మనకు శిల, దారు, లోహాలతో విగ్రహం తయారుచేసి పూజించే సంప్రదాయం ఉంది. కానీ.. పుష్పాలను ఆరాధ్యదేవతగా చేసుకుని పూజించే సంప్రదాయం తెలంగాణలో మాత్రమే ఉంది. సుందరంగా ఉండే ఈ నిసర్గచక్రంలో ముగ్ధమనోహరంగా కనిపించేవి పుష్పాలు. ఆ పువ్వులు ప్రకృతికే అలంకారమయ్యే రుతువు శరత్కాలం. వర్ణ సంశోభితమైన పుష్పాలను కళాత్మకంగా ఏర్చికూర్చే ఈ సంబరం చూసిన కన్నులే కన్నులు. బతుకమ్మలను తీర్చిదిద్దడం, ఆ తర్వాత వాటిచుట్టూ స్త్రీలు తమ సంగీత, నృత్య, సాహిత్య కౌశలాన్ని ప్రదర్శించేందుకకు ఆడే ఆటలు, పాటలు మరో వినూత్న చైతన్యాన్ని తెలియజేస్తాయి. చివరిరోజు సద్దుల బతుకమ్మనాడు కలిసి ప్రసాదాలు పంచుకుని ఆడిపాడి ఆనందాన్ని పంచుకొనే దృశ్యం మన పండుగల సామాజిక దృష్టిని తెలియజేస్తున్నది. అదేరోజు సాయం సమయాన నీటిలో తేలియాడుతూ పూలరథాలుగా పయనించే వర్ణశోభిత బతుమ్మల సౌందర్యంలో భాషకందని భావాలతో సాగనంపే స్త్రీమూర్తుల ఆరాధన వ్యక్తమవుతుంది.
ఈ బతుకమ్మ.. వర్షరుతువు సమాప్తిని, శరదృతువు ఆగమనాన్ని సూచిస్తూ ఏటా మహాలయ అమావాస్య నుండి ప్రారంభమై ఆశ్వయుజ శుద్ధ మహర్నవమి మహాగౌరీపూజతో ముగుస్తుంది. ఈ తొమ్మిది రోజుల్లో తయారుచేసే బతుకమ్మలను ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ తొమ్మిది రోజుల పేర్లముందున్న పదార్థాలే నైవేద్యాలు. బతుకమ్మ శబ్దం ‘బృహతమ్మ’ నుంచి వచ్చిందని కొందరు చెబుతారు. కాకతీయుల వంశదేవత కాకతమ్మనే బతుకమ్మగా మారిందని మరికొందరు పరిశోధకులు చెబుతున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధంతో తంగేడు పువ్వుగా పుట్టిన చెల్లెలే బతుకమ్మ అని జానపదగాథలు చెబుతున్నాయి.
సంప్రదాయాలు తెలిసినవారు నవరాత్రుల్లో శ్రీచక్రాన్ని ముందు పెట్టుకొని నవావరణ పూజ చేస్తే.. సామాన్య స్త్రీలు ఎలాంటి రసాయనాలూ లేకుండా పూచే తంగేడు, గుమ్మడి, బీర, కట్ల గోరింట, గునుగు, అల్లి, టేకు పూలతో బతుకమ్మను మేరుప్రస్థ శ్రీచక్రం ఆకారంలో అమర్చి ఆరాధిస్తారు. స్త్రీలు ఇంటిపనులకే పరిమితం కాకుండా ఆట, పాటలలో నిమగ్నమై సామూహిక నిమజ్జనం (సామాజిక దృష్టి) చేసి సరికొత్త ఆలోచనలకు తెరతీస్తారు. అందరూ కలిసి ఆడిపాడి కులసమానత్వాన్ని సాధిస్తారు. సద్దుల బతుకమ్మనాడు అందరూ ఇళ్లనుంచి తెచ్చుకున్న ప్రసాదాలు పంచుకుని తినడం అంటే.. రుచికరమైన పదార్థం అందరూ తినాలనే ఆత్మీయత అందులో ఉంటుంది. మాతృ ఆరాధనకు నెలవుగా ఉన్న ఈ పండుగ స్త్రీత్వాన్ని గౌరవించాలని తెలుపుతుంది. అమ్మదనం ఉండి అందరూ బతకాలి.. అందరినీ బతికించాలి అనే సందేశం ఈ పండుగలో నిగూఢమై ఉంది.
-డా.పి.భాస్కరయోగి
బతుకమ్మ...తెలంగాణ రాష్ట్రంలో విశేషంగా జరుపుకొనే పూల పండగ. దసరా పండగ ముందు వచ్చే అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకూ తొమ్మిది రోజులపాటు చేసే ఈ పండగ ప్రత్యేకత అంతా ఇంతా కాదు. మన చుట్టూ లభించే పూలతో అందమైన బతుకమ్మలని పేర్చి... లయబద్ధంగా అడుగులు వేస్తూ, చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ, ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ... రకరకాల నైవేద్యాలు సమర్పించడం ఈ పండగ విశిష్టత.
