తొలిరోజున స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు.. 11న బాలత్రిపుర సుందరీదేవిగా, 12న గాయత్రీ దేవిగా, 13న లలితాత్రిపుర సుందరీదేవిగా, 14న సరస్వతీదేవిగా, 15న అన్నపూర్ణా దేవిగా, 16న మహాలక్ష్మీదేవిగా, 17న దుర్గాదేవిగా, 18న మహిషాసుర మర్ధినిగా, రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.
Oct 09, 2018
భక్తితో నమస్కరిస్తే చాలు... అమ్మలా అనుగ్రహించి, అన్ని కార్యాలలోనూ విజయాలను ప్రసాదించే బెజవాడ కనకదుర్గాదేవి ఆలయంలో ఏటా ఆశ్వయుజ శుద్ధ ప్రతిపద అంటే పాడ్యమి నుండి విజయదశమి వరకు వైభవంగా శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తారు. ఇది ఆనవాయితీ. శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటిరోజు బుధవారం అమ్మవారు శ్రీస్వర్ణ కవచాలంకృత శ్రీదుర్గాదేవిగా దర్శనమిస్తుంది. అమ్మవారిని బంగారు కవచాలతో, ఎరుపురంగు చీరతో అలంకరిస్తారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే దసరా మహోత్సవాలు బుధవారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ అనంతరం అమ్మవారికి రుత్వికులు వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్నపనాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించారు. బాల భోగ నివేదనలు, నిత్యార్చనలు పూర్తయిన తరువాత ఉదయం 8 గంటలకు భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు.
నివేదన: ఆవునేతితో చేసిన పొంగలి
ఈ రోజు పఠించవలసిన శ్లోకం:
సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతి తే!
యాని చాత్యుర్థ ఘోరాణి తైర్మాస్మాంస్తథా భువమ్
భావం: ఓ జననీ! ముల్లోకాలయందు సంచరిస్తుండే నీ సాత్త్విక రూపాలతో, మిక్కిలి భయంకరమైన స్వరూపాలతో మమ్మల్ని, ఈ సమస్త భూమండలాన్ని కాపాడు!
ఫలమ్: ఇంటిలో ఉన్న చిక్కులు తొలగి, శక్తి, సంపదలు కలుగుతాయి.
అరుణ కిరణ జాలై రంజితా సావకాశా
విద్ధృత జప వాటికా పుస్తకాభీతి హస్తా
ఇతర కరవరద్యా ఫుల్ల కల్హార సంస్థా
నివసతు హృది బాలా నిత్యకల్యాణరూపా
శరన్నవరాత్రి మహోత్సవాలలో కనకదుర్గాదేవి బాలా త్రిపురసుందరీదేవిగా దర్శనమిస్తుంది. బాలాదేవి మహిమాన్వితమైన తల్లి. శ్రీబాలామంత్రం సమస్త దేవీమంత్రాల్లోకి గొప్పది, ముఖ్యమైనది. అందుకే శ్రీవిద్యోపాసకులకి మొట్టమొదట బాలామంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపురసుందరీదేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత ఈ బాలా దేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపురసుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణ ఫలం అందించే అలంకారం శ్రీబాలాదేవి.లలితా త్రిపుర సుందరిదేవి రూపంలో అమ్మవారు 3 సంవత్సరాల బాలికా రూపంలో కనిపిస్తారు. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవటం ద్వారా అనుకున్న పనులు నెరవేరతాయని భక్తుల నమ్మకం.
ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. దుర్గమ్మ ఈరోజు గాయత్రి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ అలంకరణలో అమ్మవారు పంచముఖాలతో అధిష్టాన దేవతగా కనిపిస్తారు. ఈ తల్లి శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణుమూర్తి, శిఖలో రుద్రుడు నివశిస్తుండగా అమ్మవారు త్రిమూర్తి స్వరూపంగా వెలుగొందుతోంది. గాయత్రి దేవికి ఇష్టమైన పాయసం, పంచభోగాలను నైవేద్యంగా సమర్పించారు. దుర్గగుడి ప్రాంగణంలో సంప్రదాయ వాయిద్యాల హోరు ప్రతిధ్వనించింది. మరోవైపు భారీగా తరలివస్తున్న భక్తులతో ఇంద్రకీలాద్రి పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.
