచక్రమే ఆమె నిలయం. కాశీలో హనుమాన్ ఘాట్‌లో శ్రీచక్రేశ్వరీ శివలింగాన్ని, ముత్తుస్వామి దీక్షితులవారు ప్రతిష్ఠించారు. నేటికీ ఎంతోమంది దర్శించి, నవావరణ కీర్తనలు దీక్షితులవారి విగ్రహం ముందు కూర్చుని గానం చేస్తారు. లలితా సహస్రనామం పారాయణ చేసి ఆత్మానందాన్ని పొందుతారు. ‘లలిత’రాగంలో ‘‘ననుబ్రోవు లలిత వేగమే చాల నిన్ను నెఱ నమ్మియున్నవాడగదమ్మ భక్తకల్పకలతా’’ అని కీర్తించాడు లయబ్రహ్మ, కామాక్షీ వరప్రసాది శ్యామశాస్ర్తీ. ఇది శ్రీ లలితాపూజకు పూర్తి స్ఫూర్తి.
మనిషి తనలోని భండాసుర ప్రవృత్తిని అణచుకొని, శ్రీలలితా పరమేశ్వరీ ఆరాధనతో ప్రాప్తించిన ‘శక్తి’ని విశ్వకల్యాణానికి వినియోగించాలని చెప్తోంది- శ్రీలలితా దేవి పూజ.
‘‘అగ్నేనయ సుపధారాయే అస్మాన్’’ వేదకాలంనుండి అనాదిగా, అగ్నిదేవుడు ఉష్ణశక్తికి ప్రతీకగా ఆరాధింపబడుతున్నాడు. అగ్నిదేవుణ్ణి, విశ్వశక్తిని తెలిసికొనే ‘సుపధ’ అంటే మంచి మార్గాన్ని తెలుపవలసిందిగా ప్రార్థన చేశారు. పదార్థము, శక్తీ అన్న రెండూ సృష్టికి మూలకారణం. సృష్టి స్థితిక్రమంలో మరణానంతరం, జీవుడు తన కర్మ జ్ఞానాలను బట్టి అనుసరించే రెండు మార్గాలు- దేవయానం, పితృయానం. అవే వెలుగు చీకటి మార్గాలు. ఉత్తరాయణం, దక్షిణాయనం; పగలు -రాత్రి. కాలంతో సహా, అన్నీ పదార్థ శక్తుల ఫలాలే. మరణానంతరం చంద్రలోకానికి పోయిన జీవుడు, తన కర్మ జ్ఞానములను బట్టి, అవి తీరిపోయేవరకు అక్కడే ఉండి, మిగిలిన పూర్వకర్మతో- వర్షధారలు చంద్ర కిరణముల ద్వారా పంట పొలములందలి సస్యములలో ప్రవేశిస్తారు.
అన్నరూపంగా జీవులలో ప్రవేశించి, స్ర్తి పురుషులలో, శుక్ల శోణితములుగా మారి జీవోత్పత్తి జరుగుతుంది. కనుక ‘అన్నం’ నుండే రేతస్సు కలుగుతుంది. దానినుండి ఈ ప్రాణిజాలమంతా జన్మ ఎత్తుతోంది. కనుక, జీవుల జీవాల్ని నియమం చేసి, అనుగ్రహించే కరుణామయి, జగన్మాత- అన్నపూర్ణాదేవి. తైత్తిరీయ ఆరణ్యకం, ప్రశ్నోపనిషత్, బృహదారణ్యకోపనిషత్, భగవద్గీత మనకు ఈ విషయాల్ని అందజేసినాయి.
‘తస్మాద్యా ఏతస్మాదాత్మన ఆకాశస్సంభూతః
ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృధివీ, పృధివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నమ్ అన్నాత్పురుషః సవా ఏష పురుషోన్న రసమయః’’- పరమాత్మ నుండి ఆకాశము, ఆకాశమునుండి వాయువు వాయువునుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలమునుండి భూమి, భూమినుండి ఓషధులు, ఓషధులనుండి అన్నము, అన్నము నుండి పురుషులు అనగా జీవులు పుడుతున్నారు. జీవులంతా అన్నంతో పుట్టి జీవిస్తున్నారు. ఓషధుల ద్వారా పంటలు, తద్వారా మంచి అన్నము ఏర్పడుతోంది. మంచి వర్షము మేఘము ద్వారా కల్గుతోందని, మేఘము యజ్ఞ్ధూమము చేత కల్గుతోందని, యజ్ఞములు వైదిక కర్మల వలన, వైదిక కర్మలు వేదములవలన కలుగుతున్నాయని, ఆ వేదమాత ‘అన్నశక్తి’ స్వరూపంగా అన్నపూర్ణాదేవిగా పూర్ణ స్వరూపంతో వెలుగొందుచున్నదని, వేదములు, ఉపనిషత్తులు, ఆనందవల్లి తెల్పుతున్నాయి.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు- సృష్టి స్థితి లయ కారకులని తెలిసిన విషయం. జీవులు అన్నం నుండి పుట్టటం, అన్నంవలన జీవించటం, అన్నంలోనే లయమవటం చేత, అన్నం పరబ్రహ్మ స్వరూపంగా చెప్పబడింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు- త్రిమూర్తులకు మూలశక్తి- ఆది పరాశక్తి. ఈ విధంగా, అన్నపూర్ణాదేవి, మహాశక్తి స్వరూపిణిగా చెప్పబడింది.
ఎవరి గృహంలో అన్నమును అందరూ తింటారో, ఎవరు ఇతరులకు తనకున్నదాంట్లో కొంచెం అన్నదానం చేస్తారో- వారి పాపాలన్నీ దగ్ధమైపోతాయి. వారి ఇంట్లో సుఖశాంతులు వెలసి, గృహం నిత్యకళ్యాణం పచ్చతోరణంగా ఆరోగ్యంగా భాసిల్లుతుంది. వీటిని ప్రసాదించే జగన్మాత అన్నపూర్ణాదేవి. ఇది అధర్వవేదం చెపుతున్న విషయం.
ప్రకృతి స్వరూపం-ఋతువులు. ‘శక్తి’ స్వరూపమే ప్రకృతి. అన్నాన్నిచ్చి శారీరకంగా పుష్ఠివంతులుగా చేసి, సద్భుద్ధి భిక్షనొసగి, జ్ఞానపుష్టివంతులుగా నొనర్చు కరుణామయి అన్నపూర్ణాదేవి.
ప్రాణికోటికి ప్రాణశక్తిప్రదాయిని అన్నపూర్ణాదేవి. మానవుని ఇంద్రియాలన్నీ బహిర్ముఖంగా ఉంటాయి. కనుక అతని దృష్టి సహజంగా బహిర్ముఖంగా ఉంటుంది. జగన్మాత ఆత్మస్వరూపిణి. సాధనతో దృష్టిని అంతర్ముఖం చేస్తే, ధ్యానయోగం సిద్ధిస్తుంది. అపుడు శక్తి సహస్రారాంతర్గత చంద్రమండలం చేరగానే ఆనందామృత వర్షిణి, అమృతధారలను వర్షింపజేస్తుంది. ఆ తురీయావస్థలో ఆకలిదప్పులు ఉండవు. చిన్మయంతో చిద్రూపిణి చిచ్ఛక్తిరూపం దర్శనమవుతుంది. ఆ పరంజ్యోతి స్వరూపమే అన్నపూర్ణాదేవి.
అయితే, ఇవన్నీ సామాన్యునికి సాధ్యమా? సాధ్యంకాని విషయాల్ని చెప్పి ప్రయోజనం ఏమిటి? అనేప్రశ్నలు ఉదయించక మానవు. ఎందుకు ఆ విషయాల్ని ప్రస్తావన చేస్తున్నామంటే, మన మహర్షులు అటువంటి యోగసిద్ధులని, భారతీయ విజ్ఞాన సంపదను భావితరంవారికి తెలియజేస్తూ, వారు మనకందించిన మంచి విషయాల్ని తెలిసికొని వాటిని ఆచరించి మన జీవితాల్ని సార్థకత నొందించుకోవటానికి చెప్పటం జరిగింది. ఇది కూడా అన్నపూర్ణాదేవి ఆరాధన, ఉపాసనే.
స్థూలంగా సేవిస్తే సాకారంలోను, సూక్ష్మంగా భావించి ధ్యానించి ఆరాధిస్తే నిరాకారంగాను సాక్షాత్కరిస్తుంది అన్నపూర్ణాదేవి. ధ్యాన ఆవాహనా అర్ఘ్య పాద్య ధూప దీప నైవేద్యాది షోడసోపచారములకూ ఆనందపడుతుంది తల్లి. దహరాకాశంలో రస స్వరూపిణిగా ధ్యానం చేసే మానసిక పూజకు దరహాసం చిందిస్తుంది. ఎవరు ఎలా చింతించి, స్మరిస్తే వారికి ఆ విధంగా సాక్షాత్కరిస్తుంది అన్నపూర్ణాదేవి.
నీటిలో ‘వెలుగు’ ఉంది, నీటిలోనే ‘రసం’ ఉంది. ‘రసోవైసహ’ అన్నది శ్రుతి. అమృతము కూడా జలములలోనే ఉంది. బ్రహ్మ పదార్థముంది. ఉదకములకు మూలమైన అగ్ని, వెలుగునిస్తుంది. వెలుగులకు వెలుగయి నెలవులకు నెలవైన పరంజ్యోతి- అన్నపూర్ణాదేవి.
మరో జన్మ లేకుండా జన్మరాహిత్యాన్ని పొందించే మోక్షప్రదాయిని, జ్ఞానజ్యోతి- అన్నపూర్ణాదేవి.
‘‘అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః’’ అని అన్నశక్తిని, అన్నాన్ని పొందే విధానాన్ని గీతాచార్యుడు భగవద్గీతలో బోధించాడు. ఇది అన్నపూర్ణ తత్త్వాన్ని తెలియజేస్తుంది.
‘‘నిత్యానందకరీ వరా భయకరీ సౌందర్య రత్నాకరీ, నిర్దూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ, ప్రాలేయాచల వంశపావనకరి’’ అని సంబోధించి, ‘‘భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ’’- కాశీ పట్టణానికి అధీశ్వరివి, భక్తులను దయతో ఉద్ధరించే దానివి, తల్లీ నాకు జ్ఞానభిక్షను ప్రసాదించమని అన్నపూర్ణాదేవిని ‘‘అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిచ పార్వతీ’’ అని అన్నపూర్ణామాతను వేడుకొన్నారు, ఆదిశంకరాచార్యులు.
‘‘శబ్దాత్మికే శశికళాభరణార్థదేహే శంభోరుర స్థ్యల నికేతన నిత్యవాసే, దారిద్య్ర దుఃఖ భయహారిణి..’’ నాదరూపమైన శబ్దమే స్థూల శరీరముగా గలది, చంద్రకళ ఆభరణముగాగల అర్థరూపుడైన దేవుని అర్థాంగి, సర్వలోకాత్ముడైన శంభుమూర్తి వక్షస్థలమే అనగా అంతర్గత సూర్యమండలమే నిత్య నివాసముగా స్ఫురించు తేజోరూపిణి, దారిద్య్రమును దానివలన కలుగు దుఃఖమును దానికి ముందు వెనుక కన్పట్టు భయమున పారద్రోలు అమృతవర్షిణి ‘‘అన్నపూర్ణాదేవి’’ అని స్తుతించారు, శంకర భగవత్పాదులు. ఇది అన్నపూర్ణాదేవి తత్త్వాన్ని తెలియజేస్తుంది.