బతుకమ్మ ఎవరంటే:
ధరచోళ దేశంలో ధర్మాంగుడనే రాజు, ఆయన భార్య సత్యవతి. వారికి చాలామంది మగసంతానం. అయితే వాళ్లందరు యుద్ధంలో మరణించడంతో ఆ దంపతులు అడవులకు వెళ్లి లక్ష్మి దేవి గురించి తపస్సు చేస్తారు. ఆమె ప్రత్యక్షమై వరం కోరుకో అంటుంది. తన కుమార్తెగా ఆమె పుట్టాలని అడుగుతారు. వారి కోరిక మేరకు సత్యవతికి అమ్మాయిగా పుడుతుంది. చుట్టు పక్కల మునులు ఆమెకు ‘కనీసం నువ్వైనా బతుకు’ అని ఆ పేరు పెడతారు.
మందారాలు మొదలు:
పూలను దొంతరలుగా పేర్చి బతుకమ్మను తయారు చేస్తారు. ఇందులో ఎక్కువగా గునుగు, తంగేడు, కట్లపూలు, కలువలు, గన్నేరు, మందారాలు... వంటి పూలు కనిపిస్తాయి. లలితా సహస్రనామంలో అమ్మవారిని చైతన్య కుసుమ ప్రియ అంటారు. చైతన్య కుసుమం అంటే గుమ్మడి పువ్వు. గుమ్మడి పువ్వును బతుకమ్మ పైన గౌరమ్మలా పెడతారు. ఆ పువ్వులోని పుప్పొడి పసుపు గౌరమ్మలా కనిపిస్తుంది. అమ్మవారిని గుమ్మంలో తెచ్చుకుని పూజిస్తారు. అయితే అంతకన్నా ముందు... వినాయక నిమజ్జనం తరువాత పాడ్యమి నుంచి పదకొండు రోజుల వరకు పదకొండేళ్ల లోపు ఆడపిల్లలంతా బొడ్డెమ్మ ఆడతారు. దాని తరువాత మహాలయ అమావాస్య రోజు బతుకమ్మను ఆడతారు. బతుకమ్మను వెదురు సిబ్బి (పళ్లెం లాంటిది)బుట్టల్లో మాత్రమే పేరుస్తారు. వెదురు అంటే పార్వతి మాతకు చాలా ఇష్టం. అందుకే వీటిలోనే బతుకమ్మలు చేస్తారు. బతుకమ్మ చుట్టూ తిరుగుతూ చప్పట్లతో పాటలు పాడతారు. ఈ చప్పట్ల ద్వారా అమ్మవారిని స్తుతిస్తూ ఆమెకు శక్తినిస్తుంటారు.
ఏమేమీ పువ్వప్పునే గౌరమ్మ... ఏమేవీ కాయప్పునే గౌరమ్మ
గుమ్మాడి పువ్వప్పునే గౌరమ్మ.. గుమ్మాడి కాయప్పునే గౌరమ్మ
గుమ్మాడి పువ్వప్పునే గౌరమ్మ... గుమ్మాడి కాయప్పునే గౌరమ్మ అంటూ అమ్మవారిని పూజిస్తూ బతుకమ్మ ఆడతారు. మహాలయ అమావాస్య రోజున తెలంగాణ ప్రాంతంలో తమ పితృదేవతల (చనిపోయిన కుటుంబ పెద్దలు)ను గుర్తు చేసుకుంటూ బ్రాహ్మణులకు బియ్యం, కాయగూరలు, ఆకుకూరలు వంటివన్నీ ఇస్తారు. పెద్దలకు నైవేద్యంగా గారెలు, వడలు, పాయసం కూడా అర్పిస్తారు. వాటిని ఎక్కువగా పెసలతోనే తయారు చేస్తారు. ఈ నానబెట్టిన పెసలు, దోసముక్కలను సాయంకాలం బతుకమ్మ దగ్గర కూడా ప్రసాదంగా పెడతారు. అందుకే ఆ బతుకమ్మకు ఎంగిలి పూల బతుకమ్మ అనే పేరొచ్చింది. మరికొన్ని చోట్ల అంతకుముందు రాత్రి పూలు తెచ్చి వాడటం వల్ల కూడా ఆ పేరు వచ్చిందంటారు. మరికొన్ని ప్రాంతాల్లో అటుకులు, బెల్లం ముక్కలను నైవేద్యంగా అర్పిస్తారు.
