Oct 09, 2018
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు దసరా మహోత్సవాలు జరుగుతాయి. అమ్మవారిని లలితా సహస్రనామ స్తోత్రంలో వర్ణించినట్లుగా, సనాతన సంప్రదాయం, శృంగేరి పీఠాధిపతి, శ్రీవిద్యోపాసకులు నిర్ణయించిన విధంగా అలంకరిస్తారు. స్వర్ణకవచాలంకృత కనకదుర్గ, బాలాత్రిపురసుందరి, గాయత్రీ, లలితా త్రిపురసుందరి, సరస్వతి, అన్నపూర్ణ, మహాలక్ష్మి, దుర్గ, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి అలంకారాల్లో కన్నులపండువగా దర్శనమిస్తుంది. దసరాల్లో పది అలంకారాల్లో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే సకల పాపాలు తొలగి, సుఖశాంతులతో జీవిస్తారని భక్తుల విశ్వాసం. ఒకప్పుడు అమ్మవారిని అలంకరించే ఆయుధాలు, వస్తు, వాహనాలను తయారు చేయడానికి చెక్కసామగ్రిని; ఆభరణాలుగా సాధారణ దండలను ఉపయోగించేవారు. దాతలు, భక్తుల సంఖ్య పెరిగి దేవస్థానం ఆదాయం పెరగడంతో, బంగారు ఆయుధాలు, వజ్రాలు, రత్నాలు పొదిగిన సామగ్రిని వినియోగిస్తున్నారు. గజమాలలు, ఐదారు రకాల పట్టు చీరలు, బంగారు ఆభరణాలతో అలంకరిస్తున్నారు.
ఆలయంలోనే మూల విరాట్టుకు అలంకరణ...
దసరా ఉత్సవాల్లో మూల విరాట్టును అలంకరించడం మన దేశంలో కేవలం ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన దుర్గగుడిలోనే మాత్రమే కనపడుతుంది. నిత్యం వేద మంత్రోచార్చరణల మధ్య పూజలు, ధూపదీపనైవేద్యాలు అందుకునే మూలవిరాట్టును వివిధ అలంకారాల్లో దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని వేదపండితుల అభిప్రాయం.
– ఉప్పులూరు శ్యామ్ ప్రకాష్/సుభానీ
సాక్షి, ఇంద్రకీలాద్రి, విజయవాడ
తల్లికి ఒక బిడ్డ సేవ చేసే విధంగా మేము దసరా ఉత్సవాల్లో అమ్మవారి అలంకారాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తాం. ఏ విధంగా అలంకరిస్తే అమ్మవారు నిండుగా కనిపిస్తుందో ముందే ఊహించుకుని దానికి తగ్గట్లుగా అలంకరిస్తాం. నేను ఐదు దశాబ్దాలుగా దసరా ఉత్సవాల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరిస్తున్నాను. