Thursday, 18 October 2018

దశమి సందేశం








దశమి సందేశం



దసరాకు పదిరోజుల ముందు నుంచే మండపాలు ఏర్పాటు చేసి దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తాం. భక్తి ప్రత్తులతో అమ్మవారిని పూజిస్తాం. ఒక్కోరోజు ఒక్కో అవతారంలో ఆ నవదుర్గను కొలుచుకుంటాం. మరి ఆ అవతారాలు చెప్పే సందేశమేంటో తెలుసా! నేటితరానికి అమ్మవారి దశావతారాలు చెప్పే సందేశం దసరా శుభాకాంక్షలతో మీకోసం..
  1. స్వర్ణకవచ దుర్గ
    నిన్ను నువ్వే దృఢంగా నిర్మించుకో. ప్రతికూల పరిస్థితుల నుంచి నిన్ను నువ్వే కాపాడుకో. మంచి వ్యక్తిత్వమే నీకు కవచం. నీలోని వెలుగును ధిక్కరించే ఎవ్వరినీ ఉపేక్షించకు అనే సందేశాన్నిస్తుంది స్వర్ణకవచంతో దర్శనమిచ్చే దుర్గమ్మ.
  2. బాలాత్రిపుర సుందరి
    అనుభవం గడించు. ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవించు. నీలోని బాల్య తత్వాన్ని, ఉత్సుకతను అద్భుతంగా ఆస్వాదించు. నీ జీవితాన్ని నువ్వే జీవించు అనే సందేశాన్నిస్తుంది బాలాత్రిపుర సుందరి అమ్మవారి అవతారం.
  3. అన్నపూర్ణ
    ఆరోగ్యంగా జీవించు. నీ ఆరోగ్యానికి కావాల్సినదంతా నీ శరీరానికి నువ్వే ఇవ్వాలి. ఆరోగ్యకర ఆలోచనలు, ఆరోగ్యకర ఆహారమే నీకు సకల లోకాలను జయించే శక్తి ఇస్తుంది. నీలోని శక్తిని ఇతరులకు పంచు అంటూ అన్నపూర్ణ దేవి అవతారం ఇతరులకు పంచమనే ఆలోచనను పెంచుతుంది.
  4. గాయత్రీదేవి
    నిన్ను నీ ఆధీనంలో ఉంచుకో. నీ బలం, బలగం నువ్వే. నువ్వు మాత్రమే నీదైన ప్రపంచాన్ని రక్షించుకోగలవు. నీ శక్తిని గుర్తించు. ఏ పరిస్థితుల్లోనైనా పోరాడడానికి సిద్ధంగా ఉండు అంటూ శక్తిరూపమైన గాయత్రీదేవి అవతారం సందేశమిస్తుంది.
  5. లలితాత్రిపుర సుందరి
    ఈ ప్రపంచంలో అత్యంత అందమంటే నీదే. నీ ఆత్మసౌందర్యం ముందు ఎంతటి అందమైన దిగదుడుపే. మంచి ఆలోచనలు, మంచి కార్యాలతో అందానికే ఓ కొత్త నిర్వచనం ఇవ్వు.. అదే కదా ఆనందమంటే. నీలోని అభద్రతాభావాన్ని నిలువునా చంపెయ్ అంటుంది లలితాత్రిపుర సుందరి.
  6. సరస్వతీ దేవి
    ప్రపంచాన్ని పరిశీలించు. ప్రతీది గమనించు.. విశ్లేషించు. నీ కంటికి కనిపించేదే కాదు.. నీ చెవులకు వినిపించేది, నీ స్పర్శ ద్వారా నువ్వు తెలుసుకునే దాన్ని కూడా అధ్యయనం చెయ్యి. అదే.. నిన్ను శక్తివంతుణ్ణి చేస్తుంది. కనిపించే దాని కంటే ఇంకా ఎక్కువే ఈ ప్రపంచంలో ఉంది. తెలుసుకోవాలన్న తపన ఉంటే ఏదో ఒక శక్తి నీకు సాయం చేస్తూనే ఉంటుంది అంటూ జీవిత సారాన్ని చెప్పేదే సరస్వతీ దేవి అవతారం.
  7. మహాలక్ష్మీదేవి
    స్వతంత్రంగా ఉండు. నీ భవిష్యత్తు రూపకర్తవు నీవే. వేరే ఎవరికీ ఆ అవకాశం ఇవ్వకు. నీ లక్ష్యాలను చేరుకుంటే అదే నీ సంపద అవుతుంది అంటూ ఏం సంపాదించాలో, ఎలా సంపాదించాలో సందేశమిస్తుంది లక్ష్మీదేవి అవతారం.
  8. దుర్గాదేవి
    సరైన నిర్ణయాలు తీసుకో. ఒక అద్భుతంగా నిన్ను నువ్వు మార్చుకో. నీవు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే వరకు శ్రమించు. అందరూ నిన్ను కీర్తించే దాక నీ పోరాటం ఆపకు అని సందేశాన్నిస్తుంది దుర్గాదేవి అవతారం.
  9. మహిషాసుర మర్దిని
    ఆధిపత్యాన్ని నేలకూల్చు. ఎట్టి పరిస్థితుల్లో నీ శక్తిని తక్కువ అంచనా వేసుకోకు. నీపై విజయం సాధించాలనుకునే వారికి అందనంత ఎత్తులో నువ్వుండాలి. కొన్ని శక్తులకు నిరంకుశంగా కనిపించాలని సందేశమిస్తుంది మహిషాసుర మర్దిని.
  10. రాజ రాజేశ్వరీ దేవి
    నిజమైన జీవితమంటే శాంతి. భ్రమల నుంచి బయటపడడమే విజయం. నీ శాంతి ఎక్కడ ఉందో నువ్వే వెతుక్కో. నొప్పిని గెలిచినప్పుడే.. విజయం అంటూ జీవితసారాన్ని చెప్తుంది రాజరాజేశ్వరీ దేవి అవతారం.

