దసరా చాలా ప్రత్యేకమైంది. పల్లెల్లో దసరా శోభ వైభవోపేతంగా ఉంటుంది. కాలం మారుతున్నా.. నేటి పోకడలు మారుతున్నా, పండుగ తీరుతెన్నులు సాంప్రదాయ బద్ధంగానే జరుగుతున్నాయి. కొత్త బట్టలు వేసుకోవడం, జంబికెళ్లడం, పాలపిట్టను దర్శించుకోవడం, జొన్నకర్రలతో కోలాహలం, ఆత్మీయులతో అలయ్ బలయ్, ఆడపడుచుల దీవెనలు పొందడం వంటి వాటితో ఒకటే సంబురం. ఇదే సమయంలో ఇక దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామాతను ప్రతిష్టించి నిష్టగా పూజిస్తూ, సల్లంగా చూడాలని తల్లిని కోరుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. చెడుపై విజయమే విజయదశమి. ఈ పండుగ మనకు అందరికీ మంచి చేయాలని అమ్మవారిని కోరుతూ ఈ కథనం.
- దాయి శ్రీశైలం
దసరా ఒక పండుగ మాత్రమే కాదు. ఇదొక మానవతా సమ్మేళనంగా చెప్పుకోవచ్చు. దుర్గామాత ప్రతిష్టాపన నుంచి నరకాసుర వధ వరకు అన్నీ అట్టహాసంగా, వైభవంగా జరుపుతారు. పిల్లల నుంచి మొదలు పెడితే పండు ముసలి వరకు సంబురాలు జరుపుకొంటారు.
దసరా ఉత్సవాల ప్రాశస్త్యం
ఇంత గొప్ప పండుగ ప్రాశస్త్యం ఏంటో? దేవీ నవరాత్రి ఉత్సవాల వైభవం ఎలాంటిదో? అమ్మవారి అవతారాలెన్ని? ఆమెకు ఏమంటే ఇష్టం? విజయ దశమి దేనికి సంకేతం? చెడుపై మంచి విజయం ఎలా సాధ్యం? వంటి విషయాలు తెలుసుకొని విజయ దశమిని సంపూర్ణం చేద్దాం.
శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ
అర్జునస్య ధనుర్ధారీ శ్రీరామస్య ప్రియదర్శినీం
శమీ శమయతే పాపం శమీ కంటకలోహితా
ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ
విజయదశమి రోజున జమ్మిచెట్టుకు పూజ చేయడం మన సంప్రదాయం. జమ్మిచెట్టు పాపాలను పోగొడుతుంది. శత్రువులను నిర్మూలిస్తుంది. పుణ్యం ప్రసాదిస్తుంది. విజయసిద్థికి యాత్ర చేసే మానవాళికి ఆటంకాలను తొలగించి విజయాలను సాధించి పెడుతుంది. ఇంతటి మహిమగల శమీ పూజతో కూడిన పుణ్యదినం కాబట్టే ఈ పవిత్ర రోజుకు విజయదశమి అని పేరొచ్చింది అంటారు. దసరానాడు జమ్మిచెట్టును పూజించడాన్నే శమీపూజ అంటారు. జమ్మిచెట్టు విజయానికి సంకేతం. పూర్వం ద్వాపరయుగంలో పాండవులు తమ ఆయుధాలను అన్నింటినీ ఈ జమ్మిచెట్టుపైనే సంరక్షించి, తర్వాత వాడుకొన్నారు. వారికి యుద్ధంలో విజయం లభించింది. జమ్మిచెట్టు పాపాలను హరిస్తుందనీ, శత్రువులను తుదముట్టిస్తుందనీ, అర్జునునివంటి మహావీరునికి ధనుర్బాణాలను ప్రసాదించిందనీ, రామునికి ప్రియాన్ని చేకూర్చిందనీ, విజయయాత్రలలో సత్ఫలితాలను ప్రసాదించిందనీ, ఎలాంటి ఆటంకాలు లేని జీవితాన్ని ప్రసాదించిందన్నది పూజలోని పరిమార్థం.
పూజా విధానం
నవరాత్రుల కలశ స్థాపన చేస్తారు. పూజా మందిరంలో కలశ స్థాపన చేసేందుకు వేదిక ఏర్పాటు చేస్తారు. గోమయంతో చదరంలా అలికి, పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. పూజా సామగ్రితో పాటు ఐదు రకాల లేత చిగుళ్లు కలిగిన చెట్టు కొమ్మలు, గరిక పోచలు సిద్ధం చేస్తారు. తెల్లవారుజామునే అభ్యంగ స్నానం చేసి పట్టు వస్ర్తాలు కట్టుకొని, ఎర్రని పట్టు వస్త్రంపై కూర్చొని అమ్మవారిని ఆరాధిస్తారు.