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వందల సంవత్సరాలుగా జరుగుతున్నాయి. అమ్మవారిని వివిధ రూపాలుగా అలకరించడంలో ‘లింగభొట్ల’ వంశీకులదీ అందెవేసిన చెయ్యి. ఆ వంశంలో నేను పదిహేడవ తరం వాడిని. మా కుటుంబసభ్యులమంతా పది రోజులూ అమ్మవారి దీక్ష చేపడతాం. ఇంట్లో కూడా నిత్యం అమ్మవారి ప్రతిరూపాలుగా చిన్నారి బాలికలకు, సువాసినులకు పూజలు నిర్వహిస్తాం. ఏకభుక్తం, బ్రహ్మచర్యాన్ని అనుసరిస్తాం. అమ్మవారిని అలంకరిస్తున్నంతసేపు ఆ తల్లి మీదే మనసు లగ్నం చేసి ఆవిడ నామాన్ని జపిస్తూంటాం. దశాబ్దం క్రితం దసరాల్లో ఒకరోజు తెల్లవారుజామున అమ్మవారి అలంకరణకు బయలుదేరాం. అలంకరణ సామగ్రి కోసం ఎంత వెతికినా కనపడలేదు. ఎక్కడ పెట్టామో తెలియదు. తెల్లవారేలోపు అలంకరణ పూర్తి కాకపోతే భక్తులకు దర్శనం ఆలస్యం అవుతుంది. అమ్మవారి పైనే భారం వేసి అందుబాటులో ఉన్న కొద్దిపాటి ఇతర వస్తువులతో అమ్మవారి గర్భగుడిలోకి ప్రవేశించాం. ఆశ్చర్యం.. ఆరోజు అమ్మవారికి అలంకరించాల్సిన సామగ్రి అంతా సిద్ధంగా ఉంది. ఇది అమ్మవారి మహిమేనని భావించి, ఆ తల్లికి సాష్టాంగపడి, అలంకరణ పూర్తి చేశాం. – బదరీనాథ్ బాబు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం, విజయవాడ |
అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ అయిన దుర్గమ్మకు పట్టుచీరలంటే మక్కువ అని అర్చకులు చెబుతారు. ఆ జగజ్జననికి వంద రూపాయల నుంచి వేలరూపాయల వరకు ఖరీదు చేసే చీరలను భక్తులు సభక్తికంగా సమర్పించుకుంటారు. దుర్గమ్మను అలంకరించేందుకు భక్తులు పట్టుచీరలతో పాటు శక్తి కొలదీ నూలు, సిల్క్‌చీరలను కూడా సమర్పిస్తుంటారు. దుర్గమ్మకు అలంకరించే చీరలను ప్రత్యేకంగా ఎక్కడా నేత నేయించరు. భక్తులు సమర్పించిన వస్త్రాలలో పెద్ద అంచు ఉన్న చీరలను అమ్మవారికి అలంకరించేందుకు ఉపయోగిస్తారు. భక్తులు తమకు నచ్చిన పట్టు చీరలను కొనుగోలు చేసి దేవస్థానం కౌంటర్‌లో అందచేస్తారు. కొంతమంది భక్తులు అమ్మవారికి ప్రత్యేకంగా పట్టుచీరలను నేత నేయించి కానుకలుగా అందచేస్తారు. అమ్మవారికి ఇచ్చే ప్రతి చీరను అంతరాలయంలో ఉత్సవమూర్తికి చూపుతారు. నిత్యం నాలుగు నుంచి ఐదు చీరలను అమ్మవారి మూలవిరాట్టుకు అలంకరిస్తారు. దసరా ఉత్సవాలలోనూ ఇదే తరహాలో అలంకరిస్తారు. ఇక ఉత్సవ మూర్తులు, అమ్మవారి ఆలయం చుట్టూ కొలువుదీరిన అష్టలక్ష్ములకు కూడా పట్టుచీరలను అలంకరిస్తారు.
