Saturday, 13 October 2018

మహాలయపక్షం







మహాలయపక్షం.. పితృమోక్షప్రదం


కన్యారాశిలో సూర్యుడు ప్రవేశించి ఉండగా చాంద్రమానంలో భాద్రపదమాసంలో కృష్ణపక్షంలో తొలిరోజైన పాడ్యమి తిథి నుంచిఅమావాస్య వరకు గల పదిహేను రోజుల కాలానికి మహాలయపక్షమని పేరు. దీనికే పితృపక్షం అనికూడా పేరు. సంవత్సరంలో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క దేవతకు ప్రాధాన్యం ఉన్నట్టుగానే ఈ భాద్రపదబహుళపక్షములో పితృదేవతలకు చాలా ప్రాధాన్యం ఉంది. పితృదేవతలకు పిండప్రదానం చెయ్యటానికి ఇది ఎంతో ప్రశస్తమైన కాలం. ఈ సమయంలో పితృదేవతలు పితృలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చి తమ వంశములలో పుట్టిన తమవారసులు తమకు శ్రాద్ధక్రియను జరుపుతున్నారా లేదా? అని వారి వారి ఇంటి వాకిలిని ఆశ్రయించి ఎదురు చూస్తుంటారట. అందుకని అలా వచ్చిన పితరులకు ఎంతో భక్తిశ్రద్ధలతో మహాలయమును నిర్వహించాలి. ఈ పక్షం లో వచ్చే భరణి నక్షత్రయుక్తమైన రోజుకు మహా భరణి అని పేరు. అలాగే ఈ పక్షమున వచ్చు అష్టమికి మధ్యాష్టమి అని పేరు. ఈ పక్షంలోనీ వ్యతీపాతయోగమున్న షష్ఠీ తిథికి మహావ్యతీపాతమని పేరు. దీనికే కపిలా షష్ఠీ అని కూడా పేరు. మఖా నక్షత్రంతో కూడిన త్రయోదశికూడా చాలా గొప్పది. ఈ రోజులు మహాలయ నిర్వహణకు చాలా గొప్ప తిథులు. అలాగే ఈ పక్షములోని ద్వాదశికి ‘సన్యాసి మహాలయమని’ పేరు. అలాగే హస్తా నక్షత్రమున సూర్యుడు ఉండగా హస్తా నక్షత్రంతో కూడిన అమావాస్యకు ‘గజచ్చాయ’ లేక ‘యమగజచ్చాయ’ అని పేరు. ఇది మహాలయమునకు ఎంతో ప్రశస్తమైన తిథి. మహాలయం పెట్టడం వల్ల పితరులకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి. సిద్ధిస్తుంది. మహాలయపక్షంలో ఏయే తిథుల్లో పితృదేవతలకు మహాలయం నిర్వహిస్తే ఏయే ప్రయోజనాలు ఉంటాయో పరాశరస్మృతి చెబుతోంది. దాని ప్రకారం.. పాడ్యమినాడు నిర్వహిస్తే ధనలాభం, విదియనాడు నిర్వహిస్తే సంతాన ప్రాప్తి, తదియ నాడు నిర్వహిస్తే విశేషలాభం, చవితినాడు నిర్వహిస్తే శత్రువులు మిత్రులుగా మారడం, పంచమినాడు నిర్వహిస్తే సంపదలు కలగడం, షష్ఠి నాడు నిర్వహిస్తే లోకపూజ్యత, సప్తమినాడు నిర్వహిస్తే నాయకత్వం, అష్టమినాడు నిర్వహిస్తే బుద్ధి వికాసం, నవమినాడు నిర్వహిస్తే పుత్రికా సంతానం, దశమినాడు నిర్వహిస్తే అభీష్ట సిద్ధి, ఏకాదశినాడు నిర్వహిస్తే వేదవిజ్ఞాన సిద్ధి, ద్వాదశినాడు నిర్వహిస్తే సువర్ణలాభం, సంతాన ప్రాప్తి, పశులాభం, పుష్టి, సంపదలు, త్రయోదశి నాడు నిర్వహిస్తే దీర్ఘాయువు, ఐశ్వర్యం.. చతుర్దశినాడు (ఈ తిథినాడు కేవలం బాల్యంలో మృతి చెందిన వారికి, యుద్ధంలో ఆయుధములవల్ల మరణించిన వారికి మాత్రమే నిర్వహించాలి) నిర్వహిస్తే అభీష్టసిద్ధి, అమావాస్య నాడు నిర్వహిస్తే సర్వ వాంఛలు సిద్ధించడం.. ఫలితాలుగా చెప్పబడ్డాయి. ఇంత గొప్ప సమయం మహాలయం అనేది. మన జన్మకు కారణమైన మన పూర్వజులకు సంవత్సరానికి ఒకసారి మనం అర్పించే నివాళి ఇది. మనం ధన్యులం కావడానికి ఒక అవకాశం.

- ఆచార్య రాణి సదాశివమూర్తి





No comments:

Post a Comment