ఆయుధ పూజ
ఈ పూజ దసరా రోజున చేస్తారు. పాండవులు శమీ వృక్షంపైన ఆయుధాలను దాచి అజ్ఞాతవాసం చేశారు. విజయదశమిన అజ్ఞాతవాసం ముగిసింది. ఆయుధ పూజ రోజు శమీ వృక్షానికి ఒక ప్రత్యేకత ఏర్పడింది. అష్టమి దుర్గాదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజుగా చెప్తారు. దుర్‌గతులను నాశనం చేసి సుగతులను ప్రసాదించే దుర్గాదేవిని ఆయుధ రూపిణిగా ఈ రోజున ఆరాధిస్తారు. మానవ జీవనోపయుక్తాలైన యంత్రాలనూ, వాహనాలకూ, ఆయుధాలకూ పూజలు చేస్తారు.
మీ పండుగే మీకు విజయం
పూర్వం రాజులు తమ రాజ్య విస్తరణ కోసం విజయదశమి నాడే జైత్రయాత్ర ప్రారంభించేవారని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి మీరు కూడా మీ పనులను వేగవంతం చేసేందుకు, మంచి పనుల కోసం విజయదశమి నుంచే ప్రారంభించండి. విజయదశమి రోజున ప్రకృతిలో అపరాజిత అనే శక్తి ఆవహించి ఉంటుందనీ, ఆ శక్తి విజయాలను అందిస్తుందని ప్రజల విశ్వాసం. అందుకే విజయదశమి రోజున సాయంత్రం పూట ప్రజలంతా కలిసి ఊరి పొలిమేరలు దాటి వస్తారు. కాబట్టి ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవండి. పాలపిట్ట విజయానికి సంకేతం. తాము చేయబోయే పనులు ఫలించాలనే ఒక పాజిటివ్ దృక్పథం, శుభసూచకం కనిపిస్తుంది. దసరా రోజున పాలపిట్టను దర్శించుకుంటే సంవత్సరమంతా విజయాలు వరిస్తాయని ప్రజల నమ్మకం. మీరూ పాలపిట్టను దర్శించండి.
-పేర్వాల బలరామ శర్మ, పురోహితులు
తొమ్మిది అవతారాలు
అమ్మవారు తొమ్మిది అవతారాల్లో భక్తులకు దర్శనం ఇస్తారు. మహర్షుల సూచన ప్రకారం అమ్మవారు.. ప్రధమం శైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాంతేతి చతుర్థం, పంచమం స్కంధమాతేతి, షష్టిమం కాత్యాయనీ, సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం, నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తితగా కొలుస్తారు భక్తులు.
1 శైలపుత్రి
పాడ్యమి నాడు ప్రారంభమయ్యే అవతారం శైలపుత్రి. దక్షుని పుత్రిక ఈమె. శిరస్సున అలంకారంగా బాల చంద్రరేఖను ధరించి, శూలాన్ని చేతబట్టి ఎద్దు వాహనంపై కూర్చుంటారు అమ్మవారు. పరమేశ్వరుడే తనకు పతిగా కావాలని కోరుతుంది.
2 బ్రహ్మచారిణి
పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోర తపస్సు చేస్తుంది. ఆకులు కూడా తినకుండా ఉన్నందును అపర్ణగా ప్రసిద్ధిగాంచింది. కన్యాకుమారీ అని మరో పేరు కూడా ఉంది. ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రా విజయాలు ప్రాప్తిస్తాయి.
3 చంద్రఘంట
అమ్మవారి మూడవ అవతారం. ఈ రూపం మిక్కిలి కల్యాణ కారకం. శిరస్సుపై ధరించిన అర్ధచంద్రుడు అర్ధాకృతిలో ఉండటం వల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ తల్లిని శరణుజొచ్చిన వారికి ఎల్లప్పుడూ అభయఘంట మోగుతూ ఉంటుంది.
4 కూష్మాండ
నాలుగవ స్వరూప నామం కూష్మాండ. ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వల్ల ఈమెను అష్టభుజదేవి అంటారు.
5 స్కందమాత
అయిదో అవతారం స్కందమాత. స్కంధుడు అంటే కుమారస్వామి. స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాతగా పిలుస్తారు. నమ్మిన భక్తులకు పతనం లేకుండా దీవిస్తుంది అనడానికి ఈ అవతారం సంకేతం.