ప్రభుత్వం నుంచి పట్టుచీర
దసరా ఉత్సవాలలో అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం, సరస్వతీదేవి అలంకారం రోజున ప్రభుత్వం తరపున రాష్ట్రముఖ్యమంత్రి పట్టుచీరను సమర్పిస్తారు. దసరా ఉత్సవాల ప్రారంభం రోజున పోలీసు శాఖ నుంచి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ అమ్మవారికి పట్టుచీరను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయం నుంచి, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. దీనితోపాటు దుర్గ గుడి ఆలయ అధికారి ఈవో హోదాలో అమ్మవారికి పట్టుచీరను సమర్పించడం ఆనవాయితీ. సమర్పించే పట్టుచీరలను అమ్మవారికి అలంకరించిన అనంతరం దేవస్థానం వాటిని వస్త్ర ప్రసాదంగా భక్తులకు విక్రయిస్తుంది. వివాహం, గృహప్రవేశం, కంపెనీల ప్రారంభోత్సవం వంటి శుభకార్యాల సందర్భంగా భక్తులు అమ్మవారికి చీరలను సమర్పిస్తుంటారు. సాధారణ రోజులలో కొండపై ఆలయ ప్రాంగణంలో రెండు కౌంటర్లు, మహామండపం దిగువన ఒక కౌంటర్‌లో ఈ వస్త్రప్రసాదం భక్తులకు అందుబాటులో ఉంటుంది. దసరా, భవానీ దీక్షల విరమణ సమయంలో కొండ దిగువన మహామండపం, కనకదుర్గ నగర్‌లలో వస్త్ర ప్రసాద కౌంటర్లు అందుబాటులో ఉంటాయి. అమ్మవారి చీరల విక్రయాలు ఆలయ ఈవో పర్యవేక్షణలో జరుగుతుంది. భక్తులు అమ్మవారికి అలంకరించే నిమిత్తం సమర్పించిన చీరను... పుట్టినరోజు, పెళ్లిరోజు... ఇలా తమకు నచ్చిన తేదీలలో అమ్మవారికి అలంకరింపచేసుకునే అవకాశం ఉంటుంది.
అమ్మవారి వస్త్ర ప్రసాదం
దేవస్థానానికి వచ్చే ఆదాయంలో చీరల విక్రయం ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలాఖరు నాటికి రూ. 1.98 కోట్ల ఆదాయం వచ్చింది. గత రెండు సంవత్సరాలుగా దేవస్థానమే చీరల విక్రయాలను నిర్వహిస్తోంది. ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు సైతం అమ్మవారి చీరలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఆ వస్త్రాలను అమ్మవారి దివ్య ప్రసాదంగా భావిస్తారు.
| శ్రీస్వర్ణకవచాలంకృత దుర్గాదేవి | : | బంగారు రంగు |
| శ్రీబాలాత్రిపుర సుందరీదేవి | : | లేత గులాబీ రంగు |
| శ్రీగాయత్రీదేవి | : | ముదురు నారింజ రంగు |
| శ్రీలలితా త్రిపుర సుందరీదేవి | : | అచ్చమైన బంగారు రంగు |
| శ్రీసరస్వతీదేవి (మూలానక్షత్రం) | : | తెలుపు రంగు |
| శ్రీఅన్నపూర్ణాదేవి | : | గంధపు రంగు |
| శ్రీమహాలక్ష్మీదేవి | : | నిండు గులాబీ రంగు |
| శ్రీదుర్గాదేవి | : | నిండు ఎరుపు రంగు |
| శ్రీమహిషాసురమర్దినీదేవి | : | గోధుమ, ఎరుపు రంగుల కలనేత జరీ పట్టు చీర |
| శ్రీరాజరాజేశ్వరీదేవి | : | పచ్చరంగు |
ఎస్.కె.సుభానీ (ఇంద్రకీలాద్రి)
Oct 09, 2018
