Sunday, 21 October 2018

కుంభకర్ణుడు









కుంభకర్ణుడు


జీవితకాలం చాలా చిన్నది. అందులో దాదాపు సగం కాలం నిద్రలోనే గడిచిపోతుంది. మిగతాసగంజీవితంలో ఎదురయ్యే పరిస్థితుల సంక్షోభంలో నిద్రలేని రాత్రులను మనం గడిపేలా చేస్తుంది. వేకువ ఆలోచననిస్తే, నిద్ర ప్రశాంతతనిస్తుంది. కానీ, నిద్రలోని గొప్పతనమేమిటంటే శరీరాన్ని మాత్రమే సాంత్వన పరుస్తూ, మనిషిలోని మేధస్సును పదునుపెడుతూనే ఉంటుంది. మనిషి నిద్రావస్థలో ఉన్నా మస్తిష్కం జాగ్రదవస్థనే ఆశ్రయిస్తుంది. ఆహారం శారీరక శక్తినిస్తే, నిద్ర మేధశ్శక్తిని పెంపొందిస్తుంది. నిద్ర ప్రాపంచిక చింతల నుంచి మనిషిని దూరంగా ఉంచుతుంది. నిద్ర మనుషుల మధ్య భేదాలను దూరం చేస్తుంది. రాజు నిద్ర, బంటు నిద్ర ఒక్కటేనన్న విశ్వజనీన సత్యమే అందుకు నిదర్శనం. అటువంటి నిద్రను శాపంలో వరంగా పొందినవాడూ, సహజసిద్ధ వీరాధివీరుడూ, విలువలూ, ధర్మాలూ తెలిసినవాడూ, తన శక్తిని సామాజిక విరుద్ధంగా ఉపయోగించని విశాల హృదయుడూ కుంభకర్ణుడు. రాజనీతి, ధర్మనీతి తెలిసిన విద్వజ్ఞుడు బంగారు లంకలో జీవితకాలంలో చాలా సంవత్సరాలు హాయిగా నిద్రపోయాడు.

కైకసీ విశ్రవసుల కొడుకు, రావణుని తమ్ముడు, విభీషణుడి అన్న మహాకాయుడు కుంభకర్ణుడు. పుట్టుకతోనే ప్రచండమైన ఆకలి గలవాడు. పుట్టిన వెంటనే పెద్దపెద్ద జంతువులను తిని జీర్ణం చేసుకున్నవాడు. ఆకలి తప్ప మరొకటి ఎరుగని వాడుగా కుంభకర్ణుడు లోకాలన్నింటినీ అల్లకల్లోలం చేస్తుంటాడు.

కుంభకర్ణుని ఆకలికి ప్రపంచంలోని ఏ ప్రాణి మిగలకుండా పోతుండేది. దీంతో అల్లాడిపోయిన ఋషులూ, దేవతలూ బ్రహ్మను ఆశ్రయించగా, వెంటనే కుంభకర్ణున్ని పిలిపిస్తాడు బ్రహ్మ. కుంభకర్ణా! లోకంలోని జీవరాశినంతటినీ నీ ఆకలికి ఆహుతి చేయడానికే నీ తండ్రి నిన్ను కన్నట్టున్నాడు. ఇక నీవు తిన్నది చాలు. ఇకపై చచ్చినట్టు చచ్చేదాకా నిద్రపో అని శపిస్తాడు బ్రహ్మ. విషయం తెలిసిన రావణుడు తన అసలైన బలమైన కుంభకర్ణుడికి బ్రహ్మ ఇచ్చిన శాపాన్ని నిద్రలేవడానికి, ఆహారం తీసుకోవడానికి సమయాన్ని నిర్దేశించేలా సడలించమని వేడుకుంటాడు. అలా కుంభకర్ణుడు ఆరు నెలలకు ఒకసారి నిద్రలేస్తాడు. ఒక్కరోజు మేల్కొని రోజంతా తింటూనే ఉంటాడు. మరునాడు మళ్ళీ నిద్రపోతాడు. కానీ మధ్యలో నిద్రలేపడం మాత్రం శుభం కాదని హెచ్చరిస్తాడు బ్రహ్మ.

నిద్ర లేచిన వెంటనే ఆహార భక్షణ, తిరిగి మళ్ళీ నిద్ర అదే కుంభకర్ణుని జీవితంగా మారిపోయింది. కుంభకర్ణుడు మహాకాయుడు. అందుకనే అతని భవనం కూడా బంగారు లంకలో ఒకటిన్నర యోజన వైశాల్యంతో అత్యద్భుతంగా ఉంటుంది. రాముని చేతిలో పరాభవం తర్వాత రావణునికి కుంభకర్ణుడు ఒక్కడే దిక్కు అనే తలంపు వచ్చింది. కుంభకర్ణుడు నిద్రపోయి ఆనాటికి తొమ్మిది రోజులే అయ్యింది. కానీ తప్పని పరిస్థితుల్లో కుంభకర్ణున్ని ఎలాగైనా నిద్ర లేపాలని నిశ్చయించుకున్నాడు రావణుడు. కుంభకర్ణున్ని నిద్రలేపేందుకు పదివేలమంది రాక్షసులు బంగారు పాత్రలలో ఆహారం సిద్ధం చేసుకొని కుంభకర్ణుని భవనానికి వెళ్తారు. విశ్వప్రయత్నం చేసి ఎంతోమంది ప్రాణాలకు తెగించి కుంభకర్ణున్ని నానా విధానాలను ఉపయోగించి ఎలాగోలా నిద్రలేపుతారు. అంతే నిద్రాభంగం తర్వాత మేల్కొన్న కుంభకర్ణుడు ఆకలి ఆకలి అంటూ రాక్షసులు తెచ్చిన ఆహారాన్నంతా తినేస్తాడు.