‘యజ్ఞకృత్ యజ్ఞ గుహ్యమన్న మన్నాద ఏవచ- విష్ణు సహస్రనామ’- సకాలల వర్షములకు, అన్నసమృద్ధికి, సర్వజన ఆరోగ్య భాగ్యాన్ని కాంక్షిస్తూ యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహిస్తారు. సృష్టిలయములనే విశిష్టములైన యజ్ఞాలు నిర్వహించే స్వామి యజ్ఞకృత్. యజ్ఞ్ఫలాన్ని ప్రసాదించే స్వామి యజ్ఞాంతకృత్. యజ్ఞములలోకెల్ల జ్ఞానయజ్ఞ స్వరూపుడు స్వామి. యజ్ఞంలోని పరమార్థమైన పరబ్రహ్మ తత్త్వం తానేయైన స్వామి యజ్ఞగుహ్యుడు. సకల భూతరాశికి ఆహారము తానే అయిన పరమాత్మ - అన్నస్వరూపుడు. ప్రాణికోటి రూపంతో ఆహారాన్ని స్వీకరించేది కూడా ఆ పరమాత్మే. అన్నము తానే, ఆహారాన్ని స్వీకరించేది ప్రాణికోటి రూపంలో ఆయనే. రెండూ పరమాత్మ స్వరూపాలే. ఆ పరమాత్మలోని మహాశక్తి అన్నపూర్ణాదేవి. ‘‘అహమన్నం అహమన్నం అహమన్నం అహమన్నమ్ అహమన్నాదోహమన్నాదః’’ అని తైత్తిరీయక శ్రుతి, భృగువల్లి’’ గూర్చి వివరించింది.
వాగ్గేయకారత్రయమైన శ్యామశాస్ర్తీ, ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజస్వాములలో, ముత్తుస్వామి దీక్షితులు- అన్నపూర్ణాదేవిని ఆరాధించి జ్ఞాన వైరాగ్యసిద్ధిని పొందిన నాదయోగి. ఆయన, ఐదవ ఏటనే చిదంబరనాధ యోగీంద్రులవారి వెంట కాశీ క్షేత్రానికి వెళ్లారు. రోజూ గంగాస్నానం, శ్రీ విశ్వనాధుని దర్శనం, అభిషేకం శ్రీవిద్యోపదేశముగా శ్రీ చక్రార్చన, జగన్మాత ఆరాధన దీక్షితుల దినచర్య. ఒకనాడు చిదంబర నాధయోగీంద్రులు, దీక్షితులవారిని అన్నపూర్ణాదేవి ఆలయానికి స్వయంగా తీసికొని వెళ్లారు. ‘‘నీపై జగన్మాతకు పరిపూర్ణమైన అనుగ్రహము కలిగినది. నిన్ను జగన్మాత ఎల్లవేళలా కాపాడుతుంది. అంత్యమున మోక్షాన్నిస్తుంది. ఎక్కడ ఉన్నా అన్నపూర్ణాదేవిని ఆరాధించు’’ అని ఉపదేశించారు. మరునాడు ప్రాతఃకాలమున గంగానదిలో స్నానం చేస్తుండగా ఆయనకు ఒక వీణ కాలికి తగిలింది. దానిమీద దేవనాగరి లిపిలో ‘రామ’ అని వ్రాసి ఉంది, యాలి పైకి తిరిగి ఉంది. చిదంబరనాధ యోగీంద్రులవారు, ‘‘ఇది నీకు అన్నపూర్ణాదేవి అనుగ్రహించిన ప్రసాదం. నీవు గొప్ప వాగ్గేయకారుడివి అవుతావు’’ అని దీవించారు.
ఆ వీణపై మ్రోగిస్తూ అప్పటికప్పుడు దీక్షితులు ‘‘అన్నపూర్ణే విశాలాక్షి అఖిల భువనసాక్షి, కటాక్షి; ఉన్నత గర్తా తేర విహారిణి ఓంకారిణి దురితాపన్నివారిణి, పన్నగాభరణరాజ్ఞి, పురాణి పరమేశ్వరి విశే్వశ్వరి భాస్వరి; పాయసాన్న పూరిత మాణిక్యపాత్ర హేమ దర్వీ విధృత కరే కాయజాది రక్షణ నిపుణ తరే, కాంచన మయ భూషణాంబర ధరే..’’ మాణిక్యమయమైన పాత్రలో ప్రీతికరమైన పాయసమును, బంగారు గరిటెతో ప్రసాదిస్తూ, మోక్షాన్ని అనుగ్రహించే జగన్మాత అన్నపూర్ణాదేవి అని, కర్ణాటక దేవ గాంధారి రాగంలో (ప్రస్తుతం సామరాగంలో గానం చేస్తున్నారు) ఆర్ద్రతతో గానం చేశాడు. శ్రీదేవీ శరన్నవరాత్రి పూజలో, అన్నపూర్ణాదేవి ఆరాధన రోజున అమ్మ భక్తుడైన ముత్తుస్వామి దీక్షితుల్ని ఆయన కీర్తనల్ని తప్పనిసరిగా మననం చేసికోవాలి.
ముత్తుస్వామి దీక్షితులు తీర్థయాత్రలు చేస్తూ దక్షిణాపథానికి వచ్చేశాడు. నరకచతుర్దశి రోజున, అన్నపూర్ణాదేవి దివ్య తేజోరూపంగా దర్శనమిచ్చిందాయనకు. నవావరణ పూజ ముగించి భాషాంగరాగమైన హనుమత్తోడి జన్యము నిషాదాంత్యమన పున్నాగవరాళి రాగంలో ‘‘ఏహి అన్నపూర్ణే సన్నిదేహి సదా పూర్ణే, సువర్ణే మాంపాహి పంచాశద్వర్ణే మాంపాహి, పంచాశద్వర్ణే శ్రీయం దేహి, రక్తవర్ణే అపర్ణే కాశీక్షేత్ర నివాసిని కమలలోచన విశాలిని, విశే్వశ మనోల్లాసిని జగదీశ గురు గుహపాలిని, విద్రుమపాశిని, పున్నాగవరాళి ప్రకాశిని, భక్తవిశ్వాసిని, చిదానంద విలాసిని అని కీర్తిస్తూ అన్నపూర్ణాదేవి కటాక్ష సిద్ధినొంది, ఆ దివ్య తేజస్సులో లీనమైనాడు ముత్తుస్వామి దీక్షితులు. ఈరోజుకి కాశీలో హనుమాన్ ఘాట్‌లో శ్రీ చక్రేశ్వర శివాలయంలో, దీక్షితులవారి విగ్రహం దర్శించవచ్చు. జగన్మాతతోపాటు తల్లి భక్తుల్ని తలుచుకోవడం ఈ రోజున అంతే ముఖ్యం.
‘‘పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే’’- అఖిల ప్రపంచమూ ఆ పూర్ణ శక్తినుండి వచ్చింది. అయినా ఆ శక్తి యింకా పూర్ణమే. ఆ పూర్ణశక్తియే అన్నపూర్ణాదేవి.
‘కాశీ’ అంటే వెలుగు. మంచి మనసు కలిగి, త్యాగధనులైన వారి చేతులయందు వెలుగు ఉంటుంది. కనుకనే అటువంటివారి కరములతో వడ్డించిన భోజనం చేస్తే అమృతంగా మారి, భుజించినవారికి జ్ఞానవెలుగు దర్శనమిస్తుంది. బంగారంలో అంతర్లీనంగా అగ్ని ఉంటుందని వేదం చెప్పింది. అటువంటి అగ్నితత్త్వం కలిగిన బంగారు ఆభరణాలతో, వెలుగుకు నిలయమైన కాశీ క్షేత్రంలో వెలసిన అన్నపూర్ణాదేవిని, జగజ్జేగీయమానంగా అలంకరిస్తారు- దీపావళి పండుగ రోజున. ఆ వెలుగును చూచినవారి జీవితం ధన్యం. అనంతమైన విశ్వశక్తిని అర్థం చేసుకొని, విశ్వమానవ కల్యాణాన్ని వీక్షించాలని ఉద్బోధిస్తోంది అన్నపూర్ణాదేవి.
‘‘ఈశానాం జగతోస్య వేంకట పతేర్విష్ణోః పరాం ప్రేయసేం
తద్వక్షస్థల నిత్యవాసి రసికాం తక్షాంతి సంవర్థనీం
పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసన స్థాం శ్రీయం
వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్’’
-శ్రీవేంకటేశ ప్రపత్తిః
‘శ్రీ’ అంటే పంచేంద్రియాలు. భగవంతుని క్షేత్ర దర్శన సంపద కళ్ళు. వినే సంపద- చెవులు. భగవదర్పిత సుగంధం ఆఘ్రాణించే సంపద- నాసిక. భగవంతుని గుణములను గానం చేసే సంపద- నోరు. భగవత్ మహిమను లీలలను, ఆయన కరుణా కటాక్షములను నిరంతరం చింతించే సంపద మనస్సు. ఈ అయిదు సంపదలు, మానవ దేహంలో, శిరస్సులో కేంద్రీకృతమై ఉన్నాయి. అదే మూల పదార్థం. అక్కడే వున్న సహస్రార చక్రంలో కుండలినీయోగ శక్తి ప్రస్ఫుటవౌతుంది. సహస్రారాంతర్గత చంద్రమండలంలో కుండలిని ప్రవేశించగానే అమృతధారలు వర్షిస్తాయి. ఇదే జీవబ్రహ్మైక్యస్థితి. ఆ స్థితిని ప్రసాదించే శ్రీ శక్తి- శ్రీమహాలక్ష్మి.
‘వ’కారం జ్ఞానశక్తి వాచకం, ‘ఇ’కారం ఇచ్ఛాశక్తి వాచకం, ‘కట’ అంటే కురిపించేది అని అర్థం. కనుక పంచేంద్రియాలతో శ్రీమంతమైన శ్రీగిరి శిఖర నివాసియై, సాత్వికేంద్రియాలన్నీ లక్ష్మీ సంపదకు రమణుడై జ్ఞాన ఇచ్ఛాశక్తులను నిండుగా ప్రవహింపజేసి, నిద్రాణమైన శక్తిని ప్రకటింపజేసి, ఉద్ధరించి, భక్తుల పాపములను పోగొట్టి, యిష్టార్థాలను ప్రసాదించువానిగా, ఈశుడైన వేంకటేశుని, శక్తివంతునిగా చేసింది శ్రీ మహాలక్ష్మి.