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెల్లవారుజామున బాలభోగ నివేదనతో పాటు మధ్యాహ్నం మహానివేదన సమర్పిస్తారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు వంటశాల నుంచి నివేదనలను ఆలయానికి తీసుకువచ్చి దుర్గా మల్లేశ్వరస్వామివార్లతో పాటు ఉపాలయాలలోని దేవతామూర్తులకు సమర్పిస్తారు. ఈ ప్రసాదాలను మహా మండపం ఆరో అంతస్తులో ఉన్న వంటశాలలో తయారుచేస్తారు. అమ్మవారికి నివేదనను సకాలంలో సమర్పించేందుకు వీలుగా ఉప ప్రధాన అర్చకులు కోటప్రసాద్, అర్చకులు రంగావఝల శ్రీనివాసశాస్త్రి పర్యవేక్షకులుగా ఉంటారు. తొలిపూజ – నివేదన లోక కళ్యాణార్థమే తెల్లవారుజామున 2–30 గంటలకు అమ్మవారి ఆలయం తెరిచిన తరువాత తొలిపూజను లోకకళ్యాణార్థం చేస్తారు. అర్చనానంతరం అమ్మవారికి బాలభోగంగా దద్ధ్యోదనాన్ని ఉదయం ఆరు గంటలకు నివేదన చేస్తారు. ఉదయం 8–30 గంటలకు కట్టె పొంగలి, బూందీ లడ్డూ, ఉదయం 10–30 గంటలకు పులిహోర, సాయంత్రం 4–30 గంటలకు సెనగలు, పాలు సమర్పిస్తారు. ఉదయం 11–40 గంటలకు అన్ని దర్శనాలను నిలిపివేసి, ఆలయాన్ని శుభ్రం చేసి, మహానివేదనగా అన్నం, రెండు కూరలు, పప్పు, సాంబారు, పాయసం, గారెలను అమ్మవారికి నివేదిస్తారు. అమ్మవారికి సమర్పించిన చిత్రాన్నాన్ని ఉదయం ఆరుగంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. తాజాగా ఈ సంవత్సరం దసరా ఉత్సవాల నుంచి అమ్మవారికి అప్పాలను నివేదించి, భక్తులకు ఉచితంగా అందచేయనున్నారు.
దసరా ఉత్సవాలలో ప్రత్యేకం...
సాధారణ రోజులలో మధ్యాహ్నం 12 గంటలకు మహానివేదన సమర్పిస్తుండగా, దసరా ఉత్సవాల సమయంలో మాత్రం సాయంత్రం 6–30 గంటలకు మహా నివేదన సమర్పిస్తారు. ఉదయం ఏడు గంటలకు వడలు, పది గంటలకు అమ్మవారికి రాజభోగాలుగా చక్కెర పొంగలి, పులిహోర, పాయసం, రవ్వకేసరి, పరమాన్నం, బూందీ లడ్డూ, గారెలను సమర్పిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు పంచభోగాలను నివేదిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు అన్ని దర్శనాలను నిలిపివేసిన తర్వాత ఆలయాన్ని శుభ్రం చేసి మహానివేదన సమర్పిస్తారు. అనంతరం పంచహారతులు, చతుర్వేద స్వస్తి జరుగుతుంది. దసరా ఉత్సవాలలో మహానివేదనతో పాటు మరికొన్ని వంటకాలను అమ్మవారికి నివేదనగా సమర్పిస్తున్నామని ఆలయ అర్చకులు చెబుతున్నారు.
దసరా ఉత్సవాలు – అలంకారాలు – నివేదనలు
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి– స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి (మైసూర్‌పాక్, పులిహోర)
ఆశ్వయుజ శుద్ధ విదియ – బాలాత్రిపుర సుందరీదేవి (లడ్డూ, పెసర వడ)
ఆశ్వయుజ శుద్ధ తదియ– గాయత్రీదేవి (సున్నుండలు, అరటికాయ బజ్జీ)
ఆశ్వయుజ శుద్ధ చవితి – లలితాత్రిపుర సుందరీదేవి (కొబ్బరి లవుజు, మినప వడ)
ఆశ్వయుజ శుద్ధ పంచమి – సరస్వతీదేవి (జాంగ్రీ, ఆవడ)
ఆశ్వయుజ శుద్ధ షష్ఠి – అన్నపూర్ణాదేవి (గోధుమ హల్వా, సెనగ వడ)
ఆశ్వయుజ శుద్ధ సప్తమి – మహాలక్ష్మీదేవి (చక్కెర పొంగలి, బొబ్బర్ల గారె)
ఆశ్వయుజ శుద్ధ అష్టమి – దుర్గాదేవి (పాయసం, బూందీ)
ఆశ్వయుజశుద్ధ నవమి/దశమి – మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరీదేవి (అప్పాలు, పెసర పునుగులు)
ఉప్పులూరు శ్యామ్ ప్రకాష్,
విజయవాడ
No comments:
Post a Comment