ఆశ్వయుజ శుద్ధ చవితి, శనివారం 13–10–2018
ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం
బింబాధరం పృథుల మౌక్తిక శోభినాసమ్
ఆకర్ణ దీర్ఘ నయనం మణి కుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వ ఫాల దేశమ్
శరన్నవరాత్రి మహోత్సవాలలో కనకదుర్గమ్మ శ్రీలలితాత్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈ అమ్మవారు శ్రీచక్ర అధిష్ఠానశక్తిగా, పంచదశాక్షరీ మహా మంత్రాధిదేవతగా వేంచేసి తనని కొలిచే భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తుంది. లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా చిరుమందహాసంతో వాత్సల్యాన్ని ప్రదర్శిస్తూ చెరకుగడను చేతపట్టుకొని శివుని వక్ష స్థలంపై కూర్చొని లలితా త్రిపురసుందరీదేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడిగా, అమ్మవారు త్రిపురసుందరీదేవిగా భక్తులు చేసే పూజలను అందుకొంటుంది.
ఆశ్వయుజ శుద్ధ పంచమి, ఆదివారం, 14-10-2018
అమ్మవారి మూల నక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తులు
దసరా ఉత్సవాల్లో కీలకమైన మూల నక్షత్రం వేళ ఇంద్రకీలాద్రి జనసంద్రమైంది. కనకదుర్గ అమ్మవారు మహాసరస్వతిదేవి అలంకారంలో దర్శనమిస్తుండటంతో ఇంద్రకీలాద్రి భక్తజనంతో నిండిపోయింది. అర్థరాత్రి 1 గంట నుంచే భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు.
సరస్వతి అలంకారానికి ఎనలేని ప్రాధాన్యత
అన్ని అలంకారాల కన్నా అమ్మవారి మూల నక్షత్రం రోజున చేసే సరస్వతీ అలంకారానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. వాక్కు, బుద్ధి, విజ్ఞానం, కళలు.. అన్నిటికీ ఈమే అధిష్టాన దేవత. రుగ్వేదం, దేవీభాగవతం, బ్రహ్మవైవర్త పురాణాల్లో సరస్వతీదేవిని గురించిన అనేక గాథలు విస్తారంగా వర్ణితమై ఉన్నాయి. కచ్ఛపి అనే వీణ, పుస్తకం, అక్షమాల, తెల్లని వస్త్రాలు ధరించి, నెమలిని అధిరోహించిన రూపంలో ఈ తల్లి దర్శనమిస్తుంది. అనంత స్వరూపిణి, సర్వశక్తి స్వరూపిణి, సర్వాంతర్యామిని, విజ్ఞానదేవత, వివేకదాత్రిగా శాస్త్రాలు, పురాణేతిహాసాలు సరస్వతీదేవిని వర్ణిస్తున్నాయి. ‘వాజేభిర్వాజినీవతీ’ - అని మంత్రం. సరస్వతీదేవి మమ్ములను పవిత్రులుగా చేసి, మాకు అన్నపూర్ణగా అన్నం పెడుతుంది. జ్ఞానాన్ని అందించి, భవసాగరాన్ని దాటిస్తుంది. సకల బుద్ధులను ప్రకాశింపజేస్తుంది అని రుగ్వేదం సరస్వతీదేవిని స్తోత్రం చేసింది. అ నుంచి క్ష వరకు ఉన్న అన్ని అక్షరాలతో ఏర్పడే సకల వాజ్ఞ్మయం, సంగీతం మొదలైన అన్ని కళలూ ఈ తల్లి వరప్రసాదంగా ఏర్పడినవే. వ్యాసుడు, వాల్మీకి, యాజ్ఞవల్క్యుడు మొదలైన రుషులందరూ ఈ తల్లి అనుగ్రహం వల్లనే లోకోత్తర చరితులయ్యారు.
ఆశ్వయుజ శుద్ధ షష్ఠి, సోమవారం, 15–10–2018
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల వంశ పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
శరన్నవరాత్రి మహోత్సవాలలో కనకదుర్గమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తుంది. ఈ తల్లి అన్నాన్ని ప్రసాదించే మాతృమూర్తి. అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలోని బంగారుపాత్రలో అమృతాన్నం ఉంటుంది. వజ్రాలు పొదిగిన గరిటెతో తన భర్త అయిన ఈశ్వరునికే ఆ అన్నాన్ని భిక్షగా అందించే అంశం అద్భుతం. సర్వ పుణ్య ప్రదాయకం. లోకంలో జీవుల ఆకలిని తీర్చటం కన్నా మిన్న ఏదీ లేదు. అందుకే అన్ని దానాల కంటె అన్నదానం గొప్పదంటారు. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించి తరించి, అన్నాదులకు లోపం లేకుండా, ఇతరులకు అన్నదానం చేసే సౌభాగ్యాన్ని పొందడమే ఈ అవతార ప్రాశస్త్యం.