6 కాత్యాయని
దుర్గామాత ఆరో రూపం కాత్యాయని. కొత్స అనే రుషి తనకు పార్వతీమాత కుమార్తెగా జన్మించాలని తపస్సు చేశాడు. అతనికి కూతురు జన్మించింది. కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ని వధించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సు అంశతో ఒక దేవిని సృష్టిస్తారు. అశ్వీయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుణ్ని వధిస్తుంది.
7 కాళరాత్రి
దుర్గామాత ఏడో రూపం కాళరాత్రి. అమ్మవారి శరీర ఛాయ చీకటివలె నల్లగా ఉంటుంది. ఇందుకే ఈ దేవిని కాళరాత్రి అంటారు. ఈ తల్లిని పూజిస్తే శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి శుభంకరి అని పిలుస్తారు.
8 మహాగౌరి
పరమేశ్వరుడిని భర్తగా పొందడానికి కఠోర తపస్సు చేయడం వల్ల ఆమె దేహం నల్లబడుతుంది. ఆమె తపస్సుకు మెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళన చేస్తారు. దాని వల్ల ఆమె శరీరం గౌరవర్ణతో విద్యుత్ కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధి కెక్కింది.
9 సిద్ధిధాత్రి
దుర్గామాత తొమ్మిదవ శక్తిరూపం సిద్ధిధాత్రి. ఈ అమ్మ అన్ని సిద్ధులనూ ప్రసాదిస్తుంది. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈ దేవి కృపతో పొందాడని పురాణాలు చెప్తున్నాయి.
| రోజు | తిథి | అలంకారం | అలంకారం | నైవేద్యం |
| 1 | ఆశ్వీయుజ పాడ్యమి | శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి | శాలిపుత్రి | అమ్మవారికి పాదాల నెయ్యితో చేసిన పొంగిలి సమర్పిస్తారు. వ్యాధులు, రోగాల నుంచి కాపాడాలని అమ్మవారిని నెయ్యి నైవేద్యం సమర్పించి కోరుతారు. |
| 2 | ఆశ్వీయుజ విదియ | శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి | బ్రహ్మచారిణి | సాధారణ ఆహారాన్ని ఇష్టపడుతారు. చక్కెర, పండ్లతో చేసిన నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తారు. |
| 3 | ఆశ్వీయుజ తదియ | శ్రీ గాయత్రి దేవి | చంద్రఘంట | అమ్మవారికి పాలు, మిఠాయిలు, ఖీర్ నైవేద్యంగా సమర్పిస్తారు. |
| 4 | ఆశ్వయుజ చవితి | శ్రీ అన్నపూర్ణా దేవి | కుష్మందా | అమ్మవారికి బూరెలు సమర్పిస్తారు. |
| 5 | ఆశ్వయుజ పంచమి | శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి | స్కందమాత | అమ్మవారికి అరటిపండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రజలందర్నీ ఆరోగ్యంగా ఉంచాలని భక్తులు అరటి పండ్ల నైవేద్యం పెట్టి కోరుతారు. |
| 6 | ఆశ్వీయుజ షష్టి or మహాష్టమి | శ్రీ మహాలక్ష్మీ దేవి | కాత్యాయనీ | అమ్మవారికి తీపి పదార్థాలతో నైవేద్యం సమర్పిస్తారు. |
| 7 | ఆశ్వీయుజ సప్తమి or మహా సప్తమి | శ్రీ మహా సరస్వతీ దేవి | కాలరాత్రి | అమ్మవారికి తీపి పదార్థాలతో చేసిన లడ్డూలు, బెల్లం సమర్పిస్తారు. |
| 8 | ఆశ్వీయుజ అష్టమి or దుర్గాష్టమి | శ్రీ దుర్గా దేవి | మహాగౌరి | అమ్మవారికి కొబ్బరి కాయలతో నైవేద్యం సమర్పిస్తారు. |
| 9 | ఆశ్వీయుజ మహా నవమి or మహర్నవమి | శ్రీ మహిషాసుర మర్దిని | సిద్ధిధాత్రి | అమ్మవారికి నువ్వులు, తేనె నైవేద్యంగా సమర్పిస్తారు. భోగ భాగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటారు భక్తులు. |
| 10 | ఆశ్వీయుజ దశమి or విజయదశమి | శ్రీ రాజరాజేశ్వరి |
చెడుపై విజయమే విజయదశమి
స్వార్థం, కామం, మోహం, క్రోదం, అన్యాయం, అమానవీయం, అహంకారం, మోదం, లోభం, మదం, మాత్సర్యాలను జయిస్తేనే మంచి జీవనశైలి ఏర్పడుతుంది. మనకు హాని చేసే ఈ పది చెడు లక్షణాలను తొలగించుకొని నిజమైన విజయదశమి జరుపుకోండి.