కనుకనే ‘‘సమస్త లోకములకు తల్లివైన ఓ లక్ష్మీదేవీ, శ్రీ విష్ణుమూర్తి అయిన శ్రీవేంకటాచలపతికి ప్రియమైన దానవై, అతని విశాల వక్షస్థలమున వసించి, విహరిస్తూ అతనికి సహనశక్తిని పెంపొందించే జగన్మాతా, మహాలక్ష్మీ నీకు నమస్కరించుచున్నామని’’, శ్రీ వేంకటేశ ప్రపత్తిలో, శ్రీలక్ష్మీదేవిని ప్రస్తావించి, శ్రీవేంకటేశ్వర సుప్రభాత సేవలో ప్రార్థించారు. ఇది ప్రతిరోజు పవిత్ర పుణ్యక్షేత్రమయిన కలియుగ వైకుంఠం- తిరుమలలో శ్రీ వేంకటేశ్వర సుప్రభాత సేవలో శ్రీ లక్ష్మీ అమ్మవారి పరంగా చేసే ప్రార్థన. అంతేకాదు, శ్రీ వేంకటేశ్వర స్వామిని ‘బాల’ శక్తిగా (బాలాజీ) భావించి దేశీ శరన్నవరాత్రుత్సవములలో, బాలశక్తికి బ్రహ్మోత్సవములు జరుపుటలో గల సామరస్యం విశదమవుతుంది.
ఈ విశ్వమంతా విష్ణుమయం. విశే్వశ్వరి - శ్రీమహాలక్ష్మి. విశ్వానికి విష్ణువుకు భేదం లేదు. అలాగే శ్రీ మహావిష్ణువుకి, శ్రీ మహాలక్ష్మికి తేడా లేదు. శ్రీ మహాలక్ష్మి- భోగరూంలో భవానిగా, రణరంగంలో దుర్గగా రౌద్రంలో మహాకాళిగా పుంభావ రూపంలో విష్ణువుగా భాసిల్లుతుంది.
మంచి పనులకు, మంచి ఆలోచనలకు- మహాలక్ష్మి కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. శ్రీమహాలక్ష్మి సర్వదా చిరునవ్వు చిందించే ప్రసన్నవదన. పంచమి నాటి చంద్రకళలో మహాలక్ష్మీ వైభవం కనపడుతుంది. శ్రీపంచమి ఒక పర్వదినం. ఐదు సంఖ్య జీవితంలో ప్రాముఖ్యత వహిస్తుంది. అందుకే జగన్మాతను పంచహారతులతో అర్చిస్తారు. ఐదు సంఖ్యకు అధిపతి బుధుడు. బుధుడు విష్ణుపాదోద్భవుడు. విజ్ఞాన కారకుడు- బుధుడు. వ్యాపార వాణిజ్య కారకుడు కూడా. అందుకే బుధ అనుగ్రహం ఉన్నవారు ఉన్నత వ్యాపారం చేస్తారు. శ్రీ మహాలక్ష్మి కటాక్షం పొందుతారు.
‘‘కరాగ్రే వర్తతే లక్ష్మీః, కరమధ్యే సరస్వతి, కరమూలేతు శర్వాణీ, ప్రభాతే కరదర్శనం..’’ మన చేతి వేళ్ళు ఐదు. ఈ అయిదు వేళ్ళలో పంచబ్రహ్మలు, పంచభూతములు, పంచతన్మాత్రలు పంచేంద్రియములు ప్రతినిహితమై ఉంటాయని చెప్తారు. అరచేతిలో సరస్వతి, వేళ్లలో మహాలక్ష్మి ముంజేతిలో పార్వతిని వసిస్తారని, కనుక ఉదయానే్న నిద్ర లేవగానే చేతులు చూసుకుని, జగన్మాతను తలచుకని, రెండు చేతులూ కలిపి నమస్కారం చేస్తే ఆ రోజంతా శుభంగా జరుగుతుందని, త్రిమాతలే తమని ప్రభాత సమయంలో కొలిచిన బిడ్డలకు రక్షణ ఇస్తారని పెద్దలు చెప్తారు.
భక్తులకు సర్వదా కరుణా కటాక్షములను ప్రసాదించే కరుణామయి శ్రీ మహాలక్ష్మి. శరత్కాల పండు వెనె్నలలాంటిది శ్రీ మహాలక్ష్మి సాన్నిధ్యం. ఎందుకంటే చంద్రుడు లక్ష్మీదేవి-ఇద్దరూ క్షీర సాగర మథన సమయంలో ఆవిర్భవించినవారే. మంచి పనులకు, మంచి ఆలోచనలకు మహాలక్ష్మి కటాక్షం ఎప్పుడూ ఉంటుంది.
మహాలక్ష్మీదేవి ప్రేమ స్వరూపిణి, చిత్కళ. మనస్సే ఆ తల్లి వాక్కు. జగన్మాత చిదానందమే, ఆమె భక్తులకు ప్రేమామృతంగా భాసిల్లుతుంది. లక్ష్మీదేవి చంద్ర సహోదరి. లోకాల్ని ప్రేమ స్వరూపంతో పాలించే జగన్మాత శ్రీ మహాలక్ష్మి. లక్ష్మీదేవి కరుణా కటాక్షంతో అదృష్టం అర్ణవంలా పొంగిపొర్లుతుంది. సారహీనమైన ప్రపంచాన్ని అర్థవంతం చేసి, అర్థాన్ని ధర్మంతో అనుసంధానం చేస్తే, మోక్షాన్ని ప్రసాదించే ముక్తిప్రదాయిని, మోక్షలక్ష్మి- శ్రీ మహాలక్ష్మి. చంద్ర సహోదరి కనుక, తనను భక్తిశ్రద్ధలతో కొలిచేవారికి మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది. అందుకే చంద్ర మహర్దశ జరుగుతున్నపుడు, జాతకంలో చంద్రుడు సరియైన స్థానంలో లేనప్పుడు, లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమపూజ చేసి, ఆ కుంకుమను నుదుట పెట్టుకోమంటారు.
సూర్య తేజముగల, లక్ష్మీదేవి తప్ఫఃలంగా, పుష్పించకుండానే ఫలించే మారేడు వృక్షం పుట్టింది. అంతరింద్రియ బాహ్యేంద్రియములను దారిద్య్రాన్ని నశింపజేసే బిల్వ వృక్ష ఫలములు శ్రీదేవి అనుగ్రహము. మారేడు దళములు లక్ష్మీ స్వరూపం.
‘‘్ధనమగ్నిర్థనం వాయుః ధనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతి ర్వారుణం ధనమశ్నుతే’’ అన్నది శ్రీసూక్తం. అగ్ని వాయువు, సూర్యుడు, వసువు, ఇంద్రుడు, బృహస్పతి, వరుణుడు అను ఏడుగురు ‘్ధన’ శబ్దముచే చెప్పబడ్డారు. ధన శబ్దానికి అధిపతి, శ్రీ మహాలక్ష్మి. లౌకికమైన ధనముతోపాటు, అగ్ని మొదలగు వారి తేజోరూపమున ధనాన్ని కూడా ప్రసాదించే శక్తి- శ్రీ మహాలక్ష్మి. ‘‘ఆయుర్దా అగ్నే, అగ్నిర్మే వాచిశ్రీతః అనే వేద వాక్యమువలన, అగ్ని ఆయుర్దాన్ని, ఐశ్వర్యమును బలమును చేకూర్చేవాడు. జఠరాగ్నిని ప్రేరేపించి జీర్ణక్రియను సరిగా ఉంచి ఆరోగ్యాన్నిచ్చేవాడు, వాక్కును చేకూర్చేవాడు ‘వాయుర్మేప్రాణౌశ్రీతః’ వాయువు ప్రాణశక్తిని ప్రసాదిస్తాడు. ‘సూర్యోమే చక్షుషి శ్రీతః’ సూర్యుడు దర్శనశక్తిని, హృదయ శక్తిని ప్రసాదిస్తాడు. ‘‘వసువు శారీరక తేజస్సును యిస్తాడు’’. ఇంద్రోమే బలే శ్రీతః- ఇంద్రుడు బలాన్నిస్తాడు; బుద్ధికి అధిపతి బృహస్పతి. కనుక బుద్ధిబలముతో జ్ఞాన సంపదను అనుగ్రహించేవాడు బృహస్పతి. వరుణుడు- జలాధిపతి, శతృసంహారకుడు. కనుక వరుణునిచే జలశక్తి, శతృసంహారక శక్తి లభిస్తాయి. ఈ అగ్ని, వాయు, సూర్య, వసువు, బృహస్పతి, వరుణులందరూ- ఆ శ్రీ మహాలక్ష్మి అంశ. కనుక శ్రీమహాలక్ష్మి కటాక్షసిద్ధితో ఇవన్నీ లభిస్తాయి. ఆ దేవతల అనుగ్రహాన్ని పొందినవాడే అసలైన ధనవంతుడు, మహాలక్ష్మీ కటాక్షసిద్ధుడు.
‘పకృతి’ అన్నమాటను పదిహేను తత్త్వములుగల శ్రీమాతగా భావించి ఆధ్యాత్మిక సాధనలో శ్రీమాతను ఉపాసించి, ‘‘వేదాంత పంచదశి’ అనే గ్రంథాన్ని మనకందించిన శ్రీవిద్యోపాసనాసిద్ధుడు శ్రీ విద్యారణ్యస్వామి. విజయనగర సామ్రాజ్య స్థాపకుడై, ప్రజలు కాలవశాత్తు మిక్కిలి దారిద్య్రాన్ని అనుభవించటాన్ని చూసి, జాలి చెంది, లక్ష్మీదేవిని ప్రార్థించి ఉపాసన చేశాడు. తల్లి కటాక్షంతో సువర్ణ వృష్టి కురిసింది. ఇది శ్రీ లక్ష్మీ కటాక్ష సిద్ధిని స్వార్థరహితంగా, ప్రజోపయోగమునకు ఉపకరించిన సద్గురువులు శ్రీ విద్యారణ్యస్వామి. ఇది చరిత్ర చెపుతున్న లక్ష్మీ కటాక్షసిద్ధి.
మహాలక్ష్మీదేవిని ‘కనకధారాస్తవంతో’ స్తుతించి, పుణ్య....... దారిద్య్ర బాధను నివారించారు, జగద్గురు ఆదిశంకరాచార్యులు.
సూర్యచంద్రాగ్ని సమాన ప్రకాశ తేజోరాశి- శ్రీమహాలక్ష్మి. మనలో వుండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే శతృవులను అణచి, భక్తులకు సద్బుద్ధినిచ్చి, పుత్ర పౌత్రాభివృద్ధిని ధనాన్ని పశుసంపదను అనుగ్రహించి దీర్ఘాయుష్మంతులుగా చేసే కరుణామయి శ్రీ మహాలక్ష్మి.
‘లక్షయతీతి లక్ష్మీః’ అని లక్ష్మీ శబ్దానికి వుత్పత్యర్థం. లక్షింపజేసేదేదో అది లక్ష్మి. జగజ్జనని లక్ష్మీదేవి ఎంత దారి చూపేదైనా ఆ మూల తత్త్వాన్ని అందుకొందామనే దీక్ష మనకి ఉండాలి. ఐహికమైన కోరికలు ఉంటే అవి సత్సంకల్పాలయితే, నిస్వార్థంగా ఉండి, నలుగురికి ఉపకరించేవైతే తల్లి ఆశీస్సులుంటాయి. ముముక్షువులై సేవిస్తే మోక్షలక్ష్మి. అందుకే సిద్ధి లక్ష్మి నుండి మోక్ష లక్ష్మివరకూ తల్లి అనుగ్రహమే.