మహిషాసుర మర్దిని
మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా జననరక్షణ మోక్ష విదాయిని జయతి శుంభ నిశుంభ నిషూదిని
దేవి తొమ్మిది అవతారాలలో ఉగ్రరూపం మహిషాసుర మర్దిని. ఆశ్వీయుజ శుద్ధ నవమి రోజున అమ్మ మహిషాసుర మర్దినిగా అవతరించింది. ధర్మ విజయానికి సంకేతంగా ఈ రోజును మహార్నవమిగా జరుపుకొంటారు. సింహ వాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన అమ్మ సకల దేవతల అంశలతో ఈ రూపంలో దర్శనమిస్తుంది. ఈ అమ్మని పూజిస్తే సకలదేవతలను పూజించిన ఫలితం వస్తుంది. అమ్మవారికి ఇష్టమైన కేసరి పూర్ణాలు ఈరోజు నివేదన చేయాలి.

శ్రీ రాజరాజేశ్వరి
యా విద్యా శివకేశవాది జననీ యావై జగన్మోహినీ యా పంచ ప్రణవద్విరేఫ నళినీ యాచిత్కళా మాలినీ యా బ్రహ్మది పిపీలికాంత జగదానందైక సంధాయినీ సాసా యాత్వర దేవత భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ 
సర్వ మానవ జీవితాలలో సర్వశక్తికి కేంద్రస్థానం జగజ్జననియే. భక్త సంరక్షణోద్యోగ కారుణ్యమూర్తి ఆమె. శరన్నవరాత్రులలో అమ్మవారికి నవదుర్గల విశేష అలంకారాలు ముగిశాక విజయదశమిన దేవి శ్రీరాజరాజేశ్వరిగా దర్శనమిస్తుంది. విజయదశమి అపరాజిత పేరు మీద ఏర్పడిందంటారు. సదా విజయాన్నే సాధించిన దేవి విజయగా పేరొందింది. పైన స్తోత్రంతో పాటు.. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే.. శరణ్యే త్య్రంబకేదేవి నారాయణి నమోస్తుతే.. అనే శ్లోకాన్ని చదువుకోండి. అంతా మంచే జరుగుతుంది. ఈ దేవికి చలిమిడి, పరమాన్నం, పానకం నైవేద్యంగా సమర్పించండి.

-ప్రవీణ్‌కుమార్ సుంకరి


No comments:

Post a Comment