ఈ రోజున ప్రసాదంగా నువ్వులు, నూకలు, బెల్లాన్ని కలిపి ముద్దలు చేస్తారు. ముందుగా నూకలు దోరగా వేయించి బెల్లం పానకం చేసి నూకల పిండి, నువ్వులతో కలిపి ముద్దలు చేస్తారు. వీటిని విడిగా కూడా వెంట తీసుకెళ్తారు. వీటితోపాటుగా కొన్ని ప్రాంతాల్లో తులసి ఆకులు, వక్కపొడి, పసుపు కుంకుమలను కూడా తీసుకెళతారు. నువ్వుల్లో మాంసకృత్తులు, కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. బెల్లంలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. నూకల్లో త్వరగా జీర్ణం అయ్యే పిండిపదార్థాలు అధికంగా ఉంటాయి.
- డాక్టర్ ఆర్. కమల, రచయిత్రి
తొమ్మిది రోజుల బతుకమ్మ పండగలో రెండో రోజున అటుకుల బతుకమ్మ చేస్తారు. పూల అలంకరణ మామూలుగానే ఉన్నా... నైవేద్యాల తయారీ కాస్త భిన్నంగా ఉంటుంది. సప్పటి పప్పు, బెల్లం అటుకులు నివేదిస్తారు. సప్పటి పప్పును వివిధ ప్రాంతాల్లో రకరకాలుగా తయారుచేస్తారు. ఇందుకు పెసర లేదా కందిపప్పును నానబెట్టి దాంతో ప్రసాదం తయారుచేస్తారు. మరికొన్ని చోట్ల కంది లేదా పెసర పప్పునకు వెల్లుల్లి, కారం, పసుపు, ఉప్పు చాలినంత కలిపి ఉడకపెడతారు. దీన్ని బయటకు తీసి మెత్తగా రుబ్బుతారు. తరువాత మరికొన్ని నీళ్లను కలిపి రసంలా చేసి కాస్త గట్టిగా అయ్యే వరకు పొయ్యి మీద ఉడికిస్తారు. వీటికి కొత్తిమీర, పుదీనాతోపాటు మసాల దినుసుల పొడిని కలుపుతారు. దీన్నే సప్పటి పప్పు అంటారు. కొన్నిచోట్ల దీన్ని రసం మాదిరి చేస్తారు. మరికొన్ని చోట్ల ముద్దగా ఉంటుంది. ఈ వంటకం చేయనివారు పప్పు బెల్లం కలిపి తీసుకువెళతారు. వీటికి అటుకులు కూడా కలిపి బతుకమ్మ వద్ద పంచుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో అటుకుల ముద్దలు తయారుచేస్తారు. బెల్లాన్ని ముదురుపాకం పట్టి అప్పటికే నెయ్యిలో వేయించి పెట్టుకున్న అటుకులను కలిపి ముద్దగా చేస్తారు. కొందరు అటుకులను నానబెట్టి రుబ్బి వాటితో రొట్టెలు చేస్తారు. ఇలా అటుకులనే ప్రధాన సద్దిగా తీసుకెళతారు. అందుకే దీన్ని అటుకుల బతుకమ్మ అంటారు. పెసరపప్పులో ఎక్కువగా మాంసకృత్తులుంటాయి. బెల్లం నుంచి ఇనుము అందుతుంది. ఈ రెండు అన్నివర్గాల మహిళలకు అత్యంత మేలుచేస్తాయి.
ఈ రోజు బతుకమ్మకు ముద్దపప్పు, బెల్లం, పాలతో ప్రసాదం చేసి తీసుకెళతారు. కందిపప్పులో కొద్దిగా జీలకర్ర, కాస్త నూనె, సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి కుక్కర్‌లో ఉడికిస్తారు. తరువాత పప్పుగుత్తితో మెత్తగా చేసి, కొత్తిమీర కలుపుతారు. కొన్నిచోట్ల దీన్ని గట్టిగా చేసి చేతిలో పెట్టుకుని తింటారు. దీంతోపాటు పాలుబెల్లంతో కలిపిన ప్రసాదం కూడా ఉంటుంది. ముద్దపప్పులో మాంసకృత్తులు ఎక్కువ. నూనె తక్కువగా వాడతాం కాబట్టి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పాలు సంపూర్ణ ఆహారం. ఎముకలు దృఢంగా మారతాయి. ఈ రోజూ ప్రసాదంలో కూడా బెల్లం ఉంటుంది కాబట్టి అన్నీ ఆరోగ్యానికి మేలుచేసేవే.