‘‘సిద్ధ లక్ష్మీర్మోక్ష లక్ష్మీర్జయలక్ష్మీ స్సరస్వతీ, శ్రీలక్ష్మీ ద్వారలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదాః’’- తలచినంత మాత్రాన కోరికలను సిద్ధింపజేసే సిద్ధలక్ష్మిగాను, ముక్తిని అనుగ్రహించే మోక్షలక్ష్మిగాను, విజయాన్ని సిద్ధింపజేసే జయలక్ష్మిగాను, పద్మకాసారంలో ఉద్భవించి సంపదలిచ్చే శ్రీదేవిగాను, వరాలు ప్రసాదించే వరలక్ష్మిగాను విరాజిల్లుతున్న ఓ మహాలక్ష్మీ నీవు సర్వవేళలా నాయందు ప్రసన్న చిత్తముతో ఉందువు గాక అని జగన్మాతను ప్రార్థించటం జరిగింది శ్రీసూక్తంలో.
‘‘చంద్రాం హిరణ్మరుూం...’’ చంద్రుడిలా స్వచ్ఛమైనది, సౌమ్యమయినది, ఎటువంటి నామరూప వాసనామాలిన్యము లేనిది ఆ తల్లి. ఆ జగన్మాతను నా మనసులో ప్రవేశపెట్టి మహాలక్ష్మీదేవిని ఉపాసించేటట్లు చేయమని ప్రార్థిస్తున్నాం మనం, ఎవరిని? అగ్నిదేవుణ్ణి.
‘‘అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోదినీమ్
శ్రీయం దేవీ ముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్’’- శ్రీసూక్తం.
గుఱ్ఱాలు ముందుంటే రథాలు మధ్యలో ఏనుగులు ఘీంకారం చేస్తూ వాటి వెనకాల నడుస్తుంటాయి. ‘ఇంద్రియాణి హయానాహుః’ అన్నది కఠోపనిషత్- ఇంద్రియాలే అశ్వాలు. ‘ఆశుగచ్ఛతీతి అశ్వః’ అతి వేగంగా పరుగెత్తేదేదో అది అశ్వం. అవి ఇంద్రియాలే. గుఱ్ఱాలీడ్చుకుపోతుంటే, ఇది కదిలిపోతుంది. రథమంటే మన శరీరం. ‘శరీరం రథమేవతు’. ఇంద్రియాలనే గుఱ్ఱాలీడ్చుకుపోతుంటే, ఇది కదిలిపోతుంది. అందుకే వాటి వెనకాలే మధ్యలో ఉంటుంది శరీరం.
‘హస్తినాద ప్రబోధినీం’- శరీరంకన్నా వెనకాల ఉన్నది- హస్తి అనగా ఏనుగు- మన అహంకారం. శరీరాన్ని మమకారంతో చూస్తోంది. దానికంటె ముందున్న ఇంద్రియాలనే అశ్వాలు దాన్ని రుూడ్చుకుపోయి విషయానుభవమిస్తున్నాయి, జీవుడికి. ఇది జీవుడికి వున్న సంసార బంధం. అహంకారమనే ఏనుగు ఆక్రందన చేస్తుంటే దాన్ని ప్రజ్వలింపజేస్తుంది మాయాశక్తి. అదే ‘హరిణి’. మనలను సంసారాభిముఖంగా హరిస్తుంది. అలా కాకుండా సాయుజ్యం వైపు తీసుకెళ్లాలి. దీనికి ‘శ్రీ’ కావాలి. ఆ శ్రీదేవినే ‘పహ్వయే’ మనలోకి ఆవాహనం చేసుకోవాలి. శరీరమనే రథ మధ్యస్థగు లక్ష్మియే చైతన్య లక్ష్మి. చెవులు మూసుకొంటే వినపడు నాదమే హస్తినాదం- అదే వేణునాదం-వీణానాదం- వేదనాదం- శంఖధ్వని. ఆ నాదం చేత నిరంతరం బోధింపబడుతున్న చైతన్య లక్ష్మిని ఆరాధిస్తే పరమాత్మను చేరుకునే సన్నిధి చూపిస్తుంది.
ఈ ఆరాధనతో మానవుడు ఇంద్రియాలను, తను చెప్పినట్లు నడుచుకొనేటట్లు చేసికొని, మనస్సును అదుపులో ఉంచుకొని, తన శరీర రూప రథాన్ని భగవంతుని వైపు త్రిప్పుకొని, సన్మార్గం వైపు మరలి పవిత్రులు అవ్వాలని హితవు చెపుతోంది శ్రీ మహాలక్ష్మి.
‘‘కమలజ కన్నతల్లి, కాముని గన్నతల్లి అమరుల గన్నతల్లి ఆదిమ లక్ష్మి విమలవు నీ పతికి విన్నపము సేసి మమ్ము నెమకి యేలితి దయ నీకే తగునమ్మా’’ అన్నాడు అన్నమయ్య; ‘‘మా జానకి చెట్ట బట్టగా మహారాజువైతివి’’ అని, ‘మా’ అంటే లక్ష్మీస్వరూపురాలైన జానకి అన్న భావాన్ని తెలియజేశాడు శ్రీ త్యాగరాజస్వామి. ‘‘మహాలక్ష్మి కరుణారస లహరి, ....... మాధవ మనోహరి మహావిష్ణు వక్షఃస్థలవాసిని, మహాదేవ గురు గుహ విశ్వాసిని, మహాపాప ప్రశమని, మనోన్మణి, మారజనని, మంగళప్రదాయిని- సదా నమస్తే మహాలక్ష్మీ అని కీర్తించాడు ముత్తుస్వామి దీక్షితులు, ముదావహంతో.
అర్థాన్ని ధర్మవర్తనతో పొంది, మరల అర్థాన్ని అర్థవంతంగా చేయటానికి ధర్మంతో కలిపి, లోక కల్యాణార్థం, ధర్మకార్యాచరణ చేసి, జీవితాన్ని సార్థకం చేసికోవాలని చెప్తోంది- శ్రీ మహాలక్ష్మి పూజ.
దుష్టత్వాన్ని అణచి, సాధుత్వాన్ని పెంచి శాశ్వతమైన శాంతి సౌఖ్యాలను ప్రసాదించే జగన్మాత- శ్రీ దుర్గాదేవి. పండు వెనె్నలను నిండుగా పండించే శరదృతువులో, చంద్రునిలాగా, బిడ్డలను చల్లగా కాపాడే జనని- శ్రీ దుర్గామాత. అష్టకష్టాలతో సతమతమవుతున్న ప్రజలను, అష్టమినాటి దుర్గ అన్ని విధములా ఆదుకొని కటాక్షించి ఆనందింపజేస్తుందని పురాణ ప్రశస్తి.
లోక కళ్యాణం, లోకపోషణ, శ్రీమహాదుర్గ లక్ష్యం. దుష్టశిక్షణలో ఎంత కాఠిన్యం వహిస్తుందో, శిష్టరక్షణలో అంత దయార్ద్ర హృదయ భావనాశక్తిని ప్రసాదించే తల్లి- దుర్గామాత. అద్వైత ఐక్యతాభావనతో భయాన్ని తొలగించి, భక్త్భివాన్ని కలిగించి, శాంభవీ ముద్రలో, భక్తులకు అభయమిచ్చి, ఆశ్రయమిచ్చి, శ్రేయస్సును చేకూర్చి, భవాని విభవంగా అందించే భవాని- శ్రీ దుర్గామాత. అందుకే మంచి భావనాశక్తిని ప్రసాదించమని పోతన, శరణాగతితో ఆర్ద్రతతో ఆర్తిగా అపార భక్తి తత్పరతతో దుర్గామాతను ప్రార్థించాడు, ఈ విధంగా:
‘‘అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ తన్నులో
నమ్మిన వేల్పుటమ్ముల మనమ్ముల నుండెడియమ్మ దుర్గామా
యమ్మ కృతాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్
ముగురమ్మలు ఎవరు? మూలపుటమ్మ ఎవరు? మూల పుటమ్మ ఎవరో ఆయనే చెప్పాడు- శ్రీ దుర్గాదేవి అని.
దుర్గాదేవి అంటే శివుని అర్ధాంగి, పార్వతి అని గదా ప్రసిద్ధి. అయితే ఈ ముగ్గురమ్మలలో పార్వతీదేవి లేదా? సరస్వతి లక్ష్మి పార్వతి వీరు ముగ్గురూ చేరితేనే ముగురమ్మలవుతారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులయినట్లు. కాని చివరలో ‘దుర్గమాయమ్మ’ అన్నాడు పోతన.
పోతన మనసు ఉన్నది, దుర్గ అంటే పార్వతి కాదు, ఎంతో కష్టంమీద గాని గ్రహించలేనిదేదో అది ‘దుర్గ’. పరమాత్మ మాయాశక్తికే దుర్గ అని పేరు. అన్నింటికీ మూలభూతమయినది ఆ శక్తి- ఆదిశక్తి, పరాశక్తి. ఆ మహాశక్తే సృష్టించవలసి సరస్వతి అయింది, పోషించవలసి లక్ష్మీదేవి అయింది. ఉపసంహరించవలసి పార్వతి అయింది. వీరికి మూలభూతమైన ఏకైక శక్తి ఆ పరాశక్తి. కనుక పరాశక్తే, ఈ ముగ్గురమ్మలకు మూలపుటమ్మ అయింది.
మరి త్రిమూర్తులుగదా సృష్టి, స్థితి, లయాలు చేసేది? ఔను వారే చేసేది. వారు స్వయంగా తమ పాటికి తాము చేయలేదా పనులు. తమ తమ శక్తులనాధారంగా చేసికొని చేస్తారు. శక్తి కూడా వారిని ఆశ్రయించి ఉంటుంది. కనుక వారు ముగ్గురే ముగురమ్మలు. త్రిగుణాత్మకమయిన ఈ మూల ప్రకృతే ముగురమ్మల మూలపుటమ్మ ఆ జగన్మాతే- శ్రీ దుర్గామాత.
ద్, ఉ, ఋ, గ్, ఆ అను అక్షరముల కలయికయే ‘దుర్గ’. అనగా సర్వపాపములను శమింపజేసి, శమదమాది గుణ సంపత్తి నొసగి, సంసారాంబుధిని దాటించి తరింపజేయు మార్గమును చూపి, దుష్టులకు వశముగాని అజేయశక్తులను భక్తులకొసగి, రక్షణ ఇవ్వగల దుర్గము అనగా ఒక ‘కోట’ వంటి శ్రీ దుర్గామాత.