కుంభకర్ణుడు దాదాపు రెండువేల కడవల మద్యం తాగేస్తాడు. తిండితిన్న కుంభకర్ణుడు మళ్ళీ నిద్రలోకి వెళ్ళకముందే విషయం చెప్పాలని రావణుని మంత్రి యూపాక్షుడు కుంభకార్ణ! నిన్ను ప్రయత్న పూర్వకంగా నిద్రలేపాల్సి వచ్చినందుకు క్షమించు, లంకకు ఆపద వచ్చి పడిందని అనగానే, కుంభకర్ణుడు అన్న రావణుడు అత్యవసరమైతే తప్ప నన్ను నిద్రలేపడనీ, ముందు ఆపదను నివారించే రావణుని దర్శిస్తాననీ బయలుదేరబోతుంటే వారిస్తాడు యూపాక్షుడు.

కుంభకర్ణుడు రావణుని సభకు బయలుదేరుతాడు. తాను నడుస్తుంటే భూమే చలి జ్వరం వచ్చినట్టు వణికిందట. లంకకు ఆవల ఉన్న వానరులు కూడా కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఎవరీ మహాకాయుడు అని మాట్లాడుకోసాగారు. అలా అందరూ చూస్తుండగానే రావణ సభలోకి ప్రవేశించి తన కోసం సిద్ధంగా ఉన్న భారీ ఆసనంపై రావణుడికి నమస్కరించి కూర్చున్నాడు. రామదండును సమూలంగా నాశనం చేయగల సమర్థుడవి నీవే, అందుకనే నిన్ను నిద్ర నుంచి ప్రయత్న పూర్వకంగా లేపాల్సి వచ్చిందనీ రావణుడు అన్నప్పుడు, అన్నతో కుంభకర్ణుడు పలికిన మాటలు వివేకంతో పరిమళించాయి. కుంభకర్ణుని నిలువెత్తు వ్యక్తిత్వానికి నిదర్శనమే అవి.

పరస్త్రీ వ్యామోహం తగదనీ, బలం ఉంది కదా అని ముందు చేయాల్సిన పనులు వెనుక, వెనుక చేయాల్సిన పనులు ముందూ చేయకూడదనీ, ప్రతీ విషయంలోనూ మంచీ చెడులు బేరీజు వేసుకోవాలనీ, దూరాన ఉన్న శత్రువుకన్నా మెప్పుకోసం మిడిమిడి జ్ఞానంతో రెచ్చగొట్టే వారు ప్రమాదకరమనీ, అసలు అన్నింటికన్నా ధర్మమే శ్రేష్ఠమనీ చెబుతూనే ఇప్పటికైనా సీతమ్మను రామునికి అప్పగిద్దామని అర్థిస్తాడు కుంభకర్ణుడు.

రావణుడు కుంభకర్ణుడు ఎంత చెప్పినా వినకపోయే సరికి చేసేది లేక యుద్ధానికి బయలుదేరతాడు కుంభకర్ణుడు. అతని భారీకాయంతో లక్షల సంఖ్యలో వానరుల్ని హతమారుస్తాడు. వానర ప్రముఖులెందరో కుంభకర్ణుని ఎదురించి ఓడిపోతారు. ఇటు కుంభకర్ణుడూ, అటు వానరులూ భయంకర యుద్ధం చేస్తారు. చివరకు రాముని చేతిలో వీరమరణం పొందుతాడు. రామబాణానికి కుంభకర్ణుని తల తెగి లంకాశిఖరాన్ని పడగొట్టింది. అతని మహాకాయం సముద్రంలో పడీపడగానే సముద్రపు నీరు ఆకాశాన్నంటింది.
లోకనీతి తెలిసినా, రావణుని అధర్మం రుచించకపోయినా కుంభకర్ణుడు రావణునికి తమ్ముడైనందుకు తన బాధ్యతను నిర్వర్తించాడు. లోకంలో మన అనుకున్నప్పుడు మనవారు చేసిన తప్పులోనూ, ఒప్పులోనూ వారిని వదిలి పెట్టక, మనలోని ధర్మనిరతిని విస్మరించక మనవారి కోసం అంకితం కావాలనే మానవీయ ధర్మానికి భాష్యం చెప్పినవాడు కుంభకర్ణుడంటే అతిశయోక్తి కాదు.

కుంభకర్ణా! లోకంలోని జీవరాశినంతటినీ నీ ఆకలికి ఆహుతి చేయడానికే నీ తండ్రి నిన్ను కన్నట్టున్నాడు. ఇక నీవు తిన్నది చాలు. ఇకపై చచ్చినట్టు చచ్చేదాకా నిద్రపో అని శపిస్తాడు బ్రహ్మ.

- ప్రమద్వర

No comments:

Post a Comment