పూల పండగ బతుకమ్మలో భాగంగా నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజు నానబెట్టిన బియ్యంతో ప్రసాదం చేస్తారు. నానబెట్టిన బియ్యానికి పాలు, బెల్లం కలిపి వండుతారు. మొదట బియ్యాన్ని కొంచెంసేపు నానబెట్టాలి. దానికి పాలు, నీరు కలిపి మెత్తగా ఉడికించాలి. ఆ అన్నానికి సరిపడా బెల్లం తీసుకుని నీటిలో కరిగిస్తారు. ఆ పానకాన్ని మెత్తగా వండిన అన్నానికి కలపాలి. దీన్ని మళ్లీ పొయ్యిమీద పెట్టి దగ్గరపడుతున్నప్పుడు మరో గిన్నెలో నెయ్యి తీసుకుని అందులో జీడిపప్పు, కిస్‌మిస్ వేయించి ఆ అన్నంలో వేస్తారు. దీన్ని వేడివేడిగా తయారుచేసుకుని బతుకమ్మ ఆడేచోటకు తీసుకెళ్తారు. అమ్మవారికి నివేదించి... తరువాత ఇతరులకు పంచుతారు.
బతుకమ్మకు అట్లు ప్రసాదంగా పెడతారు. అందుకే అట్ల బతుకమ్మ అని పిలుస్తారు. బియ్యప్పిండిని అట్లుగా పోస్తారు. బియ్యం, రవ్వ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, పెరుగు సమపాళ్లలో తీసుకుని ముద్దలా చేస్తారు. దీనికి కొంత నీళ్లు కలిపి సాధారణంగా రోజు చేసుకునే దోశ కంటే కాస్త మందంగా వేస్తారు. ఈ పిండిని ఒకరోజు ముందు చేసి పెట్టుకుంటే అట్లు బాగా వస్తాయి. ఇలా చేసుకున్న అట్లకు కొందరు బెల్లం లేదా చక్కెర అదీ కాదంటే వారికి ఇష్టం వచ్చిన చట్నీతో కలిపి తింటారు. బతుకమ్మను ఆడిన తరువాత అట్లను ఒకరికొకరు పంచుకుంటారు.
ఆరో బతుకమ్మ ఆటకు సెలవు. ఈ రోజును అలిగిన బతుకమ్మగా పిలుస్తారు. అంటే బతుకమ్మను పేర్చరు. కొన్నిచోట్ల పేర్చినా ఆటలు ఆడరు. ప్రసాదం కూడా నివేదనగా ఇవ్వరు. ఐదు రోజులుగా ఆటల్లో మునిగిన మహిళలకు ఇంటి, వ్యవసాయ పనులు మిగిలిపోతాయి. కాబట్టి వాటిని పూర్తి చేసుకోవడానికి ఇలా మధ్యలో ఒకరోజు ఆటను పక్కన పెడతారని చెబుతారు. మరికొన్ని చోట్ల గౌరీదేవి శివుడి మీద అలుగుతుందనే పురాణ గాథ కూడా ఉందని బతుకమ్మ పై పుస్తకాలు రాసిన రచయితలు, కవులు చెబుతారు.
--
ఈ బతుకమ్మకు వెన్నతో తయారుచేసిన నువ్వుల ఉండలను నైవేద్యంగా పెడతారు. నువ్వులకు వెన్న, నెయ్యి వాడటం వల్ల రుచి వస్తుంది. ముందుగా బెల్లంపాకం పట్టి దానికి బియ్యప్పిండిని కలిపి ముద్దగా చేసుకోవాలి. తరువాత నువ్వులను దోరగా నెయ్యిలో వేయించి బియ్యప్పిండికి కలపాలి. వేడిగా ఉన్నప్పుడే ముద్దలుగా చేసుకోవాలి. వీటిని వెన్నతో కలిపి తినాలి. తెలంగాణ వంటకాల్లో ఎక్కువగా బెల్లం వాడతారు. నెయ్యి తక్కువగా వాడినా... బతుకమ్మ ప్రసాదంలో ఇవి తప్పక ఉండాలనే ఉద్దేశంతో రెండింటినీ ఎంచుకుంటారు. ఇవి రెండూ శరీరానికి ఇనుము, మాంసకృత్తులు, కొవ్వులను అందిస్తాయి. చిన్న పిల్లలకు వెన్న పెట్టడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారు.
ఈ రోజున అమ్మవారికి తొమ్మిది రకాల ప్రసాదాలు నివేదిస్తారు. వీటినే సద్దులుగా పిలుస్తారు. అందుకే ఇది సద్దుల బతుకమ్మ అయ్యింది. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరి తురుము సద్దులను అన్నంతో తయారు చేస్తారు. ఇక, నువ్వుల పొడి, సత్తుపిండి, కొబ్బరిపొడి, మలీద ముద్దలు, సజ్జ ముద్దలు, పండ్లు (సీతాఫలం, అరటి) వంటివీ నైవేద్యంగా పెడతారు. అందరూ కలిసి ఆడిపాడతారు.
No comments:
Post a Comment