అగ్ని స్వరూపంగా ఈ సమస్త జగత్తును సస్యశ్యామలంగా సుభిక్షంగా చేసి, దుఃఖముల బారినుండి రక్షించి, సదా శ్రేయస్సును ఇస్తుంది. భక్తులు తరింపజే మంచి మర్గాన్ని చూపి జీవిత పరమార్థాన్ని తెలియజేసి, సంప్రాప్తింపజేస్తుంది. అందుకే దుర్గాసూక్తంలో ‘కాత్యాయ నాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్’’ అని చెప్పబడింది.
‘‘దుర్గాత్తారయసే దుర్గే తత్త్వం దుర్గా స్మృతాజనైః’’-కష్టములనుండి తరింపజేయునది గావున జగన్మాతకు ‘దుర్గ’ అనే పేరు వచ్చింది.
‘క్షపిత పశు పాశ వ్యతికరః పరానందభిఖ్యం రసయతి రసం’ అని వచించారు శ్రీ శంకర భగవత్పాదులు, సౌందర్యలహరిలో. పశుపతి అగు సదాశివునితో కలిసి యున్న పరాశక్తి, ఆదిత్య మండలాంతర్గతమైన బైందవీ శక్తినిచ్చి, అవిద్యాకరమైన పాశబంధాన్ని, విమోచనము కల్గించు మాత- దుర్గాదేవి. ఇక్కడ పశువు అంటే జీవుడు, పాశము ‘అవిద్య’. పశుపాశము అనగా జీవ అవిద్యల సంబంధమును నశింపజేసి, పరమానందమనబడు జ్యోతి రూపముగా, సదాశివ తత్త్వాత్మకమును, ప్రసాదించు భగవతి- శ్రీ దుర్గామాత.
‘‘అనిర్వేద శ్రీయోమూల మనిర్వేదః పరం సుఖం అనిర్యేదో సతతం సర్వార్దేషు ప్రవర్తకః కరోతి సఫలం కర్మ యత్తత్కరోతిసః తస్మా దనిర్వేద కృతం యత్న చేష్టే అహముత్తమం’’ అన్నారు వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణంలో.
నిర్వేదమంటే విచారము అనగా దుఃఖము. అనిర్వేదమంటే విచారము, దుఃఖము లేకుండుట. శ్రీయోమూలమంటే, శ్రేయస్సునకు మూలకారణం. దుఃఖము లేకుండా ఉండటమే ఐశ్వర్యమునకు మూలకారణం. అదే పరమసుఖం. దుఃఖము లేకుండా ఉంటే సకల కార్యములు సకల వాంఛలు నెఱవేరుతాయి. కనుక దుఃఖాన్ని దరిచేరనీయకుండా ప్రతివారూ ప్రయత్నించాలి. దుఃఖము విచారభారంతో మానవుడు కృంగిపోతాడు. దుఃఖభారాన్ని తొలగించుకొని, ద్విగుణీకృతోత్సాహంతో ధైర్యసాహసములతో మానవుడు ముందడుగు వేయాలన్న మహోదాత్త సందేశాన్ని మనకందించారు-వాల్మీకి మహర్షి. అటువంటి దుఃఖాన్ని పోగొట్టే ‘దుఃఖహంత్రిణి’ దుర్గామాత.
క్షేత్రము, తీర్థము దైవము- అనే మూడూ, దేనికవే పవిత్రమైనవి. అవి మూడూ త్రిపుటిగా ఒక్కచో నెలకొని ఉంటే అది మహా పవిత్రమైన పుణ్యక్షేత్రం. క్షేత్రము- ఇంద్రకీలాద్రి, తీర్థము- కృష్ణవేణీ నది, దైవము- స్వయంభువు శ్రీ కనకదుర్గాదేవి. మరి ఆ ప్రదేశం విజయవాడ.
పవిత్ర కృష్ణానదీ తీరం విజయవాడలో నెలకొన్న దుర్గామాతను గురించి స్కాంద పురాణంలో వివరించబడింది. ‘ఇంద్రకేలుడ’డనే శాక్తేయుడు దుర్గామాతను గురించి తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన పరాశక్తిని, తన గర్భములో వశింపుమని ప్రార్థించాడు. ‘‘నీవు పర్వత రూపాన్ని పొందుతావు. తగిన సమయంలో నీ కోర్కె నెరవేరగలదు’’ అని అభయమిచ్చింది మాత. అందుకే విజయవాడలోని పర్వతానికి ‘ఇంద్రకీలాద్రి’ అని పేరు వచ్చింది. మహిషాసుర వధానంతరం, మహిషాసురమర్దినిగా, దుర్గాదేవి ఇంద్రకీలాద్రిపై, స్వయంభువుగా వెలసింది. అరుణోదయ రాగ శోభతో, రక్తాంత నేత్రములతో అతి భయంకరంగానున్న దుర్గామాతను సామాన్యులు వీక్షించలేరన్న దృష్టితో ఆదిశంకరులు, శాంతి యంత్రాన్ని ప్రతిష్ఠించారు. అప్పటినుండి దుర్గాదేవి ప్రసన్న వదనంతో భక్తుల కోర్కెలను నెఱవేరస్తూ, కన్నతల్లిలాగా కరుణిస్తోంది. ఇక్కడ కుంకుమతో శ్రీచక్రార్చన, లలితా సహస్రనామములతో జరపటం విశేషం.
పూర్వము మాధవ వర్మ అనే రాజు ప్రజారంజకముగా ధర్మపరిపాలన చేస్తుండేవాడు. ఒక రోజున అతని కుమారుడు కట్టిన గుఱ్ఱపు బండి క్రిందపడి, నిరుపేద అయిన బాలుడు మరణించాడు. ధర్మప్రభువైన మాధవ వర్మ, తన కన్న కుమారునికే మరణశిక్ష విధించాడు. అతని ధర్మబుద్ధికి సంతుష్ఠురాలైన దుర్గామాత, ఆ బాలకుణ్ణి జీవింపజేసి కనకవర్షం కురిపించింది. ఆనాటినుండి దుర్గామాతకు ‘కనకదుర్గ’ నామము సార్థకమయింది.
దుర్గముడనే రాక్షసుడు వేద విజ్ఞానాన్ని తన వద్దే నిక్షిప్తమయ్యేటట్లుగా బ్రహ్మ వద్ద వరం పొంది, ప్రజాపీడనంగా రాజ్యమేలుతున్నాడు. వర్షములు లేక, పంటలు పండక అనాష్టితో ప్రజలు అన్నపానములు లేక అలమటిస్తున్నారు. ఇతరులను కష్టాలపాలుచేసి, వారు బాధపడుతుంటే సంతోషించే స్వభావముగలవారు రాక్షసులు. దేవతలందరూ పరాశక్తికి ఈ వృత్తాంతం తెలిపి, రక్షించమని ప్రార్థించారు. ‘శతాక్షి’ అయిన జగన్మాత కన్నులనుండి సంతతధారగా సర్వౌషధములతో గూడిన వర్షము తొమ్మిదిరోజులు వర్షించగా, సర్వ జలాశయములు నిండి, సస్యశ్యామలమయినది. తన హస్తములందుండిన శాకములతో గూడిన భోజన పదార్థములను సమంగా అందరకూ పంచి ‘శాకాంబరి’ నామాంకిత అయినది దుర్గామాత.
ఆపదలు వచ్చినపుడు, దుర్గాదేవిని స్మరించి శరణు వేడికొంటే తల్లి రక్షిస్తుంది. కనుకనే ఆమె ‘దుర్గా’ అని పిలువబడుతోంది. మహాభారతం విరాట పర్వంలో, విరాట నగరంలో అజ్ఞాతవాసం చేయబోయే ముందు ఇతరులు తమను గుర్తించకుండా కాపాడమని ధర్మరాజు దుర్గాదేవిని ప్రార్థించాడు. దేవి కరుణించింది. శ్రీకృష్ణుని ఆదేశం మేరకు అర్జునుడు కురుక్షేత్రంలో తమకు విజయం సిద్ధించాలని దుర్గాదేవిని స్తోత్రం చేసి విజయాన్ని పొందాడు. దుర్గాదేవిని సరస్వతిగాను, వేదమాతగాను ‘స్వాహాకార స్వధా చైవా కలాకాష్ఠా సరస్వతీ సావిత్రే వేదమాతాచ తధా వేదాన్త ఉచ్యతే’’ అని ప్రార్థించాడు.
భక్తుల కష్టాలను కడతేర్చి, సంసార సముద్రాన్ని దాటించి కర్మఫలాలను ప్రసాదించేది దుర్గామాత అని ఉపనిషత్తులు పేర్కొన్నాయి. అందుకే లలితా సహస్రనామం ‘నిస్తులా నీల చికురా నిరపాయా నిరత్యయా దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖ హంత్రీ సుఖప్రదా’ అన్నది, దుఃఖాన్ని పోగొట్టి, భయాన్ని తొలగించి, ధైర్యాన్ని ప్రసాదించి, శతృవులు అంతఃబాహ్య శతృవులనుండి రక్షించే జగన్మాత దుర్గామాత.
మార్కండేయ పురాణాంతర్గత దుర్గా సప్తశతి, కాళీపురాణం, దేవీ భాగవతం దుర్గామాతను గురించి విశేషంగా తెలియపరచినాయి. ఈతిబాధా నివారణార్థం, దుర్గాసప్తశతి పారాయణం చేస్తారు. జాతకభాగంలో లగ్నం నుంచి రాహుగ్రహం- అష్టమంలో, చతుర్థంలో, వ్యయంలో, లగ్నంలో ఉంటే వివాహములు ఆలస్యమవుతాయి, సంతాన భాగ్యానికి ఆటంకములు కలుగవచ్చు. వారు దేవీ సప్తశతిలోని దేవీ కవచం, దేవీ కీలకస్తోత్రం, దేవీ అర్గల స్తోత్రం పారాయణ చేసి, తీర్థం ప్రసాదం స్వీకరిస్తే, గ్రహబాధలు తొలగి, అన్నీ శుభంగా జరుగుతాయి. ‘చండీహోమం’ చేస్తే దోషములు తొలగి, సర్వకార్యసిద్ధి చేకూరుతుంది. ఇది దుర్గామాత అనుగ్రహం.
మహాదుర్గను ‘దుర్గామాత’ అని ఆర్తితో ఆర్ద్రతగా సంపూర్ణ శరణాగతితో, స్మరిస్తే సమస్త జీవుల భయాన్ని, దుఃఖాన్ని పోగొడుతుంది. సకల విద్యలను కరుణిస్తుంది. జగన్మాతను ‘వనదుర్గా మహామంత్రంతో’ ఆవాహన చేసి, శారదామాతగా ప్రతిష్ఠించారు శ్రీ శంకర భగవత్పాదులు, శృంగేరీ మహాక్షేత్రంలో.