స్వార్థం: నేను అనే తపన కలిగించడానికి మనలోకి ప్రవేశించిన గుణమే స్వార్థం. ఇతరులను నాశనం చేసైనా సరే తాము బాగుపడాలనే స్వార్థం దురాశ. స్వార్థం ఉండటం తప్పు కాదు. కానీ దాన్ని నిప్పులా తయారు చేసి వినాశకారిగా మార్చడం తప్పు. స్వార్థాన్ని కూడా నిస్వార్థంగా వాడగలిగితే జీవితానికి అర్థం తెలిసినట్టే.
అన్యాయం: అన్యాయమే అభివృద్ధికి వనరుగా మారుతున్న రోజులివి. ఉన్నోడు అన్యాయానికి పాల్పడటం, లేనోడు అన్యాయానికి గురికావడం అతి సాధారణమైన క్రియ. ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయాలకైతే లెక్కేలేదు. అన్యాయంపై పోరాడక పోయినా కనీసం దానికి కారణమైన వాళ్లకు తప్పు గుర్తు వచ్చేట్లు చేయాలి.
అహంకారం: మిడిమిడి జ్ఞానంతో కొట్టుమిట్టాడే వాళ్లు మాత్రమే తనకు తెలిసిన కొద్ది సంగతులే ప్రపంచం అన్నట్లు తానే అందరికంటే గొప్పవాడిననే అహంకారాన్ని పెంచుకుంటారు. దీనిని విడిచిపెడితేనే ఉన్నతి ఉంటుంది అనే విషయం తెలుసుకోవాలి.
మదం: అంటే హద్దుల్లేని అహంకారం. మదం ఉన్నవాళ్లు ఎదుటివారిని తనకంటే తక్కువచేసి వారిపై పెత్తనం చెలాయించడానికి దుర్మార్గపు పనులు, దురాలోచనలు చేస్తారు. దీనివల్ల వారిలో అసూయ పెరిగి ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటారు. దసరా వంటి పెద్ద పండుగ రోజున మదాన్ని పారదోలితే విజయాలు మీ సొంతం.
మాత్సర్యం: అంటే అసూయ. ఇది చాలా ప్రమాదకరం. మాత్సర్యం వల్ల మనిషి తనలోని మానవత్వాన్ని కోల్పోయి అశాంతితో గడుపుతాడు. ఎవరికి చేతనైంది వాళ్లు చేస్తూ క్రమంగా ఉత్తమ ఫలితాలను రాబట్టేందుకు ప్రయత్నాలు చేయాలిగానీ ఈర్ష్యాసూయలకు పోతే పతనం ఖాయం అని తెలుసుకుంటే విజయం సొంతం.
లోభం: అంటే పిసినారితనం. సంపాదించిన ధనాన్ని తాను అనుభవించకుండా కనీసం తనవారిని కూడా అనుభవించనీయకుండా దాచిపెట్టడం లోభత్వం. లోభియైనవాడు ఏ విధంగానైనా ధనాన్ని ఆర్జించడం కోసం ఎల్లప్పుడూ ఆలోచిస్తాడు. దాచిపెట్టి మట్టి పాలు చేస్తే లాభమేంటి? కాబట్టి లోభత్వాన్ని జయిస్తే విజయాలు సొంతమవుతాయి.
మోహం: కోరిక, వ్యామోహం, కాంక్ష మరీ ముఖ్యంగా శరీరకాంక్షలు మితిమీరిన కామంతో కూడిన మోహానికి సంబంధించినవి. ఇది వ్యక్తిగతంగా కాకపోయినా ఒక వ్యవస్థ విజయానికి, ఒక దేశ విజయానికి కూడా అడ్డంకిగా మారుతుంది. ఇది తొలగి సమాజంలో స్వచ్ఛమైన సోదరభావం పెంపొందిన రోజే మనకు నిజమైన విజయదశమి.
అమానవత్వం: మనిషికి ఉండాల్సిన మొదటి గుణం మానవత్వం. ఇది లేకపోతే మనం మనుషులమెందుకవుతాం? అమానవత్వాన్ని జయిస్తేనే మనిషి విజయం సాధించినట్టు.
క్రోదం: క్రోదం అంటే కోపం. క్రోదం మనుషులను దూరం చేస్తుంది. ఆవేశకావేశాలకు పోయి హద్దులు దాటే క్రోదం వల్ల ఎప్పటికీ నష్టమే. కాబట్టి దీన్ని పారదోలి నిజమైన విజయదశమిని జరుపుకుందాం.
No comments:
Post a Comment