ఆశ్వయుజ శుద్ధ సప్తమి, మంగళవారం, 16–10–2018
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే
శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే
శరన్నవరాత్రి మహోత్సవాలలో కనకదుర్గమ్మవారు మహాలక్ష్మిగా దర్శనమిస్తుంది. మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మి. జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో రాక్షస సంహారం చేయటం అద్భుత ఘట్టం. మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించింది. లోకస్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మీ సమష్టి రూపమైన అమృత స్వరూపిణిగా దుర్గమ్మ ఈ రోజు మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ తల్లిని దర్శించడం వలన భక్తులకు ఐశ్వర్యం, విజయం ప్రాప్తిస్తాయి.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కనకదుర్గ అమ్మవారు నేడు శ్రీ మహాలక్ష్మిదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వరాలిచ్చే తల్లిగా, సిరిసంపదలు కురిపించే మాతగా మహాలక్ష్మీదేవి రూపానికి పేరుంది. అందుకే ఈ రూపంలోని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. కృష్ణానదిలోని ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
దసరా సమీపిస్తుండటంతో కొండపైకి భవానీల రాక మొదలైంది. దీంతో ఇంద్రకీలాద్రి పరిసరాలు అరుణ వర్ణం సంతరించుకుంటున్నాయి. వినాయక ఆలయం వద్ద క్యూలైన్లలోకి ప్రవేశించిన భక్తులు... ఘాట్ రోడ్డు మార్గంలోని కామధేను అమ్మవారిని దర్శించుకుని కొండపైకి వస్తున్నారు. జగన్మాతను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.
మంగళవారం కావటం... మహాలక్ష్మీదేవి రూపంలో అమ్మవారు అభయమిస్తుండటం నేటి ప్రత్యేకత. లోక స్థితికారిణిగానూ మహాలక్ష్మి అమ్మవారికి పేరుంది. అలాగే ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రకటించే అష్టలక్ష్ముల సమిష్టి రూపంగా శ్రీమహాలక్ష్మిదేవి రూపాన్ని పేర్కొంటారు. పద్మంపై ఆశీనురాలైన ఆ జగన్మాత తన చేతుల నుంచి కనకవర్షాన్ని కురిపిస్తున్న రూపాన్ని చూడటం ద్వారా వారి ఇంట సిరికి లోటుండదని భక్తుల నమ్మకం.
ఆశ్వయుజ శుద్ధ అష్టమి, బుధవారం, 17–10–2018
సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవీ నమోస్తుతే
శరన్నవరాత్రి మహోత్సవాలలో కనకదుర్గమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు తన దివ్యదర్శనాన్ని ప్రసాదిస్తుంది. లోక కంటకుడైన దుర్గమాసురుడిని సంహరించి దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై స్వయంగా ఆవిర్భవించింది ఆ తల్లి. రాక్షసుడిని సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గగా వెలుగొందినది అష్టమి తిథి నాడే. శరన్నవరాత్రులలో దుర్గాదేవిని అర్చించటం వలన దుర్గతులను తొలగి సద్గతులు ప్రాప్తిస్తాయని పెద్దలు చెబుతారు. ‘దుర్గే దుర్గతి నాశని’ అనే మంత్రం సకల జనులకూ శుభాలను కలుగచేస్తుంది. దుర్గతులను నశింపచేసి సద్గతులను ప్రసాదించి, ఆయురారోగ్యాలను ప్రసాదించే దివ్యరూపిణి దుర్గమ్మవారు. ఈ అమ్మవారి దర్శనం సకల శ్రేయోదాయకం.
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఆఖరి రోజుకు చేరాయి. మహర్నవమి, విజయదశమి ఒకే రోజు రావడంతో అమ్మవారు రెండు అవతారాలలో దర్శనమివ్వనున్నారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి మహిషాసురమర్ధని అవతారంలో, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీ రాజరాజేశ్వరీ దేవీ అవతారంలో కనిపించనున్నారు. మధ్యాహ్నాం 1.30 గంటలకు యాగశాలలో పూర్ణాహుతితో దసరా ఉత్సవాల ముగింపు ఉంటుంది.
No comments:
Post a Comment