‘శ్రీ దుందుర్గే, శివసంసర్గే, చిత్రసవర్గే, స్థిరేహపవర్గే, శ్రీ నవదుర్గే, శ్రీ దుందుభివాద్య భౌదనాద వినోదిని, మోదిని, వీణావాదిని, సంవేదిని, అభేదిని, సుందరి, శ్రీరంజని, నిరంజని, జయజనని, కరుణారసాలయే, కలికల్మషవిలయే, కరావిధృత కువలయే, స్వర సంగీతలయే, సురు చిరమలయే, గురుగుహోదయే, సదయే, విజయ, అభయే, సరసమయే, షట్సమయే, సమయే, కలయే.. శ్రీ దుందుర్గే అంటూ తిరువారూరులోని దుర్గను, దుం అను బీజాక్షర రూపిణిని, లలితమైన పదజాలంతో, అంత్యప్రాసలతో మహాలక్ష్మీ స్వరూపంగా కూడా భావించి, శ్రీయుతము చేసి, శ్రీరంజని రాగంలో ఘనంగా కీర్తించాడు శ్రీ విద్యోపాసనాసిద్ధుడు, నాదయోగి, సద్గురు శ్రీముత్తుస్వామి దీక్షితులు.
వంశవతి, శివయువతి, పాలయమాం శాంభవి.. ఉరిత ధ్వంసి జనని అని వంశవతీ రాగంలో కీర్తించాడు. ప్రపంచమందలి జీవరాశియను వంశమునకు తల్లి శ్రీ దుర్గామాత. స్వరములు ఏడు. వాటికి ఇరువది రెండు శ్రుతులు. షడ్జమమునకు నాలుగు, రిషభమునకు మూడు, గాంధారమునకు రెండు, మధ్యమునకు నాలుగు, పంచమమనకు నాలుగు, ధైవతమునకు మూడు, నిషాదమునకు రెండు. ఈ ఇరువది రెండు శ్రుతి స్వరూపిణి శ్రీ దుర్గామాత.
శక్తి స్వరూపాన్ని తెలిసికొని, స్ర్తిలను జననీ సోదరీ భావంతో గౌరవించి, విశ్వమానవ కల్యాణాన్ని వీక్షించాలని కాంక్షించాలని, శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవములలో, శ్రీ దుర్గాపూజ హెచ్చరిస్తోంది.
విశ్వాన్ని బ్రహ్మశక్తితో సృష్టిస్తుంది, జగన్మాత. సృష్టించిన ప్రపంచాన్ని విష్ణుశక్తితో రక్షిస్తుంది. ‘రుద్ర’ శక్తితో సకల చరాచర సృష్టిని సంహరిస్తుంది. ఒకప్పుడు సంహరించేందుకు బదులుగా, తన ఐశ్వర్య శక్తితో సృష్టిని తనలో లీనం చేసికొంటుంది. ఇదే- తిరోధానం. ఇది సంహారం కాదు, ఉపసంహారం. మరొకప్పుడు సదాశివ రూపంలో ప్రాణికోణినంతటిని అనుగ్రహిస్తుంది. ఈ విధంగా సృష్టి, స్థితి, లయ, ఉపసంహారం, అనుగ్రహం- జగన్మాత చేసే పంచమహత్కార్యాలు. దీనినే పంచబ్రహ్మలు సాధించే పంచకృత్యాలంటారు.
ఎవరికి ఏది ఇవ్వాలో అది వారి తత్త్వాన్ని అనుసరించి అందిస్తుంది. ముందుకా తల్లి తత్త్వాన్ని అర్థం చేసికొంటే, ఆ ‘తత్త్వాసనిని’ సమీపానికి చేరుకోగలుగుతాం. చివరకు ఆ తత్త్వ వెలుగును పొంది ‘సోహం’ భావంతో ‘తత్త్వమసి’ అయి వెలుగు శక్తిలో లీనమవుతారు భక్తులు. ఈ తత్త్వానే్న శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవములలో, తొమ్మిదవ రోజున పూజించే మహర్నవమి దేవత ‘మహిషాసుర మర్దిని’ వివరిస్తుంది.
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు- ఆరు అరిషడ్వర్గములు- మన శరీరంలో ఉంటూ మన పతనానికి దారితీస్తాయి. వాటిని అదుపులో ఉంచుకొంటే నరోత్తముడు లేకపోతే పశువుకంటె హీనమైవాడు. కనుక ఇంద్రియాల్ని అదుపులో ఉంచుకొని, మనస్సును స్వాధీనంలో ఉంచుకోవటానికి ప్రయత్నిస్తూ, ధర్మవర్తనతో ఆనందాన్ని పొందాలి. అంతేకాని విశృంఖలంగా కామదాహాన్ని తీర్చుకోవటానికి ప్రయత్నిస్తే పతనమవుతాడు, అల్పాయుష్కుడవుతాడు. అధర్మాన్ని చూస్తూ ఊరుకోదు మహిషాసుర మర్దినీ మాత. ఇవన్నీ మనకు ‘సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవింద రూపిణీ, సంహారిణీ రుద్ర రూపా తీరోదానకరీశ్వరీ, సదాశివానుగ్రహదా పంచకృత్య పరాయణా’ అన్న లలితా రహస్య నామాలను తరచి దర్శిస్తే గోచరమవుతాయి.
‘‘అయిగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందినుతే
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే’’-
మానవులమైన మనమంతా మర్త్యులం. అనగా జన్మ మృత్యు జరావ్యాధులతో నిత్యమూ సతమతమవుతున్నాం. వీటి బారినుండి తప్పించుకొని బయటపడాలంటే, దేవతామూర్తులను ఆరాధించాలి. ఎందుకని? ఎందుకంటె వారికి ఆ బాధలు లేవు కాబట్టి. దేవీ దేవతలను ఆరాధిస్తే వారిలోని దివ్య గుణాలు, ధర్మమార్గం మనలో చోటుచేసుకుంటాయి. అందుకే పండగలూ పబ్బాలూ ఏర్పడ్డాయి. ఉత్సాహంతో జరుపుకుంటాం. పండుగ రోజుల్లో బంధు మిత్రులు కలుసుకొని ఆనందంగా గడిపినా, ఆంతర్యాన్ని తెలుసుకోవటం ముఖ్యం. అందులోనే విశేషముంది.
మనం శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవ పండగల్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు మహర్నవమి, అనగా తొమ్మిదో రోజు. శరత్తంటే శరదృతువనే గాక, సంవత్సరమని కూడా అర్థం ఉంది. ‘జీవేమ శరదశ్శతమ్’ అన్నారు గదా. వివాహ సమయంలో మంగళసూత్రాన్ని కడుతూ చదివే మంత్రంలోను యిదే అర్థం. సంవత్సరం వసంత ఋతువుతో మొదలవుతుందని అనుకుంటాం, పండుగ చేసికుంటాం, పూర్వం శరదృతువులో సంవత్సరం మొదలుపెట్టేవారట. ఇవి రెండూ మనకి అనారోగ్యాన్ని యిచ్చే ఋతువులు. అనారోగ్యాన్ని పోగొట్టుకోవాలంటే, నిశ్చల మనస్సు పొందాలంటే ఆయా దేవతలను సేవించాలని దేవీ భాగవతం చెప్తోంది.
శరదృతువులో వచ్చే అనారోగ్యాన్ని పోగొట్టుకుని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందటానికి, నవరాత్రి ఉత్సవములు జరుపుకొంటున్నారు. ఈ రోజు మహర్నవమి. జగన్మాత మహిషాసురుణ్ణి సంహరించినరోజు.
‘మహిషాసుర దోర్వీర్యనిగ్రహాయైనమః’ అని, ‘తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా’ లిలతా నామములలోను, కపర్దినీ కలామాలా కామధుక్కామ రూపిణీ’ అని, జయ జయహే మహిషాసురమర్దిని శైలసుతే’ అని స్తుతింపబడే మాత- ‘మహిషాసుర మర్దిని’.
మహిషాసురుడు అనగా, వక్రబుద్ధి, క్రూరబుద్ధి కలవాడు అని అర్థమవుతుంది. అటువంటి దుష్టబుద్ధి కలవారి అజ్ఞానమును మర్దించి మహిష బుద్ధిని నశింపజేసి, జ్ఞానమును వివేకమును కలిగించు జ్ఞానదేవత, వేదమాత- మహిషాసురమర్దిని.
‘‘మహీం, మహం వాసీదన్తీతి మహిషాః అసురాః రాక్షసాః తాన్ మర్దయతీతి మహిషాసురమర్దినీ’’ భూమినీ ప్రజలను హింసించేవారు, లోకకంటకులైన రాక్షసులు. దుర్మార్గతతో భూదేవికి కూడా భారమైనవాళ్ళు రాక్షసులు. అటువంటి దుష్టశక్తులను మట్టుపెట్టు మహాశక్తి గనుకనే, జగన్మాతను ‘మహిషాసురమర్దిని’ అన్నారు.
కపర్దమనగా భాస్కర రాయ భాష్యము యిలా వివరించింది. ‘కం’ అనగా జలము, బ్రహ్మ, సుఖము అను అర్థాలున్నాయి. వానితో పూర్తిగా నిండియున్నది కపర్దము. అట్టి రమణీయమైన కపర్దమును ధరించిన జగదంబ, రమ్యకపర్దినీ అని స్తుతింపబడుతోంది. కపర్దమనగా జటాజూటము, వేద మంత్ర సమూహము. వైదిక జటలను అనగా ఘన, జట వేద మంత్రములు, మరొకర్థం. జడలను ధరించిన శివుడు కపర్ది. పార్వతి కపర్దినీ. ఇదీ రమ్యకపర్దినీ అంటే అర్థం.
పూర్వం ‘దనువు’ అనే రాక్షస రాజుకి- రంభుడు, కరంభుడు అనే యిద్దరు పుత్రులున్నారు. ఆ రాక్షస సోదరులిద్దరూ సంతానం కోసం తపస్సు చేశారు. కరంభుడు పంచనదమందున్న సరస్సులో దిగి, కంఠంలోతు నీళ్ళలో తపస్సు ప్రారంభించాడు. ఇంద్రుడు మకర రూపంలో వచ్చి కరంభుణ్ణి సంహరించాడు. ఇది న్యాయమా అని మనకు అనిపిస్తుంది. అది న్యాయమే. కరంభుడి సంకల్పం అమరుడై, దేవ ఋషి మానవులందరినీ హింసపెట్టటానికి తపస్సు ప్రారంభించాడు. మంచి సంకల్పంతో నలుగురికీ ఉపకరించే పని చేయడానికి కాదు. అటువంటివారి సంకల్పం నెరవేరితే అల్లకల్లోమవుతుంది. కనుక ఇంద్రుడు మకర రూపంలో సంహరించాడు. ఎదురుగా చెట్టుపైనుండి తపస్సు చేస్తున్న ‘రంభుడు’ ఇది సోదరుడు లేకుండా ఇంటికి వెళ్ళటానికి మనస్సు రాక బాధపడుతూ ఆత్మహత్య చేసికోవడానికి ఉద్యుక్తుడయ్యాడు. అగ్నిదేవుడు ప్రత్యక్షమయి ఆత్మహత్య మహాపాపమని హితబోధ చేసి, రంభుడు చేసిన తపస్సుకు సంతసించి కామరూపాన్ని ధరించేవాడు, ముల్లోకాలను జయించేవాడు అయిన పుత్రుణ్ణి పొందుతావని అనుగ్రహించాడు.
వరాన్ని పొంది, ఉత్సాహంతో వెడుతున్న రంభుడికి, యక్షుల సంరక్షణలోనున్న ఒక మహిషము కనపడింది. తదేకంగా దాన్ని చూచి, దానితో క్రీడించాలనే పశు రాక్షస నికృష్ట కోరిక కలిగింది. కామం ఎంత హేమయమైనదోగదా. దాని ఫలితంగా తాను మహిష రూపాన్ని దాల్చాడు. మహిష గర్భం దాల్చింది. రంభుడు మహిషాన్ని తీసికొని పాతాళలోకానికి వెడుతుండగా, వేరొక మహిషము సహజ సిద్ధముగానున్న పశుతత్త్వంతో, గర్భందాల్చిన మహిషాన్ని సంగమించటానికి వచ్చింది. రంభుడు అడ్డుకున్నాడు. మహిషములోని తీవ్ర కామము- క్రోధాన్ని ప్రేరేపించటంతో, తన వాడి కొమ్ములతో రంభుణ్ణి సంహరించింది.
రంభుని వలన గర్భం దాల్చిన మహిషి పాతాళమునుండి బయల్పడి యక్షులున్నచోటికి రాగా, యక్షుల బాణములతో మహిషాన్ని చంపి, రంభుని శరీరాన్ని, మహిష శరీరాన్ని దహనం చేశారు. ఆ మంటలయందు మరణిస్తున్న మహిషికి ఇద్దరు పుత్రులు కలిగారు. వారే మహిషాసురుడు, రక్తబీజుడు. కాలక్రమమున, బ్రహ్మచేత వరాన్ని పొంది, సాటిలేని మేటి పరాక్రమంతో, ముల్లోకాలను గడగడలాడిస్తూ ప్రజా పీడనంగా రాజ్యమేలుతున్నాడు మహిషాసురుడు. పురుషుల చేతిలో కాక స్ర్తిమూర్తి చేతన మహిషాసురుడు సంహరింపబడతాడని తెలిసికొని, దేవతలందరూ, ఆర్తితో శ్రీ భువనేశ్వరీ మాతను ప్రార్థించారు. తమ కష్టాలను జగన్మాతకు విన్నవించారు. త్రికాలాత్మకం త్రిగుణాత్మకం అయి, తేజ స్వరూపిణిగా, మహిషుని మంత్రులు సైన్యాధిపతులు అయిన తామ్రుడు, బిడాలుడు, ధూమ్రాక్షుడు, చక్షుడు, అసిలోముడు మున్నగువారినందరినీ సంహరించింది.
‘‘సురవర వర్షిణి దుర్థర ధర్షిణి, దుర్ముఖమర్షిణి హర్షరతే, దనుజ నిరోషిణి, దుర్మత శోషిణి, దుఃఖ నివారిణి, కిల్బిష మోషిణి మోహరతే జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే’’ అని దేవతలందరూ సోత్రం చేస్తుండగా, సింహవాహనమై, మహోగ్రరూపంతో ‘కాళీ’ శక్తిగా రక్తబీజుణ్ణి మహిషాసురుణ్ణి సంహరించింది జగన్మాత. మహిషాసుర మర్దిని సార్థక నామధేయురాలై, విజయవాడ ఇంద్రకీలాద్రిపై స్వయంభువుగా వెలసి, కనకదుర్గా నామంతో, భక్తకోటి అభీష్టాలను నెరవేరుస్తూ వెలుగొందుతున్నది.
మహిషాసుర మర్దిని వాహనం- సింహము. శతృవులను సంహరించేది సింహము. శౌర్య ధైర్య సాహసములకు చిహ్నం- సింహం. జగన్మాతకు వాహనమై మంత్రమయమై శతృ సంహారాత్మకమై ప్రవర్తించునది సింహం. ‘మృగాణాంచ మృగేం ద్రోహం’ అన్నారు శ్రీకృష్ణపరమాత్మ, భగవద్గీతలో. సంసార ఘోరారణ్యంలో చిక్కుకున్న భక్తుల్ని కాపాడటానికి, మద మాత్సర్యాది మత్త్భాల్ని అణచే శక్తికి ప్రతీకయే జగన్మాత వాహనమైన సింహం.
శక్తితత్త్వానికి పూర్ణముగా అభివ్యక్తమయినది- కాళీమూర్తి- కాళీమాత- కాల తత్త్వానికి సూచితం. మానవుని జ్ఞాన విజ్ఞాన ప్రణాళిక అంతా కాల విశేషము ద్వారా నిర్మితమయి, కాళీదేవియందే అనగా ‘కాల’ శక్తిలోనే లయమవుతుంది. రూపం అరూపంలో లీనమయితే, అది ‘నీలం’. రూపరహితమైన ఆకాశం- నీలం. ధర్మ స్వరూపుడైన శ్రీరామచంద్రుడు- నీలమేఘశ్యాముడు. దుష్టశిక్షణ శిష్టరక్షణమునకు అవతరించిన యోగీశ్వరేశ్వరుడు శ్రీకృష్ణుడు- నీలవర్ణం. కాళీమాత నీలవర్ణం.
సృష్టికి పూర్వం అంతా జలమయం, అంధకారమయం. ఈ మహాంధకారమే కాళీదేవి యదార్థరూపం. నీలవర్ణం- జగత్తుకు ఆదిరూపం. సృష్టికి పూర్వం ఉన్నది పరాశక్తియే, కాళీదేవియే అని చెప్తుంది కాళీపురాణం. నీల వర్ణాంతర్గత మహాసౌందర్యమే - మహాకాళి.
‘‘కాలానికి రాణి, సద్గుణ శీల, కీరవాణి త్రిలోకజనని దేవి’’ అన్న లయబ్రహ్మ శ్యామశాస్ర్తీ కీర్తన, ‘‘మహిషాసుర మర్దినీం నమామి మహనీయ కపర్దినీం, మహిష మస్తక నటన భేద వినోదినీం, మోదినీం మాలినీం, ప్రణత జన సౌభాగ్య జననీం’’ అన్న నారాయణి రాగకీర్తన, మహిషాసురమర్దిని మాంపాహి, మధ్య దేశ వాసిని అన్న ముత్తుస్వామి దీక్షితుల వారి గౌళరాగ కీర్తనలు, తొమ్మిదవ రోజు పూజకు స్ఫూర్తినిస్తాయి. ప్రాప్తించిన ‘శక్తి’ సంపదను లోకకల్యాణార్థం వినియోగించి ధర్మరీతితో, జీవనం చేయాలని, మహిషాసుర మర్దినీ పూజ హెచ్చరిస్తోంది.
మనస్సుకు అధిపతి ‘చంద్రుడు’. చంద్రుడు వెనె్నలను బాగా పండించే ఋతువు శరదృతువు. శరదృతువులో మొదటి మాసం, ఆశ్వయజుమాసం. చంద్రుడంటే ‘తల్లి’. జన్మనిచ్చిన మాత, జగన్మాత. చంద్రుడు అనుగ్రహం ఉంటే, మనస్సు నిశ్చలంగా ఉంటుంది. నిశ్చలమైన మనస్సుతో ఏ కార్యాన్నైనా చేయగలుగుతాం. చంద్రానుగ్రహం, తల్లి ఆరాధనతో లభిస్తుంది. ప్రతిరోజూ జగన్మాత ఆరాధన చేసినా, శరదృతువులో ఆశ్వయుజమాసంలో శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు అనగా నవమి వరకూ తల్లి ఆరాధనకు శ్రేష్టమని విశేష ఫలితాన్నిస్తుందని పురాణములు, ఉపనిషత్తులు పేర్కొన్నాయి. నవాహ్నిక దీక్షగా (తొమ్మిది రోజులు) వ్రతాన్ని ఆచరించి, మనలో ఉన్న పశు రాక్షసత్వాన్ని పారద్రోలి, నరుడు నరోత్తముడవుతాడు.
పదవరోజు విజయదశమి. శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవానికి మకుటాయమానమైన పండుగ, విజయదశమి. నవరాత్రి పూజకు జయకేతనం విజయదశమి. లోకాలనేలే ప్రభ్వి శ్రీ రాజరాజేశ్వరీ మాతను విజయదశమి రోజున పూజిస్తారు.
‘‘యాదేవీ సర్వభూతేషు, శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమో నమః’’ అన్నది దేవీ సప్తశతి. శక్తి ఆరాధన ఎందుకు చేయాలి అంటే విశ్వమంతా ‘వక్తి’మయం. శక్తిలేనిదే ఏ పనీ చేయలేం. ఆత్మశక్తిని పెంపొందించుకుంటేనే మానవుడు ప్రగతిపథంలో పయనిస్తాడు. అంతేకాదు, ఎందరికో ఆదర్శప్రాయుడై వారి జీవితాలలో కూడా వెలుగును నింపే శక్తి వంతుడవుతాడు. దీనితో సమాజ వికాసం కలుగుతుంది. ఇదే దేశాభ్యున్నతికి దోహదం చేస్తుంది.
తల్లిగా కరుణించి, లాలించి తండ్రిగా పోషించి, గురువుగా విజ్ఞానాన్ని అందించి, విశ్వంలోని ఏ పదార్థానికి ఎంత సామర్థ్యం ఉందో ఎంత ప్రాధాన్యతనివ్వాలో అన్న విషయాన్ని తెలియజేస్తూ, తప్పుదోవ తొక్కకుండా బిడ్డల్ని ఒక కంట కనిపెట్టి ఉండేది- జగన్మాత. అందుకే ఆ మహాశక్తిని ‘శ్రీమాతా’ అన్నారు. జగన్మాత సామ్రాజ్యం- మూడు లోకాలలో వ్యాపించి ఉంటుంది. బ్రహ్మాండమంతటా వ్యాపించిన తల్లి- ‘మహారాజ్ఞి’. రాజ లక్షణమైన రాజఠీవి, పరిపాలనకు ఉండవలసిన కాఠిన్యం, మాతృవాత్సల్యం- ఈ త్రిగుణాలతో సృష్టిస్థితి లయలను త్రిమూర్తులచేత చేయిస్తూ, త్రిమూర్తులకే కాక, చతుర్దశ భువనములకు ప్రభ్వి, సింహాసనేశ్వరి శ్రీ రాజరాజేశ్వరి.
‘శ్రీ’ అంటే లక్ష్మి. సమస్త లక్ష్మీ సంతతని ప్రసాదించే త్రిజగన్మాత- శ్రీ రాజరాజేశ్వరి. తల్లి కరుణార్ద్ర నయనాలతో, విశ్వం మేల్కొంటుంది, ప్రపంచం ఉదయిస్తుంది. తల్లి ఆగ్రహిస్తే విశ్వం లయమవుతుంది. విశ్వమహాసామ్రాజ్ఞిగా, తల్లికి అందరూ సమానమే. అయితే ఋజు మార్గంలో విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించే వారికి ఆమె చేయూతనిస్తుంది.
మండలాధిపతులు, భూమండలాధిపతులు, రాజ్యాధిపతుల అందరూ సామ్రాజ్య పదవీ లబ్ధులు. తన భక్తులకు భాహ్య సామ్రాజ్య పదవికన్న మిన్న అయిన ఆత్మానంద సామ్రాజ్య పదవిని అనుగ్రహించే శ్రీదేవి శ్రీ రాజరాజేశ్వరి.
ఇంద్రాది అష్ట దిక్పాలకులు రాజులయితే, వారికి రాజులు సత్వ రజ తమో గుణాతీతులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వీరి చేత సృష్టి, స్థితి లయ కార్యములను గావింపజేసే ప్రభ్వి- శ్రీమాత- శ్రీ మహారాజ్ఞి, సింహసనేశ్వరి, కను
కనే శ్రీ రాజరాజేశ్వరి సార్థక నామధేయురాలైంది.
‘‘చితాభస్మాలేపో గరల మశనం దిక్పటధరో
జటాధారీ కంఠే భుజగపతి హారీ పశుపతిః
కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం
భవాని త్వత్పాణి గ్రహణ పరిపాటీఫలమిదమ్’’
చితాభస్మాన్ని పూసుకొనేవాడు, విషమే ఆహారమయినవాడు, దిక్కులే వస్త్రాలుగా గలవాడు, తలపై జడలవాడు, మెడలో పాముల దండలవాడు, పశువులకు పతి, చేతిలో తల పుఱ్ఱె కలవాడు, భూతనాధుడు- పరమశివుడు అయినా ఎల్లలోకాలకు ప్రభువు అయినాడు ‘‘ఓ భవుని రాణీ’’ అని సంభోధిస్తు అటువంటి జగదీశైక పదవి ఈశ్వరునికి లభించటానికి కారణం- నీ పాణిగ్రహణం పరిపాటే ఫలమేనని, శ్రీ రాజరాజేశ్వరీ సామ్రాజ్య వైభవాన్ని వివరించాడు శ్రీ శంకర భగవత్పాదులు. సాత్విక సాధన, పవిత్ర భావన, నిర్మల హృదయం, నిశ్చల మనస్సు- వీటితో సంపూర్ణ శరణాగతితో భక్త్భివంతో, తల్లిని స్మరిస్తే, మన యోగక్షేమాల్ని, జగన్మాత చూసుకుంటుంది. ఆ తల్లే శ్రీ రాజరాజేశ్వరి.
‘‘పరాశక్తి మనుపరాద నాపై పరాకేలనమ్మా
పురాణి ధర్మ సంవర్థని శ్రీపురాధీశ్వరి రాజరాజేశ్వరి’’
సర్పభూషణుడైన శివుడు, దేవరాజైన ఇంద్రుడు, జలజభవుడైన బ్రహ్మ, రాక్షసారులైన దేవతలు- అందరూ జగన్మాత, శ్రీ రాజరాజేశ్వరీదేవి అనుగ్రహం కోసం ప్రాకులాడతారు. లోకాధిపతులందరూ ఆ జగన్మాత కరుణా కటాక్షములతోనే శాశ్వత సౌఖ్యాన్ని పొందారని చెప్తూ, అటువంటి శ్రీ మహారాజ్ఞి రాజ్యంలో దుష్టులు అనగా సాధుజనులను నిరాకరించేవారికి ప్రవేశము లేదని, ధర్మవర్తనులకు, త్యాగశీలురకు మాత్రమే- శ్రీ రాజరాజేశ్వరి సామ్రాజ్యంలో స్థానం ఉంటుందని, వారికే ఆ జగన్మాత శాశ్వతానందాన్ని అందిస్తుందని, తిరువారూరులోని శ్రీ రాజరాజేశ్వరీదేవి అయిన ధర్మసంవర్థనీ మాతను సద్గురు త్యాగరాజస్వామి, ఆద్యమైన ఆది తాళ నిబద్ధనలో, సావేరీ రాగంలో గానం చేశారు. ఇది శ్రీ రాజరాజేశ్వరీ సామ్రాజ్య స్వారాజ్య సిద్ధికి దర్పణం.
పరమేశ్వరుణ్ణి రంజింపజేసే పరమేశ్వరి- శ్రీరాజరాజేశ్వరి. ప్రపంచంలో మంచితనానికి మారుపేరు జగన్మాత. తనలాగానే బిడ్డలు కూడా మంచిగా నడుచుకోవాలని హితవు పలుకుతుంది. శ్రీచక్రం- యంత్రం, శ్రీవిద్య మంత్రం- శ్రీ సహస్రం- తంత్రం- శ్రీచక్రమునందు నవ (తొమ్మిది) ఆవరణములుంటాయి. అందులో ‘బిందు’ రూపంలో మహాచైతన్యంతో వెలిగే, మహోదాత్తశక్తి శ్రీ రాజరాజేశ్వరి. ఈ విశాల కువలయమే తల్లికి ఆలయం.
శ్రీవిద్య, శ్రీచక్ర సంబంధిత విషయాలు గురుముఖతగా తెలిసికోవాలి. అయినా కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. మనశరీరమే ఒక శ్రీచక్రం. అందులో నవ ఆవరణలుంటాయి. అవి త్రైలోక్యమోహన చక్రం, సర్వాశాపరిపూర్వక చక్రం, సర్వసంక్షోభణ చక్రం, సర్వసౌభాగ్యదాయక చక్రం, సర్వార్థసాధక చక్రం, సర్వరక్షాకర చక్రం, సర్వరోగహర చక్రం, సర్వసిద్ధిప్రద చక్రం, తొమ్మిదవది సర్వానందమయ చక్రం. ముత్తుస్వామి దీక్షితులవారు నవావరణ కీర్తనలు మనకందించారు. అత్యద్భుతమైన కీర్తనలు. ‘శ్రీకమలాంబా జయతి అంబా శ్రీ కమలాంబా జయతి.. సూకరానవాద్యర్చిత మహాత్రిపుర సుందరీం రాజరాజేశ్వరీం సువాసినీం, కర సర్వానందమయ చక్రవాసినీం, చింత్రాయేహం’’ అని, దేవీ అనుగ్రహసిద్ధుడు, దేవీ ముక్తాహార వరప్రసాది, తొమ్మిదవ ఆవరణానికి మనకిచ్చిన కీర్తన, శ్రీ రాజరాజేశ్వరీ దేవి పూజకు పూర్తి స్ఫూర్తినిస్తుంది.
శక్తితత్త్వం, ఈశ్వరతత్త్వం, పైకి అనగా సామాన్య దృష్టికి వేరుగా కనపడినా, అది ఒకే తత్త్వం, అభిన్న స్వరూపాలు. ఆ రెండు తత్త్వములు వాక్కు అర్థం లాంటివి. అవి కలిసే ఉంటాయి. ఇదే శివశక్తి సామరస్యం. జీవుడు శివ శక్తుల సంయుక్తోపాసన చేయాలి. ఈ విషయానే్న ‘అంగన సహిత భుజంగ శయన ఎన్నకంగళి గుత్సవవీయో’ అనే కీర్తనలో సూచించారు. కర్నాట సంగీతానికి ఆద్యుడు, వాసుదేవ విఠలుని వాసిగా భజించిన శ్రీపురందరదాసు.
ఈ తొమ్మిది రోజులలో (తిథులలో) మహాశక్తిలో, త్రిమూర్తులు అష్టదిక్పాలకులు, సమస్త దేవతలు తమ శక్తుల్ని విలీనం చేస్తారు. ఎందుకంటే, ఏ పురుషుని చేత కాకుండా స్ర్తిమూర్తి చేతనే సంహరింపబడేటట్లు, వరములు పొందారు ఆ రాక్షసులు అందరూ. రాక్షసులనందరినీ సంహరించిన తదుపరి, విజయోత్సవంతో, మరల శివశక్తులను ఏకం చేసి అర్థనారీశ్వర తత్త్వంతో ప్రకృతీ పురుషుల ఏకత్వాన్ని, శివశక్తుల సామరస్యాన్ని విజయదశమి రోజున సాయంత్రం సంధ్యాసమయంలో, శమీవృక్షం (జమ్మిచెట్టు) దగ్గర సంయుక్తోపాసన, ఏకేశ్వరోపాసన చేస్తారు. చంద్ర నక్షత్రమైన హస్తానక్షత్రంలో కలశస్థాపన చేసి, పాడ్యమి తిథి నుంచి జగన్మాత శరన్నవరాత్రి మహోత్సవములు ప్రారంభించి మరల చంద్ర నక్షత్రమున శ్రవణా నక్షత్రంలో కలశోద్వాసనతో, శమీపూజ ఏకేశ్వరోపాసనతో కలశోద్వాసనతో శరన్నవరాత్రి పూజను విజయదశమితో ముగిస్తారు.
‘‘శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాసిని, అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శినీ’’ అన్న శ్లోకాన్ని పఠిస్తూ, శమీవృక్షానికి ప్రదక్షిణ చేస్తారు. శమీ (జమ్మి) ఆకుల్ని ఒకరికొకరు యిచ్చుకుంటారు. ఈ ఆశ్వయుజ దశమి నుండి, మరలా వచ్చే సంవత్సరం ఆశ్వయుజ దశమి వరకు, విజయాన్ని చేకూర్చి కాపాడమని, శమీ వృక్షాన్ని ప్రార్థిస్తూ, శివశక్తుల సంయుక్తోపాసనగా దర్శిస్తారు. ఈనాటికి ఆ జమ్మిచెట్టు, బ్రాహ్మణ వీధిలో విజయవాడలో ఉన్నది. అక్కడే సంయుక్తోపాసన- శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు చేస్తారు. దీనికి గొప్ప స్థల పురాణం కూడా ఉన్నది.
‘‘శ్రీ రాజరాజేశ్వరి, త్రిపురసుందరి శివే పాహిమాం, వందే పూర్ణచంద్రికా శీతలే విమలే’’- పూర్ణచంద్రునివలె చల్లనైన తల్లీ అంటూ, పూర్ణచంద్రికారాగంలో, ముత్తుస్వామి దీక్షితులు కీర్తించిన ఈ కీర్తన- చంద్ర నక్షత్రమయిన శ్రవణా నక్షత్రంలో వచ్చే విజయదశమి పండుగకు, శ్రీ రాజరాజేశ్వరీ పూజకు, సంపూర్ణ దీప్తినిస్తుంది.
‘‘శంకరి శంకరి కరుణాకరి, రాజరాజేశ్వరి, సుందరి పరాత్పరి గౌరి అంబి.. పరమ పావని, భవాని సదాశివ కుటుంబిని..’’ అని శివశక్తి సామరస్యాన్ని, కల్యాణి లయబ్రహ్మ, కామాక్షీ వరప్రసాదుడు- శ్యామశాస్ర్తీ, మనకందించిన కీర్తన, విజయదశమి రోజున అర్చనలందుకొన్న శ్రీ రాజరాజేశ్వరీ తత్త్వానికి స్ఫూర్తినిస్తుంది. ఆధునిక విజ్ఞాన సముపార్జన, వికాసము- విశ్వమానవ కల్యాణానికి ఉపకరించాలని, శ్రీమాత, శ్రీమహారాజ్ఞి, శ్రీ రాజరాజేశ్వరీ పూజ, విజయదశమి రోజున, విజయోస్తు అని చెప్తూ, విశదపరుస్తోంది.
పసుమర్తి కామేశ్వరశర్మ
No comments:
Post a Comment